10, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 788 (వృద్ధురాలికి నేఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...

వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె !
ఈ సమస్యను పంపిన వసంత కిశోర్ గారికి ధన్యవాదములు.

28 కామెంట్‌లు:

  1. పల్లెటూరున నుండెను పాప మామె
    పట్న వాసపు మనుమరాల్ భర్త తోడ
    వృద్ధురాలికి, నేఁడు వేవిళ్ళు గలిగె
    ననుచు కబురంప మనిజె\ప్పె నామె నాడు

    రిప్లయితొలగించండి
  2. వృద్ధురాలికి నేడు వేవిళ్ళు గలిగె
    నేడు పర్యాయములు పొందె నీ శుభాంగి
    గర్భమును నితఃపూర్వంబు కనెను సుతుల
    సకల సల్లక్షణాఢ్యుల చారుమతుల

    (ఈ వృద్ధురాలు ఇంతకు మునుపు ఏడు మారులు వేవిళ్ళు పొంది పుత్రులను కనెను అని భావము).

    రిప్లయితొలగించండి
  3. షష్టిపూర్తిని జేతును సంతసమున
    వృధ్ధురాలికినే డు, వేవిళ్ళు కలిగె
    పెండ్లి యైనట్టి భామకు పెద్ద గాను
    సహజ మేగద ! యింతుల కహరహమ్ము .

    రిప్లయితొలగించండి
  4. వృద్ధురాలికి నేఁడు వేవిళ్ళు గలిగె
    నంత పోటుగా డెవ్వడు సుంత చెపుమ
    ని పదునారేళ్ళ బాలిక నిలువఁదీసె
    పట్టిచూడనవి పసరు వాంతు లేను!

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పూరణము.....

    'ముని మనుమఁడో, మనుమరాలొ?',మనుమరాలు
    కనినఁ జాలుఁ, గనులఁ జూచి, చనెడు నాశ
    వృద్ధురాలికి! నేఁడు వేవిళ్ళు గలిగె
    మనుమరాలికి! తాతమ్మ మనసు మురిసె!!

    రిప్లయితొలగించండి
  6. స్వర్గవాసమ్ము పై చింత చాల కలిగె
    వృద్ధురాలికి నేడు, వేవిళ్ళు కలిగె
    పడచు భామకు, నాశలు పసిడి బాల
    కులకు కలిగె నలలవోలె కొలను లోన.

    రిప్లయితొలగించండి
  7. చందమామ కథలరాజుఁబొందగోరి
    భామ పంతమ్ము వీడక బామ్మ యయ్యె!
    అక్క మగడే నతివ నందె,నాశఁదీర
    'కేరు' సంతాన సాఫల్య కేంద్ర మందు
    వృద్ధురాలికి నేడు వేవిళ్ళుగలిగె!

    రిప్లయితొలగించండి
  8. తాత గారి పూరణ బావున్నది. నమస్సులు. అందరికీ ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  9. మిత్రులంతా బావున్నారని తలుస్తాను !
    మానసిక ప్రశాంతత లేక, జాలానికి వచ్చి చాలా కాలమైనది !
    శంకరార్యా ! యీ సమస్య నేనిచ్చిన గుర్తు లేదే ! మీరు పొరబడలేదు గద !

    రిప్లయితొలగించండి
  10. ఇద్దరి మిత్రుల నడుమ సంభాషణ :

    01)
    ______________________________

    "వృద్ధురాలికి నేడు వే - విళ్ళు గలిగె !
    ఎద్దు యీనెను దూడల - నిద్దరి నట !"

    వద్దు వినలేను చెప్పకు - వాదులింక !
    నిద్దురదె వచ్చు చున్నది - నిజము ! విడుము !

    ______________________________
    వాదు = అసత్యము

    రిప్లయితొలగించండి
  11. శ్రీసరస్వత్యై నమః:
    మిత్రులారా! అందరికి అభినందనలు. ఈరోజు పూరణలు ఎక్కువగా విరుపునే ఆధారముగా చేసుకొనినవి. వృద్ధురాళ్ళలో వింతలు పొడసూపిన చందమే సమస్య. పురాణాలలోకి వెళితే దశరథునికి అరువదివేల యేళ్ళకి సంతానము కలిగిందట. మరి ఆయన భార్యలకి వయస్సు ఎంతో ఊహించుకొనవచ్చును కదా. అవన్నీ పురాణాలు లెండి. కొన్ని యేళ్ళ క్రిందటి వార్తలు - ఇద్దరు 80 యేళ్ళ కవలలు అక్కచెల్లెళ్ళు ఆ వయస్సులో గర్భము ధరించి పిదప ప్రసవించేరట ఒకే రోజున. బాగు బాగు.

    1. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు చక్కటి విరుపుతో వృద్ధురాలికి మనుమరాలిచేత వార్త పంపేరు. ఆ వార్త సకాలములోనే అందినది. పూరణ చాల బాగున్నది.

    2.శ్రీ సుబ్బారావు గారు కూడ మంచి విరుపునే యెన్నుకొనినారు. చాల బాగున్నది.

    3. శ్రీ ఛంద్రశేఖర్ గారి పంథాయే వేరు. వారు సరదాగా నింపేరు - పసరువాంతులని కొట్టి పారేసేరు. అంతా చమత్కారము. చాల బాగున్నది.

    4. శ్రీ గుండు మధుసూదన్ గారు: మనుమరాలి వేవిళ్ళ వార్తను మామ్మకి చెప్పి మురిపించేరు. ప్రశంసనీయముగా నున్నది.

    5. శ్రీమతి లక్ష్మీదేవి గారు: మంచి విరుపుతో మంచి భావముతో చాల చక్కగా పూరించేరు.

    6. శ్రీ సహదేవుడు గారు: వృద్ధురాలిని సంతాన సాఫల్య కేంద్రానికి పంపేరు. మంచి తమాష.

    7. శ్రీ వసంత కిషోర్ గారు: ంవ్యంగ్యమైన ఉదాహరణలు మరికొన్ని చొప్పించేరు అలరింప జేసేరు. బాగున్నది.

    అందరికి మళ్ళీ మళ్ళీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. వసంత్ కిశోర్ గారూ,
    మళ్ళీ మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీరు ‘మానసిక ప్రశాంతత’ లోపించిందని చెప్పడం విచారాన్ని కలిగించింది. అందరమూ ఏవో కొన్ని సమస్యలతో మానసిన ప్రశాంతతకు దూరమైన వాళ్ళమే. ముఖ్యంగా నేను ఏ క్షణాన ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానో నాకే తెలియదు. నాకు నా యింట్లో ఓ గుర్తింపు, గౌరవం లేవు. వాళ్లకు కావలసింది నా పెన్షన్ డబ్బులు, అవసరమైతే అప్పులు చేసి తేవడం. అంతే! నాకు కాస్త సంతృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చేది ప్రస్తుతం ‘శంకరాభరణం’ మాత్రమే. ఏదో యాంత్రికంగా సమస్యలు ఇస్తున్నానే కాని నేను స్వయంగా పూరణలు, పద్యాలు వ్రాయలేక పోతున్నాను. మిత్రుల పూరణలలోని కావ్యానందాన్ని పొందలేక పోతున్నాను.

    రిప్లయితొలగించండి
  13. వసంత్ కిశోర్ గారూ,
    నేను చాలా రోజులుగా మన కవిమిత్రుల పేర ఒక్కొక్క ఫైల్ ఓపెన్ చేసి ఉంచాను. వారు పంపిన సమస్యలను ఎప్పటికప్పుడు వారి ఫైళ్ళలో కాపీ, పేస్ట్, సెవ్ చేసి ఉంచుతున్నాను. ప్రకటించిన వానిని ఆ ఫైల్ నుండి తొలగివ్తున్నాను. మీ పేర ఇంకా ప్రకటించని సమస్యలు 26 ఉన్నాయి. ఉదయం మీ ఫైల్ నుండే ఆ సమస్యను కాపీ చేసాను.

    రిప్లయితొలగించండి
  14. మాస్టరు గారూ! ధన్యవాదములు.నా చిరు నామాను శ్రీ నేమాని వారికి పంపుచున్నాను.
    వసంత కిశోర్ గారు సమస్యా పూరణములలో పాల్గొనుట లేదు. వారి ఆరోగ్యము యెలా ఉన్నదో.....కిశోర్జీ త్వరగా కోలుకుని శంకరాభరణములో మీ కవితా ధార కురిపించాలని మా కోరిక.... పై సమస్య గతములో ఇచ్చినదా...

    రిప్లయితొలగించండి
  15. నేమాని వారికి ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  16. >> ముఖ్యంగా నేను ఏ క్షణాన ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతానో నాకే తెలియదు. నాకు నా యింట్లో ఓ గుర్తింపు, గౌరవం లేవు. వాళ్లకు కావలసింది నా పెన్షన్ డబ్బులు, అవసరమైతే అప్పులు చేసి తేవడం. అంతే! నాకు కాస్త సంతృప్తినీ, ఆనందాన్నీ ఇచ్చేది ప్రస్తుతం ‘శంకరాభరణం’ మాత్రమే. ఏదో యాంత్రికంగా సమస్యలు ఇస్తున్నానే కాని నేను స్వయంగా పూరణలు, పద్యాలు వ్రాయలేక పోతున్నాను. మిత్రుల పూరణలలోని కావ్యానందాన్ని పొందలేక పోతున్నాను.



    శంకరయ్య మాష్టారు గారికి ప్రణామాలతో

    మీ కామెంటు చూసి చాలా చాలా బాధ కలిగింది....ప్రతి రోజు ఈ బ్లాగులో హాజరు వేసుకుని చదువుకుని వెళ్ళిపోవటమే కానీ కామెంటు వ్రాయని నేను మీ మానసిక బాధను తగ్గించటానికి చేయగలిగిన సాయమేదన్నా ఉన్నదేమో తెలియదు.....ఒకవేళ ఏదన్నా ఉంటే, ఆ సాయానికి ఈ మీ ఏకలవ్య శిష్యుడు సదా సిద్ధం.....తప్పక తెలియచెయ్యండి.....

    నమస్కారాలతో
    మాగంటి వంశీ

    రిప్లయితొలగించండి
  17. కిశోర్జీ! మీ పునరాగమనము సంతోషము కలిగించినది

    రిప్లయితొలగించండి
  18. మాస్టరు గారూ! మీ గృహములో సుహృద్భావ వాతావరణ మేర్పడాలనీ, మీకు మానసిక ఫ్రశాంతత చేకూరాలనీ మనసారా భగవంతుని వేడుకొను చున్నాను.

    రిప్లయితొలగించండి
  19. శంకరయ్యగారూ,

    మీ వ్యాఖ్య చదివి చాలా విచార పడ్డాను.

    ఒకరి నుండి గుర్తింపు గౌరవం కోసం యెదురు చూడవలసిన పని లేదు మీ వంటి ప్రాజ్ఞులకు. ఆ స్థితినీ, వయస్థితినీ మీరు దాటి వచ్చేసారు.

    నా జీవితంలో కూడా చాలా వైక్లబ్యం కలిగించే కోణాలున్నాయి. తలచుకుని కుమిలి యేమి లాభం? అవన్నీ నా చేతి లోని విషయాలు కావు గాబట్టి బాధపదటం దండగ కదా?

    నేను కూడా యధాశక్తి వైరాగ్యభావంతోనే జీవిస్తున్నాను. ఏదీ‌ ఆశించవద్దూ అని భగవదాదేశం అయింది. ఇంక పూర్తిగా‌ నిర్లిప్తుడనై యున్నాను. దాని అర్థం ప్రపంచం నుండి విముఖుడనై పెడమోమై యుంటున్నానని కాదు. వ్యావహారికప్రపంచం లో నా పాత్ర నిర్వర్తిస్తూనే ఉంటాను యథాశక్తి. కాని ఆసక్తి మాత్రం‌దేని మీదా లేదు. అంతే. అలా గయితే అంతా ప్రశాంతత.

    (శ్యామలీయం బ్లాగులో కొన్ని ఆధ్యాత్మగీతాలు వ్రాస్తున్నాను. అవి మీకు కొంత చిత్తశాంతి కలిగించితే ధన్యుడను.)

    సర్వం పరమేశ్వరసంకల్పం అని భావించి ప్రశాంత చిత్తులై యుండ వలసినదిగా నా విజ్ఞాపన.

    అశేషప్రజానీకానికి హితమైన శంకరాభరణం భాగును దిగ్విజయంగా కొనసాగించండి!

    రిప్లయితొలగించండి
  20. మిత్రులారా!
    సర్వేషాం సుఖినః సంతు
    సర్వే సంతు నిరామయాః
    సర్వే భద్రాణి పశ్యంతు
    మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్

    రిప్లయితొలగించండి
  21. సాధ్యమేయగు,వార్తలజదువలేద?
    వైద్యశాస్త్రశోధనలచే,వైపరీత్య
    కార్యములు,కనివిననివి,కలుగుచుండె
    వృద్ధురాలికినేడు
    వేవిళ్ళుకలిగె!

    రిప్లయితొలగించండి
  22. గురువు గారు,
    మీకు చెప్పేంత దాన్ని కాదు. కానీ చూస్తూ ఊరికే ఉండలేక... నాకు తెలిసినది చెప్తున్నాను.
    ఏదీ శాశ్వతంకాదు. ఈ ప్రకృతి ద్వారా లభించేదేదీ శాశ్వతత్వాన్ని కలిగిఉండదు. అందం, ఆనందం, దుఃఖం అన్నీ ఈ ప్రకృతి ద్వారా, శరీరం ద్వారా, ప్రకృతిలో భాగమైన మనుష్యుల ద్వారా లభించేది ఏదీ శాశ్వతం కాదు.
    మన జీవితం , సుఖశాంతులు వీటి మీదే ఆధారపడినట్టు భావిస్తూ భ్రమలోనే మనము ఉంటాము. అన్నీ తెలిసినా భ్రమలోనే ఉంటాము. కానీ నిజానికి ఏది ఉండటం వల్ల, లేకపోవటం వల్ల జీవనప్రయాణం ఆగదు. మలుపు తిరగదు. నిశ్చయింపబడిన సమయంలోనే ఆగుతుంది, మలుపు తిరుగుతుంది. ఎక్కువగా మనసుకు అన్ని విషయాలూ పట్టించుకోకండి. భగవంతుని పైనే భారం వేసి వదిలేయండి.

    రిప్లయితొలగించండి
  23. మాస్టారూ, ఏమీ కాదు, మీకు కావలసినదే జరుగుతుంది. పట్టు విడవకండి, పారిపోకండి. ప్రపంచానికి రెండు ప్రక్కలా బ్రతుకుతున్నవాడిని. ఇక్కడి వాతావరణంలో "చచ్చే వరకూ తృప్తిగా బ్రతుకుతూనే ఉండండి-వినా దైన్యేన జీవనం" అనేది చూస్తాం, ఒకింత నేర్చుకొంటాం. యక్ష ప్రశ్నలలో ధర్మరాజు చెప్పినట్లు మన మనోధైర్యమే మనతో పాటు చివరివరకూ వచ్చేది. శుభం భూయాత్.

    రిప్లయితొలగించండి
  24. డా. కమనీయము గారి పూరణ వాస్తవ వైద్య విజ్ఞాన విషయమును వెల్లడి చేసినది. చాల ప్రశంసనీయము. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. dear sankarayya garu !namaste.i am verry sorry on seeing your comment.There is SHANKARA for all.we are all under Administretion of Shankara.BE HAPPy.

    రిప్లయితొలగించండి
  26. పలికి సాంత్వనవాక్యముల్ చెలిమితోడ
    మానసికధైర్య మొసఁగిన మంచి మిత్రు
    లెల్లరకు ధన్యవాదము లివి యఁటందు
    నింతకన్నను జెప్పలే నెదియు నిపుడు.

    రిప్లయితొలగించండి
  27. గురువర్యులకు వందన శతము.ఒక సారి మెయిల్ లో మీ బాధను నాతో పంచుకున్నపుడు,నేను వివరాల్లోకి వెళ్ళి మిమ్మల్ను బాధ పెట్టటం ఇష్టంలేక మౌనంగా ఉన్నాను. మీరు నిన్నవివరించిన తర్వాత నా మనసు ద్రవించింది.మహాకవి శ్రీశ్రీ గారన్నట్లు జీవితం వెలిగించిన సిగరెట్ లాంటిది,తాగిన తాగకున్న అది కాలిపోతుంది.జీవితం కూడా అలాగే గడచిపోతుంది. ఓ వెలుగు వెలగటమే కావాలి. ప్రస్తుతంమీరు అలానే బ్లాగు ఏర్పాటు చేసి వెలిగి పోతున్నారు.ఆ త్రిమూర్తులు మిమ్మల్నుసదా కాపాడాలని నా ప్రార్థన. స్వస్తి.

    రిప్లయితొలగించండి