2, ఆగస్టు 2012, గురువారం

పద్య రచన - 69

అందరికీ రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు.
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

9 కామెంట్‌లు:

  1. అనురాగ రత్నముల జే
    ర్చిన రక్షను జెల్లె లన్న చేతికి గట్టెన్
    ఘనమగు బహుమతితో గూ
    ర్చెను బహుభద్రముల నన్న చెల్లికి ప్రేమన్

    రిప్లయితొలగించండి
  2. అన్నదమ్ముల తోడుగ నక్క, చెల్లి
    యు బలు సంతసమ్మునజేయు నొక్కవిధియె
    వారికొసగినదిట్టుల బంధములను
    గట్టి పఱచుట కొక యవ కాశమిపుడు.

    తోడుగ బుట్టిన వారలు
    వేడుకలను జేయు దినము, వెల్లువగునహో
    కూడిన ప్రేమలును, నిజము
    నేడే రక్షాబంధన సుదినము, నేడే నేడే!!

    రిప్లయితొలగించండి
  3. అమ్మా! లక్ష్మీ దేవి గారూ! శుభాశీస్సులు. మీ కందపద్యము 4వ పాదములో గణములు సరిచూచుకొనండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. గుండు మధుసూదన్ గారి పద్యం.....

    రక్షాబంధన దిన మిది!
    వీక్షించఁగ సోదరుల కభీష్ట తమమ్మౌ
    సుక్షేమ మ్మొనఁగూర్చును;
    రక్షణ నిడి, యిడుఁ బరస్ప రాప్యాయతలన్!!

    రిప్లయితొలగించండి
  5. ఎల్లలు లేని ప్రేముడికి నిల్లయి శోభల గూర్చు నెన్నగా
    చెల్లెలు కట్టు సోదరుని చేతికి బంధన మౌచు రక్షయై
    యుల్లము తల్లడిల్ల పురుషోత్తము చెంతకు జేరి కట్టదే
    చల్లగ చూడు మంచు బ్రియు సంగరమందున నాడు రుక్సనా.

    రిప్లయితొలగించండి
  6. రక్త బంధమ్ము బలపడు రాఖిగట్ట
    మనసుపులకించు మమతలు మధుర మౌను
    అక్కచెల్లండ్ర ప్రేమల చక్కదనము
    విలువ గట్టగాతరమౌనె విశ్వమందు ?

    రిప్లయితొలగించండి
  7. అయ్యా, మీ సూచనకు ధన్యవాదములు. నేనిప్పుడే చూసినాను మీ సూచన.

    నేడయ్యె రక్షాబంధనసుదినము,నేడే నేడే!!

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    మీ పద్యం సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    రక్షాబంధనాన్ని గురించి చక్కని పద్యాలు చెప్పారు. బాగున్నవి. అభినందనలు.
    కందం నాలుగవ పాదం మీ సవరణ తరువాత కూడా గణదోషం తొలగలేదు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మధురమైన పద్యం చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువు గారు,
    అయ్యో , ఇంత సిల్లీగా తప్పుచేసి గమనించనేలేదు. ధన్యవాదాలండి మీరు సూచించినందుకు.
    ఇప్పుడు సరిగ్గా ఉందండి.

    తోడుగ బుట్టిన వారలు
    వేడుకలను జేయు దినము, వెల్లువగునహో
    కూడిన ప్రేమలును, నిజము
    నేడీ బంధము బలపడు, నేడే నేడే!

    రిప్లయితొలగించండి