29, ఆగస్టు 2012, బుధవారం

అభినందన మందార మాల

శ్రీరస్తు         శుభమస్తు       అవిఘ్నమస్తు
నేడు తెలుగు భాషా దినోత్సవము సందర్భముగా,
రానున్న ఉపాధ్యాయ దినోత్సవము సందర్భముగా 
" శంకరాభరణము" బ్లాగ్ నిర్వాహకులు 
శ్రీ కంది శంకరయ్యకు
అభినందన మందార మాల.
శ్రీ కంది శంకరయ్య. విశ్రాంత ఆంధ్రోపాధ్యాయులు.

కం:- శ్రీ కంది వంశ చంద్రమ! 
మీ కవితా మార్గమున సుమేరు సుకవులన్
లోకంబున కందించిన  
శ్రీ కందిగ పేరు గనిరి చిన్మయ రూపా!

సీ:- ఉత్తమోపాధ్యాయ వృత్తిని చేపట్టి  -  స్ఫూర్తిని కొలిపి సద్వర్తనముల,.
నిర్మల భావనా ధర్మము నెఱనమ్మి  -  ధర్మవర్తనులను ధరను నిలిపి,
సత్య బోధన చేసి, స్తుత్యసన్మార్గమ్ము  -  నత్యంత స్తుత్యమై యలర వేసి,
జీవన సద్గతి భావనాపటిమతో  -  విద్యార్థులకు మప్పి వెలయఁ జేసి,
గీ:- చెదరి పోనట్టిన నగవులు జిందు మోము 
సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
కరుణ  గాంభీర్యతలు చూపు కన్ను దోయి 
పొంకమున నొప్పుదే! కంది శంకరార్య!

శా:- మీ సద్వర్తన సత్య సంధత, సదా మేల్గోరు మీ బుద్ధియున్,
ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, మీ ధన్యాత్మయున్, ప్రేమయున్,
భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్
మీసాదృశ్యుల నెన్న లేరుగద!స్వామీ! శంకరార్యా! ధరన్.

గీ:-శంకరాభరణము మీరె.శంకరయ్య!  
జంకు గొంకులు లేనట్టి సహృదయ మణి!
యింక పై మిము శుభములే యేలు నిజము. 
శంకరుండిల మిము బ్రోచు శాంతి గొలిపి.

గీ:- మంగళంబులు మీకిల మంగళములు. 
మంగళంబులు కవులకు మంగళములు.
మంగళంబులు బుధులకు మంగళములు.  
మంగళంబులు హరికి సన్ మంగళములు.

మంగళం                       మహత్                        శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ

20 కామెంట్‌లు:

 1. చింతావారు చెప్పినది అక్షరాక్షర సత్యం !
  శంకరార్యులకు అభినందనా సహిత వందనములు !

  రిప్లయితొలగించు
 2. శంకరార్యులను చక్కగా ప్రశంసించిన
  చింతావారికి ధన్యవాదములు !

  రిప్లయితొలగించు
 3. శ్రీ చింతా వారు చెప్పినట్లు

  "చెదరి పోనట్టిన నగవులు జిందు మోము
  సరస సద్భావనా సుధల్ దొరలు పలుకు,
  కరుణ గాంభీర్యతలు చూపు కన్ను దోయి "

  కలిగియున్నశ్రీ శంకరార్యులకు శతాధిక నమస్కారములు. అభినందన మందారమాలలు.

  రిప్లయితొలగించు
 4. సద్భావనా సుధల్ దొరలు పలుకు,ధ్యాసన్ జూపుచు చేయు బోధనలు, భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్ మీసాదృశ్యుల నెన్న లేరుగద!
  చాలా చక్కగా చెప్పారండీ. మా గురువు గారి సాటి లేరు.

  రిప్లయితొలగించు
 5. శ్రీ చింతా రామకృష్ణా రావు గారు వ్రాసిన అక్షర సత్యములు,భావగర్భితములు, సన్మార్గ దర్శకములు. ధన్యవాదములు.

  రిప్లయితొలగించు
 6. పండిత నేమాని వారి శుభాశీస్సులు....

  కవిజనాశ్రయ ప్రముఖుడు కంది శంకరయ్య, స
  త్కవివతంసు డార్యనుతుడు జ్ఞానవైభవుండు తత్
  వివిధ సద్గుణ ప్రతతిని వేడ్కతో నుతించి నే
  ప్రవిమలాత్మ తోడ గూర్తు వాన్కి భవ్య కామనల్

  రిప్లయితొలగించు
 7. చింతా రామకృష్ణారావు గారూ,

  అల్పుఁడను, నన్ను ప్రేమ ననల్పుఁ జేసి
  వ్రాసి యభినందనమ్ముల రాసి పోసి
  వాసిఁ గాంచు చింతాన్వయ వార్నిధిశశి
  యైన రామకృష్ణారావు నభినుతింతు.

  రిప్లయితొలగించు
 8. చింతా రామకృష్ణ కవుల వాక్కులు సత్యములు.
  శంకరయ్య గారు అభినందనలకర్హులు.

  రిప్లయితొలగించు
 9. మనతెలుగు చంద్రశేఖర్బుధవారం, ఆగస్టు 29, 2012 9:35:00 AM

  "భాషాటోపముఁ జూపనట్టి కవితా పాండిత్యమున్ జూచినన్"-మా శంకరయ్య మాస్టారి సూపర్ క్వాలిటీ ఇదే. మా చిన్నప్పటి తెలుగు మాస్టారనేవారు, "నేను పద్యం వ్రాయటం గొప్ప కాదురా మీరు వ్రాయగలిగేట్లు నేను పాఠం చెప్పగలిగితే చాలు" అని. అదే మా మాస్టారూ చేసే పని శంకరాభరణం బ్లాగు ద్వారా. చింతా వారికీ, ఏల్చూరి వారికీ, మరియు ఉపాధ్యాయులందరికీ, నా గురుపరంపరకీ శతాధిక వందనములు.

  రిప్లయితొలగించు
 10. చింతావారు చెప్పినది అక్షరాక్షర సత్యం !
  శంకరార్యులకు అభినందనా సహిత వందనములు !
  శంకరాభరణం బ్లాగు ద్వారా పండిత నేమానివారికీ,చింతా వారికీ, ఏల్చూరి వారికీ, మరియు ఉపాధ్యాయులందరికీ, నా గురుపరంపరకీ శతాధిక వందనములు.మా గురువు గారి సాటి లేరు.  రిప్లయితొలగించు
 11. గుండు మధుసూదన్ గారి వ్యాఖ్య....

  సత్కవిమిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావుగారు శ్రీ కంది శంకరయ్యగారిని గూర్చి వ్రాసిన యభినందన మండన పద్య సుమము లక్షర సత్యములు! పద్యములును జక్కని భాషా పటిమచే నలరారుచున్నవి! ఇట్టి యభినందనల కర్హులైన శంకరయ్యగారు ధన్యులు! మిమ్ము మఱొక్కమా రభినందించుచు....

  మంచి వీవు! సుగణ గణ మణివి నీవు!
  బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
  స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
  కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

  -:శుభం భూయాత్:-

  రిప్లయితొలగించు
 12. వసంత కిశోర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  వామన్ కుమార్ గారికి,
  పండిత నేమాని వారికి,
  మిస్సన్న గారికి,
  చంద్రశేఖర్ గారికి,
  వరప్రసాద్ గారికి,
  గుండు మధుసూదన్ గారికి,
  ధన్యవాదాలు... మొత్తానికి నన్ను మునగచెట్టెక్కించారు!

  రిప్లయితొలగించు
 13. అవునండీ మాస్టారు గారూ! మా అభినందనల వెల్లువలో మీరు "మునగ" - చెట్టెక్కారు.

  రిప్లయితొలగించు
 14. మాతృభాషాదినోత్సవ శుభవేళ సుకవిమిత్రులందరికి పేరుపేరున అభివందనం.

  తెలుగు తల్లికి విన్నపం

  వేదార్థప్రతిపాదనైకపరమై విఖ్యాతసత్సంప్రదా
  యాదిత్యోదయసానుమచ్ఛిఖరమై యాంధ్రావళీసంతతా
  హ్లాదాపాదకమై మహాకవిశుభవ్యాహారనిష్పన్నమౌ
  ఓ దివ్యాంధ్రసరస్వతీ! కొనుమివే యుద్యన్మదీయస్తుతుల్.

  నన్నయార్యుని సుధీసన్నుతస్వచ్చగీ
  ర్వాణాంధ్రగంగాప్రవాహఘోష
  తిక్కన కవి తేట తెనుఁగు పల్కుల చక్కె
  రలతోడి మావిముక్కల పసందు
  శ్రీనాథకవినాథు శృంగారచాటూక్తి
  నందనప్రసవమరందధార
  పోతనామాత్యుని మోక్ష్మలక్ష్మీపరి
  ష్వంగ సంరంభ వాక్పాటవంబు

  పెద్దనార్యుని కవనగాంభీర్యరేఖ
  రాయల బహుశాస్త్రప్రౌఢరసజగత్తు
  దివ్యదీధితు లొలయు చాంద్రీమయాంధ్రి!
  దీవెనలు వోసి మమ్మోము తెలుఁగు తల్లి!

  చిన్నయసూరికృతోన్నయనంబున
  జీవసత్త్వంబునఁ జేవమీఱి
  తిరుపతి వేంకటేశ్వరకవీంద్రవధాన
  శుభవాక్యసంహతి శోభఁ జెలఁగి
  మానవల్లిబుధేంద్రమానితాఖిలకావ్య
  మాణిక్యరోచుల మహిమఁ జెంది
  వేదాన్వయోదయవేంకటరాయశా
  స్త్రి మహాత్మ కృతికళాదీప్తి నలరి

  నన్నయాద్రిశిఖరసముత్పన్నమైన
  విశ్వనాథార్షభారతీశశ్వదమృత
  నిమ్నగాస్నాతపూతమై నీ పదాబ్జ
  యుగళి మా కభయచికీర్ష నెగడుఁ గాత.

  పూజ్య నేమాని గురు పదాంభోజరాజ
  మాన మధుపానలోలహృన్మత్త సుకవి
  లోకలోలంబనికరంబు లౌ సహృదయ
  మిత్రులకు స్వస్తిఁ గూర్పుము మేలుఁగీళ్ళ.

  కమ్రపద్యమాకంది మా కంది శంక
  రయ్య గారి సంకల్పకల్పావనీరు
  హంబు “శంకరాభరణంబు” హరువు మెఱయ
  నాశిషంబుల నిడుమమ్మ! యలవి కొలఁది.

  విధేయుఁడు,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించు
 15. పదసౌభాగ్యము వాక్యగౌరవములున్ భావోన్నతుల్ మంగళా
  స్పదముల్ గాగ మహాద్భుతాశురచనా ప్రాశస్త్యమేపారగా
  కదముల్ ద్రొక్కుచు సాగె నీ కవిత వాఙ్మాతృ ప్రసాదంబుగా
  హృదయంబెంతయు బొంగె సంతసముతో నేల్చూరి వంశోద్వహా!

  వరహృదయంబున నతులిడి
  మురళీధర! కూర్చితీవు ముచ్చటలిడు సా
  దర వాక్యంబులను సుధీ!
  సరసమతిన్ నీకు నాశిషములను గూర్తున్

  రిప్లయితొలగించు
 16. అయ్యా ఏల్చూరిమురళీధర రావు గారి పద్యాలెంతో బాగున్నాయి కానీ గురుస్తుతి బొత్తిగా శ్రుతిమించిందనిపిస్తుంది ఎందుకంటే పదాంభోజ మకరంద మధుపాన లోలంబాలు అని దేవుళ్ళ్ల గురించి వాళ్ళ భక్తుల కోరిక అయినచో బాగుంటుంది కానీ లౌకికంగా ఆవిధంగా వాడడమేం బాలేదు , ఇంకా వేరే కవులందరినీ ఆగాటన కట్టడం కూడా ఏం బాలేదు . స్వస్తి.

  రిప్లయితొలగించు
 17. శ్రీ అజ్ఞాత గారికి నమస్కారం. పెద్దమనసుతో సాధకవిద్యార్థి పద్యరచనను అభినందించినందుకు మీకు హృదయపూర్వక అభివాదనం!

  శ్రీ నేమాని గురుదేవులతో, శ్రీ శంకరయ్య గారితో, అనునిత్యం సమస్యాపూరణం కావిస్తున్న కవులతో ప్రత్యక్షంగా నాకెటువంటి పరిచయమూ లేదు. నన్ను వారెఱుగరు. కేవలం “శంకరాభరణం” బ్లాగు ముఖాన ఈ కంప్యూటర్ వ్యాసంగం పుణ్యమా అని ఈ కృషిని మొదలుపెట్టిన నాకు ఈ పెద్దలందఱితోనూ ఒక ఆత్మీయమైన మైత్రీబంధం ఏర్పడింది. వారి పేర్లను చూసినప్పుడు, వారి పద్యాలను చూసినప్పుడు – ఒక ఆత్మీయత కుదురుకొన్నది. అవకాశం లభించినప్పుడు నేనూ పాల్గొనే చనవు ఏర్పడింది. శ్రీ శంకరయ్య గారి కవిహృదయం, నిష్కల్మషమైన ప్రోత్సాహనం, సమర్థత; శ్రీ నేమాని వారి అంతఃకరణపరిశుద్ధి, స్పష్టమైన వాక్కు, ఆధ్యాత్మికచింతన నాకు నచ్చి, నేనై శిష్యత్వాన్ని భజించి, వారి గురుత్వాన్ని అర్థించాను. నాతో సమానమైన హృదయం కలిగిన సహృదయులు ఆ ప్రకారమే చేస్తున్నారని నేను భావిస్తున్నాను.

  “అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః
  చత్వారి తస్య వర్ధన్తే ఆయుర్విద్యాయశోబలమ్.”

  అని పెద్దలంటారు. “యద్భావం - తద్భవతి”. అంతకు మించి మరేమీ లేదు.

  ఈ పద్యాలు కేవలం ఆత్మాశ్రయాలు కనుక ఆ భావైక్యం కలవారు వాటిలో తమ హృదయబింబాన్ని చూస్తారు. నచ్చకపోతే నవ్వుకొంటారు. అంతే కాని, ఎవరినో గాట కట్టాలని, నాకు పరిచితులే కాని అన్యకవులను తిరస్కరించాలని - నా ఉద్దేశం కాదని; “గురు ర్దేవో మహేశ్వరః” అని; “నా భక్తి రచనలు నావి” అని; ఏమైనా అటువంటిది - నా భావంలోనూ, భాషలోనూ లేని అపార్థం ఘటిల్లితే మాత్రం మన్నింపగలరని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.

  పద్యంలో దోషం దొర్లింది కాబట్టి ఈ విధంగా సవరించుకొన్నాను:

  పూజ్య నేమాని గురుపదాంభోజ రాజ
  మాన మధుపానలోలహృన్మత్తసుమతి
  లోక లోలంబనికరంబు లౌ కవయితృ
  మిత్రులకు స్వస్తిఁ గూర్పుము మేలుఁగీళ్ళ.

  నమస్తే, పునస్తే.
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించు
 18. నేమాని వారి రామాయణం చదివిన వారికి వారు ఋషితుల్యులని భావించి వారికి గురుస్థానాన్ని ఇస్తారనడంలో సందేహం లేదు. ‘గురుదేవో భవ’ అన్నారు. గురువును దైవంకన్నా ఎక్కువగా స్తుతించినవారూ ఉన్నారు. దయచేసి విమర్శలను వ్యక్తినిష్ఠ చేయవద్దని సవినయంగా మనవి చేస్తున్నాను. స్వస్తి!

  రిప్లయితొలగించు