అవతారధార
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
శరణని కేళులెత్తు శ్రుతి సంతతి వంత నడంప, సోమకా
సురు పెనుమోమునం దొరఁగు శోణితపూరము సాగి సాగరో
దరమున రక్తనాడుల విధంబుగఁ దోప జగత్త్రయీభయం
కరముగ నీడ్చుచుం గెడపు కాలమునన్ శ్రమ మందినావొ?; మం
దరగిరి వీపుచిప్పపయి దార్కొని కుమ్మరిసారె పోల్కి బి
ట్టొరయుచు దిర్దిరం దిరుగుచున్నెడ నొచ్చితివో?; శశాంక సుం
దరతర బింబపున్నడిమి నల్లనిమచ్చ యనంగ నానన
స్ఫురదురుదంష్ట్రికాగ్రమున భూవలయం బమరించి, తన్మహా
భరము వహించుచో నలత పాల్పడినావొ?; యనన్యతన్ “హరీ
హరి” యను పచ్చిరక్కసుని యర్భకు నోమఁగ నుక్కుకంబపుం
జిరుతఁడవై, మహాసురుని జీలుచువేళ రమాలతాంగి ముం
గురులకు శిల్పకారులగు గోరులు నొచ్చెనొ?; పిన్నవై బలీ
శ్వర కరదానధార సహసాస్ఫురదంఘ్రిని దమ్మిచూలి ని
ర్భరముద మందుచుం గడుగు పావనజీవనధార కర్పరం
బొరసెడి గోటికోటి దిగుచున్న మహాజలధార యేకతన్
ధరఁ బడ విశ్వరూపమును దాల్చుతరిన్ వెరఁ గందినావొ?; దు
ర్నరపరిపాలకాళి గళనాళవిలుంఠన కేళి వేడి నె
త్తురు లవి చుక్కచుక్కలుగఁ ద్రుళ్లిపడం గఱలెక్కి యెఱ్ఱనౌ
పరశువు దీపఁపుం గళిక భాతిఁ గరాంచలమందు వెల్గఁగా
నిరువదియొక్కమారులు నహీనతరార్భటి భూప్రదక్షిణీ
కరణ మొనర్చుకాలమున గాసిలితో?; యల తండ్రి యానతిన్
శిరమునఁ దాల్చి కారడవి జేరి శిలాశితకంటకౌఘ ని
ష్టురతరదంతురస్థలులు సోకఁ జరించెడివేళ నూత్న పం
కరుహ పదద్వయంబు కసుగందెనొ?; యల్ల యశోద నీదు పెం
పెరుగక చిన్నిబొజ్జపయి నిప్పటికిం బెనుదద్దు సుట్టిరా
బిరబిర గట్టు కట్లు, “నిలు వెన్నెలదొంగ!” యటంచు గోపతా
మరసదళాక్షు లెల్ల బహుమానముగా నిడు బుగ్గపోట్లు, పా
ర్థ రథము ద్రోలు వేళఁ బయిఁ గ్రమ్మెడి కైదువు వ్రేట్లు, మున్నుగా
బెరసిన పెక్కుపాట్లు పడి వేసరితో?; పెడదారి పోడుముల్
గరపుచు నాసురప్రకృతులన్ పెకలించి కలంచినట్టి య
వ్వెరవు దలంచియే యనుతపించుచు నుంటివొ?; యింకముందు భీ
కర కరకంపితాసి తొలి కార్మెరపుల్ నెరపన్ నవాంబుదా
విరళ వినీలకాంతి మహిభృచ్ఛిరముల్ వెస నాక్రమించి తీ
వ్ర రుధిరవృష్టిమై పదనువారిన ధారణి ధర్మనిర్మలాం
కురముల సొంపునింపు తెరఁగుం బరికింపుచు నుంటివో?; నిజం
బరయ నతీతమున్ మఱి యనాగతమున్ గొన సర్వశక్తి వీ
కరణి కనుల్ మొగుడ్పఁ దగు కాలము గాదిది మెండునిండి ర
స్థిర హృదయుల్ దురామయులు “దేవుఁడు లేఁ”డని విఱ్ఱవీగు పెన్
మొరకులు వారి యోష్ఠపుటి మున్‌మును సీవనముం బొనర్చి దు
ర్భరతరగర్భ దాస్యమయ పంకనిమజ్జ దమాయక ప్రజం
గరుణ సముద్ధరింపుచు జగత్పతి! యాద మహీధరాగ్ర మం
దిరమున నిందిరం గలిసి తేలుము విశ్రమకేళి, పాతకో
త్కర పటుగంధ సింధుర విదారి! హరీ! గుణహారి! మాదృశా
దరణము మానకుండుము సుధామయ దృఙ్గ్లహరీ! నృకేసరీ!
(ఇది యాదగిరి లక్ష్మీనృసింహస్వామి ప్రార్థనా రూపం. అవి రజాకార్ల దురంతాలతో నైజాం ప్రజలు పలుపాట్లు పడుతున్న రోజులు. కాలం 1947-48. ఉత్సవాలకు కాలినడకన ప్రయాణమైన చిలుకమఱ్ఱి వారిని, వారి సహచరులను దారిలో అడ్డగించి సోదాచేసి ఆ దుండగులు రెండు రోజులు పడవేసి ఉంచారు. స్వామిని నిందించారు. తర్వాత ఎలాగో తప్పించుకొని స్వామి సన్నిధిని చేరి వ్రాసిన విన్నపం ఇది.)
బాగుందండి.
రిప్లయితొలగించండిరమాలతాంగి ముంగురుల శిల్పకారులైన యంగుళులు....
చివరికి వచ్చే సరికి కంటనీరు తెప్పించారు.
చిలుకమర్రి వారు రామదాసులా ఆవేదన తో చెప్పిన చంపక మాలా మాలిక అనుపమానముగా నున్నది.
రిప్లయితొలగించండివారి ప్రతిభకు నశ్శతములు.
నారాయణోపాసకులైన ఆచార్యులవారు శ్రీ హరి దర్శనము ను పొంది ఆర్తితో వ్రాసినట్లుగా ఉన్నది. వారు ధన్యులు. వారి శిష్యులు మీరు ధన్యులు. మీ ద్వారా మేము ధన్యులం. గురువుగారూ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిప్రాచీనమహాకవులకు తీసిపోని పాండిత్యం,కవితాధారతో చంపకమాలలో మాలికగా అద్భుతంగా రచించిన చిలుకమర్రివారి రచనకు నివాళినర్పిస్తున్నాను.