22, ఆగస్టు 2012, బుధవారం

విన్నపము - ౮

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

మేనుగల యంతకున్ విషయానువృత్తి
సాగుటయె తప్పదందువా? సాగనిమ్ము!
కాని యద్దాని ఫలము సుంతైన నాకు
వలవ దంతర్నియంతవై వెలయు రేఁడ!
యందవలె నీకె తానది యడుగడుగునఁ,
గరుణతో నీవ కొనవలెఁ గాన్కవోలె,
ఇంతపాటిగ చనవు నీ విచ్చెదేని
నిన్నె కన్గొందు నాయందు, నిఖిలమందు
నింక నీకు నా కరమర యేమి స్వామి?
ఈ జగంబెల్లఁ బ్రేమింతు వీవ యంచు,
నపుడు నీ సృష్టిశిల్పమం దణఁగియుండు
నతి నిగూఢ మహారహస్యములు నాకు
గోచరంబగు నడుగడుగునకుఁ దామె!
సకల కర్మలు యుష్మదర్చనమ యౌచు
విశ్వకల్యాణ కృతులయి వెలయు నపుడు!
కాని యపుడేని నాయెద గర్వలవము
చేరఁగా నీకు మంజలి సేతు నీకు!
దోపవలయుఁ బ్రభూ! నీవ తోపవలయు!
నీదు కల్యాణ గుణములె నిఖిలమందు
నందవలె మేనఁ బ్రాణము లాడుదాఁక!
చిన్నబుచ్చకు తండ్రి నా విన్నపంబు.
*     *     *     *     *     *
అవలి మాటయొ! యమృతార్ణవాంతరాళ
పరినిమజ్జనమౌ భవత్పదమె కలదు,
తప్ప దాపొందు నీకు నా కెప్పుడైనఁ,
జింత రవ్వంత చెంతకుఁ జేరదింక.
*     *     *     *     *     *
కాని యీదేహ మున్నంత కాల మిచట
నీ పయింగల నమ్మిక మాపఁజూచు
ఘటనలంగూడ నీ చిత్ర నటన గతులె
కాన రావలెఁ గనులకు గట్టినట్లు,
చిన్నబుచ్చకు తండ్రి! నా విన్నపమ్ము,
నాదు పేరాస గన్గొని నవ్వఁబోకు,
శ్రీసఖా! ముగ్ధమధుర సౌశీల్యసీమ!
స్వామి! నారాయణా నమస్కార మిదిగొ!

* సంపూర్ణము*

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి