7, ఆగస్టు 2012, మంగళవారం

పద్య రచన - 74


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. భరత ఖ్యాతిని పరదేశ వాసులకును
    తెలియ జెప్పెను యువతకు దేశ భక్తి
    బోధ జేసె 'నరేంద్రుడు' పుణ్య పురుషు
    డాతడెవ్వడు వివేకానంద మూర్తి

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    వివేకానందులపై మీ పద్యమును సరిగా చూచుకొనండి.
    (1) భరత ఖ్యాతి -- ఖ్య వలన ఆ ముందరి త గురువు అవుతుంది.
    (4) 4వ పాదము ఏ పద్యపాదమో తెలియుట లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వేగంగా స్పందించి చక్కని పద్యాన్ని వ్రాసినందుకు ధన్యవాదాలు, అభినందనలు.
    మొదటి, చివరి పాదాలలో గణదోషాలున్నాయి. ‘భరతఖ్యాతి’ అన్నప్పుడు త గురువుకదా! ‘వివేకా’ అని యగణం పడింది. నా సవరణ...
    భారతఖ్యాతి పరదేశ వాసులకును
    తెలియ జెప్పెను యువతకు దేశ భక్తి
    బోధ జేసె 'నరేంద్రుడు' పుణ్య పురుషు
    డాతడే వివేకానందు డమలయశుడు.

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ! నిజమే ..త్వరపాటు లో పొరపాటులు ..ధన్యవాదములు..
    శంకరార్యా! చక్కని సవరణలు జెసిన మీకు కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  5. దేశ దేశాలు చాటిన దేశ భక్తి
    సంత సంబును గలిగించె సకల ప్రజకు
    అందు కొనుమయ్య ! యోనరేంద్రందుకొనుము
    వందనంబులు మాయవి వంద లాది

    రిప్లయితొలగించండి
  6. మన ధర్మమ్ము స్వతఃప్రమాణవర మాత్మజ్ఞాన సంపత్తియే
    మన విత్తమ్మని విశ్వవేదిపయి బ్రహ్మజ్ఞానమున్ బోధ చే
    సిన ధీవర్య! నరెంద్ర! సాదరముగా జేజేలొనర్తున్ సుధీ
    జన సమ్మాన్య గురూత్తమా! సుగుణ భూషాఢ్యా! వివేకార్ణవా!

    రిప్లయితొలగించండి
  7. వేదిక పైన నిల్చి సభ విస్మయమంద వచించు శక్తితో
    సాదరభావనన్ పరులు సంతసమందగ నుండు భక్తితో
    సోదరులంచు నెల్లరకు సూక్తుల నెప్పుడు నేర్పు యుక్తితో
    తా దరి జేరు వారలకు ధర్మపు మూర్తిగ నిల్చె నీతడే.

    రిప్లయితొలగించండి
  8. అయ్యా శ్రీ సుబ్బా రావు గారూ! శుభాశీస్సులు. మీ పద్యములలో తరచుగా వందనములు మాయవి వందలాది అనే పాదమును చూస్తున్నాము. ఆ ప్రయోగము మీకు చాల యిష్టముగా నున్నదేమో. ఆ ప్రయోగములో ఏమీ తప్పు లేదు కానీ - ఏదో ఒక మారు ముచ్చటించేము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారి పద్యములు.....

    ఱాలఁ బూజించు టేల? విగ్రహములందు
    దేవుఁ డుండునా? యనుచు వాదించునట్టి
    మూర్ఖుఁ డాళ్వారు రాజుకు మోహ మూడ్చి,
    జ్ఞాన మందించినట్టి విజ్ఞాని యతఁడు!

    భరత సంస్కృతిఁ బరదేశ వాసులకును
    జాటి చెప్పి, మెప్పించిన సాధు వతఁడు;
    రామకృష్ణుని ప్రథమ వారసుఁ డతండు;
    శిష్యుఁ డిట్లుండునని చాటు శ్రేష్ఠుఁ దతఁడు!

    భరత యువకుల దివ్యమౌ భవిత కొఱకు
    బోధనలు సల్పి, వెలుఁగొందు బుద్ధుఁ డతఁడు;
    హితము వివరించినట్టి నరేంద్రుఁ డతఁడు;
    నతులు! నా వివేకానందునకు వినతులు!!

    రిప్లయితొలగించండి
  10. చిద్వేద్యంబయి శ్రీనిధానమయి విశ్వేశాకృతింగల్గి, భా
    వద్వేషంబుల రూపుమాపి జనసౌభ్రాతృత్వముల్ బెంచితే,
    విద్వన్మూర్తివి యోనరేంద్ర! ప్రతిబింబించెన్ విదేశమ్మునన్,
    అద్వైతామృతభక్తిభావనలు నిత్యంబై వెలుంగన్ భళా.

    రిప్లయితొలగించండి
  11. అయ్యా శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ!
    అందరూ సౌభ్రాతృత్వము అనుకొంటారు కానీ అది పొరపాటు. సౌభ్రాత్రము అను పదమే ఒప్పు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. కవిమిత్రులకు నమస్కృతులు.
    భాషాభిమానంతో, పద్యకవిత్వంపై ఆసక్తితో, ఉత్సాహంగా పూరణలను, పద్యాలను వ్రాస్తున్న అందరికీ అభినందనలు, ధన్యవాదాలు.
    నా కంప్యూటర్ మానీటర్ చెడిపోయి బ్లాగులో చిన్న అక్షరాలు స్పష్టంగా కనపడటం లెఉ. అందువల్ల మీ పద్యాలను చదివలేకపోతున్నాను. మెకానిక్‌కు ఎన్నిసార్లు ఫోన్ చెదినా ఇదిగో వస్తున్నా అంటూ వారంరోజులుగా ఇబ్బంది పెడుతున్నాడు.
    దయచేసి మరో రెందు మూడు రోజులు మిత్రులు పరస్స్పరం గుణదోష విచారణ చేసికొనవలసిందిగామనవ్.
    ఇప్పుడు నేను టైప్ చేదినన్యాఖ్యుఅలో ఎన్ని తప్పులున్నాయో?

    రిప్లయితొలగించండి
  13. నిద్రాణమై యున్న నిర్వీర్య జాతిని
    మేఘ స్వరమ్ముతో మేలుకొలిపె
    ప్రాచీన శాస్త్రగుప్తమ్మైన జ్ఞానమ్ము
    ప్రజలకు బోధించి పంచిపెట్టె
    దేశ విదేశాల దివ్యసందేశమ్ము
    వాగ్ధాటిచే చాటి వాసికెక్కె,
    భారతీయుల కళా ప్రాచీన విజ్ఞాన
    విభవదీపమ్మును వెలుగజేసె
    దాస్యశృంఖలా బద్ధులై ,తమదు వార
    సత్త్వ వైభవము మరచి ,శక్తిహీను
    లైన యువత నుద్బోధించె నద్భుతముగ,
    అట్టి యా వివేకానందు డమరజీవి.

    రిప్లయితొలగించండి