ఇట్టి సృష్టి యేల?
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
౧శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు
సీ.
మోదుగు బూగెలల్ మొద్దువారెడిఁ గదా
ముద్దుగులాబికే ముండ్లివేల?
కళలేని గాజుపూసలు రాదులౌఁ గదా
నిగ్గుముత్తెములకే గొగ్గువేల?
లెక్క కెక్కని పెక్కు చుక్కలు కలవుగా
వెన్నెల రేనికే వెలితి యేల?
కారుకూతలు ప్రేలు కాకులున్నవి కదా
వాకట్టు లివియేల కోకిలలకె?
ఆ.వె.
నీ నిరంకుశంపు నిర్మాణ ఘనశక్తి
కిది నిదర్శనమ్మొ? యీ విధంబె
నీ వినోదకరమొ? దేవ! కన్నీట వ్రా
యించు నిట్టి సృష్టి యేలనయ్య?
సీ.
ఆణ్వాది బ్రహ్మాండ మంత దానై చొక్కు
సుకవి యౌదలఁ బేదరికఁపు బరువు
మలమలమాడు పొట్టల గొట్టుకొను బిచ్చ
గాండ్ర కేటేట నొక్క శిశుజన్మ
నవ్వు బువ్వుల డాగు నాగులౌ నెడఁదల
విసఁపు టూర్పులకు సొంపెసగు తావి
తెలివి దివ్వెల తళత్తళలందె యజ్ఞాన
గాఢతమస్సమాక్రమణ పరిధి
ఆ.వె.
నీ మహిమకు వెరచి నిన్నెదిర్చి యడుగఁ
జాలఁ డెవఁడు ధైర్యసాహసముల
నెవఁడొ యడగెనేని నీవును మారాడ
జాల విట్టి సృష్టి యేల దేవ?
(మిగిలిన భాగము రేపు)
గురువుగారూ సిరివెన్నెల వారి ఆదిభిక్షువు వాడి నేది కోరేదీ పాట గుర్తుకొస్తూంది. మనసుకు హత్తుకొనే పద్యాలు.
రిప్లయితొలగించండిగుండు మధుసూదన్ గారి వ్యాఖ్య.....
రిప్లయితొలగించండిశ్రీ శంకరయ్య గారికి నమస్సులు. మనోజ్ఞమైన చిలుకమఱ్ఱి వారి పద్యాలు చదువ హృదయము ద్రవించుచున్నది. వారి స్వస్థలమైన వేల్పుఁగొండ(జఫర్ గఢ్)లో వారి తమ్ముని కొడుకు శ్రీ వేంకటాచార్యులు గారితో కలసి పనిచేసినందులకు నేను ధన్యుఁడనైనాను. ఇట్టి పద్యములు తమ శంకరాభరణము బ్లాగునుండి ప్రచురించినందులకు తమకు హృదయపూర్వక ధన్యవాదములు. స్వస్తి.