20, ఆగస్టు 2012, సోమవారం

విన్నపము - ౬

విన్నపము
శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు.

అమల కౌస్తుభ వైజయంత్యాది వివిధ
హార నూపుర కాంచి కేయూర కటక
మకరకుండల మకుటాది మండనముల
సౌరు, పంచాయుధ ప్రభా శబలితముగ,
నింద్రధను వనఁ గెలఁకుల నింపు నింప
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.
*     *     *     *     *     *
ముసి నగవుతోడఁ గ్రీగంటి విసురుతోడ
నాకు నిన్ జూపి, నీకును నన్ను జూపి
కలుపు కలుములవెల్లి మా కన్నతల్లి
నీదు వలపుల దేవేరి నిలిచి వెలుఁగు
మెఱపువలెఁ బేరెడందఁ గాపురము పెట్ట
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.
*     *     *     *     *     *
కనులఁ బెదవులఁ బలుకులఁ గనికరంపు
టమృత వర్షము గురియు, చనాదికాల
ఘోర సంసారదావ దుర్వార వహ్ని
కీలికా మాలికాపరిఖేలనంపు
మేటి తాపము లొకమాటు మీటఁజాలు
చలువ నిడు కేలు నాపయిఁ జాచి వాలు
నీలమేఘము వోలిన నీదురూపు
పరచుకొందును జీవితాంబరమునందు.

1 కామెంట్‌:

  1. అయ్యా గురువుగారూ ఆచార్యులవారి విన్నపాలు మనసును దోచుకొంటూ అనిర్వచనానుభూతిని కల్గిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి