21, ఆగస్టు 2012, మంగళవారం

సమస్యాపూరణం - 799 (రామునకున్ భక్తులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

21 కామెంట్‌లు:

  1. రాముడు రావణు జంపెను
    క్షేమముగా వాని తమ్ము జేసెను రాజున్
    ప్రేమలు నిండిన లంకను
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

    రిప్లయితొలగించండి



  2. తామసమున జయవిజయుల్
    సామికె రిపులైన తత్త్వసారముగనగా
    ప్రేమద్వేషములొక్కటె
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రేముడియో ద్వేషమ్మో
    యే మార్గమునైన భక్తియే, ద్వేష
    మ్మే ముక్తినిడె నసురులకు
    రామునకున్ భక్తులుకద రాక్షసు లెల్లన్

    రిప్లయితొలగించండి
  4. తామస బుద్ధిని వైరము
    రాముని పై బూనియుండి రణమున పోరా
    టము జేసి ముక్తి పొందిరి.
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా గత సమస్యలో నా పూరణకు మీ సూచనను గమనించాను. మెరుగు పరచుకోవడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి

  6. రాముడు భక్తుల పాలిట
    దేముడు గద నిలను జూడ, దీ న జనులకున్
    రాముడె రక్షకు డ య్యెడ
    రామునకుం భక్తులు గద రాక్షసు లెల్లన్

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    రాముని ,
    -----
    క్షేమము గోరిన వారలు
    రామునకున్ భక్తులు గద, రాక్షసు లెల్లన్
    స్వామి శరాఘాతమునకు
    తామసమును బొంది జన్మ ధన్యత గాంచెన్

    రిప్లయితొలగించండి
  8. అయ్యా! శ్రీ సుబ్బారావు గారూ!
    మీ పద్యములో "దేముడు" అనే పదమును వాడేరు. అది సరియైన పదమైనా? దేవుడు అని వాడాలి కదా! పద్యమును మరియొక మారు చూడండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ గురువులకు ప్రణామములు.

    “దేముడు” ప్రయుజ్యమే అనుకొంటాను. కవులు మునుపు ప్రయోగించినదే. కన్నడములోని నడువు – తావరె – నవిలు తెలుగులో వరుసగా నడుమ(ము) – తామర – నమిలి అయినట్లే, ఉచ్చారణసామ్యం వల్ల దేవుడు – దేముడు అయింది. ఇటువంటివే “మావిడి - మామిడి”, “చెవుడు – చెముడు” మొదలైనవి.

    నేటి సమస్యకు పూరణ:

    సోమునకున్ తుహినాచల
    ధామునకున్ కాద్రవేయదామునకున్ శ్రీ
    హైమునకు నంధకరిపువి
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  10. రాముడు సముడెల్లరి యెడ *
    నామము రూపమ్మును విడనాడుచు నాత్మా
    రాముడె సర్వంబన నా**
    రామునకున్ భక్తులు కద రాక్షసులెల్లన్

    *సమోహం సర్వభూతేషు (భగవద్గీత)
    **సర్వం ఖల్విదం బ్రహ్మ (ఉపనిషద్ వాక్యం)

    రిప్లయితొలగించండి
  11. ప్రేమగఁదీవిని దివిగాఁ
    దా మలచగ రావణుని,తన్మయులగుచున్
    స్వామీ యనంగ,రిపులై
    రామునకున్, భక్తులుగద రాక్షసులెల్లన్!

    రిప్లయితొలగించండి
  12. పాముల గళమున దాల్చె డి
    సోముడు భక్తికి వశుడట శోభలు గూర్చన్ !
    ప్రేమగ గొలిచిన దైవము
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్ !

    రిప్లయితొలగించండి
  13. ఏమనిరసురులు లంకన్ ?
    నీమముగ విభీషణుండు నేతయె లంకన్
    రాముని చలవను ! యౌలే !
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్ !

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    లంకాధినేత :

    01)
    _______________________________

    రాముని శోకపు కారకు
    రాముని భామాపహారి , - లంకాపతికిన్
    రాముని దూషకు , డహితుడు
    రామునకున్; భక్తులు గద - రాక్షసు లెల్లన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్టు విభీషణుడి పాలనలో రాక్షసులు రామభక్తులన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ ఉదాత్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    ద్వేషంతో ముక్తిని పొందిన అసురల ప్రస్తావనతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    రెండవ పాదంలో కొన్ని అక్షరాలు టైపు చేయడం మరిచినట్టున్నారు. ‘భక్తియే, ద్వేష’
    ఆన్నచోట ‘భక్తియే యగు, ద్వేష’ అని ఉండాలనుకుంటాను.
    ఇక మీ రెండవ పూరణ అనుపమానం. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి అభ్యంతరాన్ని పరిగణనలోకి తీసుకుంటే ‘రాముడు భక్త శరణ్య/స్థేముడు...’ అనవచ్చు.
    *
    వరప్రసాద్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ నందించారు. అభినందనలు.
    పద్యం చివర ‘గాంచెన్’ను ‘గనిరే’ అంటే బాగుంటుంది.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలు ఎప్పుడు సాధికారంగా, సోదాహరణంగా ఉంటాయి.
    శివభక్తులుగా రాక్షసులను సమర్థించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    రాక్షసులను రావణభక్తులుగా మలచిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘రావణునకు’ అంటే సరిపోతుంది.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    రామేశ్వరునకు రాక్షసులను భక్తులుగా చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా శ్రీ శంకరయ్య గారూ!శుభాశీస్సులు.
    నిజమే - మీరన్నట్లు "యగు" అనే పదము టైపు చేయుటలో పొరపాటున మతిమరపు గర్భములో కలిసిపోయినది. సవరించినందులకు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. లక్ష్మీ నరసింహం గారి పూరణ....

    శ్రీరాముని గుడి కనపడని
    యూరే కనపడదు యా రాముని దయ లేకన్
    యేరోజు గడవదు ద్రవిడమున
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్.

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !

    అంధకరిపువంటేనే శివుడు గద !
    అంధకరిపువిరాముడంటే ఎవరు ?

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వసంత కిశోర్ గారికి
    నమస్కారం!

    సందర్భం వచ్చింది కాబట్టి ముందుగా రెండు మాటలు: 1) "శంకరాభరణం" తొలినాటి నుంచి పూరణలు కావిస్తున్న కవివతంసునిగా మీకు హృదయపూర్వకమైన అభినందనలు. 2) మీ "అమృతభాండము" బ్లాగు అమోఘంగా ఉన్నది.

    మీరు సూచించిన సమాసదోషం విషయం:

    "రపతి (రప - లప వ్యక్తాయాం వాచి) అపకీర్తిం ఇతి రిపుః" అన్న వ్యుత్పత్తిని పురస్కరించుకొని, తనను గురించి దుర్భాషలాడుతున్న అంధకుడనే వాడిని విరమింపజేసినవాడు (శివుడు); "రేపృ గతౌ - రేపయతి" తనమీదికి మూకను కూర్చుకొని యుద్ధానికి వచ్చిన అంధకుడనే వానిని (అంధక ఇతి రిపుం) విరమింపజేసినవాడు - అని రెండు అర్థాలు. అంధకుడనే రిపుని అని విగ్రహం. అంధకరిపుడు అన్నప్పుడు శివుడనే అర్థంలో అంధకస్య రిపుః అని తత్పురుషం. అంధక ఇతి రిపుః అంధకరిపుః. తస్య అవసానకర్తరి" అని చెప్పుకొంటే తప్పులేదనుకొని వ్రాశాను.

    శ్రీ శంకరయ్య గారి సౌజన్యపూర్ణ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  20. విశదంగా వివరించి నా అఙ్ఞానాన్ని విరమింప జేసిన
    ఏల్చూరి వారికి వందనములు మరియు ధన్యవాదములు !

    "అమృతభాండము" లో పద్యాలు(audio)విన్నారా ?
    ఆ గాన గంధర్వుని సమకాలికు లవడం మన అదృష్టం !
    మీకు నచ్చినందుకు ధన్యవాదములు !

    ఈ మధ్య video లతో సహా upload చేస్తున్నారు చాలామంది !
    అందుచేత "అమృతభాండము" update చెయ్యడం లేదు !

    కవివతంసుడు లాంటి పెద్ద మాటలకు నేను తగను స్వామీ !
    నాదంతా 45 ఏళ్ళ నాటి SSLC(11th class) పరిఙ్ఞానం !
    సంస్కృతంలో నాఙ్ఞానం పరిపూర్ణం(అంటే పూజ్యం అన్న మాట)

    మీ విషయ పరిఙ్ఞానం అమోఘమూ , అద్భుతమూ !
    మీ వ్యాసాలనూ , పద్యాలనూ చదివి అవాక్కయ్యాను !
    ప్రశంసించే సాహసం కూడా చెయ్యలేక పోయాను !
    మీ వ్యాసాలవీ చదివిన తరువాత
    తెలుగు మృత భాషల జాబితాలో ఉన్నదని
    బాధ పడడం మాని వేసాను !
    ఇంతకు ముందు పడే వాడిని !

    మరొకసారి ధన్యవాదములు !




    రిప్లయితొలగించండి
  21. నామము "భూకైలాసము"
    భామిని "జమున"మ్మ తోడ భాసిల్లెడి యా
    సోముని భక్తుడు "ఎన్.టీ."
    రామునకున్ భక్తులు గద రాక్షసు లెల్లన్!

    రిప్లయితొలగించండి