17, ఆగస్టు 2012, శుక్రవారం

పద్య రచన - 84


కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

13 కామెంట్‌లు:

  1. ధరను హిరణ్యాక్షుడు తన
    కరమూలము నందు బట్టి కడలిని దాగన్
    తరలి వరాహపు రూపున
    పరిమార్చిన హరికి భూమి భర్తకు జేజే !

    రిప్లయితొలగించండి
  2. అతి దర్పమ్మున విక్రమించుచు హిరణ్యాక్షుండు వేవేగమే
    క్షితి నంతన్ వనరాశిలో మునుచ నెంచెన్ విష్ణువా వేళనా
    దితిజున్ గూల్చె వరాహరూపుడయి భూదేవిన్ వెసన్ దెచ్చి సు
    స్థితి నిల్పెన్ స్థితి కారకుండయిన యా శ్రీశున్ బ్రశంసించెదన్

    రిప్లయితొలగించండి
  3. ధరిత్రిఁ బట్టి రాక్షసుండధర్మియై చరింప, నా
    సురారిపై మహోగ్రతన్ విశుద్ధ వర్ణధారివై
    వరాహ రూపమున్ ధరించి పట్టితీవు ధాత్రినిన్
    పరాత్పరా! మొఱాలకింప భర్తృధర్మమౌ కదా!

    రిప్లయితొలగించండి

  4. చోద్య మరయగ పుడమిని చుట్ట చుట్టి
    దాన వుడక ట సంద్రాన దాచి పెట్ట
    పంది రూపము దాలిచి పద్మ నాభు
    డవని గొని దెచ్చె సర్వులు హర్ష మొంద .

    రిప్లయితొలగించండి
  5. గుండు మధుసూదన్ గారి పద్యము....

    అల దేవాసుర యుద్ధమందున హిరణ్యాక్షుండు సంక్షుబ్ధ కృ
    ద్విలయమ్మున్ సృజియింప నెంచి, యల పృథ్విన్ జుట్టఁగాఁ జుట్టియున్
    జలధిన్ ముంచ; వరాహరూపుఁడయి, యా సర్వంసహ న్గాచి , త
    త్కలధౌతాక్షు వధించినట్టి హరికిం గైమోడ్పు లందించెదన్!

    రిప్లయితొలగించండి
  6. గోలి హనమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    స్థితికారకుడైన వరాహస్వామిని ప్రశంసించిన మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    భర్తృధర్మాన్ని ప్రస్తావించిన మీ పద్యం ప్రశంసనీయంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    అలతి అలతి పదాలతో ఎంత చక్కని పద్యం చెప్పారు! చాలా బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  7. అతులబలుడు,హిరణ్యాక్షు డసురనేత,
    అమితశక్తి గర్వొన్మత్తు దవని నెత్తి
    అబ్ధిలో బడవేయ మహావరాహ
    మూర్తితో వాని వధియించి,ముజ్జగములు
    పొగడ నుద్ధరించితివిగా భూమినపుడు.

    సూకరాకృతిగానిమ్ము భీకరమ్ము
    నారసిమ్హాకృతియ కాని నరుడెకాని,
    ఎట్టి యవతారమైనను నేడులోక
    ములకు బూజనీయమె దివ్యమూర్తి నీదు.

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వరహావతారము :

    01)
    _______________________________

    వసుధను గొని , యసురు డంత - వనధి మునుగ
    వనజభవుని చూచుకమున - ప్రభవ మొంది
    వప్రి జొచ్చి వరాహమై - వసుధ గాచె !
    వందన మిడరె ! కిటి , మన - వాంఛ దీర్చు !
    _______________________________

    రిప్లయితొలగించండి
  9. ధరను చుట్టి సాగరమున దాచి యుంచి దర్పియై
    తిరుగుచున్న హిరణ్యాక్షు త్రుటిని సంహరించగా
    హరివి, శ్రీ వరాహమటుల యవతరించి లీలగా
    అరిని ద్రుంచి, ఇలను ధర్మమరసినావు రాఘవా !

    రిప్లయితొలగించండి
  10. వామన కుమార్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘హిరణ్యాక్షు’ అంటే గణదోషం. ‘హిరణ్యనయను’ అందాం.

    రిప్లయితొలగించండి
  11. గురువు గారికి ధన్యవాదములు.
    ఇలా సమయం దొరికినప్పుడు పాత సమస్యలు లేదా పద్య రచనల మీద పద్య రచన ప్రయత్నం చేస్తున్నాను. వాటిని అక్కడే పోస్ట్ చేయమంటారా, లేక విడిగా మెయిల్ చేయమంటారా ?తెలియ జేయ ప్రార్ధన.

    రిప్లయితొలగించండి
  12. వామన్ కుమార్ గారూ,
    శుభోదయం.
    ఆ పద్యాలను ఆ పోస్టుల దగ్గరే పెట్టండి. అవి ఎలాగూ నా మెయిల్ కు కూడా వస్తాయి కనుక నా దృష్టికి వస్తాయి.
    మీ
    కంది శంకరయ్య.

    రిప్లయితొలగించండి