5, ఆగస్టు 2012, ఆదివారం

సమస్యాపూరణం - 784 (కరము కరము సౌఖ్య)

 కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
కరము కరము సౌఖ్యకరము సుమ్ము!

16 కామెంట్‌లు:

  1. గుండు మధుసూదన్ గారి పూరణ....

    వరము లిడెడి తల్లి వరలక్ష్మి కరుణించి,
    యెల్ల వేళలందు హితముఁ గోరి,
    యఖిల జనుల కిడెడు నభయ ముద్రితమైన
    కరము, కరము సౌఖ్యకరము సుమ్ము!

    రిప్లయితొలగించండి
  2. పగటి వేల్పు మనకు ప్రత్యక్ష దైవము
    జీవముండువరకు చేవనిచ్చు
    ఉదయ భాను రుక్కు లూనుట నారోగ్య
    కరము కరము సౌఖ్యకరము సుమ్ము!
    కరము=కిరణము

    రిప్లయితొలగించండి
  3. మాస్టారూ, ఎందుకో నాపూరణ The Other గా పోస్టు అయింది - 'మనతెలుగు' చంద్రశేఖర్.

    రిప్లయితొలగించండి
  4. పంచయజ్ఞములను పాలించుటకొఱకు
    మగువ కరము బట్టు మగడు; పత్ని
    కరము పతికి శుభము కల్పించు;మంగళ
    కరము; కరము సౌఖ్యకరము సుమ్ము

    రిప్లయితొలగించండి
  5. ఉన్న దానిలోన మిన్నగ నిచ్చునా
    కరము కరము, సౌఖ్య కరము సుమ్ము
    ఇంతి మనసు నెఱిగి యిచ్చకంబులు సేయ
    యెట్టి వారి కైన యిదియ దారి

    రిప్లయితొలగించండి
  6. కరివరేణ్య ముఖుడు గౌరీకుమారుండు
    విఘ్ననాయకుండు విబుధనుతుడు
    ఆశ్రితవరదమగు నా వేల్పు పంచమ
    కరము కరము సౌఖ్యకరము సుమ్ము

    (విఘ్నేశ్వరునికి తుండమే పంచమ కరము)

    రిప్లయితొలగించండి
  7. బాల భక్తుడైన ప్రహ్లాదు బ్రోచిన,
    బాల్యమిత్రుఁగాచు భక్త వరదు,
    మకరిఁజంపికరినిమనసారరక్షించు
    కరము కరము సౌఖ్య కరము సుమ్ము

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీ నరసింహం గారి పూరణ.....

    జగతిలోన జనులు శాంతితో బ్రతుకగ
    బేధభావములను బాధ తొలగ
    దిక్కుదిక్కు ప్రజలు నొక్కటై కలసిన
    కరము కరము సౌఖ్యకరము సుమ్ము.

    రిప్లయితొలగించండి
  9. కాళి రూపు జూడ కాటుక నలదిన
    నల్లదనము గల్గి నాల్క జూడ
    నెరుపు నిండి యుండు నెద దల్చగాను భీ
    కరము, కరము సౌఖ్య కరము సుమ్ము

    రిప్లయితొలగించండి
  10. సత్య నిరతి గాను సంసార బద్ధులై
    క్రొత్త దంప తులన కోరి కోరి
    ధర్మ బద్ధ మైన దామము నందుండి
    కరము కరము సౌఖ్య కరము సుమ్ము !

    రిప్లయితొలగించండి
  11. సోదరులు , చంద్ర శేఖర్ గారూ ! ఒకోసారి నాకు కుడా పోస్ట్ చేయ బోతె , వేరే పేరు వస్తుంది .ఎందుకో తెలియదు అటువంటప్పుడు , ప్రివ్యు కొట్టి నప్పుడు మనం " సైన్ అవుట్ " కొట్టి , మళ్ళీ సైన్ ఇన్ " చేస్తే అవతలి వారి పేరు పోతుంది అప్పుడు మన పేరు వస్తుంది . అలా చేసి చూడండి . ఇలాంటి అనుభవాలు బోలెడు .

    రిప్లయితొలగించండి
  12. పాదములను జూపు పామరుడా జేరు
    మనుచు నొక కర మ్మనును మరొకటి
    పైకి లాగుదనును పరమేశ్వరునిదైన
    కరము కరము సౌఖ్యకరము సుమ్ము!

    రిప్లయితొలగించండి
  13. గుండు మధుసూదన్ గారూ,
    ‘అభయముద్రిత కర’మన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ‘ఆరోగ్యకరము’గా మీరు చేసిన పూరణ బాగుంది. అభినందనలు.
    రాజేశ్వరి అక్కయ్యగారి సలహాను గమనించారు కదా!
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    విఘ్నేశ్వరుని పంచమకరమును ప్రస్తావించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    హరికరమును ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మి నరసింహం గారూ,
    ప్రజలు చేయి చేయి కలిపితే సౌఖ్యమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘భేద’ ప్రాసకోసం ‘బేధ’ అయినట్టుంద. ఆ పాదాన్ని ‘భేదభావములను వెడలగొట్టి’ అందాం.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    భీకరమైనా కాళి రూపు సౌఖ్యకరమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నిన్నటి నుండి విపరీతమైన తలనొప్పి. అందువల్ల కవిమిత్రుల పూరణలను, పద్యాలను పరిశీలించడం ఆలస్యమైంది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  14. కమనీయం గారి పూరణ....

    వర సురుచిర భావవర్ణనా కలితమ్ము
    దేవదేవు శౌరి దివ్యచరిత
    గాన మొనరు భవ్యకావ్యమ్ముమంగళ
    కరము,కరముసౌఖ్యకరముసుమ్ము.

    రిప్లయితొలగించండి
  15. కమనీయం గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. లక్ష్మీ నరసింహం గారి పూరణ.....

    అతమామలింట కొత్తగా పెళ్ళైన
    జంట, చిలిపికోర్మెలంట, నెవరి
    కంట దొరకకుండ గలిసెడి యిరువురి
    కరము కరము సౌఖ్యకరము సుమ్ము!

    రిప్లయితొలగించండి