31, ఆగస్టు 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 808 (పాపములకు హేతు వగును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.
(ఈ సమస్యను తేటగీతి, ఆటవెలది, కందము, ఉత్సాహములలో పూరించవచ్చు)

14 కామెంట్‌లు:

  1. ఆశ్రయించి సమర్థుడౌ నాత్మ గురుని
    పొంది యుపదేశమును మంత్ర మూలకముగ
    శ్రద్ధతో నుపాసింప భంజనము గాగ
    పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.

    రిప్లయితొలగించండి

  2. భాగ వతులను దూషించ, పరుల నింద
    పాపములకు హేతు వగును, ప్రణవ మొకటె
    మోక్ష సాధన మగును ము ముక్షు వులకు
    నుచ్చ రించుడు మీ రలు నుత్సుక త న .

    రిప్లయితొలగించండి
  3. రండు, మా మతమున చేరి మెండుగుండు
    క్రొత్త దేవుని పూజించు చిత్త మందు
    విత్త మార్గముఁ జూపునే వేద పథము?
    పాపములకు హేతు వగును ప్రణవ మొకటె!

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురువు గారికి మరియు శ్రీ పండిత నేమాని గారికి పాదాభివందనము జేయుచూ,
    గురువుగారి సవరణలకు ధన్యవాదములు
    తే : ధనముపై నాశ జనులకు ధరణిలోన
    పాపములకు హేతు వగును , ప్రణవ మొకటె
    వాదములు లేని నాదము వసుధ లోన
    నిహపర సుఖమిచ్చు పధము యింపుగాను
    ఆ : ధరణిజులకు బెరుగ ధనముపై నాశలు
    పాపములకు హేతు వగును , ప్రణవ
    మొకటె రోగ జగతి కుత్తమ మైనట్టి
    సుర వరమగు దెరచి జూడ నేడు
    క : దాపరికములో దారులు
    పాపములకు హేతు వగును , ప్రణవ మొకటె గా
    కాపాడును మునిజనులన్
    యాపద ముంగిట నిలువగ యమపాశముగన్ |

    రిప్లయితొలగించండి
  5. విడదు ప్రారబ్ద మనునది విశ్వమందు
    రాదు ఆగామి సత్కర్మ రాగమందు
    దమిత దుర్గుణ సంచిత దగ్ధమైన
    పాపములకు హేతు వగును ప్రణవ మొకటె.

    రిప్లయితొలగించండి
  6. చి. వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు. మూడు విధముల చందస్సులలో పూరించేరు. మంచి ప్రయత్నములు. బాగున్నవి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. శ్రీ పండిత నేమాని గురువుగారి ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  8. మిస్సన్న గారూ,
    ప్రణవము పాపభంజన హేతువన్న మీ పూరన ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. నిజమే! కొందరు అన్యమతస్థులు స్వమత ప్రశంస తక్కువగా, అన్యమత విమర్శ ఎక్కువగా చేయడం చూస్తూనే ఉన్నాం. బాగుంది. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    రోజురోజుకు మీ రచనా ప్రావీణ్యం శోభిస్తున్నది. సంతోషం. మీ పూరణలు నేమాని వారి ప్రశంసకు పాత్రమయ్యాయి. అభినందనలు.
    ‘పథము + ఇంపు’ అన్నప్పుడు యడాగమం రాదు. ఆ పాదాన్ని ‘నిహపర సుఖమ్ముల నొసంగు నింపుగాను’ అని సవరిద్దాం.
    ‘మునిజనులన్ + ఆపద’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘మునిజనముల నాపద...’ అందాం.
    *
    చంద్రమౌళి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    అన్య మత ప్రచారకులు :

    01)
    _______________________________

    పాపములకు హేతు వగును - ప్రణవ మొకటె
    పదుల దేవుళ్ళ గొలిచిన - పాపమొదవు
    పారమార్థిక చింతనా - భావమునను
    పాపకర్ములు పెరిగిరి - భారతమున !
    పాపకర్మలు జేసినన్ - బాధ లేదు
    పాప కర్ముల పాపము - బాపుగాన
    పాత మతమును వీడి మా - బాట చనుడు
    క్రొత్త మతమును జేరుచో - కొరత దీర్చు !
    _______________________________

    రిప్లయితొలగించండి




  10. మదము,మోహమ్మహంకార మత్సరములె
    మనుజు లెల్లరికి బతనమునకు,దారి
    పాపములకు హేతువగును,; ప్రణవమొకటె
    ముక్తి మార్గమ్ము జూపు ముముక్షువులకు .

    రిప్లయితొలగించండి
  11. రూప భేద ముండుఁ గాని లోప మేది వారిలో
    చూపుఁ జూడ సర్వ దైవ శోభితంబునిత్యమై
    ఓపు గలిగి స్మరణ జేయు నొడుపుఁదెలియ నడ్డమై
    పాపములకు,హేతువగును ప్రణవ మొకటె కాచగన్

    రిప్లయితొలగించండి
  12. సకల మంత్రమ్ము లకు ముందు శక్తి పెరుగ
    నిలిచి యుండును ఓంకార మలతి జేయ
    రాదు దానిని నరులు నిరాదరింప
    పాపములకు హేతు వగును, ప్రణవ మొకటె.

    రిప్లయితొలగించండి
  13. లక్ష్మీ నరసింహం గారి పూరణ....

    సిరులు గోరి మనసు చిక్కుల బడి ఘోర
    పాపములకు హేతు వగును; ప్రణవ
    మొకటె పాపనాశము కలియుగమునందు
    నాకు దిక్కు శివుని నామ జపము.

    రిప్లయితొలగించండి
  14. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘ఉండును + ఓంకార’ మన్నప్పుడు సంధి జరగాలి కదా. ‘విలసిల్లు నోంకార’ మందాం.
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి