23, ఆగస్టు 2012, గురువారం

సమస్యాపూరణం - 801 (శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య   ఇది...
శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్.

23 కామెంట్‌లు:

  1. వశుఁడయ్యె రుక్మి, యతనికి
    శిశుపాలుడు ప్రాణసఖుడు; శ్రీకృష్ణునకున్
    వశమైనట్టి రుక్మిణి గని
    దశవిధముల సఖునికొసగ దా యోచించెన్.

    రిప్లయితొలగించండి
  2. శిశుపాలుండజ్ఞానియు
    బశుతుల్యుండగుట హరిని వైరిగ దలచెన్
    పశుపాలకుండు కృష్ణుడు
    శిశుపాలుడు ప్రాణసఖుడు శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి
  3. లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ చక్కని విరుపుతో ప్రశస్తంగా ఉంది. అభినందలు.
    మూడవ పాదంలో గణదోషం... ‘వశమైన రుక్మిణిం గని’ అని నా సవరణ...

    రిప్లయితొలగించండి
  4. పండిత నేమాని వారూ,
    పశుసమానుడైన వానిని పశుపాలకునికి సఖునిగా జేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  5. యశ రహితులు కౌరవులకు
    శిశు పాలుడు ప్రాణ సఖుడు, శ్రీ కృ ష్ణు నకున్
    పశువుల కాపరి పేరును
    పశువుల లం మేపు కత న వడ సె ను భువిలో .

    రిప్లయితొలగించండి
  6. అయ్యా! శ్రీ సుబ్బారావు గారి పూరణలో కొన్ని సవరణలు చేయాలి.
    (1) యశరహితులు - సాధువు కాదు. యశోరహితులు అని యుండాలి.
    (2) పశువుల లం మేపు - వారి భావము తెలియుట లేదు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. గుండు మధుసూదన్ గారి పూరణ....

    నిసుగైన వయసు నుండియు
    సిసలౌ శ్రీకృష్ణు వైరి శిశుపాలుఁడు; ప్రా
    ణ సఖుఁడు శ్రీకృష్ణునకున్
    బిసరుహ నేత్రుఁడు కిరీటి బీభత్సుఁడిలన్!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ గురువులకు ప్రణామములు.

    యశశ్శబ్దం సకారాంతం కనుక “యశోరహితులు” అన్నది ప్రకృష్టప్రయోగం. అకారాంతమైన “యశ” శబ్దం కూడా ఉన్నది. శ్రీ సుబ్బారావు గారు తెలిసి చేసినా, తెలియక చేసినా “యశరహితులు” కూడా సాధ్యమే. తప్పు కాదు.

    “సవిసర్గావిసర్గయోః స్యాదభేదేన కల్పనమ్” అని పురుషోత్తమదేవుని ‘శబ్దభేదప్రకాశం’ లోని సూత్రం. పురుషోత్తమదేవుని కోసమే కాదు; శ్రీహర్షుని ‘ద్విరూప కోశం’, మహేశ్వర సూరి ‘శబ్దభేదప్రకాశం’ “యశ”శ్శబ్దాన్ని సకారాంతం గానూ, అకారాంతం గానూ పఠించాయి. సంస్కృతకవులు ప్రయోగించారు.

    ఎఱ్ఱన గారు శ్రీమదాంధ్ర మహాభారతం ఆరణ్యపర్వంలో అచ్చమూ ఈ “యశ”శ్శబ్దాన్నే అకారాంతంగా “యశలాభంబు” అనుకొంటాను - దిద్దటానికి వీలులేని ప్రయోగం చేశారు (అలవోకగా పద్యం మొదలు జ్ఞాపకం రాలేదు. పుస్తకం చూసి మళ్ళీ పద్యాన్ని ఉదాహరిస్తాను). ఇతర సకారాంతశబ్దాలనూ తెలుగు కవులు అకారాంతాలుగా ప్రయోగించారు.

    నాకు వెంటనే స్ఫురించినది సకారాంత “రజ”శ్శబ్దాన్ని అకారాంతంగా ప్రయోగించిన శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి “ఊహాగానము – ఇతరకృతులు” గ్రంథంలోని పద్యం. (ఈ శీర్షికలో అకారాంత పుంలింగమైన “ఊహ” శబ్దాన్ని “ఊహా” అని ఆకారాంత స్త్రీలింగంగా ప్రయోగించిన రూపాన్ని గుఱించిన నా వ్యాసాన్ని http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/nov11/gadhapratibhudu.html లో చూడవచ్చును. “రజాశ్లేషం” శబ్దచర్చతోడి నా వ్యాసం “అబ్బూరి శతజయంతి సంపుటి”లో అచ్చయింది.)

    శ్రీ అబ్బూరి రామకృష్ణారావు గారి పద్యం ఇది:

    “నేనే కాదు; సమస్తభూతతతియున్ నిర్వేదభారమ్ముచే
    నానాభంగుల లాలనీయగతులన్ నా గీతమే పాడు, లో
    కానీకమ్ముల లోన లోన నొక హాహాకార ముద్భూతమై
    శ్రీ నారాయణపాదనీరజరజాశ్లేషమ్ము కాంక్షించెదన్.”

    అని. భవతు!

    విధేయుడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  9. పశువుల గాచిన వానికి
    పశు తుల్యుడు మిత్రుడనిరి పండిత నేమా-
    ని శత నమస్సులు వారికి
    శిశుపాలుడు ప్రాణసఖుడు శ్రీకృష్ణునకున్.


    రిప్లయితొలగించండి
  10. శ్రీ మురళీధర రావు గారికి - సాదర నమస్సులందిస్తూ - వ్యాకరణ శాస్త్రం మీద మీకున్న గాఢతమాభినివేశానికి ప్రణిపాతములతో -

    మీ ' ఊహా గానం ' నన్ను అలనాడెన్నడో ఒకానొక సంపూర్ణ శతావధానంలో ' అవధానాధ్వమునన్ జరించునపు డూహాలోకముల్ దాటి ' అన్న పద్యపాదాన్ని 'ఊహ ను స్త్రీమూర్తిని చేశారే ! ' అన్న వివియల్ నరసింహారావు గారి ఆక్షేపణ మేరకు ' అవధానాధ్వమునన్ జరించునపు డీహాలోకముల్ దాటి ' అని అవధాని మార్చిన విధం జ్ఞప్తికి తెచ్చింది . సంతోషం .

    ఇక యశము రజములను గురించిన మీ వివరణ సాధికారికమైనది. సత్య సన్నిహితమైనది . అభినందనలు !

    రిప్లయితొలగించండి
  11. పశుపాలకుండనుచుఁద
    న్ను శతంబుగ నిందఁజేయఁ నుతులే యనుచున్
    'శిశు'ప్రాణైక్యముఁజేకొనఁ
    శిశుపాలుడుప్రాణసఖుడుశ్రీకృష్ణునకున్!

    రిప్లయితొలగించండి
  12. సుబ్బారావు గారూ,
    సమస్యను విరిచి సమర్థవంతంగా పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘యశరహితులు’ శబ్దం గురించి నేమాని వారి అభ్యంతరాన్ని, ఏల్చూరి వారి సమర్థనను చూసారు కదా! వ్యాఖ్యానించడానికి నాకేమో సంస్కృతంలో పాండిత్యం లేదు.
    నేమాని వారన్నట్టు చివరి పాదం దురవగాహంగా ఉంది. బహుశా టైపాటు కావచ్చు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    సమస్య పాదాన్ని పద్యాంతర్భాగంగా చేసిన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు. ఇంతకు మించి చెప్పే సామర్థ్యం లేని అల్పజ్ఞుడను.
    *
    మిస్సన్న గారూ,
    ఏమి చాకచక్యం! నేమాని వారిని ప్రశంసిస్తూనే పూరణాకార్యంలో సఫలీకృతులయ్యారు. అభినందనలు.
    *
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *
    సహదేవుడు గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘శిశుప్రాణైక్యము’....?

    రిప్లయితొలగించండి
  13. పశువుల కాపరి తగడని
    విసురుగ తావలచి వచ్చె వేడుక మీరన్ !
    వసుదేవుని మేనల్లుడు
    శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీ కృష్ణునకున్ !

    రిప్లయితొలగించండి
  14. రాజేశ్వరి అక్కయ్యా,
    చిన్నప్పుడు మేనబావ ప్రాణ సఖుడే. బాగుంది పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి


  15. పిశునుడు,కుటిలుడు,రుక్మికి,
    శిశుఫాలుడు ప్రాణసఖుడు ; శ్రీకృష్ణునికిన్
    పశుపాలకులు,కిరీటియు
    వశవర్తులు,ప్రాణసఖులు వందితచరితుల్.

    రిప్లయితొలగించండి
  16. ఈనాడు డా. ఏల్చూరి వారి సమర్థన మరియు డా. విష్ణువర్ధన్ గారి ప్రశంస మిగిలిన మిత్రుల స్పందన చాల బాగున్నవి. అందరికీ అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    పసిబాలునిగా నున్నప్పుడు :

    01)
    _______________________________

    శిశువగు వికార రూపుని
    శశధరునిగ మార్చె , నాడు - సౌజన్యముతో
    శిశుపాలుని శ్రీ కృష్ణుడు !
    శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు - శ్రీకృష్ణునకున్ !
    _______________________________
    శశధరునిగ = చంద్రునివలె అందముగా

    రిప్లయితొలగించండి
  18. లక్ష్మీ నరసింహం గారి పూరణ....

    అశువులు బసెను సుఖముగ
    శిశుపాలుడు, ప్రాణసఖుడు శ్రీకృష్ణునకున్
    కుశలము లేదు కుచేలుకు
    వశమే పరమాత్ము లీల వర్ణింప నిలన్.

    రిప్లయితొలగించండి
  19. కమనీయం గారూ,
    ఈనాటి మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    లక్ష్మీ నరసింహం గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చేశారు. అభినందనలు.
    ‘అశువులు’ అనే శబ్దం లేదుకదా.. ‘అసువులు’అన్నా శసప్రాసలో సరిపోతుంది. కుచేలుకు అనరాదు.. కుచేలునకు అనాలి. అయినా కృష్ణుని వలన కుచేలుడు కుశలము పొందాడు కదా! అందువల్ల ‘కుశలమును గనె కుచేలుడు’ అందాం.

    రిప్లయితొలగించండి
  20. పశు తుల్యుడు కాదా మరి
    శిశుపాలుఁడు, ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్
    వశుడగు విజయుడు కావున
    పశువును తా గూల్చె నరుని ప్రక్కన నిల్చెన్.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారికి వందనములు.
    ధన్యవాదాలు.
    శిశుప్రాణైక్యము=శిశుపాలుని ప్రాణం కృష్ణునిలో ఐక్యము చెందుటవలన ప్రాణసఖుడన్న భావంతోవ్రాశాను.

    రిప్లయితొలగించండి
  22. అశరీర వాణి పలుకున
    కుశలునిగా జేసి నూరు క్రోధము లోర్చెన్;...
    యశమీ విధమ్ము నొందిన
    శిశుపాలుఁడు ప్రాణసఖుఁడు శ్రీకృష్ణునకున్

    రిప్లయితొలగించండి