25, ఫిబ్రవరి 2013, సోమవారం

సమస్యాపూరణం – 977 (క్షణమె కోరుదు నిచ్చు నాకదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

31 కామెంట్‌లు:

  1. అణిమవంటి విభూతి వద్దు మహానిధుల్ బహు సంపదల్
    మణులు కోరను వద్దు వద్దిక మాయలన్ బడలేను ర
    క్షణము గూర్చుచునుండు నీకృప! సర్వమంగళ! నీ శుభే
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్

    రిప్లయితొలగించండి
  2. కవిమిత్రులారా,
    ఈనాటి సమస్య "తరల" వృత్తం. దీని గణాలు న-భ-ర-స-జ-జ-గ. యతిస్థానం 12. ప్రాస నియమం ఉంది. దీనికి 'ధ్రువకోకిల' అనే నామాంతరం ఉంది.

    రిప్లయితొలగించండి


  3. నవ భవ రస జగతి జనావాళీ గరియ
    ఇదే నిజ జగ నభ సరస భరిత బ్లాగ్విత
    అయ్యవారి టపా వీక్షించు క్షణమె కోరుదు
    నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్!


    జిలేబి.

    రిప్లయితొలగించండి
  4. ఫణిధరా! నిను నమ్మి యుంటిని, పాహిమాం పరమేశ్వరా!
    గణన సేయక నాదు పాపము, కావరా! కరుణించరా!
    తృణ సమానమటంచు త్రోయక, దీవనల్ కురిపించు వీ
    క్షణమె కోరుదు, నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.

    రిప్లయితొలగించండి
  5. గణన సేయక నాదు తప్పులు కావు నన్ను శుభంకరా !
    వ్రణము కైవడి సల్పు చుండును బాధలెన్నొ జగమ్మునన్
    రణము బోలెడు జీవితమ్మిది రక్షణమ్మిడు నీదు వీ
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్

    రిప్లయితొలగించండి
  6. కురుక్షేత్రములో అర్జునుడు శ్రీకృష్ణునితో...

    రణము వీడుదు నన్న వెంటనె లక్ష్య సాధనఁ దెల్పుచున్
    కనగ నిల్చిన విశ్వరూపముఁ గాంచ దిక్కులుఁ దెల్యవే
    ప్రణుతి జేయగ నిత్య సుందర రాజితంబగు రూప మీ
    క్షణమె కోరుదు,నిచ్చు నాకదె సర్వదాసుఖ శాంతులున్!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ నేమని గురువర్యులు కూర్చిన మధుర కంద ఛందస్సులో నా ప్రయత్నం:

    సులువుగ నూతన విధంపు పద్య సూత్రముఁ గూర్పన్
    పులకితమానసుడనై కరంబు మోడ్చెద మీకున్
    నలువ కళత్ర కరుణా రసంబు నాదెసఁ గుర్వన్
    జెలువము, దీవెనలనీయ నాకు శ్రీగురు వర్యా!
    (తప్పులు సరిదిద్ద ప్రార్థన)

    రిప్లయితొలగించండి

  8. గణన జేయకు దాసు తప్పులు కైటబారి !పదే పదే
    మణులు మాన్యము కోర నేనిక మాధవా !కరుణించు మీ
    క్షణము నుండి నుతింతు నిత్యము శౌరినిన్ భవదీయ వీ
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్

    రిప్లయితొలగించండి
  9. అయ్యా శ్రీ సహదేవుడు గారూ!
    శుభాశీస్సులు.
    మీ ప్రయత్నము ప్రశంసనీయము. మీరు నేను చేసిన ప్రయోగము కంటె ప్రతి పాదములోను 2 అక్షరములు వేసేరు. అందుచేత మరొక క్రొత్త వృత్తము అవుతుంది. సెహబాస్. ఈ క్రొత్త వృత్తమునకు మీరే పేరు పెట్టుట సమంజసము. శుభం భూయాత్. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. రణవిభూతుల బాంబుదాడుల రౌద్రులైచెల రేగుచున్
    పణమువెట్టిరి మాదుప్రాణము పాడుమూకల ముష్కరుల్
    ఫణివిభూషణ! పన్నగేశ్వర! పాహియంచును, నీకృపే
    క్షణమెకోరుదు, నిచ్చునాకదె సర్వదా సుఖశాంతులన్.

    రిప్లయితొలగించండి
  11. గురువర్యులకు ప్రణామములు.మొదటి పాదం వ్రాసుకుని మిగతా పాదాలన్ని అదే విధంగా వ్రాయడం వల్ల మొదటి పాదంలో యెక్కువగా వచ్చిన రెండక్షరాలు ప్రతి పాదంలో పునరా వృతంబై కొత్త వృత్తావిష్కరణమునకు మూలము కావడము మహదానందంగా వుంది. ధన్యవాదములు. ప్రతి పాదంలో 'న జ స జ భ గా' గణాలుండి 13వ అక్షరం యతి మైత్రిని గలిగి, ప్రాస నియమంతో ప్రాణం పోసుకుంది కాబట్టి వాటిని అలాగే పాటిస్తే బాగుంటుందని పిస్తుంది.పేరు ' భారతి కందం' అని ఆ వాగ్దేవి పేరుతో పెడితే యెలా వుంటుందో బుధజనులైన శంకరార్యులు,ఏల్చూరి వారలు,డా॥విష్ణునందన్ గారలు తదితర గురుతుల్యులందరూ మరి కవిమిత్రులెల్లరూ పరిశీలించ ప్రార్థన. స్వస్తి .

    రిప్లయితొలగించండి
  12. శ్రీ పింగళి శశిధర్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చక్కని ధారాశుద్ధితో అలరారుచున్నది. అభినందనలు. 3వ పాదమునకు చిన్న సవరణ సూచించున్నాను:

    "ఫణివిభూషణ! పన్నగేశ్వర!......"
    కి బదులుగా
    "ఫణివిభూషణ! పార్వతీశ్వర!......."
    అంటే బాగుంటుంది అని నా భావన.

    ఫణివిభూషణ మరియు పన్నగేశ్వర అనే సంబోధనలలో ఒకే అర్థము స్ఫురించుచున్నది కదా!.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ సహదేవుల వారికి అభినందనలు ! మీ వృత్తానికి ' సహకారము ' అని పేరు పెడదాము.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు, గురుతుల్యులు నేమాని వారికి నమస్సుమాంజలులు.
    నా చిన్ని ప్రయత్నం నచ్చినందుకు సంతోషం. మీసవరణ బాగుంది పునరుక్తి అనుకుంటాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. గుణము రూపము లున్న లేకను గోప్యవర్తన భాసిలన్
    గణ కణమ్ముల నిండియుండవె ! కన్నతండ్రి ! కృపాళువా !
    ప్రణతులిచ్చెద బ్రహ్మమేలను భక్తి గూడగ నిశ్చలన్
    క్షణమె కోరుదు, నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.

    రిప్లయితొలగించండి
  16. యథాలాపంగా సహదేవుడు గారు రచించిన నూత్నచ్ఛందమ్మును చూసి సంతోషపడితే , దానికి గన్నవరపు నరసింహ మూర్తిగారి వినూత్న నామకరణము రెట్టింపు ఆనందము కలుగజేసినది . నేనూ ఆ నామకరణాన్ని బలపరుస్తున్నాను .

    సహకారమ్మను క్రొత్త ఛందమును సాక్షాచ్ఛారదా సత్కృపా
    సహితంబైన కుశాగ్ర బుద్ధి సెలగన్ సంధించితే ? యిమ్మహిన్
    రహియించున్ సుకవీ త్వదీయ రచనా ప్రావీణ్యముత్కృష్టమై
    సహదేవా ! విజయోస్తు పద్య కవితా సంపత్కళా వైభవా !

    రిప్లయితొలగించండి
  17. క్షణములున్ దిన వర్షమాదిగ సాగిపోవుచునుండ నే
    క్షణమునన్ నిను నెమ్మనంబున గాంచనేరక పోయితే
    రణము చేయగ జీవితంబున"రామ" నామము పల్కునా
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖ శాంతులన్.

    రిప్లయితొలగించండి
  18. ఈనాటి సమస్యకి మంచి మంచి పూరణలు వచ్చినవి. పూరించిన కవి మిత్రులందరికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. ఈనాటి సమస్యకు మంచి పూరణ లిచ్చిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    లక్ష్మీదేవి గారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    సహదేవుడు గారికి,
    గండూరి లక్ష్మినారాయణ గారికి,
    పింగళి శశిధర్ గారికి,
    గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    తోపెళ్ళ బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    సంతోషం.
    మీ క్రొత్త ఛందం నేమాని వారి ఆమోదం, గన్నవరపు వారి నామకరణం, డా. విష్ణునందనుల సమర్థన పొందింది. అదృష్టవంతులు మీరు.

    రిప్లయితొలగించండి
  21. పెద్దలందరికీ ధన్యవాదములు. మీరందరూ బలపరచిన 'సహకారము' అన్న నామమే ఆ పద్య ఛందానికి పెడుతున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. నూత్నచ్ఛందోవిధాత శ్రీ సహదేవుడు గారికి
    హార్దికాభినందనములతో,

    మీరు కల్పించిన ఈ వృత్తం సంస్కృతాంధ్రాలలో ఎక్కడా లేనందువల్ల శ్రీ వావిళ్ళ వారికి నేను పరిష్కరిస్తున్న “అప్పకవీయము” పీఠికలో “ఆధునిక కాలమున నూతనప్రయోగములు” అన్న విభాగంలో సంతోషంగా చేర్చుకొంటున్నాను. దీనికి శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారు “సహకారము” అని చేసిన నామకరణం మనోహరంగా ఉన్నది.

    ఈ విధమైన చిత్రకల్పనలకు ఆలవాలమైన “శంకరాభరణం” కల్పయిత మాన్యులు శ్రీ శంకరయ్య గారికి కూడా అభినందనలు!

    ఇహపరతారకపదసం
    గ్రహమై వాణీపదాబ్జఘటితామరభూ
    రుహనవపుష్పకమై మీ
    సహకారము వ్యాప్తిఁజెందు సహదేవకవీ!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి




  23. గణుతి కెక్కిన యంత్రతంత్రము,కామభోగవిలాసమున్
    క్షణికమైన విమోహబంధము ,గర్వకారణ ధీకృతుల్
    మణులు ,మాన్యము ,కావు ముక్తికి మాధవా,హరి ,నీదు ర
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ సహదేవుడు గారికి అభినందన మందారమాల!

    రిప్లయితొలగించండి
  25. వణకుచుంటిని భీతితో భవ వార్నిధిన్ దరిగానకన్
    తృణము బోలిన దేహమెప్పుడు తేలునో యిట కట్టె యై
    పణపు మోహము బాసి నీ పద పద్మ సన్నిధి నిల్తు నీ
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యములో "దరిగానకన్" అన్నారు కదా. అది వ్యతిరేకాత్మకము - అందుచేత చివర ద్రుతము రాదు. కొంచెము చూచి మార్చండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. నేమాని పండితార్యా ధన్యవాదములు.

    వణకుచుంటిని భీతితో భవ వార్నిధింబడి యొంటినై
    తృణము బోలిన దేహమెప్పుడు తేలునో యిట కట్టె యై
    పణపు మోహము బాసి నీ పద పద్మ సన్నిధి నిల్తు నీ
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్

    రిప్లయితొలగించండి
  28. సణుగుడొద్దుర! ప్రాణనాయిక! సగ్గు బియ్యము లేదనే
    గొణగ బోకుర! పూరి గారెలు కొబ్బరన్నము లేవనే
    పుణుకు చాలును భామ నాకిక బుగ్గ గిల్లెద! నీదు వీ
    క్షణమె కోరుదు నిచ్చు నాకదె సర్వదా సుఖశాంతులన్

    రిప్లయితొలగించండి