23, మే 2014, శుక్రవారం

సమస్యాపూరణం – 1421 (పిల్లి మనసున నెలుకపై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)

22 కామెంట్‌లు:

  1. రాజ్య పాలన వచ్చె మార్జాలమునకు
    ప్రజల నెల్లర సుఖముగా బ్రతుకు నట్లు
    పాలన మొనర్చు నాకాంక్ష ప్రబల మగుట
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

    రిప్లయితొలగించండి
  2. తొల్లి యొకనాడు సింగంబు తోక ముడిచి
    మంచి మనసున మనమంత మైత్రి గాను
    నమ్మి స్వేచ్చగ నుండుము వమ్ము గాదు
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

    రిప్లయితొలగించండి


  3. గోడమీది పిల్లి ఎలుకకై వేచిన విధమున
    మనమును ధ్యాన రీతిన ఆ పరంధాముని
    ఈశ్వరుని సాక్షాత్కారము కోరి వేచిన
    పిల్లి మనసున నెలుక పై ప్రేమ పండె !!

    ఈట్-ప్రే-లవ్
    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  4. తెలుగుజాతినివిభజించు తెఱగుచేత
    ప్రజలమద్దతు గెలువనేఱముయటంచు
    పిల్లకాంగ్రెసు జగనుపై ప్రీతి సలిపె
    పిల్లిమనసున నెలుకపై ప్రేమకలిగె

    రిప్లయితొలగించండి
  5. Hi All,
    I'm Venkat son of Satyanarayana Reddy garu. His recent bypass surgery is successful and he will be returning home with in a week's time. He is missing this blog a lot.

    Regards,
    Venkat

    రిప్లయితొలగించండి
  6. ప్రేమ శత్రువు కైనను ప్రీతిగూర్చు
    ననుట పసిగట్టి పనిపట్ట నార్తితోడ
    వేటువేయగా వ్యూహమ్ము చాటెనేమొ
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె!!!

    రిప్లయితొలగించండి
  7. ఎల్ల జంతువు లేకమై పిల్లి ! నీవె
    రాజువయి మమ్మేలు మీ రభసమేల
    ననగ మతబేధమును వీడె, నాత్మలోన
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె.

    రిప్లయితొలగించండి
  8. మునుల యాశ్రమ పరిసర మున ని వాస
    మగుట కారణము వలన నన్ని జంతు
    వులచట స్నేహ భావంబు మెలగు వలన
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

    రిప్లయితొలగించండి
  9. పిల్లి తినునను భయముచే బిలము చేర
    నెలుక దాచిన సరుకులు వెలికి వచ్చె
    పలు రుచుల భోజ్యముల్కడుపార దినిన
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె.

    రిప్లయితొలగించండి
  10. పిల్లి తినునను భయముచే బిలము చేర
    నెలుక దాచిన సరుకులు వెలికి వచ్చె
    పలు రుచుల భోజ్యముల్కడుపార దినిన
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె.

    రిప్లయితొలగించండి

  11. పండిత నేమాని గారికి పూజ్యులు గురుదేవులు
    శ౦కరయ్య గారికి వందనములు

    మూషికము వంటి భర్తకు ముద్దులసతి
    పిల్లి వలె నుండ నేమాయె?కొల్లలుగను
    యెలుక పెనిమిటి కానుక లీయ రాణి
    పిల్లి మనసున యెలుకపై ప్రేమ ప౦డె
    మరియొకపూరణ:అఖువు వాహనమాయె గజాననునకు
    కుడుములు౦డ్రాళ్ళు యప్పాల కొదువ లేద
    ట౦చెరు౦గుచు తినుటకు నాశ గల్గి
    పిల్లి మనసున యెలుకపై ప్రేమ ప౦డె

    రిప్లయితొలగించండి
  12. నాగరాజు రవీందర్ గారి పూరణ చాలా బాగుంది.

    Thank you Venkat for the happy news.

    రిప్లయితొలగించండి
  13. పిల్లికూన తటాలున బిలమునందు
    జారె, మూషిక మద్దాని జాలితోడ
    పైకి జేర్చెను, ముదమాయె బయట తల్లి
    పిల్లి మనసున, నెలుకపై ప్రేమ పండె.

    రిప్లయితొలగించండి
  14. పండిత నేమాని వారూ,
    రాజు ప్రజలందరినీ సమానంగా చూడాలి కనుక ఎలుకపై ప్రేమను చూపించిందంటారు. మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మృగరాజు ఆజ్ఞను పిల్లి పాలించకుంటుందా? మంచి పూరణ. అభినందనలు.
    *
    జిలేనీ గారూ,
    పైన వచనకవితలో చెప్పిన భావానికీ, క్రింద ఈట్ ప్రే లవ్ అన్నదానికి లంకె కుదిరినట్టు లేదు.. అయినా ఈ అనుభూతివాదపు వచన కవిత్వాన్ని అర్థం చేసికొని ఆనందించేంతగా నా బుద్ధి ఎదగలేదు ☺
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    పంచతంత్ర కథతో విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    ప్రస్తుత రాజకీయాలకు అనువర్తిస్తూ మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘నేరము + అటంచు’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘నేరము మన మంచు’ అనండి.
    *
    వెంకట్ గారూ,
    మంచి వార్త తెలిపి మాకు ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదాన్ని ఇలా అందాం. ‘జంతు/వు లట స్నేహభావంబుతో మెలగు కతన’.
    *
    భాగవతుల కృష్ణారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ఆఖువు ఉంది కాని అఖువు లేదు. ఉండ్రాళ్ళు + అప్పాల అన్నప్పుడు యడాగమం రాదు. నా సవరణ....
    ఆఖువే వాహనమయె గజాననునకు
    కుడుములు౦డ్రాళ్ళు నప్పాల కొదువ లేద/ టం చెరుగుము...’
    *
    మిస్సన్న గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి




  15. 'మిక్కి మౌసు ' కథలయందు నొక్కమారు
    'టాము ,జెర్రీలు ,చెలిమితో దగ్గరగుట
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె
    నన్న విధముగ నటియించుటరుదు కాదు.

    రిప్లయితొలగించండి
  16. ఆటలాడించి గడుపునో మాటకారి
    పెంచుకొనుచుండె నెలుకయు పిల్లి కుక్క
    జాతివైరంబు మరచియురీతి దప్పి
    పిల్లిమనసున నెలుకపై ప్రేమపండె

    రిప్లయితొలగించండి
  17. మల్లెల సోమనాధ శాస్త్రి గారి పూరణలు

    లక్కయింటికి కౌరవులంపినారు
    పాండుపుత్రుల సుఖముగా వరలుడనుచు
    వారినంతంబు చేయునా పన్నుగడను
    పిల్లిమనసుననెలుకపై ప్రేమపండె

    ఎల్లపార్టీలు నెన్నికనెట్లొ గెలువ
    ప్రజలకష్టాలుదీర్పగా వాదు కొనరె
    గద్దెనెక్కగసమయాన్నిగడుపుకొనరె
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె

    రిప్లయితొలగించండి

  18. పిల్లి పాత్రకు కార్టూను పిక్చరందు
    ఎలుకపాత్రకు డబ్బింగు నిరవుగాను
    చెప్పు వారలు నొకచోట చేరి కలియ
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె



    బహుళంతస్తుల గృహముల
    మహిళలు నొకచోటజేరి మాహేశ్వరినే
    సహపంక్తిజేరి గొలిచిరి
    బహు పత్నీవ్రతమె మేలు భర్తల కెల్లన్.

    వీడను నిన్ను పొందకను వీడిని కీచకుడందురే సఖీ
    నీడగనీదు వెంటబడి నిక్కము కోర్కెను దీర్చుకొందునే
    వీడిని బొంద సౌఖ్యములు పెక్కగు నీకని వ్యర్థ భాషణా
    లాడెను, చేయిపట్టుకొని లాగెను, ద్రౌపది కౌగలింతకై.


    రిప్లయితొలగించండి
  19. Happy to hear about successful surgery to Sri A.S.N Reddy gaaru

    కలిసి రాక యెన్నకలలో కలబడినను
    ఫలితమందిన క్షణమున బలము గలుగ
    రంగు మార్చి మద్ధతు పొంద రాజకీయ
    పిల్లి మనసున నెలుకపై ప్రేమ పండె!

    రిప్లయితొలగించండి
  20. కమనీయం గారూ,
    మీ వాల్ట్ డిస్నీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    డబ్బింగు ఆర్టిస్టుల మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    నిన్నటి, మొన్నటి సమస్యలకు మీ పూరణలు బాగున్నవి.
    *
    సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘ఎన్నికలలో’కు టైపాటు ‘ఎన్నకలలో’...

    రిప్లయితొలగించండి
  21. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి