23, మే 2014, శుక్రవారం

గాయత్రి



గాయత్రి

 రచన :
పండిత నేమాని రామజోగి సన్యాసి రావు



ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
చేతనమ్ము గూర్చు జ్యోతివీవు
భయము దీర్తువీవు భద్రముల్ గూర్తువు
తలతునమ్మ! నిన్ను గొలుతునమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
బడుగునైతి నమ్మ! బాధలెన్నొ
పడుచునుంటి నమ్మ! భవచక్రమున తల్లి!
తలతునమ్మ! నిన్ను గొలుతునమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
నడువజేయు మమ్మ! నన్ను మంచి
యోగమార్గమందు నొప్పుగా నో దేవి!
తలతునమ్మ! నిన్ను గొలుతునమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
ఆర్తి తోడ నిటుల నరుగుచుంటి
దుర్గమమ్ములైన త్రోవలలో నేను
తలతునమ్మ! నిన్ను గొలుతునమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
అభయమిమ్ము భవభయమ్ము బాపి
అలసి సొలసియుంటి నమ్మ! నెమ్మనమున
తలతునమ్మ! నిన్ను గొలుతునమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
ప్రణవ మంత్ర వాచ్య! పరమ పూజ్య!
నీ పదమ్మె నాకు నిక్కమౌ రక్షగా
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
పిలిచి నంతలోనె పలికి వ్యథల
దీర్చి రక్ష గూర్చు దేవత వని మది
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!

ఊతమిమ్ము నాకు నోతల్లి! గాయత్రి!
నీదు సేవలందు మోదమొందు
భాగ్యమిమ్ము నాకు పరమ దయామయీ!
తలతు నమ్మ! నిన్ను గొలుతు నమ్మ!

5 కామెంట్‌లు:

  1. పూజ్య పండితులకు ప్రణామములు
    శ్రీ గాయత్రీ మాత పాద పద్మములకు శిరసు తాటించి శతాధి వందనములు

    రిప్లయితొలగించండి
  2. అమ్మ ! గాయత్రి ! మముజూడు నెమ్మనమున
    నిన్ను బూజింతు నిరతము నిన్ను దలతు
    నీదు సేవయే ముఖ్యము నీరజాక్షి !
    వందనంబులు గైకొను మమ్మ !దయను

    రిప్లయితొలగించండి
  3. నేమాని పండితార్యా! గాయత్రీ మాత మీ ఆర్తిని తప్పక వినగలదు.

    ముత్యపు కాంతి నింపొదవెడు నొక మోము!
    ........విద్రుమాభమ్ముతో వెల్గునొకటి!
    పసిడి కాంతుల తోడ భాసిల్లు వేరొండు!
    ........నీల మేఘఛ్ఛాయ నాలుగవది!
    ధవళ వర్ణము తోడ తనరు నైదవ మోము!
    ........మూడు నేత్రము లుండు మోమునందు!
    ఇందుబింబము కాంతు లీను కిరీటాన!
    ........తత్త్వార్థ వర్ణమ్ము తల్లి మేను!

    అభయముద్రయు, నంకుశ, మబ్జయుగము,
    శంఖ, చక్ర, కపాల, పాశములు, గదయు
    నష్ట భుజముల దాలిచి, హంస పైన
    విహరణము జేయు గాయత్రి విశ్వ మేల!

    రిప్లయితొలగించండి
  4. మా పద్యముల గూర్చి మంచి స్పందన చేసిన మిత్రులు శ్రీమతి రాజేశ్వరి గారికి, శ్రీ సుబ్బా రావు గారికి మరియు శ్రీ మిస్సన్న గారికి మా సంతోషము తెలియజేయుచున్నాను. స్వస్తి.

    రిప్లయితొలగించండి