7, ఆగస్టు 2015, శుక్రవారం

సమస్యాపూరణ - 1753 (మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.
ఈ సమస్యను పంపిన గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదాలు. 

35 కామెంట్‌లు:

  1. నేనెన్నడు నీదాననె
    నానడతను తప్పుబట్ట నాధా తగునా
    యీనీ గేహినిపై యను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  2. స్థానము నెఱిగి మసలుకొను
    వానిని గుర్తింతురు సహవాసులు నౌరా!
    జ్ఞానమ్మునుపొంది దురభి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  3. నేనే నీవని తలచుచు
    నీనీ డనునిలచి యుంటి నీనెల వునకై
    నీనా బేధము మదినను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  4. హీనము గా మము తూలుట
    మానుము ! పైశాచికమ్ము మాపై తప్పే !!
    జ్ఞానము కలిగిన , మగలతి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్!!!

    రిప్లయితొలగించండి
  5. కం: నేనే గొప్పని పలుకుచు
    హీనముగా నితరుల గనియెడి పతి తోడన్
    వేనలి ముడివేసి దురభి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  6. (దంపతులు ప్రయాణం చేస్తున్న విమానం ప్రమాదగ్రస్త మయింది.....)

    ఓ నాప్రియవల్లభ! యిది
    గో నామాట విని గాలిగొడుగుఁ గొని యు
    గ్రానల దగ్ధమ్మైన వి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    (గాలిగొడుగు = పారాచ్యూట్)

    రిప్లయితొలగించండి
  7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. "అనుమానముతో" " అభిమానముతో " మిత్రులు చేసిన పూరణలు బాగున్నవి...మాస్టరుగారూ...మీ పూరణ విమానములో విహరించుచున్నది....అందరికీ అభినందనలు...

    రిప్లయితొలగించండి
  9. మానుము చాడీల వినుట
    మానము లేనట్టి వేళ మననొల్ల సఖా !
    మానిన ముదమిరువుర కను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  10. మానుము చాడీల వినుట
    మానము లేనట్టి వేళ మననొల్ల సఖా !
    మాన ముదమిరువురకు, నను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  11. నెనరుగ బ్రదుకుట కష్టము
    మానము వీడిన, సుఖమని మానిని చెప్పె
    న్ననయము బతికను సన్నల
    జనుటయ యేయింతి కెపుడు జగమున మేలౌ

    రిప్లయితొలగించండి
  12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    పప్పులో కాలువేశారు... విరుపుతో పూరణ బాగున్నది కాని సమస్య గురువుతో ప్రారంభమైతే మీరు మిగిలిన మూడుపాదాలను లఘువులతో ప్రారంభించారు. సవరించండి.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణలు

    నానా ఖర్చులు తామే
    యీనాడు భరించు వారలే సన్మానం
    బూనగ జూడమె మన స
    మ్మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    ఊనగ = పొందగ

    మానాభిమానములు విడి
    నానా కూతలను కూసి నాయకుడగుచున్
    గోనెల ధనమొందు దురభి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  14. గురువుగారికి నమస్కారం. నాకు వచ్చినంతవరకూ పూరణకు ప్రయత్నించాను. కంద పద్యం రాయాడానికి తొలిసారిగా సాహసించాను. నా పూరణ నాకే మరీ అంత అర్ధవంతముగా కనిపించలేదు. మీరు ఒకసారి పరిశీలించి తప్పులు సవరించగలరు. గణ విభజన నాకోసం చేసుకున్నదే అయినా నేను రాసిన మూడు పాదాలకు అలాగే ఉంచాను.

    నేనే |చక్కని |సతినని
    UU UII IIII
    నేనే| నీ యడు|గుజాడ| నీవే |నీడా
    UU UII IUI UU UU
    నేను ను|వు మనమె| మరియను
    UII IIII IIII

    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    నేనే చక్కని సతినని
    నేనె నీ యడుగు జాడ నేవే నీడా
    నేను నువు మనమె మరియను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  15. దీనుల చులకన జేయక
    మానవులందరు నొకటను మమకారముతో
    జ్ఞానముతో మనుజులు నస
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్!!!



    కానల కైనను నడచెడు
    జానకివలె నోరిమి గల సతిపై నెపుడున్
    బూనకు మాత్సర్యము, నను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్!!!

    రిప్లయితొలగించండి
  16. గురుదేవుల పూరణ ఆకాశమంత మంత ఎత్తున విహరిస్తూ వుంటే మా పూరణలు భూమార్గంలోనే...

    లంకాధిపతి దశకంఠునితో మానిని మండోదరి:
    ఇనకుల తిలకుని వనితను
    వనమున నిగుడుచు వరించ బాధించుట మీ
    కొనగూర్చదు సేమము యభి
    మానము వీడిన సుఖమని మానిని జెప్పెన్

    రిప్లయితొలగించండి
  17. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    మొదటి ప్రయత్నమైనా చాలా చక్కగా వ్రాశారు. (అసలిది మొదటి ప్రయత్నం అనిపించడం లేదు. కందం వ్రాయడంలో చేయితిరిగినవాళ్ళు వ్రాసినదానిలా ఉంది). సంతోషం.
    కొన్ని టైపు దోషాలున్నాయి. ‘నీవే నీడై’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు!
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘మీ|కొనగూర్చదు శుభము దురభి|మానము...’ అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  18. జ్ఞానార్జన చేయుచు మది
    ధీనులగూర్చి తలచుచును తీరగు బుద్ధిన్
    ధ్యానము చేయుచు సత మతి
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్
    అతిమానముః దురభిమానము, గర్వము

    రిప్లయితొలగించండి
  19. ధన్యవాదాలు గురువుగారు. అక్షరదోషాలు సవరించి మర్లా రాసిన పద్యమిదిగోనండి.
    నేనే చక్కని సతినని
    నేనే నీ యడుగు జాడ నీవే నీడై
    నేను నువు మనమె మరియను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  20. గుండా వేంకట సుబ్బ సహ దేవుడు గారూ- సమస్య గురువుతో మొదలైతే మీరు మూడుపాదాలూ లఘువుతో పూరించారు.సరిచేయండి.

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు, అన్నపురెడ్డి వారలకు ధన్యవాదములు.పద్యం ప్రచురించి బయటకు వచ్చిన కాసేపటికే, పొరబాటు అవగతమైంది సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  22. సైనికబలగపు కుట్రలు
    కనుగొని తన మాతృభూమి కష్టము దీర్పన్
    మౌనమ్ముగ రిపుల గలసి
    మానము వీడుట సుఖమని మానిని చెప్పెన్.
    (చారిత్రక యథార్ద ఘటన ఆధారంగా.....) _సుమిత్ర....

    రిప్లయితొలగించండి

  23. ఏనాతియు నిల బ్రదుకదు
    మానము వీడిన ,సుఖమని మానిని చెప్పె
    న్నేనాడు గోపగించక
    పానముగా జూచు కొనెడు భర్తలు దొరకన్

    రిప్లయితొలగించండి
  24. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    సుబ్బారావు గారి పద్యంలోని లోపాన్ని గుర్తించాను కాని సహదేవుడు గారి లోపాన్ని గమనించలేదు. తెలియజేసినందుకు ధన్యవాదాలు.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    ఇప్పుడు పద్యం సలక్షణంగా, చక్కగా ఉంది. సంతోషం!
    *****
    మంథా శ్యామల గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదాన్ని లఘువుతో ప్రారంభించారు. కందంలో మొదటిపాదం గురులఘువులలో దేనితో ప్రారంభమైతే మిగిలిన పాదాలు దానితోనే ప్రారంభించాలని నియమం కదా! రెండవపాదాన్ని ‘కానగ తన మాతృభూమి కష్టము దీర్పన్’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    పానము (ప్రాణము)?

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమ:

    ఒక 116/- సంభావన తీసుకొనే పేద పురోహితిని అమాయకురాలైన భార్య తన భర్తతో

    ఏ నోట విన్న కోటియె
    ఈనాటికి వంద యనుట యెక్కడి కగునో?
    కానీ యికనైనను శత
    మానము వీడిన, సుఖమని మానిని చెప్పెన్
    (శతమానం భవతి)

    రిప్లయితొలగించండి
  26. శ్రీపతి శాస్త్రి గారూ,
    చమత్కారభరితమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. దానవ ధూర్తుల మాటలు
    మానసమున నమ్మి నన్నమల చరితను నీ
    దానను బాధించకు మను
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్.

    రిప్లయితొలగించండి
  28. సవరించిన పద్యం :

    లంకాధిపతి దశకంఠునితో మానిని మండోదరి :

    జానకి, రాముని ప్రాణము
    మానుడు కాంక్షిచఁ దగదు మాన్య మహీద్రా!
    దానవ శుభమెంచి దురభి
    మానము వీడుట సుఖమని మానిని జెప్పెన్!

    రిప్లయితొలగించండి
  29. మానము మగువకు ప్రాణము
    మానము వీడిన సుఖమనిమానిని చెప్పెన్
    ఆనాటి శోభ నంబున
    పానుపు ఫై పూలచెంత పలికెను పతితో|
    2.మానుము ననుమానమునే
    నేనను నీయాహముమాని,”నీవేగదనా
    దానవు నిరతము యని?అభి
    మానమువీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  30. దానము,సత్యము,శౌచము
    మానిని విడువక వరలిన మానిత యనుచున్
    పూనక కోపమును దురభి
    మానము,వీడిన సుఖమని మానిని చెప్పెన్

    మానిని పుడమిని యోర్పుకు
    తానొక తార్కాణమనుచు,ధర్మజుడనగా
    వే నవమానములందభి
    మానము వీడినసుఖమని మానిని చెప్పెన్

    మానము బోటికి ప్రాణము
    తానటు శీలము చెడకను తాల్మిని వెలుగన్
    చానయు తలపున తనస
    మ్మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    బోనము నిడగను తల్లయి,
    మానిత యోచన విడుచును మంత్రై సేవల్
    పూనగ దాసిగ,పతినవ
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  31. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  32. నానాటికి బరువెదిగితి
    మా నాన్నకు తప్పదుగద (మదిలో) కన్యా
    దానము జేయునపుడు కొల
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి
  33. వేణువు నూదెడు కన్నడు
    స్నానము జేయగ విడిచిన చక్కని చీరన్
    వైనమ్మున దోచుకొనగ
    మానము వీడిన సుఖమని మానిని చెప్పెన్

    రిప్లయితొలగించండి