18, ఆగస్టు 2015, మంగళవారం

సమస్యాపూరణ - 1763 (కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.
(ఒకానొక అవధానంలో ఇచ్చిన సమస్య)

31 కామెంట్‌లు:

  1. జన్మ ధన్యము దేవుని సన్ని ధనుచు
    భక్తి తోడను గుడికేగు భాగ్య మబ్బి
    సంత సంబున ప్రార్ధించి సన్ను తించ
    కన్ను లబ్బిన ఫలమును గాంచె నెదుట

    రిప్లయితొలగించండి

  2. శ్రీగురుభ్యోనమ:

    విశ్వ రూపమ్ము తా జూడ వేడుకొనగ
    కౌరవేంద్రుని కరుణించి గడియసేపు
    దేవదేవు డొసంగగ దివ్య దృష్టి
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.

    రిప్లయితొలగించండి
  3. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్రులందఱకు నమస్సులతో...

    ధౌమ్యుఁ డుపమన్యు గురుభక్తిఁ దలఁచి యతని
    నిం బరీక్షింప నొక్కట నేత్ర రహితుఁ
    డైన నపుడు నశ్వినుల వరానఁ ద్వరను
    గన్నులబ్బెను, ఫలమునుఁ గాంచె నెదుట!

    రిప్లయితొలగించండి
  4. విశ్వ రూపమ్ముదానుగా వీ క్షణ మ్ము
    కొఱకు ధృ తరాష్ట్రు గృష్ణుని గోర ,యతడు
    తనదు రూపమ్ము జూడ న యన ము లీయ
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట

    రిప్లయితొలగించండి
  5. రామచంద్రు రూపురమణీయముగ గన
    కానయందు వేచె కాంత శబరి
    అనుజు తోడ నటకు యరుదెంచగా గాంచి
    కన్న లబ్బెను ఫలమును గాందె నెదుట.

    రిప్లయితొలగించండి
  6. అస్తమయమైన పుత్రుని యక్షములను
    దానమొనరించగ దయతోఁ దల్లి దండ్రి
    గ్రుడ్డి వానికి వైద్యులు కూర్చగానె
    కన్నులబ్బెను ఫలమును గాంచె నెదుట

    రిప్లయితొలగించండి
  7. సేవఁజేయగ స్వచ్చంద సంస్ధ యొకటి
    పేద వారికి నేత్రపరీక్షఁ జేసి
    చక్షు దానము చేయగఁ జక్కదనపు
    కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట

    రిప్లయితొలగించండి

  8. జ్ఞాన మెంత యున్న గాని నేమిఫలము? }
    సత్యమెరుగ లేదు సంశయాత్మ
    మదిని హరిని నిలిపి మహితభక్తిని గొల్వ
    కన్ను లబ్బె ఫలము గాంచె నెదుట

    రిప్లయితొలగించండి
  9. బూసారపు నర్సయ్య గారి పూరణ.....

    వ్యాసమౌనీంద్రుఁ డొసఁగిన వరముఁ బడయ
    దురితరహిత సంజయునకు దూరదృష్టి
    కన్ను లబ్బెను; ఫలమును గాంచె నెదుట
    విశ్వరూపము, కన్గొని వినుతి కెక్కె.

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సన్నిధి+అనుచు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘సన్నిధి యని’ అనండి.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదాన్ని ‘కొఱకు ధృతరాష్ట్రుడు హరిని గోర నతడు’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. కాని సమస్య తేటగీతి పాదమైతే మీరు ఆటవెలది వ్రాసారు. పద్యాన్ని సవరంచలేను. సమస్యను ‘కన్ను లబ్బె ఫలముఁ గాంచె నెదుట’ అందాం.
    ******
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీరు సమస్యను ఆటవెలది పాదంగా మార్చి పూరించారు. పూరణ బాగుంది కాని అలా స్వతంత్రించవచ్చునా?
    *****
    వల్లూరు మురళి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మొదటి రెండవ పాదాలలో యతి తప్పింది. సవరించండి.
    *****
    బూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. పౌత్రునిన్ జూసి మరణించు భాగ్యమింకె
    నేత్ర దానమ్ము వెలుగిడె భ్రాత కంత
    మనుమడుదయించు శుభవేళ కనుజునకట
    కన్నులబ్బెను ఫలమును గాంచె నెదుట!

    రిప్లయితొలగించండి
  12. ఏడు కొండల స్వామిని వేడుకొనగ
    కొండ లన్నియు నెక్కగ కోర్కెదీర
    గర్భ గుడిలోన జూడ శ్రీగర్భునపుడు
    కన్ను లబ్బెను ఫలమును గాంచెనెదుట!!!


    శంభు కన్నుల రుధిరమ్ము జాలువాఱ
    కన్నులిచ్చిన భక్తుడు తిన్ననిగని
    చూపునొసగగ వివశుడై శూలధరుడు
    కన్ను లబ్బెను ఫలమును గాంచెనెదుట!!!

    రిప్లయితొలగించండి
  13. అంధు డైనట్టి కురురాజు హరిని గాంచ
    గర్వ మనుమబ్బు గ్రమ్మ సుపర్వు లైన
    సత్యమును గాంచ లేరన్న తత్వ మతని
    కన్నులబ్బెను ఫలమును గాంచె నెదుట !!!

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా, గత కొద్దికాలంగా గమనిస్తున్న విషయం ఏమిటంటే ఉకారంతో జరిగే యడాగమ దోషాన్ని తమరు ఉపేక్షిస్తునారు.అలాగైతే ఔత్సాహికులు నేర్చుకొనేదెలా?? తప్పు తెలుసుకునేదెలా?? ఉమాదేవిగారి నేటి పద్యం చూడండి అనుజుతోడనటకు యరుగుదెంచ అని ఉంది. ఎన్నో సవరణలూ సూచనలూ చేస్తున్న మీరు ఈ దోషం మాత్రం ఎందుకు విస్మరిస్తున్నారో మరి.

    రిప్లయితొలగించండి
  15. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    ముందుగా ధన్యవాదాలు. నిజమే ఈమధ్య అనారోగ్యం, త్రిప్పట జీవనం తదితర కారణాల వల్ల పరిశీలనాశక్తి, బ్లాగుకు కేటాయించే సమయం, ఓర్పు కొంత తగ్గాయి. ఇకనుండి జాగ్రత్తగా పరిశీలిస్తాను.

    రిప్లయితొలగించండి
  16. సంఘ సేవను స్వచ్చంద సంస్ధ యొకటి
    బడుగు వారికి నేత్రపరీక్షఁ జేసి
    చక్షు దానము చేయగఁ జక్కదనపు
    కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట

    రిప్లయితొలగించండి
  17. డాక్టర్ మూలె
    రామమునిరెడ్డి విశ్రాంత తెలుగుపండితులు ప్రొద్దుటూరు.తెలుగు భాషా సంరక్షణా సమితి కడప జిల్లా అధ్యక్షులు

    అంధ విద్యార్థి జీవితా నలుముకొన్న


    చిమ్మ చీకటి తొలగింప(జేయుకొరకు

    వైద్యుల కృషితోడ వెలుగు సాధ్యమయ్యె

    గన్నులబ్బెను ఫలమును గాంచె నెదుట .





    రిప్లయితొలగించండి
  18. శ్రీ కంది శంకరయ్య గారికి నమస్కారము శ్రీ కామేశ్వర శర్మ శ్రీ ఆదిభట్ల గారు యడాగమము గురించి చేసిన వ్యాఖ్యను నేను చేనట్లుగా పొరపడి మీరు వ్యాఖ్యను చేశారు గమనింప ప్రార్థన .(మనలోమాట నేనూ యడాగమ బాదితుడనే)

    రిప్లయితొలగించండి
  19. గురుదేవులు క్షమించాలి పొరపాటును సరి చేసిన పద్యము
    జ్ఞాన మెంత యున్నను గాని సాధకునకు }
    సత్యమెరుగ౦గ జాలదు సంశయాత్మ
    మదిని హరిని నమ్మినవేళ మహితభక్తి
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట

    రిప్లయితొలగించండి
  20. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    శ్రీఆదిభట్ల వారిని సంబోధించబోయి మిమ్మల్ని సంబోధించాను. మన్నించండి.
    *****
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ముందుగా ధన్యవాదాలు. నిజమే ఈమధ్య అనారోగ్యం, త్రిప్పట జీవనం తదితర కారణాల వల్ల పరిశీలనాశక్తి, బ్లాగుకు కేటాయించే సమయం, ఓర్పు కొంత తగ్గాయి. ఇకనుండి జాగ్రత్తగా పరిశీలిస్తాను.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరింపజేసింది. అభినందనలు.
    *****
    వల్లూరు మురళి గారూ,
    మొదటి పాదాన్ని సవరించారు. బాగుంది. రెండవపాదాని సవరించలేదు. ‘బడుగులకు జేయుచును నేత్రవైద్య సేవ’ అనండి.
    *****
    డా. మూలె రామముని రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మీ ప్రొద్దుటూరు వాస్తవ్యులు గుండా వేంకట సుబ్బ సహదేవులు గారు మీకు పరిచయమేనా? మన బ్లాగుకు పాతకాపు!
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురుదేవులకు ప్రణామములు శ్రీ మూలె రామముని రెడ్డి గారిని సభలందు చూశాను, విన్నాను. వారితో పరిచయం లేదు. వారు జానపద సాహిత్యంలో పరిశోదన చేసి డాక్టొరేట్ పొందినట్లు తెలుసు. ఆ సంధర్భంగా జరిగిన వారి అభినందన సభకు కూడ నేను హాజరు కావడం జరిగింది. వీలైనంత త్వరలో వారి ఆశీస్సులు పొందగలను.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    అంధ రాజగు ధృతరాష్ట్రు డార్తి గొలిచి
    విశ్వ రూపము జూపింప వేడు కొనగ
    కన్ను లబ్బెను ; ఫలమును గాంచె నెదుట
    ధవళ కాంతుల నీను మాధవుని హరిగ

    రిప్లయితొలగించండి
  23. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. ప్రొద్దుటూరు వాస్తవ్యులు జి. వేంకటశేష శాస్త్రి గారు కమలాపురం తాలుకా, దాదిరెడ్డిపల్లెలో 1930 ప్రాంతంలో చేసిన అష్టావధానంలోని పూరణ....

    సంధిఁ జేయంగ వచ్చుఁ గృష్ణభగవానుఁ
    డతని దర్శించి ధన్యుఁడ నగుదు ననుచుఁ
    దలఁచె ధృతరాష్ట్రుఁ డాశౌరి దయను జేసి
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.

    రిప్లయితొలగించండి
  25. రాయబారిగ నేగిన రమ్య కృష్ణు
    డచట,విశ్వరూపుండుగా,నంధ రాజు
    జూడ గోరంగ వానిపై జూప దయను
    కన్నులబ్బెను ఫలమును గాంచెనెదుట

    మన్ను తిన్నట్టి కృష్ణుని మందలింప
    తల్లియౌ యశోదకు దలగె మాయ
    నోరు తెరచియు లోకాలనొప్పు జూపె
    కన్నులబ్బెను ఫలమును గాంచెనెదుట

    కరియు తానట్లు బలిమి మకరిని నెదిరి
    వేయి యేండ్లట్లు పోరియు వేసరిల్లి
    తుదకు నజ్ఞాన గర్వంబు దూరమవగ
    కన్నులబ్బెను ఫలమును గాంచెనెదుట

    కనక కశ్యపుడటులను గర్వియగుచు
    విష్ణు గానక సుతునట్లు వేగ జూపు
    మనుచు,కంబమ్ము గొట్టగా,మాయవీడి
    కన్నులబ్బెను ఫలమును గాంచెనెదుట

    రిప్లయితొలగించండి
  26. గురువుగారూ నమస్తే.పొరపాటును మన్నించండి.సవరించిన పద్యము.
    తే.గీ: రామచంద్రుని రూపము రహిని గాంచ
    కాన లోన నెదురు జూసె కాంత శబరి
    అనుజు తోడ రాముగనిన యతివ తనదు
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.

    రిప్లయితొలగించండి
  27. నేత్రదానంపు ఫలితమ్ము నిలనుగొనగ
    మరణమాసన్నమైనంత మరియొకరికి
    తనదు కన్నులు ముందుగా దానమొసగ
    కన్నులబ్బెను ఫలమును గాంచెనెదుట

    రిప్లయితొలగించండి
  28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. సరదాగా....

    పట్టణములోన వసియించు బావగార్కి
    తాటిముంజల రుచిపట్ల తగని ప్రీతి
    తరలివచ్చెను పల్లెకు తాటిముంజ
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.

    రిప్లయితొలగించండి
  30. మిస్సన్న గారూ,
    మీ సరదా పూరణ కడు పసందుగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. సంఘ సేవను స్వచ్చంద సంస్ధ యొకటి
    బడుగులకు జేయుచును నేత్రవైద్య సేవ
    చక్షు దానము చేయగఁ జక్కదనపు
    కన్నులబ్బెను ఫలమునుఁ గాంచె నెదుట

    రిప్లయితొలగించండి