22, ఆగస్టు 2015, శనివారం

సమస్యాపూరణ - 1767 (బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్.

33 కామెంట్‌లు:

  1. రాణివి నాహృదయమునకు!
    ప్రాణమునీవన్న! నాకు పత్నివికమ్మా
    వాణీ! యనగా మదనుని
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  2. శ్రీగురుభ్యోనమ:

    ప్రాణేశ్వరుడగు పార్థుని
    తూణీరము వీడి వచ్చి దుస్సలపతి పా
    షాణపు చిత్తుని తనువున
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ, భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రాణము నీవే నంటిని
    త్రాణగ నను సతిని జేయ తరుణియె కోరన్
    వీణియ మ్రోగెను వలపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    సైంధవమరణాన్ని ప్రస్తావించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తూణీరము, బాణములు’లతో పునరుక్తి దోషం. సవరించండి.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులతో...

    (ప్రేయసీ ప్రియుల సరస సంభాషణము)

    "రాణీ! నా వలపుల పూ
    బోణీ! నీ వాక్పటుత్వపుం ఝరి నిఁక నా
    ప్రాణము నీ" దను మరు సుమ
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్!

    రిప్లయితొలగించండి
  6. పై పూరణమే కొలఁది మార్పులతో...


    "రాణీ! తొలి వలపుల యలి
    వేణీ! నీ ప్రణయ వచన వీచిని ననుఁ, బూ
    బోణీ! తేల్చుమ" యను మరు
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్!

    రిప్లయితొలగించండి
  7. తానుగ వలచిన హరుడే
    మౌనముగా యెదుట నిలిచి మరుబాధపడెన్
    ప్రాణ పతికి తన చూపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్!

    రిప్లయితొలగించండి
  8. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చింతా రామకృష్ణా రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఓణీలనాడె బావగు
    వేణును ప్రేమించి యాడె పెండ్లిని నేడే
    వీణకు తొలిరేయి, కుసుమ
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి

  10. జాణవు నీవని యెంచుచు
    ప్రాణములకుమించి నెక్కువమమత తోడన్
    ఏణనయన జూడ మదన
    బాణమ్ములు గ్రుచ్చుకొనంగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  11. ద్రోణుని శిష్యుడు పార్థుని
    తూణీరమునుండి వెడలు దోనిని జూడన్
    రాణగ కృష్ణకు వలపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్!!!



    ప్రాణముగా ప్రేమించిన
    రాణిని గని దరికిజేర రాజకుమారే
    ప్రాణేశుని విరిచూపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్!!!


    రిప్లయితొలగించండి
  12. భూసారపు నర్సయ్య గారి పూరణ.....

    ప్రాణసఖితో హరి యసురు
    ప్రాణమ్మును దీయ శరము ప్రహరింపంగన్
    ప్రాణము విడిచెను నరకుఁడు
    బాణమ్ములు గ్రుచ్చకొనఁగ భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి

  13. జాణ యగు సత్య,కృష్ణుని
    ధ్యానించుచు నేసె శరమనాయాసముగా
    రాణగ,లక్ష్యము నందున
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  14. వేణీ భరమ్ము భూషణ
    శ్రేణీ రుచిరమ్ము దోచె చిత్తము, చేతున్
    పాణీ గ్రహణమ్మను ప్రియు
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్ !!!

    రిప్లయితొలగించండి
  15. జాణ తనమ్మున గాధిజు
    మౌనము వీడంగ జేసి మరులేగొల్పెన్
    మేనక, నుడివింటి నెగయు
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్!

    రిప్లయితొలగించండి
  16. ప్రాణేశ్వరివీవు మహా
    రాణివి నాహృదయపీఠి రాజ్యమునకనన్
    ప్రాణసఖుఁ సరస వాఙ్మయ
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి
  17. రాణివి నావలపుల పూ
    బోణివి నీవని ప్రియుండు పొగడిన నుడులే
    జాణకు యెదలో వలపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యంలో పునరుక్తి దోషం ఉందని భావించాను కాని మీ ప్రయోగం సరియైనదే. మన్నించండి.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీరు తాజాగా వ్రాసిన రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. అననమున తేజమడర
    వేణువునూదుచును శౌరి వేడుక చేయన్
    మేని ప్రియసఖుని చూపుల
    భాణమ్ములు గ్రుచ్చుకొ నగ భామిని మురిసన్

    రిప్లయితొలగించండి
  20. గురువుగారూ మీరు క్షమాపణలు కోరడం నాకు నచ్చలేదు. మీరు క్షమాపణ అడుగుతారని ఊహించియే నేను వివరణ వ్రాయలేదు. ఐననూ మీరు అలా వ్రాశారు.
    మీరు మాకు ఎప్పటికీ మార్గదర్శకులే. పొరపడిన మాతేముననే క్షమాపణలు కోరవలదని ప్రార్థన. మీ అభినందనలే మాకు ఆశీస్సులు.



    రిప్లయితొలగించండి
  21. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    వీణను మీటిన యట్టుల
    ప్రాణ సఖుడు పడతిని గని బంధించ గత
    క్షణమున రువ్విన మదనుని
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి
  22. .జాణగ జతగా జేరియు
    ప్రాణానికి ప్రాణ మనుచు బహువిధములుగా
    ప్రాణేశుని సరదాపూ
    బాణమ్ములు గ్రుచ్చుకోనగ భామిని మురిసెన్|

    రిప్లయితొలగించండి
  23. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ఉభయప్రాసలో న-ణలకు ప్రాసమైత్రి చెప్పబడింది. కాని సాధ్యమైనంతవరకు ప్రయోగించకపోవడమే ఉత్తమం.
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. సత్యభామ:
    ప్రాణేశ్వరుండు తొలగగ
    తానె సమరమునకుదూకి ఢైర్యముగానున్
    దానవునకు తాగొట్టిన
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ, భామిని మురిసెన్.

    రిప్లయితొలగించండి

  25. ప్రాణేశు డేయు మన్మథు
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్
    పాణిగ్రహనపు దినమది
    ప్రాణమ్ములు లేసి వచ్చెబ్రణయోన్నతి తోన్

    రిప్లయితొలగించండి
  26. ‘ఊకదంపుడు’ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    టైపాట్లు దొర్లాయి... గ్రహణము/గ్రహనము, లేచి/లేసి.

    రిప్లయితొలగించండి
  27. కోణంబున నంబ నిలిపి
    నాణెమ్ముగ పూజ సలుపు నాతిని,పతియే
    కోణంగియట్లు చూపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    నాణెపు సపర్యలను,నలి
    వేణియు పార్వతి,శివునికి వేడుక జేయన్
    తూణపు పూలవి మదనుని
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    బాణలి వంటలతో,నలి
    వేణీ బృందము వ్రతముల వేడుకనుండన్
    కోణంగి పతివి వలపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    శోణము,శుక్రము,గలిసియు
    నాణెపు దేవకి యటులను నందెను గర్భం
    బాణియు కృష్ణుని సూతిక
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    (గర్భంబు+ఆణి)

    కోణము శ్రావణ మాసము
    నాణెపు పర్వముల రాశి,నయముగ వ్రతముల్
    కోణగికిని,పతిచూపుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనగ భామిని మురిసెన్

    (కోణగి=నమస్కారము చేసేది)

    రిప్లయితొలగించండి
  28. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. కాణాచి సొగసునకు పూ
    బోణి! పతిని గూడి వలపు బొందగ గోరన్
    ప్రాణేశుడు విడచు విరుల
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్!

    రిప్లయితొలగించండి
  30. ప్రాణము వీడెడు భీష్ముని
    త్రాణము నాశించి మేలు తల్పమ్మొనరన్
    రాణికి భూదేవికి పలు
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి
  31. నాణెమ్మగు తన కోడలు
    వాణెమ్మను చంపి చంపి భండన మందున్
    ప్రాణములు తీయు నత్తకు
    బాణమ్ములు గ్రుచ్చుకొనఁగ భామిని మురిసెన్

    రిప్లయితొలగించండి