17, అక్టోబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/26


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

26వ అర్థము  మన్మథ స్మరణ      
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే అన్నగా గలవాఁడును (బ్రహ్మ, మన్మథుడు హరి కుమారులు),
నీరజాంబక భూతి = పద్మ బాణముల సత్తా కలవాఁడును (లేక కమలాక్షునకు బుట్టినవాఁడును),
మహిత కరుఁడు = అతిశయమైన వాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనమైన మణిభూషలు గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = గొప్ప సాధువుల సేన కధ్యక్షుఁడైనవాఁడును (పిక శారికాది సాధు పక్షుల కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన బాణములకు నాయకుఁడైనవాఁడును (ఉత్పత్తికి కారణమైన మోహమును గలిగించు బాణముల కనుట),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు మన్మథుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

1 కామెంట్‌:

  1. పూల విల్లును ధరియించు పురుషు డతడు
    రూప మ నునది లేకనే రూప వంతు
    డైన మన్మధుడు మనల ననవరతము
    గాచు గావుత తరుగనిగరుణ తోడ

    రిప్లయితొలగించండి