వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
(౧)
శతకం బొక్కటి వ్రాయ నెంచితిని మీచారిత్ర్యముల్ చాటుచున్
నుతియింతుం దమ లీలలన్నిటిని నే నోరార రమ్యంబుగా
వెతలం బెట్టక శక్తి నిచ్చి నను దీవింపంగ రావే నమ
శ్శతముల్ సేసెద భక్తినిం దిరుమలేశా భక్త రక్షాగ్రణీ!
శ్రీసతి భీకరాగ్రహము శ్రీపతి శాంతము గాదె మిమ్మిలన్
భాసిత సప్తశైలయుత భారత విశ్రుత పుణ్య భూమినిన్
హాస విలాస రేఖల విహార నివాసము సేయ నిల్పె సం
త్రాస జనాళి రక్షణకు రాజనిభానన వేంకటేశ్వరా! 1.
నుదుటను నామ మొప్పెను గనుంగవ కన్పడ కుండు నట్టులన్
సదమల దామ మొప్పెను భుజద్వయ భాసిత భూషణమ్మనన్
ముదిత లలంకరించి రట ముచ్చట గొల్పుచు వక్షమందునం
దదసదృ శాకృతిన్నరయ ధన్యుల మైతిమి వేంకటేశ్వరా! 2.
శంభుని కంఠ మందున విషమ్మును చంద్రుని యందు మచ్చయున్
గుంభిత తాపమే యినుని క్రూర కరమ్ములఁ దల్లడిల్లగన్
గుంభన రీతిఁ జంపె వనిఁ గోతిని రాముడు నట్టి దోషముల్
సంభవ మన్న మీ కడ నసత్యపుఁ బల్కులు
వేంకటేశ్వరా! 3.
కలువలు పూయ నేర్చునె ప్రకాశిత చారు శశాంకుఁ గానకే
వలవల యేడ్చు పద్మములు పశ్చిమ దిక్కున సూర్యు డున్నచో
వెలవెలఁబోవు గేహములు పేరిమి పూజలు సల్పకున్నచో
నిలయము సత్య సంపదకు నీ భజనావలి వేంకటేశ్వరా! 4.
సుందర దివ్య విగ్రహము సూర్య శశాంక నిభాక్షియుగ్మ పా
రీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా
నందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తివే
నందిత పద్మగర్భ సురనాథ మహేశ్వర వేంకటేశ్వరా! 5.
రోజూ ఉదయం నిద్రలేవ గానే వేంకటేశ్వర శతకము చదివే భాగ్యము కలిగించిన కవి మిత్రులు కామేశ్వర రావుగారికి, ప్రచురించిన గురువర్యులకు ధన్యవాదములు.
రిప్లయితొలగించండి_/\_ _/\_ _/\_
రిప్లయితొలగించండిసూర్య శశాంక నిభాక్షియుగ్మ పారీంద్ర నిభావలగ్న పరిలిప్త సుగంధ నితాంత గాత్ర మా
రిప్లయితొలగించండినందమ యాభయప్రద ఘనద్యుతి హస్త వికాస....బాగుందండీ....దాశరధీ శతకం చదువుచున్నట్లున్నది.
"ఆనందమయాభయప్రద ఘనద్యుతి హస్త వికాస మూర్తి"..... అద్భుతమైన వర్ణన కామేశ్వర రావుగారూ..... నమస్సులు.
రిప్లయితొలగించండిచదివితి శతకపు భాగము
రిప్లయితొలగించండిచదువగ సంతసము గలిగె జక్కగ నుంటన్
చదువుల తల్లియ నిన్నిక
సదయను మఱి జూచు గాక సహజ న్ముండా !
సుకవివరులు రెడ్డి గారు సహదేవుడుగారు శాస్త్రి గారు శర్మగారు అన్నయ్య నమస్సులు. ధన్యవాదములు. ఆసాంతము సమీక్షించి దోషములున్న తెలుప గోర్తాను.
రిప్లయితొలగించండిసుకవి మిత్రులు కామేశ్వర రావు గారూ...నమస్సులు! భక్తి రస భరితమైన వేంకటేశ్వర శతక పద్యములను ప్రతిదినము అందించుచున్నందులకు మీకు శుభాభినందనలు! మీ పద్యముల శైలి మృదు మధురమై, గంభీరమై, ధారాళమై అలరారుచు, ప్రాచీన కవులతో బోల్పదగియున్నది.
రిప్లయితొలగించండికవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సుమాంజలులు.
తొలగించండి