త్రింశదర్థ పద్యరత్నము – పోకూరి కాశీపతి
ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.
27వ అర్థము
– నారద స్మరణ
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తండ్రిగా గలవాఁడును,
నీరజాంబక భూతి = విష్ణువే యైశ్వర్యముగా గలవాఁడును
(హరిభక్తుఁ డనుట),
మహిత కరుఁడు = గొప్ప (ధవళ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమే మణిభూషలుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధు గణములకు
(దేవర్షి గణములకు) అధ్యక్షుఁడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన (హరినామ సంకీర్తనా)
వాక్యముల కధిపుఁడైనవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును
(అగు నారదుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!
బ్రహ్మ పుత్రుడు మాన్యుడు మహిత కరుడు
రిప్లయితొలగించండినగ్ర గోపుడు కలహ భోజ నుడు నిత్య
మతడు నారాయణా యను మంత్ర రాజ
మునుబ లుకుచుండునట్టి యా ముని య నార
దుండు మనలను రక్షించు నిండు హృదిని