27, అక్టోబర్ 2016, గురువారం

వేంకటేశ్వర శతకము - 6వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౬)
ప్రాకట ఘోర దుష్టజన భంజన! కచ్ఛపమూర్తి భాసితా!
మూక సురూప భాసిత! విమోచిత సత్య పురార్చితాంఘ్రి రా
జాకర ఘాత రామ! చదిరాశన గోత్ర నివాస తోషితా!
శ్రీకర! పాండవారిహర! సింహసుమధ్యమ! వేంకటేశ్వరా!                        46.
[మూకము=మత్స్యము; ధరాధినాధాకర =రాజసమూహము; చదిరాశనము = ఏనుగును భుజించునది, సింహము]    

ఆయత వాయు నందన వరాతత దాయక! వాసుదేవ! నా
రాయణ శైలవాస! మిథిలాధిపతీష్టద! నిత్యయౌవనా!
మేయ వృషాసురాంబుద సమీరణ! భక్త జనార్థితార్థ సం
ధాయక! తీర్థపంచక సుధామ! సునిశ్చల! వేంకటేశ్వరా!             47.
[నిశ్చలుడు = విభవుడు]

భాసుర జానుదఘ్నభవ భవ్యవరాహ! కుమారధారికా
వాస మయూరకేతు చిరభవ్యవరప్రద! సేవ్యరుద్ర భా   
మాసుత నాధతీర్థవర మజ్జన లోక హితప్రదాయకా!
శాసిత పంచ బాణ ఘన సత్సఖ! మాధవ! వేంకటేశ్వరా!             48.
[జానుదఘ్న=మోఁకాటి లోఁతు (జానుదఘ్నసముద్భూతపోత్రిణే)]

అంజన గోత్రనాధ! కుముదాక్షగణధ్వజినీ విభుత్వ ధృ
ద్రంజన దాయకా! మృగసురంజన! కిన్నరయుగ్మశాప స
ద్భంజన! విశ్వతీర్థ దురితఘ్న! సపర్వత దేశమందిరా!
కంజజ మాతృహస్తకద కైరవ మాలిక! వేంకటేశ్వరా!                              49.
[మృగసురంజన=మృగయారసిక; సపర్వత దేశమందిరా=ఉపత్యకాప్రదేశస్థ]

పావన పాండుకోలవర! భక్తసుగోచర! విష్ణుశైల స
ద్జీవన! రుక్మపద్మ సరసీతటి మాకృత సంయతీష్ట! సం
సేవక నీలకంఠ నరసింహ! వృషాద్రి నివాస తోషితా!   
సేవక మాధవీయ ఖల ఛేదన రంజన! వేంకటేశ్వరా!                             50.
[పాండుకోలవర:శ్వేతవరాహము; విష్ణుశైలము=సాలగ్రామము; మాకృత=లక్ష్మీకృత ]

ప్రాభవ ధర్మసంచరిత భక్త సుచేతన దాయకార్త! నా
గాభరణేష్టమిత్ర! కుముఖాచల వల్లభ! నీలధేను దు
గ్ధాభిషవాంగశుద్ధజనితావ్యయ! చోళ సుతప్రియా! హిర
ణ్యాభరణప్రభావిలసితాజిర! మధ్వరి! వేంకటేశ్వరా!                               51.
[కుముఖాచలము=వరాహాచలము; అభిషవము= స్నానము]

అంతవిహీన! గోగణవరాధిప! కృష్ణసమాహ్వ విప్ర వే
దాంత సుదేశికత్వద! ఘనాసిత శైల నివేశన! ప్రలం
బాంతక దివ్య తీర్థ సకలాంచిత పుణ్యవితాన దాయకా!
నంత విలాస శయ్య! వర నంద సునందన! వేంకటేశ్వరా!                      52.

యాదవ శేఖరా! నలిన జార్థిత సత్కృత సౌమ్య రూప! స
మ్మోదిత మేదినీ! ధవళ పూర్ణ పయోధి మనోహరా! హృషీ
కోదిత పాలక! త్రిజగ దోచిత పూరిత! సత్య పట్టణా      
చ్ఛాదిత శైలవాస! బలసంయుత విగ్రహ! వేంకటేశ్వరా!              53.      

ప్రాయ కృతాఘ నాశక సువర్ణముఖీ జలకార్థి దాత! నా
రాయణ! నారసింహ రుచి రంజిత భార్గవి! శ్రీనివాస! ప
ద్మాయత పత్ర నేత్ర! పరమాత్మ! ముకుంద! శుకాక్షిగోచరా!
సాయక ఖండి తాజిర నిశాచర! రాఘవ! వేంకటేశ్వరా!             54.

కల నయినం ద్వదీయ భవఖండన దర్శన భాగ్యమీయవే
పలుకుల చేత నైన నిను బన్నుగ కీర్తన సేయ నోచనే
తలపుల యందు నిల్పినను దాపము బాప విలంబ మేలనో
చులకన చూపు లేల దయఁ జూడవె దీనుని వేంకటేశ్వరా!                     55.

5 కామెంట్‌లు:

 1. కల్లయు గపటము లేకన
  నల్లదె నిను వేడుకొనిన నీ నా భ్రాతున్
  జల్లగ జూడుము దయతో
  పిల్లలమే నీకు మేము వేంకట నాధా !

  రిప్లయితొలగించండి
 2. 46.దుర్మేధఃప్రాణహర్త్రే; కూర్మ మూర్తయే; మత్స్యరూపాయ; శ్వేతద్వీపవసన్ముక్తపూజితాఙ్ఘ్రియుగాయ; క్షత్రియాన్తకరామాయ; సింహాచలనివాసాయ; శ్రీకరాయ; పాణ్డవారిప్రహర్త్రే;
  8
  47.అఞ్జనాసుతదాత్రే; వాసుదేవాయ;నారాయణనగేశాయ; జనకేష్టప్రదాయ; నిత్యయౌవనమూర్తయే; వృషభాసురహారిణే; అర్థితార్థ ప్రదాత్రే; తీర్థపఞ్చకవాసినే; విభవే;
  9
  48.జానుదఘ్నసముద్భూతపోత్రిణే; కుమారధారికావాస; స్కన్దాభీష్టప్రదాయ; తీర్థస్వామిసరస్స్నాతజనాభీష్టప్రదాయినే; వామదేవప్రియాయ;
  4
  49.అఞ్జనాగోత్రపతయే; కుముదాక్షగణశ్రేష్టసైనాపత్యప్రదాయ; మృగయారసికాయ; కిన్నరద్వన్ద్వశాపాన్తప్రదాత్రే; విశ్వతీర్థాఘహారిణే (సమస్త రజఃపాపములు]; ఉపత్యకాప్రదేశస్థ; లసల్లక్ష్మీకరామ్భోజదత్తకల్హారకస్రజే;
  7
  50.శ్వేతకోలవరాయ; నారాయణార్థితాశేషజనదృగ్విషయాయ; సాలగ్రామనివాసాయ; రుక్మాబ్జసరసీ కూలలక్ష్మీకృత తపస్వినే; సద్భక్తనీల కంఠార్చ్యనృసింహాయ; వృషభాచలవాసినే; మాధవీయాఘహారిణే
  7
  51.సుధర్మిణీసుచైతన్యప్రదాత్రే; శఙ్కరప్రియమిత్రాయ; వరాహాచలనాథాయ; నీలధేను పయోధారాసేక దేహోద్భవాయ; అచ్యుతాయ; చోళపుత్రప్రియాయ; మధుఘాతినే;
  7
  52.అనన్తాయ; గోవిన్దాయ; కృష్ణాఖ్యవిప్రవేదాన్తదేశికత్వప్రదాయ; నీలాద్రినిలయాయ; హలాయుధ జగత్తీర్థసమస్త ఫలదాయినే;
  5
  53.విరిఞ్చాభ్యర్థితా౽నీతసౌమ్యరూపాయ; క్షీరాబ్ధినాథాయ; హృషీకేశాయ; త్రివిక్రమాయ; వైకుణ్ఠాచలవాసినే; బలభద్రాయ;
  6
  54.సువర్ణముఖరీస్నాతమానుజాభీష్టదాయినే; శ్రీమన్నారాయణాయ; శ్రీనివాసాయ; ముకున్దాయ; శుకదృగ్గోచరాయ;
  5
  108

  రిప్లయితొలగించండి
 3. నూటయెనిమిది నామముల్ నూత్నరీతి
  యుత్తమోత్పలములుగా నొప్ప జేసి
  వేంకటేశ్వరు గొల్చి కోవిదుడవైతి
  వయ్య పోచిరాట్కామేశ యఘవిరుద్ధ

  రిప్లయితొలగించండి