23, అక్టోబర్ 2016, ఆదివారం

వేంకటేశ్వర శతకము - 2వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౨)
శ్వేత వరాహ ధారణ నభేద్య నిశాటు హిరణ్య నేత్రునిం
బ్రీతి నొసంగఁ గంజునకు భీకర లీల వధించియున్ యథా
రీతిని నిల్పి భూమిని విరించి మహేశ్వర వాంఛ తీర్పగన్         
భాతిని నిల్చితే కలిని భక్తులఁ బ్రోవగ వేంకటేశ్వరా!                               6.

మోదము గూర్ప జానకికిఁ బుణ్య చరిత్ర దశాస్య ధర్షితన్
వేదవతిన్నుదర్చి నట వింతగ సీతగ మార్చి నిల్ప శా
తోదరి లంక యందిడుము లొంద వరంబు నొసంగి రాముడే
వేదనఁ దీర్ప పద్మయనఁ బృధ్విని పుట్టెను వేంకటేశ్వరా!              7.        

భామలఁ గూడి పద్మజ నభఃపతి నందన సంచరింపగన్
భీమ కరీంద్రు డుగ్రుడయి భీతిలఁ జేసె కరేణు యుక్తమై
యా మద హస్తి నిన్నుఁ గని యాదర మొప్ప నమస్కరించెనే
నీ మహిమల్ విచిత్రములు నీరజ లోచన వేంకటేశ్వరా!             8.

చెలువము మిన్ను మీఱగ నశేష జనాళినిఁ బ్రోవ నెంచి డా
పల దరి భూరి భూసతియు పద్మదళాలయ దక్షిణంబునన్
సలలిత భామలిద్దరును సన్నుతి సేయుచు నిన్ భజింపగం
గలియుగ మందు నిల్చితివి కామిత దాయివి వేంకటేశ్వరా!                   9.

అన్నియు నీవ యంచు హృదయాంతర మందున నిల్పి భక్తినిం
గన్నుల నీరు నిండగ వికారము లన్నియు వీడి వేడ నా
పన్నుల దుఃఖనాశనము పన్నుగఁ జేసి తరింపఁ జేతువే
సన్నుత దేవదేవ విధి శక్రముఖామర వేంకటేశ్వరా!                              10.

లాభము లేని వర్తకము లౌకిక సౌఖ్యము లిచ్చు విద్యలున్
లోభికి యున్న సంపదయు లోక మెరుంగని కావ్య సృష్టియుం
బ్రాభవ మెంత యున్నఁ దవ పావన పూజలు లేని గేహముల్
వైభవముల్ నిరంతరము వ్యర్థములే సుమి వేంకటేశ్వరా!                      11.

మానుగ భాషణమ్ములను మానవు లందరి తోఁ జరించితే
మానని తొండమానుని ప్రమాదపు చర్యలు గాంచి వేదనన్
మౌనముఁ బూని నిత్యమును మర్త్యుల కింక నగోచరమ్ముగ
న్నా నగ సప్త వల్లభుడ వైతివి చిత్రము వేంకటేశ్వరా!                             12.

ఘనములు కల్గు నత్తరి సుఖమ్ములఁ దేలెడు వేళ బంధువుల్
తనయులు దార తోడ ధనధాన్యము లాదిగ పెక్కులుండగన్
నిను మది భక్తినిం గొలువ నేరక పాపఫలమ్ముఁ బొందినన్      
ఘనముగ దుర్గతిన్ వెతలఁ గందుదు రెల్లరు వేంకటేశ్వరా!                   13.

పాచిక లాడ నేర్తునె యపార కవిత్వ పటుత్వ సంపద
న్నీచరణారవిందముల నేర్పుగఁ గీర్తన సేయ నోపనే
తూచగ నోప విత్తములఁ దోరముగా నిను నే విధంబునం        
గాచగ నేర్తు వయ్య ననుఁ గంజదళాంబక వేంకటేశ్వరా!                        14.       

మరువక వ్యూహలక్ష్మి యను మంత్రము పుణ్యతమంబు పాడగన్
విరివిగ నాత్మ రాము డను విప్రుడు పూర్వ భవాఘ తప్తుడున్
సురుచిర సంపదౌఘములఁ జోద్యము మీరగ నందెనే శుభం
కరమగు నీదు సత్కృపను గారవ మొప్పగ వేంకటేశ్వరా!                        15.

10 కామెంట్‌లు:

 1. డాపల దరి భూరి భూసతియు పద్మదళాలయ దక్షిణంబునన్....బాగుందండీ.

  రిప్లయితొలగించండి

 2. ________________________

  గు రు మూ ర్తి ఆ చా రి

  """"""""""""""""""""""""""

  శ్రీ యుత పోచిరాజు కామేశ్వర రావు గారికి

  నమస్సుమా౦జలి !

  మీ కవితా ధార , శివుని జూటము ను౦డి

  పరిచ్యుత మైన గ౦గ వే౦కటేశుని తాకు చున్న

  విధముగా తోచు చున్నది .

  ''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''


  నీ కవితా ధారా విధి

  శ్రీక౦ఠ జటా జుటీ పరిచ్యుత గ౦గా

  వ్యాకీర్ణము , వే౦కట పతి c

  దాకె నహో ! పోచిరాజ తనయా వినుమా !

  ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

  రిప్లయితొలగించండి
 3. పాచికల నాడ యవసరం బదియ వలదు
  భక్తి భావము దోడన పరమ శివుని
  బూజ జేసిన నిచ్చును బుణ్య ఫలము
  వేంక టేశుడు శంభుడు వేరు కాదు

  రిప్లయితొలగించండి
 4. శ్రీ పతి వేంకటనాథుని
  ప్రాపుంగోరుచును మీరు వ్రాసిన శతకము
  బాపురె! ధీయుత ధారల
  నోపుచు సాగును దరిగొన నుత్సాహమునన్!

  రిప్లయితొలగించండి
 5. కవివర్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. ప్రతి దినం వేంకటేశుని స్మరించుకుంటూనే సుమనోహరమైన పద్యాలను ఆస్వాదించే మహద్భాగ్యాన్ని కలిగిస్తున్నందుకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. సుకవి వరులు హనుమచ్ఛాస్త్రి గారు గురుమూర్తి ఆచారి గారు శర్మగారు శ్రీధర రావు గారు అన్నయ్య మీ కందరకు నా హృదయ పూర్వక ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. కామేశ్వర రాయార్యా!
  కామిత సత్ఫలము లందు కలియుగ ప్రభుడౌ
  స్వామిని వేంకట నాథుని
  నీమంబున గొల్చు తమకు నిత్యం బిలలోన్.

  మీవాక్కులు సురుచిరములు
  పావనభావాన్వితములు భక్తియుతంబుల్
  శ్రీవేంకటేశు నెల్లెడ
  సేవించుట కర్హమైన శ్రీమంత్రమ్ముల్.

  అభివాదంబులు గొనుడిదె
  శుభకరసద్వాక్యస్రష్ట!సుజన వరిష్ఠా!
  ప్రభుడా తిరుమలగిరిపతి
  ప్రభవింపగ జేయు తమకు బహువిధ యశముల్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సత్కవులు శ్రీ హ.వేం.స.నా.మూర్తి గారు మీ పద్య సుమాభివాదములు గని యానందాశ్రువులు రాలినవి. మీ శుభాశీస్సులకు నమఃపూర్వక ధన్యవాదములు.

   తొలగించండి
 8. చిన్న సవరణ:

  సన్నత దేవదేవ విధి శక్రముఖామర! వేంకటేశ్వరా! 10.

  రిప్లయితొలగించండి