29, అక్టోబర్ 2016, శనివారం

సమస్య - 2184 (నాగేంద్రాభరణుండు చంపె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్"
లేదా...
"నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్"

82 కామెంట్‌లు:

  1. వేగము గలిగిన మదమున
    భోగము లందున మునిగి భూభార ముగన్
    రాగా తీతుని దనుజుని
    నాగా భరణుండు కినిసి నరకునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్య గారు దీపావళి శుభాకాంక్షలు.రెండవ పాదములో గణదోషము."మునింగి" యనిన సరి పోవును. నాగా భరణుండు పదమునే విధముగా తలచితిరో వివరించలేదు. రాగాతీతుడని దనుజునికొక సద్గుణమును కూడ నాపాదించితిరి. బాగుంది.

      తొలగించండి
    2. అక్కయ్యా,
      "రాగోన్మత్తుని వందిత। నాగాభరణుండు..." అంటే ఎలా ఉంటుంది?

      తొలగించండి
    3. నమస్కారములు
      సవరించిన గురువులకు [సోదరులిరువురకు } ధన్య వాదములు
      సోదర సోదరీ మణు లందరికీ దీపావళి శుభాకాంక్షలు

      తొలగించండి
  2. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ఆగడకాడై జనులను
    పాగుని గూడని విధమున పరిమార్చెడి యా
    రేగాముని తీరు నరసి
    నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ బాగుంది. పాగుని? సమస్య ముడి నెలా విప్పితిరి?

      తొలగించండి



  3. అందరికీ దీపావళి శుభాకాంక్షలతో
    జిలేబి చుట్టిన జాంగ్రీ కథ !

    బాగుగ చదివెనొక జిలే
    బీ గురువుల చెంత, చెప్పె బింబానన తా
    పాగెము లేని కథనొకటి
    "నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్" !

    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ హాస్యరస భరితమై బాగున్నది. తాఁ బాగెము అనండి.

      తొలగించండి
  4. ప్రాగ్జౌతిషపుర నాథుని
    యాగడములుబాడబంబులైచెలరేగన్
    వేగమె నాహరి, వందిత
    నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

    వందిత నాగ+ ఆభరణుండు : నమస్కరించు కరిని ఆభరణముగాగలవాడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ బాగుంది. ప్రాగ్జ్యోతిషపురము. ప్రాస తప్పినది. రేఫంతో కాని లకారంతో కాని సంయుతమై ఉన్న హల్లుతో, రేఫ లకారాలు లేని అదే హల్లుతో ప్రాస కూర్చువచ్చు. మిగిలిన హల్లులతో సంయుక్త మయితే కుదరదు.
      యాగడములు వేడబంబు అనండి. వందితనాగాభరణుండు అంటే నమస్కరింప బడినకరిని ఆభరణముగాగలవాడని రావచ్చు. నాగ వందిత ఆభరణుడు అని పద విభాగము చేసిన అన్వయము కుదురుట లేదు. శరణాగత నాగాభరణుడు అనవచ్చు.

      తొలగించండి
  5. పదోతరగతి విద్యార్ధికి పీ. హెచ్. డీ. ప్రశ్నపత్రం ఇచ్చారు శంకరయ్య గారు:


    ఆగ్రహమున భామామణి
    భాగస్వామిగ రణమున భారము దాల్చన్;
    ఏగుచు చూడంగ దివిని
    నాగాభరణుండు, కినిసి నరకుని జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ పట్టభద్రుని పూరణ వలెనే యున్నది. వాక్యాంతము పాదాంతము నయిన గాని పద్యములలో విసంధిగా వ్రాయ కూడదు. దాల్చ /న్నేగుచు అనండి.
      ఎవరు చంపారో ప్రస్తావించ లేదు. దాల్చ / న్నాగోపాలుడు సూడగ అన వచ్చు. ఇక్కడ ప్రాస లో గ్ర వలదనుకొనిన వేగమ్ముగ అని వ్రాయ వచ్చు.

      తొలగించండి
    2. Respected Sir:

      Greetings and profound thanks for your corrections. I will remember them. There is a folklore that it was Satyabhama who killed Narakasura...Happy Deepavali!

      తొలగించండి
    3. శ్రీమదాంధ్ర మహా భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.

      తొలగించండి
  6. వేగమ్మున్ కుసుమాయుధుండు శరముల్ వేయంబ్రయత్నింపగా
    యోగాగ్నిన్ తన ఫాలనేత్రమున సంయోగించి యుగ్రుండునై
    నాగేంద్రాభరణుండు చంపె;నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్
    నాగౌఘాశనవాహనుండు తునిమెన్ నాళీకనేత్రుండునై ||


    శ్రీగణపతి తలఁద్రుంచెన్
    నాగాభరణుండు కినిసి, నరకునిఁ జంపెన్
    యోగీశ్వరుండు కృష్ణుడు
    వేగరు కొడుకనుచునెంచి విశ్వేశ్వరులున్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. అనిల్ కుమార్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగా నున్నవి. సహస్రకరుడని యా వేగరు యనగ. అనగా విష్ణుని కొడుకనియా? సందేహము తీర్ప గోర్తాను.

      తొలగించండి
    2. ఆర్య! కామేశ్వరావుగారూ! అనేక నమస్కారములు. మీకు కూడ దీపావళి శుభాకాంక్షలు. శివకేశవులిరువురు కూడ విశ్వేశ్వరులే. కృష్ణుని కుమారుడు నరకుడు. శివుని కుమారుడు గణపతి. ఆ విశ్వేశ్వరులు తమకు విసుగు తెప్పించిన కొడుకులతో వేగలేక (సహించలేక) పోయినారు. కొడుకులని కూడ చూడకుండా శిక్షించినారు అని నా భావన. ధన్యవాదములు. వేగుట = సహించుట.

      తొలగించండి
    3. ధన్యవాదములండి. వేగు (క్రియ) దిశలో ఆలోచించలేదు.

      తొలగించండి



  7. ఒక ప్రయత్నం !


    భోగేంద్రుండగు రాక్షసుండతనికిన్ పోగాలముల్రాగ తా
    భాగంబాయెను సత్యభామ ప్రసువై బాణాసనంబున్ మహా
    యోగంబైగనుచున్ , శతఘ్ని విడిచెన్ యోగాత్మ, శ్రీకృష్ణు డే
    నాగేంద్రా, భరణుండు, చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జిలేబి గారు దీపావళి శుభాకాంక్షలు.నాగేంద్రా యని సంబోధనతో ఆభరణయుక్తుడైన కృష్ణుడు చంపె ననడము చాలా బాగుంది. మీ ప్రయత్నము దిగ్విజయమైనది.

      తొలగించండి
  8. డా.పిట్టా
    ప్రోగుల్ వేసి పురాణముల్ దెలిపెడిన్ బుట్టించు బ్రహ్మంబునున్
    నాగేంద్రంబును గాచినట్టి హరినిన్ నా శంకరున్నైక్యతా
    భాగంబుల్ యననొప్పు నంచు; శివమే భాస్వంతమై వెల్గగా
    నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చగన్
    భోగాలకు బరిరక్షణ
    యాగాలకు హరియ కర్త యై శివ శక్తిన్
    పాగా వేయగ ,హరు,డౌ
    నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.పిట్టా వారు దీపావళి శుభాకాంక్షలు.శివకేశవాభేదమును తెలుపు మీ పూరణ లద్భుతముగా నున్నవి.

      తొలగించండి
  9. గురువులకు నమస్సులు .

    చేగొని హరి చక్రంబును
    రేగుచు సతితో యసురుని రివ్వున చెండన్
    కాగుచు నా సమరము గన
    నాగా భరణుండు, కినిసి నరకునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామ శంకర ప్రసాద్ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ యుత్తమముగా నున్నది.

      తొలగించండి
  10. తీగవిలుకాని సరిగొనె
    నాగాభరణుండు కినిసి, నరకుని జంపెన్
    వేగమె హరిసతితోజని
    రేగాముని యణచి ధరను లీలగ గాచెన్!!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శైలజ గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీపూరణ చాలా బాగుంది.

      తొలగించండి
    2. ధన్యవాదములు సర్..మీకు కూడా దీపావళి శుభాకాంక్షలు...

      తొలగించండి
  11. నాగేశుడు తల పెట్టిన
    యాగమెవడు భగ్న పరచె? నాలియె గూడ
    న్నా గిరిధరు జంపె నెవరి?
    నాగాభరణుండు కినిసి; నరకుని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జనార్దన రావు గారు దీపావళి శుభాకాంక్షలు.మీ పూరణ క్రమాలంకారము తో బాగుంది. నాగేశుడ న నెవరో యవగతము కాలేదు. వివరించ గోర్తాను.

      తొలగించండి
    2. కామెశ్వర రావు గారూ ! ధన్యవాదాలు!
      నగము =పర్వతము ; నాగము = పర్వతము
      నగేశుడు= పర్వత రాజు(దక్షుడు)
      దక్షుఁడు సం.విణ.(అ.ఆ.అ.)
      సమర్థుఁడు, నేర్పరి
      అభిజ్ఞుఁడు, తెలిసినవాఁడు,
      సోమరికాని వాఁడు , చుఱుకైన వాఁడు

      దక్షుఁడు వి.అ.పుం.

      ప్రజాపతులలో నొకఁడు (ఇతఁడు బ్రహ్మమానసపుత్రుఁడు, చంద్రుని భార్యలగు అశ్విన్యాదులకును కశ్యపుని భార్యలు పదుమువ్వురకును, శివుని భార్య యగు సతీదేవికిని తండ్రి.)
      వహ్ని(విల్యమ్సు.) Source = తెలుగు నిఘంటువు (శంకరాభరణం బ్లాగు లోనిదే)

      తొలగించండి
    3. నగేశుని నాగేశుడు అని కూడా అనవచ్చా? అన్నది నాకు కూడ సందేహమే.(సందేహిస్తూనే ప్రచురించాను)

      తొలగించండి
  12. ఆగడకాడై నరకుడు
    వీగుతు ముల్లోకములను విసిగించంగన్
    వేగమె సతితోనాపు
    న్నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీరామా రావు గారు దీపావళి శుభాకాంక్షలు. పురుష శ్రేష్టుని (పురుషోత్తముడు) కర్తగా చేసిన మీ నైపుణ్యము ప్రశంసనీయము.

      తొలగించండి
    2. కలువల మాల నాభరణముగా కలవాడని కూడ అనుకోవచ్చు.

      తొలగించండి
  13. నీగమ్యంబగు సద్వివేకి వగుటల్, నిష్ఠాగరిష్ఠుండవై
    రాగాత్మం బఠియించి సర్వజగతిన్ రాణించరా యన్న వా
    డా గోపాలుడు బుద్ధిహీను డొకనా డాడెన్ స్వమిత్రాళితో
    నాగేంద్రాభరణుండు చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చగన్.

    వేగంబుగ నా విషమును
    త్రాగిన వాడెవ్వ డింక తా నా కృష్ణుం
    డాగక చేసిన దేమన
    నాగాభరణుండు, కినిసి నరకుని జంపెన్
    హ.వేం.స.నా.మూర్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. వెర్రివాని మాటగా మొదటి పూరణ క్రమాలంకార మున రెండవ పూరణ బాగున్నవి. మీ శార్దూలాన్ని నాలుగైదు సార్లు చదివితే గాని విషయము బోధ పడలేదు. ఇప్పుడు కూడా యెంతవరకు కృతకృత్యుడ నయ్యానో తెలియదు.

      తొలగించండి
  14. దీపము దృష్టబ్రహ్మము
    దీపము తిమిరాంతకంబు, తేజోనిధియున్
    దీపముఁ జ్ఞాననిధానము
    దీపవ్రాతంబుమీకు దీవెనలిచ్చున్

    దీప వ్రాతము : దీపావళి
    నిధానము :నిధి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూర్తి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ దీప్తాశీస్సులకు ధన్యవాదములు.

      తొలగించండి
  15. వేగముగ మరునిఁ దునిమెను
    నాగాభరణుండు కినిసి, నరకుని జంపెన్
    నాగశయనుండు మూర్ఛిల
    సాగించి రథమురయమున సత్య యొరపుతో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సత్యనారాయణ రెడ్డి గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపు తో మీ పూరణ చక్కగనున్నది. భాగవతములో మాత్రము కృష్ణుడు చంపినట్లే యున్నది. సత్యభామ కొంత సేపు యుద్ధము చేస్తుంది. కృష్ణుడు వినోదిస్తాడు.

      తొలగించండి
  16. యాగము ధ్వంస మొనర్చెను
    నాగాభరణుండు కినిసి,నరకుని జంపెన్
    యోగేశ్వరుడౌ కృష్ణుడు
    బాగుగ సతి సత్యభామ బాణము నేయన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తిమ్మాజీ రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పూరణ చాలా బాగున్నది.

      తొలగించండి
  17. మిత్రులందఱకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

    [1]
    యోగీశులఁ పరసతులను
    వేగమె చెఱఁబెట్టి భువినిఁ భీతిలఁ జేయన్
    నాగధర మురారి నమిత

    నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్!

    [2]
    యోగుల నతివలఁ జెఱలోఁ
    దాఁ గదించి కాసిఁ బెట్టు తరిఁ బ్రార్థింపన్
    వేగమె యా గోవర్ధన

    నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవి పుంగవులు మధుసూదన్ గారు నమస్సులు. దీపావళి శుభాకాంక్షలు. మీ రెండు పూరణలు ప్రశస్తముగానున్నవి. కాసిఁ బెట్టు నా లేక గాసిఁ బెట్టు నా? తెలుపగలరు. నేను కూడా గాసిలి పదము వాడితిని.

      తొలగించండి
    2. సుకవి మిత్రులు కామేశ్వర రావుగారూ...నమస్సులు! మీ అభినందనకు ధన్యవాదములు.

      నేను "గాసిఁబెట్టు" అనియే టైపు చేశాను. కాని, మొబైలులో స్పేస్ కొట్టగానే, ఎందుకో "గా" బదులు "కా" పడినది. నేను చూచుకొనకయే పోస్టుచేశాను. తెలిపినందులకు కృతజ్ఞతలు!

      తొలగించండి
  18. ఆగణపతినిన్ జంపెను
    నాగాభరణుండు కినిసి ,నరకుని జంపెన్
    పోగాలము వచ్చుతరిని
    నా దుర్గయె భామయగుచు నాజిని లోనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నయ్య దీపావళి శుభాకాంక్షలు. క్రమాలంకారము తో నీ పూరణ బాగుంది. నాల్గవ పాదములో ప్రాస తప్పింది.

      తొలగించండి
  19. భాగస్వామిని సత్యయె
    రాగోరన్, హరి సరెయనె రణభూమికి నా
    డోగిత మని, తిలకించగ
    నాగాభరణుండు, కినిసి నరకునిఁ జంపెన్

    రిప్లయితొలగించండి
  20. రాగద్వేష పరీత చిత్త మయ నిర్మాణంబు లా వీడులే
    వేగద్యుమ్న శరాళిఁ బట్టణములన్ విధ్వంసముం జేసె నా
    నాగేంద్రాభరణుండు, చంపె నరకున్ నాకౌకసుల్ మెచ్చఁగన్
    నాగేంద్రాస్తర భూషితుండు హరియే నందాత్మజుం డుగ్రతన్

    [ ద్యుమ్నము= బలము]


    భాగవ తోత్తము లెల్లర
    వే గాసిలి పలు విధముల వేధింప నిలన్
    వేగమ కృష్ణుడు కీర్తిత
    నాగాభరణుండు కినిసి నరకునిఁ జంపెన్

    [ గాసిలి = కోపించి]

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      విరుపుతో త్రిపురాంతకుని, నరకాంతకుని ప్రస్తావించిన మీ మొదటి పూరణ, కీర్తిత నాగాభరణుని చేత నరకుని చంపించిన మీ రెండవ పూరణ ఉత్తమంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
  21. కవి పండిత మిత్రమండలికి నరక చతుర్దశి శుభాకాంక్షలు.

    యోగానందాత్మభవుడు
    నాగాభరణుండు-కినిసి నరకుని జంపెన్
    భోగారూఢుడు వెన్నుడు
    వేగంబుగ బ్రజలగావ విశ్వాత్ముండై.

    రిప్లయితొలగించండి
  22. కవి పండిత మిత్రమండలికి నరక చతుర్దశి శుభాకాంక్షలు.

    యోగానందాత్మభవుడు
    నాగాభరణుండు-కినిసి నరకుని జంపెన్
    భోగారూఢుడు వెన్నుడు
    వేగంబుగ బ్రజలగావ విశ్వాత్ముండై.

    రిప్లయితొలగించండి
  23. వీగెడి మదనుని యదిమెను
    నాగాభరణుండు కినిసి; నరకుని జంపెన్
    వేగం బందుచు సత్యయె
    తూఁగుచు నా గృష్ణు జెంత తూపులయొఱపున్!

    తూఁగు=నడచు
    తూపు=బాణము
    ఒఱపు=ప్రతాపము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపుతో బాగున్నది.

      తొలగించండి
    2. కవివరేణ్యులు కామేశ్వర రావు గారికి నమస్సులు. మీకును.....సుకవి గణమునకును దీపావళి శుభాకాంక్షలు.

      తొలగించండి
  24. ఆ గణనాధుని జంపెను

    నాగాభరణుండు కినిసి; నరకుని జంపె

    న్నా గోవిందుడు మూర్ఛిల

    సాగించి బవరము' సత్య' శరముల తోడన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాగేశ్వర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. విరుపుతో మీ పురాణ బాగున్నది. "సాగించి పవరము" అనండి. సరళాదేశము కాదు కదా.

      తొలగించండి
    2. కామేశ్వరరావు గారూ!

      ధన్యవాదములు మీ సూచనకు!

      తొలగించండి
  25. యాగమున నడ్డె దక్షుని
    నాగాభరణుండు కినిసి! నరకుని జంపెన్
    వేగిరమె జక్రి తోడుగ
    సాగిన సతి సత్యభామ సహకారమునన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్రీధర రావు గారు దీపావళి శుభాకాంక్షలు. మీ పూరణ విరుపు తో బాగుంది.

      తొలగించండి
  26. అందరికీ నరక చతుర్దశి పర్వదిన శుభాకాంక్షలు.

    గురుదేవులు సత్వరమే కోలుకోవాలని భగవంతునికి మా ప్రార్థన.
    రాగము వీడెను సత్యయె
    పోఁగాలము దాపురించ పుత్రుని కంతన్
    రేగుచుఁగూల్చెన్ గద? యే
    నాగాభరణుండు కినిసి నరకుని జంపెన్?

    రిప్లయితొలగించండి

  27. ఆగము చేయుచు నరకుడు
    సాగించెను మునులహింస సంరంభముతో
    వేగమె సతితో వచ్చిన
    నాగాభరణండు కినిసి నరకుని చంపెన్.

    రాగముతో సతితోడను
    వేగముగా నాదనుజుని విక్రమమణచ
    న్నాగరుడుని యెక్కిన యా
    నాగాభరణుండు కినిసి నరకుని చంపెన్.

    దాగిన కాముని గాంచును,
    నాగరుడునిపైన నెక్కి హరుషము తోడన్
    వేగముగా వచ్చి న హరి
    నాగాభరణండు,కినిసి నరకుని చంపెన్.

    రిప్లయితొలగించండి

  28. ఆగము చేయుచు నరకుడు
    సాగించెను మునులహింస సంరంభముతో
    వేగమె సతితో వచ్చిన
    నాగాభరణండు కినిసి నరకుని చంపెన్.

    రాగముతో సతితోడను
    వేగముగా నాదనుజుని విక్రమమణచ
    న్నాగరుడుని యెక్కిన యా
    నాగాభరణుండు కినిసి నరకుని చంపెన్.

    దాగిన కాముని గాంచును,
    నాగరుడునిపైన నెక్కి హరుషము తోడన్
    వేగముగా వచ్చి న హరి
    నాగాభరణండు,కినిసి నరకుని చంపెన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా.ఉమాదేవి గారు దీపావళి శుభాకాంక్షలు. మీ మూడు పూరణలు బాగున్నవి. నాగాభరణుడు పదము నెట్లు సమర్థించు చున్నారో ప్రస్తావించ లేదు.

      తొలగించండి
  29. కవిమిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం దాదాపుగా మెరుగయింది. రేపటినుండి మీ పూరణలను సమీక్షించగలనని భావిస్తున్నాను.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలు పంపిన అందరికీ అభినందనలు.
    ఈనాటి పూరణలను సహృదయంతో సమీక్షిస్తున్న పోచిరాజు కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.

      తొలగించండి
    2. మాన్యశ్రీ శంకరయ్య గారికి వందనములు. దీపావళి శుభాకాంక్షలు. సంతోషమండి.

      తొలగించండి