17, అక్టోబర్ 2016, సోమవారం

సమస్య - 2173 (అంగముఁ జేతఁ బట్టుకొని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"అంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్"
(ఎన్నో అవధానాలలో అడిగిన ప్రసిద్ధ సమస్య)
లేదా...
"అంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్"

92 కామెంట్‌లు:

  1. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గురువుగారూ! నమస్కారములు. నిన్న నేను వేరే ప్రాంతములో ఉండుట వలన సమస్యా పూరణ పద్యం పంపలేక పోయాను. ఇప్పుడు పంపుతున్నాను. దయతో పరిశీలించగలరు.

    కుంభిని వెలిగిన బుధులను
    దంభముతో బట్టి నణచు దనుజుల జంపన్
    సంభవ మొందిన నెఱి నా
    రంభాపతి రాముడయ్యె రాజసమొప్పన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
      నేను కూడా ప్రయాణంలొ ఉండి నిన్నటి పూరణలను ఇప్పటిదాకా సమీక్షించలేదు. వీలైతే ఈరోజు చేస్తాను.
      మీ పద్యం బాగుంది. కాని 'ఆరంభాపతి'.. అర్థం కాలేదు. '..బట్టి యణచు' అని ఉండాలి.

      తొలగించండి
    2. క్రొవ్విడి వెంకట రాజారావు

      కుంభిని వెలిగిన బుధులను
      దంభముతో బట్టి యణచు దనుజుల జంపన్
      సంభవ మొందిన శివుడా
      రంభాపతి రాముడయ్యె రాజసమొప్ప

      (రంభాపతి= పార్వతి భర్త)

      తొలగించండి
  2. మంగళ కరమగు పనులకు
    భంగము వాటిల్ల కుండ పండిత వర్యుల్
    సంగడి గొనురీతి చలనపు
    టంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అక్కయ్యా,
      మీ పద్యం బాగుంది.
      'చలనపు టంగమ్ము'.. అర్థం కాలేదు. మూడవపాదంలో గణదోషం. 'సంగడి గొను విధమునఁ బం।చాంగమ్మును...' అంటే సరిపోతుంది కదా!

      తొలగించండి
    2. మంగళ కరమగు పనులకు
      భంగము వాటిల్ల కుండ పండిత వర్యుల్
      సంగడి గొను విధమునఁ బం
      చాంగమ్మును జేతఁ బట్టి యాడిరి విబుధుల్

      తొలగించండి
  3. క్రొవ్విడి వెంకట రాజారావు:

    అంగు నిడెడి నీతుల ను
    ప్పొంగుచు ధరణిని వెలిగెడి పొడుగగు శృతిలో
    పొంగులు జూపుచు నుండెడి
    అంగమ్మును జేతబట్టి యాడిరి విబుధుల్.

    (పొడుగగు= గొప్పదగు; శృతి= వేదము; అంగము= భాగము; ఆడు = వచించు )

    రిప్లయితొలగించండి


  4. భంగిమల గనుచు తమతమ
    యంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్
    రంగుల జీవన నాటక
    రంగము చెంగట గనపడు రసమయ కేళీ‌!

    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. నింగి కృపాంబుదంబులను నిండుగ రాల్చును పంటలందగన్
    చెంగున గెంతు గోతతుల చెంతను లేగలు, శ్రీలుఁ గల్గుఁ , దా
    రంగము లాడుచుంద్రు శిశు రత్నము లిండ్లను నంచు నూత్న పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చాలా నాండ్ల తరువాత రాస్తున్నానండీ -
      గెంతు అన్నపుడు వచనమూ,
      ఇండ్లనున్ + అంచు = ఇండ్లనునంచు సరియేనా లేక ఇండ్లను+ అంచు ఇండ్లను యంచు అనవలెనా అని సందేహిస్తూ రాశాను

      తొలగించండి
    2. ఊకదంపుడు గారూ,
      బహుకాల దర్శనం... సంతోషం!
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మీ రెండు ప్రయోగాలు సాధువులే. అయితే 'కృపాంబుదంబులు = దయామేఘాలు' అన్నచోట 'కృపాంబుధారలను' అంటే బాగుంటుందని నా సూచన.

      తొలగించండి
    3. ఊకదంపుడు గారు "ఇండ్లను యంచు" అసాధువు. యడాగమము రాదు. "ఇండ్లనునంచు", "ఇండ్లనంచు" రెండు సాధువులని గురువు గారి యభిప్రాయము.

      తొలగించండి
    4. గురువు గారికి, కామేశ్వరరావు గారికి ధన్యవాదములు.

      నింగి కృపాంబుధారలను నిండుగ రాల్చును పంటలందగన్
      చెంగున గెంతు గోతతుల చెంతను లేగలు, శ్రీలుఁ గల్గుఁ , దా
      రంగము లాడుచుంద్రు శిశు రత్నము లిండ్లను నంచు నూత్న పం
      చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

      తొలగించండి
  6. ఉంగర ములధరి యించిరి
    అంగర ఖాలను బిగిచిరి యతిశయ మొప్పన్
    ముంగల విషయము లను పం
    చాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
  7. రోగపు బాధ సహించక
    యాగము తలబూని యోగి ఆరంభించన్;
    ఆగమ శాస్త్రజ్ఞులు పం
    చాంగమ్మును (జేత (బట్టి యాడిరి, విబుధుల్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. జి.పి. శాస్త్రి గారూ,
      మీ ప్రయత్నం ప్రశంసనీయం.
      సమస్యలోని ప్రాసాక్షరం అనుస్వారపూర్వకమైన గ (ంగ) మిగిలిన పాదాలలోనూ అటువంటి పాసాక్షరాన్నే ప్రయోగించాలి. సవరించండి.

      తొలగించండి
    2. గురువర్యా! అర్ధమైనది. లెంపకాయలు వేసుకున్నాను. మీ సహనము అద్వితీయము!

      తొలగించండి
  8. భంగుర మైన జీవితము వ్యర్థముఁ జేయక దైవచింత వ్యా
    సంగము చేత సత్కవులు జంగమ దేవర నాట్యమందు సా
    రంగ కుఠార శూలములు రంగును గూర్చెడి భంగి వ్రాయ కా
    వ్యాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భంగుర మైన జీవితము వ్యర్థముఁ జేయక దీక్షనంది వ్యా

      తొలగించండి
    2. శృంగారము శోభిల, చతు
      రంగ బలముతో ప్రభువు లలర వేదము, వే
      దాంగము గని భుక్తికి పం
      చాంగమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్!

      హంగుల చాటుకొనుచు చతు
      రంగ బలముతో ప్రభువు లలర వేదము, వే
      దాంగము గని భుక్తికి పం
      చాంగమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్!

      తొలగించండి
    3. ఫణికుమార్ తాతా గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *****
      శ్రీధర రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  9. కవి మిత్రులకు నమస్సులు. పంచాగముతో పూరించినచో ఆఖరి పాదంలో యతి భంగమవుతుంది కదా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంచ + అంగము......కాబట్టి యతి భంగము కాదండీ...

      తొలగించండి
    2. సహదేవుడు గారు యతి భంగమే రీతినో తెలుప గలరా.

      తొలగించండి
    3. కామేశ్వర రావు గారూ,
      సహదేవుడు గారు "(యతిభంగం) కాదండి. మరో మారు పరిశీలించండి' అని ఫణికుమార్ గారి వ్యాఖ్యకు సమాధానంగా అన్నారు.

      తొలగించండి
    4. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు. శాస్త్రి గారి వ్యాఖ్య తర్వాత వస్తే పొరబడ్డాను.

      తొలగించండి
    5. గురువుగారికి, హనుమచ్ఛాస్త్రి గారికి, సహదేవుడు గారికి మరియు కామేశ్వరరావు గారికి అభివాదములు. యతి భంగము కాదు అని తెలియజేసినందులకు ధన్యవాదములు. దయచేసి అందలి సూత్రమును కూడా తెలియజేసిన యెడల నేర్చుకొనగలవాడను. అచ్చు తో పాటుగా హల్లునకు కూడా యతి మైత్రి కావలెననే సూత్రము ననుసరించి నేను యతి భంగమవుతుందని భావించితిని. దయచేసి వివరించ ప్రార్థన.

      తొలగించండి
    6. ఫణి కుమార్ గారు యీ సూత్రములను చూడండి.
      1. స్వరప్రధానయతి:- పదాలమధ్య సంధి జరిగినపుడు రెండవపదం మొదటిఅచ్చుకే యతి చెల్లించాలి.
      (ఉభయయతులలో ఈ నియమం చెల్లదు).
      ఉదా-
      *అతులవిక్రముఁ డతఁడు వి*ద్యాధికుండు (విద్యా +*అధికుండు)

      ఉభయ యతులు:
      1. అఖండయతి :- యతి చెల్లించాల్సిన చోట అచ్‍సంధి ఉన్నప్పుడు పరపదాది అచ్చుకే కాక, ఆ అచ్చుతో కూడిన హల్లుకు కూడా యతి చెల్లించడం అఖండయతి.
      ఉదా-
      *భాను సహస్రభాసి వృష*భాధిపుఁ డన్నటు లర్థయుక్తమై. [కవిజనాశ్రయం]
      యీ యఖండ యతిని సాధారణముగా వాడరు తప్పని సరి పరిస్థితులలో తప్ప.

      తొలగించండి
    7. బాగా చెప్పారు కామేశ్వర రావుగారూ! నేనును నా పూరణమున నఖండయతినే వాడాను. నే నఖండయతి వ్యతిరేకిని కాను. నే నవసరమైనపుడని కాకుండా, సముచిత మనిపిస్తేనే వాడుతాను.

      తొలగించండి
    8. కవిపుంగవులు మధుసూదన్ గారు ధన్యవాదములు. అఖండ యతి నస్పృశ్యముగా భావించ రాదనే నా మతము.

      తొలగించండి
    9. కామేశ్వరరావు గారూ నమస్సులు. మీ వివరణకి ధన్యవాదములు.

      తొలగించండి
  10. హంగంచు యెన్నికలలో
    కంగారెత్తించ పత్రికలు పరిశీలిం
    పంగన్ బిరబిర మన రా
    జ్యాంగము చేతఁ బట్టి యాడిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      చివరి పాదంలో 'జ్యాంగమ్మును' అని కదా ఉండాలి. లేకుంటే గణదోషం.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ:
      హంగంచు యెన్నికలలో
      కంగారెత్తించ పత్రికలు పరిశీలిం
      పంగన్ బిరబిర మన రా
      జ్యాంగమ్మును చేతఁ బట్టి యాడిరి విబుధుల్

      తొలగించండి
  11. గంగా యేమని జెప్పుదు
    నం గమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్
    మంగమ చేసిన నాట్యపు
    భంగిమనే జూచివారు ప్రమదము తోడన్

    రిప్లయితొలగించండి
  12. అంగజ తూణ సాయక విహార వికార సుకీర్తనప్రియుల్
    భృంగ సమూహ నిస్వన గభీర పదోచిత వర్ణ నోద్ధతుల్
    ప్రాంగణ మందు నర్తన విలాస మతిం జరియించు చున్న బ
    ర్హ్యంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    [బర్హి+అంగము = బర్హ్యంగము; అంగము = సమీపించినది; బర్హి = నెమలి]


    అంగ కళింగ ఘనాంగ మ
    భంగాంధ్రద్రవిడ పాండ్య పాంచాలములన్
    భంగ మెరుంగ మనుచు పం
    చాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
      మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.

      తొలగించండి
    3. "వంగ కళింగ ఘనాంగ మ" గా మొదటి పాదమును చదువ గలరు.

      తొలగించండి
  13. భంగము కల్గజేసిరని భారత చట్టమ దిచ్చు హక్కులన్
    క్రుంగక యున్నతమ్మునగు కోర్టున కొందరు కేసువేయ,న్యా
    యాంగము తీర్పు జెప్పె తమ వాదన నొప్పియు,కేసుగెల్వ;రా
    జ్యాంగము చేతబట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'తమ్మునగు'...?

      తొలగించండి
    2. యున్నతమ్మును + అగు = యున్నతమ్మునగు
      (సరి కాదంటారా?)

      తొలగించండి
  14. సంగతములౌచు బహువిధ
    మంగళములుగూర్చు నట్టి మహితములగు సత్
    సంగతులు తెలుపుటకు పం
    చాంగమ్మును చేతబట్టి యాడిరి విబుధుల్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.

      తొలగించండి
  15. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    { శివరాత్రి పర్వదినమున శ్రీశైలముపై గొప్పనైన వె౦డి శివలి౦గమును ప౦డితు ల౦దరు
    కలసి చేతబట్టుకొని ఆడుచు పాడుచు మోసిరి }

    భ౦గ మొనర్చు మయ్య , భవపాపము |

    …………… మన్మథ గర్వభ౦గ ! బ్రో

    వ౦ గదె మమ్ము , శ్రీ గిరి శివా ! యను చా

    ………… శివరాత్రి పర్వ మ౦

    దు౦ గడు భక్తి (న్) మ౦త్రములతో

    …………… రజితా౦చిత భూరి శైవ లి౦

    గా౦గము జేత బట్టు కొని , యాడిరి పాడిరి

    …………… ప౦డి తోత్తముల్ ! !

    { శ్రీగిరిశవా = ఓ శ్రీశైల మల్లిఖార్జు నా ! శైవ లి౦గా౦గము చేతబట్టుకొని = పెద్ద శివ
    లి౦గము యొక్క భాగములను ప౦డితు ల౦దరు
    కలసి పట్టుకొని ఆడి పాడి మోసిరి !

    రిప్లయితొలగించండి
  16. అంగరకాలు లేకనె మహా మహు లెల్లరు వాయువేగులై
    ప్రాంగణమందు జేరిరట ప్రాజ్ఞులు మంత్రికుమారుఁ బెండ్లికై
    బంగరు కాంతులీనెడొక వస్త్రము నందున దాచుకొన్న పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    దొంగయె గెలిచిన యెన్నిక
    భంగమ్మును జేయదలచి ప్రాజ్ఞుల్ యొకచో
    సంగతి నెఱంగుటకు రా
    జ్యాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విరించి గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'కాంతులీను నొక' అనండి. 'ఈనెడు+ఒక=ఈనెడు నొక' అవుతుంది.
      'ప్రాజ్ఞుల్+ఒకచో' అన్నపుడు యడాగమం రాదు. 'ప్రాజ్ఞు లొకయెడన్' అనండి.

      తొలగించండి
  17. పూజ్యశ్రీ శంకరయ్య గారూ:
    ఒక సారి మిమ్ము కలవాలి. 74 సంవత్సరముల వయోవృధ్దుడను. ప్రయాణం చెయ్య లేను. మీరీసారి హైదరాబాదు వచ్చినపుడు తెలియజేయ కోరిక. నా ఈమైలు క్రింద ఇస్తున్నాను. 40 సంవత్సరాలు ఐ.ఐ.టీ ఖరగ్పూరులో ఫిసుక్సు చెప్పి 12 ఏళ్ళక్రితం రెటైర్ అయ్యాను.
    5 నిముషాలు మీతో గడపాలని కోరిక. మీలాటి గురువులను తప్పక చూడాలి...

    e-mail: gps1943@yahoo.com

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శాస్త్రి గారూ,
      ఈసారి హైదరాబాదు వచ్చినప్పుడు తప్పక కలుస్తాను. వచ్చేముందు మీ మెయిలుకు తెలియజేస్తాను. మీ ఫోన్ నెం. ఇవ్వండి.

      తొలగించండి
    2. నాటినుండి నేటికి ఈ కోరిక చాలా సార్లు తీరినది

      __/\__

      తొలగించండి
  18. మంగళ కారకుండయిన మాధవు సత్కృప మానవాళికిన్
    సంగర భీతి లేక సుఖ శాంతి సమున్నతి నిచ్చునట్టి ని
    ర్భంగపు భవ్య జీవనపు వత్సర మంచును వ్రాసినట్టి పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి
  19. భంగములేకనుండగనుభావితరాలకునెల్లవేళలన్
    రంగదభంగకాంతులవిరమ్యముగామరివిందుగొల్పగా
    చెంగునగంతులేయుచునుసేదలుదీరగలోపునేభళా
    యoగముజేతబట్టుకొనియాడిరిపాడిరిపండితోత్తముల్

    రిప్లయితొలగించండి
  20. పొంగిన నుత్సాహంబున
    హంగులతో వీరభద్ర నారాధ్యులు సత్
    సంగమ్మున ఖడ్గమ్మను
    అంగమ్మును జేతబట్టి యాడిరివిబుధుల్.
    2.క్రంగున మేఘమాలికలు గాలికిదేలుచు మెర్పుతీగ తే
    లంగను,నూయలూగుచు ఫలాశయ మెంచకనీట నోట ను
    ప్పొంగగ జల్లు గ్రక్కగనె ?పూ వడగళ్ళను మేఘమాలికా
    అంగము జేతబట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్ .{వేడిదాడికిబాధాకరమున వానజల్లున వడగళ్ళు బడగసంతసాన}

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నా రెండవ పూరణలో కొంత అన్వయలోపం ఉన్నట్టుంది.

      తొలగించండి
  21. రంగారు భావమలరగ
    పొంగారెడు గావ్యపటిమ పుంభావమునం
    దంగాంగంబుల నా వ్యా
    సాంగమ్మును చేతబట్టి‌ యాడిరి విబుధుల్!

    రిప్లయితొలగించండి


  22. మంగళకార్యముల్ త్వరితమై జరిపింపగనూత్నవర్షమున్
    సంగతులయ్యవారికడ చయ్యని చెప్పగ నేగిచూడ స
    త్సంగములందుగాదిఫలితంబులగాంచి ప్రమోదమొంది పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్ ||

    ప్రాంగణమున్ సమ్మిళితు ల
    భంగముహూర్తములగాంచి బహుసంతుష్టుల్
    సంగతిఁ నుడువగఁ జని పం
    చాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్ ||

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      (నిన్నటి అష్టావధానానికి రావాలని ఎంతగానో అనుకున్నా.. కాని అప్పటికే రెండు రోజుల ప్రయాణం అస్వస్థతకు కారణం కాగా రాలేకపోయాను. మన్నించండి!)

      తొలగించండి
    2. ఆర్య! అనేక నమస్కారములు. మీ రాకకై వేచి చూశాను. శ్రీ రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు మీ అనారోగ్య విషయం తెలియజేశారు. మరొకమారు అవకాశం చేసుకొని కలువగలము. ధన్యవాదములు.

      తొలగించండి
  23. సంగమము జరుగు తావుల
    మంగళకార్యములు జరుప మహనీయముగన్
    హంగుగ నుండుననుచు పం
    చాంగమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్!!!

    రిప్లయితొలగించండి
  24. హంగుగ నుగాది కిన్ను

    ప్పొంగగ పంచాంగ శ్రవణముత్సాహంబున్

    ప్రాంగణమున్ జేరగ పం

    చాంగమ్మును జేత బట్టి యాడిరి విబుధుల్.

    రిప్లయితొలగించండి
  25. మిత్రులందఱకు నమస్సులు!

    [హంసవలె స్వచ్ఛమైనది, యష్టాదశ వర్ణనలచే నలరునది యగు సత్కావ్యమునుం బఠించుటకుఁ బండితులు, షడంగములలో నొకటైన వ్యాకరణమును చేఁతఁబట్టుకొని (=గ్రహించి) చదువుచు నాడిపాడిరి (= గ్రంథములోని లక్షణము సరియైనదా లేదా యనే తర్కవితర్కాలతో నాడుకున్నారు) అని యాశయము]

    గాంగతరంగరంగదభిగాహితనిర్మలరాజహంసికిన్
    సంగత గౌణ వర్ణ ఘన సన్నిభ, వర్ణ్య నవద్వయాఖ్య నూ
    నంగ వెలుంగు కావ్యమును నంది పఠింపఁగ షడ్విధోక్త వే

    దాంగముఁ జేఁతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్!

    స్వస్తి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తృతీయ పాదమున నఖండయతి రావలదనుకొన్నచో...

      గాంగతరంగరంగదభిగాహితనిర్మలరాజహంసికిన్
      సంగతగౌణవర్ణఘనసన్నిభ, వర్ణ్యనవద్వయాఖ్యతో
      నింగిని వెల్గు కావ్యమున నేర్పుఁ బఠింపఁగ షడ్విధోక్త వే

      దాంగముఁ జేఁతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్!

      తొలగించండి
    2. గుండు మధుసూదన్ గారూ,
      మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

      తొలగించండి
    3. కవిపుంగవులు మధుసూదన్ గారు మీ మొదటి పాఠశైలియే సుందరముగా నున్నది.పండితోత్తముల యంతరగానికి తగిన పూరణ నిచ్చారు. ...రాజహంసస/త్సంగత... అనిన నెట్లుండును?
      గౌణ మనగ నప్రధానమని కదా. ఇక్కడ అన్వయము వివరించ గోర్తాను.

      తొలగించండి
    4. సుకవి మిత్రులు చక్కగా సెలవిచ్చారు. మీరన్నట్లుగా గౌణ మనగ నముఖ్యమని యర్థమున్నను...(లేక) గుణసంబంధమైనది అనే అర్థమున్నను...

      "గుణేభ్యో భవః గౌణః" గుణములు అనగా అవయవముల వలన - వ్యుత్పత్తిద్వారా సంభవించిన అర్థము గౌణార్థము.
      లోకవ్యవహారసిద్ధమై రూఢమై యున్న అర్థము ముఖ్యార్థము. పంకజమునకు పద్మము అను నర్థమువలె.

      ఇవి కావ్యమున కోకొల్లలుగా కనిపిస్తాయి. అలాంటి కావ్యాన్ని లక్షణబద్ధంగా విశ్లేషించడానికి పండితులు పూనుకున్నారు...అంటూ...నేను నా పూరణను కొనసాగించాను.

      సూక్ష్మంగా పరిశీలించి, ఒక మంచి చర్చకు తావిచ్చినందులకు కృతజ్ఞుడను. నేనేమైన పొరపడి వుంటే మన్నించి తెలుపగలరు. సరిదిద్దుకొనగలను.

      వినమ్రాంజలులతో...
      భవదీయుడు
      గుండు మధుసూదన్

      తొలగించండి
    5. అర్థవిశేషమును తెలుసుకోవాలన్న కుతూహలముతోనే యడిగితిని. మీ చక్కటి వివరణకు ధన్యవాదములండి.

      తొలగించండి
  26. డా.పిట్టా
    "రంగము మీది పద్యములు వ్రాయుడి గూర్చి విమర్శనావళిన్
    భంగము జేయకుండగను బ్రాకుడి యచ్చు ప్రభుత్వ పూచి వే
    ఖంగు తినంగ చంధమును గావగనౌ"నను భారతీయ రా
    జ్యాంగము జేత బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్!!

    భంగమయెన్ వేదార్థము
    లంగమ్ములు దాన మోది యారడి గని వే
    మంగళములనరయగపం
    చాంగమ్మునుచేత బట్టి యాడిరి విబుధుల్!!
    డా.పిట్టా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పిట్టా సత్యనారాయణ గారూ,
      మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  27. దొంగతనమ్ము దాచుకొన దోపిడి కెద్ది ముహూర్త మంచనన్
    సంగరమందు గెల్వదగు చక్కనిదౌ క్షణ కాలమే దనన్
    గంగను చెత్త నూడ్చుటకు కాలమ దేది శుభమ్మనంగ పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి
  28. పొంగగ భావఝరి ప్ర
    త్యంగమ్మును జేతబట్టి యాడిరి విబుధుల్
    సంగమశృతిలో హృదయము
    శృంగాకృతిసంతసాల శ్రీలను కలపన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చేపూరి శ్రీరామ్ గారూ,
      మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో గణదోషం. 'పొంగగ భావఝరులు ప్ర...' అనండి.

      తొలగించండి
  29. రంగముపై శివరాత్రిని
    జంగమదేవరలవోలె శంకర యనుచున్
    లింగని రూపము స్పటిక శు
    భాంగమ్మునుఁ జేతఁ బట్టి యాడిరి విబుధుల్.

    రిప్లయితొలగించండి
  30. ఆర్యా
    "చంధస్సు"లోని స.కారం తప్పింది.ఛం దముగా నైతే,అభిప్రాయము,అనే అర్థం పొసగును.
    తి.తి.దే.వా,రిచ్చిన మ.మహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య గారి "మళయాళ స్వామి వారి చరిత్ర"కు ఆంగ్లానువాదం పూర్తి జేసి పంపినాను డా.పిట్టా

    రిప్లయితొలగించండి
  31. హంగులు లేక చందురుడు హాయిగ నెన్నికలుగ్గడించగా
    కంగరు తోడ కాంగ్రెసులు గమ్మున పిల్వగ పండితుండ్లనున్
    బంగరు టుంగరమ్ములను వందలు కోరుచు వారివారి పం
    చాంగముఁ జేతఁ బట్టుకొని యాడిరి పాడిరి పండితోత్తముల్

    రిప్లయితొలగించండి