26, అక్టోబర్ 2016, బుధవారం

వేంకటేశ్వర శతకము - 5వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౫)
ఆయత చంద్ర వంశజుడు నాతత కీర్తి విభూషణుండు నా
రాయణ నామధేయుడు విరాజిత శీలుడు పుణ్యమూర్తియుం
బాయని భక్తి నేర్పఱచె స్వర్ణ విమానము వేంకటాద్రినిన్
ధ్యేయము నెల్ల భక్తులకు దివ్య నిధానము వేంకటేశ్వరా!                        36.

కుర్వ నివాసి యుత్తముడుఁ గుమ్మరి భీముడు దైవ భక్తుడున్
సర్వము విష్ణు మూలమని సన్మతి మృణ్మయ పత్ర రాజినిన్
గర్వము వీడి కొల్వగ సకాంతయ చేరెను విష్ణు లోకమున్
సర్వ ఖలవ్యయమ్మునను సత్వర మింపుగ వేంకటేశ్వరా!                        37.      

పుణ్య తమమ్ము లయ్య మధు పూరిత తావక నామ కీర్తనల్
గణ్యము గాదు మీ దగు నఖండ మహాత్మ్యము నేరికిన్ ఘనా
రణ్యము లందు నున్నను సురక్షితులే భవదీయ భవ్య కా
రుణ్య వితానమున్న నిల రోచిత లోచన వేంకటేశ్వరా!                           38.

శేష నగాధి వాస రత! శీఘ్ర వృషాక్షి సుగోచరా! సదా
తోషద నాధఖాత తట! తోయజ నేత్ర! సుమేరు పుత్ర సం
తోషద శైలనాధ! లసదుత్తమ విష్ణు సదాభిధాన! సం
భాషణ భవ్య పుష్ప యుత వాత సుపూజిత! వేంకటేశ్వరా!                      39.
[ వృషాక్షిసుగోచరా = వృషదృగ్గోచరా; నాధఖాతము= స్వామి పుష్కరణి;  సుమేరుపుత్ర సంతోషద శైలనాధ = మేరుపుత్రగిరీశా]

నిత్య కుమార సేవ్య! రమణీయ గిరీంద్ర నికుంజ సంచరా!
సత్య పరాక్రమ త్రిదశ సన్నుత రామ! బలారి గోచరా!
దైత్య కదంబ నిర్దళన! తార్క్ష్య మహీధర వాస హర్షితా   
త్మ! త్యజి తాక్షయస్థల! రమాస్థ భుజాంతర! వేంకటేశ్వరా!                       40.

శాశ్వత! పద్మనాభ! హరిచందన గోత్రవరాధినాధ! స
ర్వేశ్వర! శంఖ చక్ర యుగళేద్ధ కరాంబుజ! శంఖ రాజరా
జేశ్వర నేత్ర గోచర! మునీశ్వర సంచయ పూజి తాగ్రణీ!
శశ్వదభీష్టదాత! సురసన్నుత! కేశవ! వేంకటేశ్వరా!                               41.

శ్రీగిరి సన్నివాస! నిజ శేషనగాకృతి దర్శనాతురా!
శ్రీ గురుమానసాపహర! శీర్షసహస్ర! సహస్రపాద! రూ
ప్యాగమ నాధ సేవ్య! చతురాస్య సురాసహ విశ్వరూప! స
ద్భాగవతేష్టదాయక! కృపారసవీక్షణ! వేంకటేశ్వరా!                                42.
[ రూప్యాగమనాధ = శివుడు]

మోద సువర్చలాసుతచమూభర! సంయమి బృంద సేవ్య! దా
మోదర! కృష్ణ! గూఢతర మోక్షవిమాన విలాస భాసితా!
సాదర వైనతేయ భుజ సమ్మదవాస! సులిప్త చందనా
మోద! హరి! ప్రియంగు ఘనభుక్ప్రియ! శ్రీధర! వేంకటేశ్వరా!                    43.
[ఆమోదము = దూరముగా వ్యాపించెడు పరిమళము, సంతోషము]

వారిద సన్నిభద్యుతి సువర్ణ వరాంగ! సహస్రలోచనా!
కీర వసూరు రక్షక! సుకీర్తిత కుంభభవాక్షి గోచరా!
సార ధరాధరాంచిత విశాల సుసానుతలప్రతిష్ఠితా
గారివరా! పరాత్పర! ఘనాఘవినాశన! వేంకటేశ్వరా!                             44.
[కీర వసు+ఉరు రక్షక =కీరవసూరురక్షక: వసూపరిచరత్రాత(ఉపరిచరము=పక్షి): పంచవర్ణపు చిలుకను, వసువును రక్షించిన వాడు)  ; కుంభభవుడు= అగస్త్యుడు;  సానుతలప్రతిష్ఠిత +అగ+అరి (అగము = పాము): సానుస్థాపిత తార్క్ష్యాయ]

నీరజనేత్ర! సత్యపుర నిర్గత హేమ విమాన సంగతా!
సారస సంభవానిమిష సద్గురు దాత! శశాంకరూపదా!
కారణ కార్య హేతుక! మృకండజ తీర్థజ పుణ్యదాయకా!
వారిజగర్భ హస్తకృత  భవ్య మహోత్సవ! వేంకటేశ్వరా!                           45.

7 కామెంట్‌లు:

 1. మా అన్న గారు పోచిరాజు సుబ్బారావు గారి పద్యము:

  వేంకటేశుని శతకము వీను లలర
  చదువు చుంటిని నిత్యము, చదువు తరిని
  స్వామి దర్శన మగు నట్లు భ్రాంతి గలుగ
  మోకరిల్లుదు వెంటనే ముఖము దించి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీదు శతకము స్వామిని నెయ్య మలర
   జూపుచున్నది వైభవ శోభ లెగయ
   వేంకటేశుని చరితము విపుల మవగ
   జెప్పు చుంటిరి మహిమల నొప్పగాను!

   తొలగించండి
 2. ఇందలి 39 నుండి 54 పద్యముల వరకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 108 నామములు పొందుపరప బడినవి. వాటిని క్రింద చూడ గలరు. ప్రతి పద్యము లోని నామముల సంఖ్య కూడ నీయబడినది.

  39.ఓం నమో వేఙ్కటేశాయ; శేషాద్రి నిలయాయ; వృష దృగ్గోచ రాయ; సరస్స్వామి తటీ జుషే; మేరు పుత్ర గిరీశాయ; విష్ణవే; సదా వాయు స్తుతాయ
  7
  40.కుమారాకల్పసేవ్యాయ; గిరికుఞ్జవిహారిణే; రామాయ; వజ్రి దృగ్విషయాయ; దైత్యసఙ్ఘప్రణాశినే; తార్క్ష్యాచలనివాసినే; త్యక్త వైకుణ్ఠలోకాయ; అబ్ధికన్యాపరిష్వక్తవక్షసే;

  8
  41.నిత్యాయ; పద్మనాభాయ; హరిచన్దనగోత్రేన్ద్రస్వామినే; శఙ్ఖచక్రవరానమ్రలసత్కరతలాయ; శఙ్ఖరాజన్యనేత్రాబ్జ విషయాయ; సనకాదిమహాయోగిపూజితాయ; కేశవాయ; వేఙ్కటాయ
  8
  42.శ్రీశైలనిలయాయ; శేషపర్వతరూపత్వప్రకాశనపరాయ; ; అనంతశిరసే; అనంతచరణాయ; శఙ్కరధ్యాతమూర్తయే; బ్రహ్మాదిదేవదుర్దర్శవిశ్వరూపాయ;
  6
  43.సువర్చలాసుతన్యస్తసైనాపత్యభరాయ; వైఖానసమునిశ్రేష్టపూజితాయ; దామోదరాయ; కృష్ణాయ; మాయాగూఢవిమానాయ; గరుడ స్కంధవాసినే; ద్రవన్మృగమదాసక్తవిగ్రహాయ; హరయే; ప్రియఙ్గుప్రియభక్షాయ; శ్రీధరాయ;
  10
  44.నీలమేఘనిభాయ; అనన్తాక్షాయ; వసూపరిచరత్రాతే; అగస్త్యాభ్యర్థితాశేషజనదృగ్గోచరాయ;సానుస్థాపిత తార్క్ష్యాయ; మహతే;
  6
  45.వైకుణ్ఠాగతసద్ధేమవిమానాన్తర్గతాయ; వాక్పతిబ్రహ్మదాత్రే; చన్ద్రలావణ్యదాయినే; మార్కణ్డేయమహాతీర్థజాత పుణ్యప్రదాయ; బ్రహ్మక్లప్తోత్సవాయ

  5

  రిప్లయితొలగించండి
 3. గారవ పోచిరాజు కుల కామయ నిర్మిత హృద్యపద్యముల్
  నేరుగ జూచుభాగ్యమును నిక్కము నేనిట నొందితిన్ సుధా
  ధారలు జాలువారు తరిఁ దక్షణమే యఘదగ్ధమౌ విధిన్
  శౌరిని వేంకటాధిపుని శ్లాఘితుఁ జేసె శుభంకరంబుగన్ (సువర్ణ శోభలన్)
  దయచేసి ఇందులోని గుణదోషములు తెలియజేస్తే మార్చివ్రాయడానికి ప్రయత్నిస్తాను

  రిప్లయితొలగించండి
 4. శిష్ట్లా శర్మ గారు, మూర్తి గారు అన్నయ్య మీ పద్య కుసుమాభినందనలకు ధన్యవాదములు. మూర్తి గారు మీ పద్యము చక్కగనున్నది. “తత్క్షణమే” అనండి.

  రిప్లయితొలగించండి
 5. చాలాసంతోషమండి.సువర్ణ శోభలన్ అంటేమంచి అక్షర శోభలతో అనివ్రాయాలనుకున్నా, శుభంకరంబు ఇంకా బాగుంటుందనిపించింది.
  గురువు గారూ, మీరేమీ అనుకోక పోతే,
  "పలుకుచుంటి నమ్మ పాదమంటి"
  అనే మకుటముతో కొన్ని పద్యాలు వ్రాశాను. మీకువీలైనప్పుడు కొద్దిగాచూడాగలరా?
  నేను retired bank officerని.తెలుగు మీద వ్యామోహమున్నవాణ్ణి

  రిప్లయితొలగించండి