24, అక్టోబర్ 2016, సోమవారం

సమస్య - 2179 (రైకను విప్పి డాసె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రైకను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్"
(ఒకానొక అవధానంలో గరికిపాటి వారు పూరించిన సమస్య)
లేదా...
"రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్"

83 కామెంట్‌లు:

 1. ఉ.భీకర యుద్ధము న్నరుల ప్రేరిత వ్యూహము నందు జిక్కి స్వ
  ర్లోకము జేర పార్థసుతుడు రోయుచు నుత్తర తల్లడిల్లుచున్
  శోకము తోడ నందరును జూచుచు నుండగ గంట గిల్లు వా
  రై; కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గుఱ్ఱం జనార్దన రావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పార్థసుతుడు' అన్నచోట గణభంగం. 'పార్థజుడు' అనండి.

   తొలగించండి


 2. భీకరమైనయుద్ధమది వెన్నునిసాక్షిగ సాగినప్పుడున్
  కూకటివేళ్ళతో తరువు కూలినరీతి శవమ్ము గుట్టలై
  తాకరణాంగణమ్ము ప్రమదామణి చేకొననెంచ తారుమా
  రై కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్ ||

  విప్పి = విడదీసి

  భీకరయుద్ధము జరుగగ
  ప్రాకటముగశవపుగుట్ట పడగన్ సతియున్
  చేకొన జూడగ తార్మా
  రై కను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్ ||

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ,
   మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   'తార్మారు' శబ్దం సందేహమే!

   తొలగించండి

  2. ఆర్య! అనేక నమస్కారములు. తార్మారు పదము గూర్చి సందేహమును మా గురువుగారిని అడిగితిని. వారు సరియైనదేనని నుడివిరి. మఱియు ఉదాహరణ పద్యమొకటి దొరికినది. ఇచ్చట పొందుపరచుచున్నాను. ధన్యవాదములు.

   మ|| తనుభావేశ్వరుఁడౌచు లాభముననే తానుండుచు౯ నాకుఁ ద
   త్తను సౌఖ్యాదికలాభ మీక తనువే తార్మారు గావించెడి౯.
   తనుజాతాంతరలాభకృత్త్వమొకమేల్ తప్ప౯ విచారింప నీ
   తనికావించిన వేఱుమేలు గలదే తథ్యంబుగా భాస్కరా!

   తొలగించండి
  3. డా. మాడుగుల అనిల్ కుమార్ గారూ సోదాహరణముగా సందేహ నివృత్తి చేశారు. ధన్యవాదములు.
   “తారుమారు” నేకపదముగా గ్రహించిన
   “ఆచ్చికంబులం బద మధ్యంబుల నలడర ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగా నగు.” సూత్రముచే తార్మారు, తారుమారు రెండు రూపములు సాధువులని తెలియుచున్నవి.

   తొలగించండి
  4. మాన్యశ్రీ కామేశ్వరరావు గారికి అనేక నమస్కారములు. సూత్ర యుక్తంగా సమర్పించిన మీకు ధన్యవాదములు. నేను పరిశీలించిన అహోబిలపండితీయం లో కూడ మీరు తెలియజేసిన సూత్రమే సంస్కృతంలో మూడు వరుసలలో ఉండినది. ఎంతో ఓర్పుతో ఇక్కడ తెలియజేసినందులకు శతధా కృతజ్ఞతలు.

   తొలగించండి
  5. తారుమారు రెండు పదములుగా భావించిన:
   16.పదాంతంబు లయి యసంయుక్తంబు లయిన ను లు రు ల యుత్వంబునకు లోపంబు బహుళంబుగ నగు. ఇందు నురుల కుత్వలోపంబు ప్రాయికంబుగ హల్పరకంబులకుఁ జూపట్టెడు.
   మ్రాన్పడె - మినువడె - మిన్వడె - వత్తురు వారు - వత్తుర్వారు - కారుకొనియె - కార్కొనియె - రాములు - రాముల్‌ - వనములు - వనముల్‌.

   తొలగించండి
 3. ఉత్తర అభిమన్యుడు నధనుడగుట దెలిసి

  ఆకలశజు యూధమునన్
  భీకరముగ బోరుసల్పి మిత్తిని బొందన్
  జేకొని కనుగవ మున్నీ
  రై కను విప్పి కలిసినది రణనిహతుఁబతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అశ్వత్థ సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 4. డా.పిట్టా
  జోకను పాలులం గలిసి జూ(చూ)డగ నెంచనియట్టులుండ నో
  పాకమునందు నీరమదె బాసెను యావిరి యయ్యి వంట నా
  పోకడ యుద్ధమై విభుడు పొంగుగ జారిన వేళ తిర్గి నీ
  రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

  పాకన పాలను గుడుపగ
  వీకన బాలిండ్లకప్పు విప్పినతరి యా
  "పాకు"లు బంపిన శవమును
  రైకను విప్పి కలిసినది రణనిహతు బతిన్
  డా.పిట్టా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పిట్టా సత్యనారాయణ గారూ,
   మీ రెండు పూరణలలో భావం బోధపడలేదు. వివరిస్తారా?

   తొలగించండి
 5. ఏకాంత మోర్వజాలక
  వేకువ రాగలడటంచు వేచిన; రాగా
  వాకిట; కన్నుల జలధా
  రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్

  రిప్లయితొలగించండి
 6. భీకరమగు పద్మ వ్యూహము
  నేకత ముగనుత్త రపతి నిర్గతి నొందన్
  శోకము వెల్లువ లవగ నే
  రై , కను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అక్కయ్యా,
   మీ పూరణ బాగున్నది.
   మొదటి, మూడవ పాదాలలో గణదోషం. 'భీకర పద్మవ్యూహము... శోకము వెల్లువ లయి యే।రై...' అనండి.

   తొలగించండి
  2. భీకర పద్మ వ్యూహము
   నేకత ముగనుత్తర పతి నిర్గతి నొందన్
   శొకము వెల్లువ లయియే
   రై ,కనువిప్పి కలిసినది రణ నిహతుఁ బతిన్

   తొలగించండి
 7. క్రొవ్విడి వెంకట రాజారావు:

  నైకృతికు లెంచు తగవున
  చేకల వాడగు పతినట చనెనని దెలియన్
  శోకముతో సతి కనులే
  రై కనువిప్పి కలిసినది రణనిహతు బతిన్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. క్రొవ్విడి వేంకట రాజారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. 'నైకృతికులు' శబ్ద ప్రయోగం ప్రశంసనీయం.
   రెండవ పాదంలో యతి తప్పింది. '...పతి యట జేరగ దెలియన్' అనండి.

   తొలగించండి
  2. గురువుగారికి నమస్కారములు పొరబాటును సరిదిద్దినందులకు కృతజ్ణతలు


   తొలగించండి

 8. వేకువ జామున తెలియగ
  చేకురు గోరుచు కళింగ చేరెను రణమున్
  శోకమ్మనునది కన్నీ
  రై,కను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్


  జిలేబి

  రిప్లయితొలగించండి
 9. భీకర సమరము నందున
  వీకను జూపి మరణించ పెనిమిటి చనితా
  శోకమున కంటినీరే
  రై,కనువిప్పి కలసినది రణనిహతు పతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 10. ఆ కరము, కాలు తెగినను
  భీకరముగ రిపుల దాకి భీతిల జేయన్
  కాకను బడి వడలిన యల
  రై కనువిప్పి కలిసినది రణనిహతు పతిన్!

  రిప్లయితొలగించండి
 11. పాకీల పారద్రోలగ
  దూకిన మన సైనికుండు దుర్ మృతినొందన్
  వ్యాకులత నెలత కన్నీ
  రై, కనువిప్పి కలిసినది రణనిహతుఁ బతిన్.

  రిప్లయితొలగించండి
 12. పాకిస్థాన్ వెధవలతో
  నా కాశ్మీరమున పోరి నమరుడు కాగా
  శోకము సతికన్నుల నీ
  రై కనువిప్పి కలిసినది రణనిహతు పతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చేపూరి శ్రీరామారావు గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'పోరి యమరుడు కాగా' అనండి.

   తొలగించండి
 13. తాకుట కష్టమంచు మదిఁ దల్చక గ్రుడ్డివైతి వో
  కైకసపుత్ర రాముసతికై సుఖజీవితమున్ త్యజించి వే
  నాకము జేరినావు గద నాథుడ యంచును కంటినీరు యే
  రై,కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అన్నపరెడ్డి వారూ,
   మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
   మొదటి పాదంలో గణదోషం. సవరించండి.

   తొలగించండి
  2. సత్యనారాయణ రెడ్డి గారు "కైకసిపుత్ర" సాధువనుకుంటాను.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారూ- నిజమే. టైపు తప్పు వలన మొదటి / రెండవ పాదములలో తప్పులు దొర్లాయి.తెలియ జేసి నందులకు ధన్యవాదములు.

   తొలగించండి
 14. మీకిది చేటు జానకియె మృత్యువు రాక్షసకోటి కెన్నడున్
  పోకుడు రాము పాలి కని మొత్తుకొనన్ వినరైతి రయ్యయో
  యీ కఠినోర్విపై బడితిరే యనుచున్ మయసూన బాష్ప మే
  రై కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

  రిప్లయితొలగించండి
 15. అమరవీరుడైన వీరసైనిక మహా పురుషుని భార్య

  పాకీ తలోగ్రముష్కర
  రాకాసులనని నెదిర్చి ప్రాణార్పిత శూ
  రైకాగ్రణి పేటిక కెదు
  రై కనువిప్పి కలిసినది రణనిహతుఁ బతిన్"

  రిప్లయితొలగించండి
 16. భీకరమైన భారత సుభీమర మందభిమన్యుఁ డుద్ధతిం
  గాఁక నెదిర్చి యీల్గె ననఁ గర్ణ యుగమ్మున వజ్రకీలమై
  తాకగఁ గార నశ్రువులు దైన్యపుఁ గన్నులఁ జిత్త మంత చూ
  రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్


  ఆ కలికి కట్టి మాసిన
  కోకయు మరి కాలవర్ణ కూర్పాసకమున్
  శోకమునం గౌశేయపు
  రైకను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
   మీ రెండు పూరణలు వైవిధ్యంగా, ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
  2. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.
   దంత్య “చూ” వ్రాయడము కుదరలేదండి. ౘూరు
   ఇందులో కన్పించు చున్నది కానీ నా ప్రతిలో ౘ ూరు లా ఉన్నది.

   తొలగించండి
  3. కామేశ్వర రావు గారు ! నమస్తే!
   మీ ఉత్పలమాల పద్యంలో కర్త గోపితమైన దనుకుంటాను.
   -- జనార్దన రావు.

   తొలగించండి
  4. జనార్దన రావు గారు నమస్సులు. అవునండి. అభిమన్యుడు, ప్రాణనాథునిన్ యని తెల్పుట చే డాసిన స్త్రీ యుత్తరగా గ్రాహ్యము.

   తొలగించండి
  5. అయినా మీ తృప్తి కొఱకు పాఠాంతరము:

   భీకరమైన భారత సుభీమర మందభిమన్యుఁ డుద్ధతిం
   గాఁక నెదిర్చి యీల్గె ననఁ గర్ణ యుగమ్మున వజ్రకీలమై
   తాకగఁ గార నశ్రువులు దైన్యపుఁ టుత్తర జిత్త మంత చూ
   రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

   తొలగించండి
 17. ఆ కమలాయతాక్షి గళహారము లన్నియు త్రుంచివేసి బ
  హ్వాకులచిత్తయై గురుజనావళి చేరువ నేడ్చియేడ్చి య
  స్తోకముగాగ పెల్లుబుకు దుఃఖము కన్నుల నడ్డగింప నీ
  రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్.
  హ.వేం.స.నా.మూర్తి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
   మీ పూరణ బాగున్నది. అభినందనలు.

   తొలగించండి
 18. తాకెను శస్త్రమటంచు
  న్నేకరువున్ బెట్ట నింతి యేడ్చుచు నేగన్
  చేకొని వచ్చు శకటమెదు
  రై, కనువిప్పి కలసినది రణనిహతుఁ బతిన్!

  రిప్లయితొలగించండి
 19. మిత్రులందఱకు నమస్సులు!

  [తన ప్రేరణచే సైన్యమునఁ జేరిన భర్త, కొలఁది దినములకే పాక్ వంచనచే మరణించఁగా, నామె గుండె నీరై [గుండె పగిలి మరణించి], విప్పిన కనులు విప్పినట్లుండఁగనే, భర్త పాలికి నేఁగిన సందర్భము]

  పాకు దురాగతమ్ములును వంచనముల్ సహియింపలేక తాఁ
  దాఁకు మనంగ, భర్తయె సదాశయుఁడై తమితోడ సైనికా
  నీకమునందుఁ జేరఁగనె, నీచులు వంచనఁ జంప, గుండె నీ

  రై, కనువిప్పి, డాసె, సమరంబున గూలిన ప్రాణనాథునిన్!

  రిప్లయితొలగించండి
 20. పోకిరి యంచు సోదరుని పోరున గూల్చగ నెంచివానితో
  భీకర పోరుజేయుటకు బీరము లాడుచు బోయియచ్చటన్
  శ్రీకరుడైన దాశరథి చేతహతంబవ కంటనీరె యే
  రై, కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

  భీకరపోరాటములో
  నాకురు సైన్యపు కుయుక్తి యసువుల్ దీయన్
  శోకించె సతి క నులె యే
  రై, కను విప్పి కలిసినది రణనిహతుఁ బతిన్

  రిప్లయితొలగించండి
 21. పాకుదురాగతమ్మది యవాంచిత భండనమంకురింపగన్
  చీకటి వేళముష్కరులు చేరగ వారిని యడ్డగించెడిన్
  భీకర పోరులో దనువు వీడిన వీరుడి పత్నికన్నులే
  రై, కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   3వ పూరణలో 'వారిని నడ్డగించెడిన్' అనండి.

   తొలగించండి
 22. పాకిస్థానుల కుట్రకు

  నా కాశ్మీరంబున బలియయ్యెను మగడున్

  వ్యాకులమున కన్నీరే

  రై, కను విప్పి కలిసినది రణ నిహతు బతిన్.

  రిప్లయితొలగించండి
 23. చాకలికొమరుడురణమున
  నేకాకిగబోరుసలిపియీడ్వంబడుచు
  న్నాకముజేరగదనసతి
  రైకనువిప్పికలిసినదిరణనిహతుబతిన్

  రిప్లయితొలగించండి
 24. ఆ కిల్జీ సుల్తానుల
  ఆకాంక్షలు రిచ్చ వడగ నగ్నిని దూకెన్
  వీకను పద్మిని తనుపా
  రై కను విప్పి కలిసినది రణనిహతుపతిన్

  రిప్లయితొలగించండి
 25. భీకర యుద్ధరంగమున పెన్మిటి కాయముఁ జేరినంతనే
  శోకము సంద్రమయ్యె నెదశూన్యతనొందె నయోమయం బునన్
  తేకువ వీడెనుత్తర పతింగని దాఁ తన మేనుతోడఁ వే
  రై కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్"

  రిప్లయితొలగించండి
 26. భీకరయుధ్ధరంగమునబేరయనాయుడుఖడ్గమున్దగన్
  దాకరమందునన్మిగులధారణజేయగముందెబోవగన్
  రైకనువిప్పిడాసెసమరంబునగూలినబ్రాణనాధుని
  న్నాకమలాక్షిశోకముననాయతరీతినినీరుకార్చుచున్

  రిప్లయితొలగించండి
 27. భీకర సంగరంబున విభిన్న దళాలను నేల గూల్చుచున్
  వాకొనరాని దుష్కృతుల భగ్నముజేయుచు వ్యూహమందునన్
  పోక నెరింగి జొచ్చి, మృతి పొందగ, దుఃఖితురాలు కంట నీ
  రై , కను విప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్"

  రిప్లయితొలగించండి
 28. భీకరమైన పోరుగని భీతిల బోకను సైనికుండు పాక్
  సాకులు లెక్కజేయకను సాయుధుడై మనభారతీయుడే
  లోకుల రక్షణార్థము ప్రలోభము లెంచకె చావురాగ?పే
  రై|కనువిప్పిడాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్
  2.సాకగ గర్వంబెంతో
  శ్రీకృష్ణుడు కంస వధను చెలితో జరుపన్
  శోకంబున సతి పతి వే
  రై|కనువిప్పి కలసినది రణనిహతు పతిన్|

  రిప్లయితొలగించండి
 29. భీకరముగ పోరుజరుగ
  నాకదనపు భూమియందు నర్జును సుతుడున్
  యేకతముగ చావగ నీ
  రై కనువిప్పి కలసినది రణనిహతు పతిన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సుతుడున్+ఏకతముగ' అన్నపుడు యడాగమం రాదు. 'సుతుడే । యేకతమున...' అనండి.

   తొలగించండి
 30. కవిమిత్రులారా!
  మధ్యాహ్నం నుండి విపరీతమైన తల, మెడ నొప్పులు. రేపటి కెలా ఉంటుందో? ఎందుకైనా మంచిదని రెండు రోజుల సమస్యలను షెడ్యూల్ చేస్తున్నాను. వీలైతే పరస్పర గుణదోష విచారణ చేసికొనండి. నా ఆరోగ్యం బాగుంటే నేను సమీక్షిస్తాను.

  రిప్లయితొలగించండి
 31. మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసిందిగామనవి.

  రిప్లయితొలగించండి
 32. మీకు ఆరోగ్యము బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీరు పూర్తిగా విశ్రాంతి తీసుకోవలసిందిగామనవి.

  రిప్లయితొలగించండి
 33. ఆరోగ్యము జాగ్రత్తగ చూసుకోండి అన్నయ్యగారూ .

  రిప్లయితొలగించండి
 34. వేకువజాముచీకటిన వీరుల దున్మగ దొంగ చాటుగా
  భీకరమైన శస్త్రములు భీతిని గొల్ప జవానులన్ను రీ *
  పాకన జంపగా తనువు బాసిన ధీరుని జూడ గుండె నీ
  రై, కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణ నాథునిన్ !!!

  * జమ్మూకాశ్మీరు ఉరీ గుడారము(సైనిక స్థావరం)

  రిప్లయితొలగించండి
 35. తూర్పు గోదావరి జిల్లా ముక్కామల గ్రామానికి చెందిన బాలావధాని (అప్పటికి) జానదుర్గ మల్లికార్జున రావు 9వ తరగతి చదువుతుండగా అవధానాలు చేయటం మొదలు పెట్టాడు.అతను ఇంటర్మీడీయట్ మొదటి సంవత్సరం చదువు తున్నపుడు (1996 అని జ్ఞాపకం)చిత్తూరు జిల్లా చౌడేపల్లి, పుంగనూరు, పలమనేరులలో అవధానాలు చేశాడు.పుంగనూరు అవధానంలో అతనికి పృఛ్ఛకుడు దత్తపది అంశముగా " వైర్, బల్బ్, వాలర్, స్విచ్" అనే పదాలిచ్చి భారతార్థంలో ఓ పద్యం చెప్ప మన్నాడు. అప్పుడతను చెప్పిన పద్యం.
  ఉ. వైరము వద్దు మీకు మరి బాంధవులేగద పాండవోత్తముల్
  వారికి మీకు సంధి తగు బల్బల వంతులె గాని యొండొరుల్
  పోరిన బాధ యెంతొ తల పోయవె ఓ కరుణాలవాల రా
  జా ! రణయత్న మాపి ఇక సంధిని గూర్చు యశస్వి చక్కగన్.

  రిప్లయితొలగించండి
 36. గోకుల నాథుడుగ్రముగ కోఱలు గూల్చుచు నాట్యమాడగన్
  భీకర కాళియాహిబహు పీడితుడౌటకు భీతి గొన్న వా
  రై కనువిప్పి డాసె సమరంబున గూలిన ప్రాణనాథునిన్
  శోకపు నాగపత్నులు యశోదకుమారుని రక్షవేడుచున్

  రిప్లయితొలగించండి