14, అక్టోబర్ 2016, శుక్రవారం

చమత్కార పద్యాలు – 216/23


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

23వ అర్థము  నందీశ్వర స్మరణ 
                                                                          
భూరి జఠర గురుఁడు = వినాయకుఁడే రాజుగా గలవాఁడును (నందీశ్వరాది ప్రమథులకు గణపతి రాజు),
నీరజాంబక భూతి = శివుఁడే యైశ్వర్యముగా గలవాఁడును (శివభక్తుఁడు),
మహిత కరుఁడు = గొప్ప (ధవళ) కాంతి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = గొప్ప రత్నభూషలు (మణియుక్తములగు మువ్వల పట్టెలు) గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = ఘనులైన ప్రమథవర్యులలో శ్రేష్ఠుడైనవాఁడును,
అగ్ర గోపుఁడు = గోవులకు ముఖ్యాధీశుఁ డైనవాఁడును
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (మృతిలేనివాఁడును) (అగు నందీశ్వరుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

2 కామెంట్‌లు:

  1. నందీశ్వర మముగావుము
    బృందావన మందు గల్గు బచ్చటి పూల
    న్నందముగ జేతు బూ జను
    చిందులు మఱి వేయకుండ జేయుము సిగనున్

    రిప్లయితొలగించండి
  2. పంచాక్షరి మంత్రమ్మిది
    సంచలనపు సృష్టి కర్త సాహిత్యమునన్
    నుంచెను కాశీపతియే
    పంచెనులే త్రింశ దర్థ పద్యంబొకటే|

    రిప్లయితొలగించండి