వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర
రావు)
(౮)
వినవలె నీదు కీర్తనలు వీనుల విందుగ నాట్య మాడుచుం
గనవలె దివ్య రూపమును గన్నుల కింపుగ సంతసమ్మునన్
మునుకలు వేయగావలెను బుష్కరిణీ జల మందు భక్తినిన్
మనమున నిల్పగా వలెను మంగళ రూపము వేంకటేశ్వరా! 66.
శ్లోక చతుష్టయమ్ములను సూర్య కులోద్భవ చక్రవర్తి సు
శ్లోకుడు ప్రస్తుతింప ఘన శోక పరీత మనస్కుడై తదీ
యాకుల చిత్తు నా దశరథాఖ్యుని పుత్ర చతుష్ట యమ్మునన్
వే కరుణించితే విమల వేంకట శృంగిని వేంకటేశ్వరా! 67.
కుందన మంత శుద్దము వికుంఠపు టయ్యయిరంమదమ్ము నే
యందరు స్వామి పుష్కరిణి యందురు భాసిల వేంకటాద్రి లో
నెందు మునంగఁ బాపములు హీనము లౌనిల నద్భుతమ్ముగన్
సందియ మల్పముం గనము సన్నుత శంకర వేంకటేశ్వరా! 68.
[(అయిరంమదము) ఐరంమదము= వైకుంఠములోని తటాకపుపేరు]
వరముల నిచ్చి నిత్యమును బన్నుగఁ బ్రోచెడు దైవముండగా
నరబలు లిచ్చి క్షుద్రసుర నైరృత పూజలు సల్పనేర్తురే
గరళముఁ గ్రోలఁ జూచెదరు కమ్మని పాలను విస్మరించియున్
గిరివర వేంకటాద్రి ఘన కీర్తితు వేడక వేంకటేశ్వరా! 69.
ముదముగ బ్రహ్మ కల్పిత మపూర్వ మహోత్సవ మందు నొక్క రో
జు దరల నశ్వరాజమున శోభిల దంతిని నొక్క రోజునన్
సృదర విహార మొక్కపరి చెన్నుగ తార్క్ష్యు రథంబు నందునం
బదపడి యొక్క రోజునను వర్తిలు చుందువు వేంకటేశ్వరా! 70.
[సృదరము=సర్పము(అనంతుడు); అశ్వవాహనము (ఉచ్చైశ్రవము), గజవాహనము (ఐరావతము),
గరుడ వాహనము]
అల నలమేలు మంగపుర మందున చందన చర్చితాంగియై
మిలమిల కాంతులన్ మెఱయు మేలిమి భూషణ వస్త్రధారణం
గలవర మందు భక్తజన కామిత దాయి యనంగ భాసిలం
జెలువముఁ జూపు నా సతినిఁ జేరగ వత్తువు వేంకటేశ్వరా! 71.
[మేలిమి = అపరంజి; చెలువము = మహత్త్వము]
రాముడు దైత్యఛేదనకు రమ్యపు టంజన శైల మందు నా
రామము నందు నంజన కరమ్ములఁ బూజల నంది విప్రు ని
ర్లోముని వేంకటాద్రిని విలోకన ముక్తుని జేసి భక్తినిం
దా మునుగంగఁ బుష్కరిణిఁ దత్ఫల మందెను వేంకటేశ్వరా! 72.
అంతము సేసి దైత్యుని బలాన్విత మూర్ఖు హిరణ్య నేత్రుఁ గ
ల్పాంతము వేంకటాద్రిని మహామహి మాన్విత శైల మందునన్
శాంత దయా గుణప్రతతి సాగర నందన భూసతీ యుతం
బెంతయుఁ బ్రీతి నుందు నని యేర్పడ నంటివి వేంకటేశ్వరా! 73.
మేదిని వేంకటాచలము మిక్కిలి మక్కువ సత్యలోకమున్
మోదపు నాకలోకము నపూర్వపు సూర్య జగమ్ము కన్ననున్
శ్రీదయితుండు నా హరికి శ్రీయుత ముండును శ్రీనివాసుడీ
వేద మయోర్వి భక్తుల కభీప్సిత దాతగ వేంకటేశ్వరా! 74.
కందర నిర్ఝ రావృతము క్ష్మాజ మృగద్విజ సంకులమ్మునున్
సుందర నంద నోపమ విశుద్ధ జలాశయ వాటికా తటీం
దిందిర నాద మోదితము దివ్యము నబ్జజ సేవితమ్మునున్
సుందర వేంకటాచలము సూక్ష్మమె యిద్ధర వేంకటేశ్వరా! 75.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండివినగను గాధలు నీయవి
రిప్లయితొలగించండిమనసున సంతోష మయ్యె మాన్యుడ వగుట
న్గను లార జూచు భాగ్యము
నొనరగమఱి జేయుమార్య!యోనా సామీ !