25, అక్టోబర్ 2016, మంగళవారం

వేంకటేశ్వర శతకము - 4



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౪)
గురువటఁ బుష్య యోగమునఁ గూడగ నా శ్రవణా భ యుక్తమై
పరగెడు సోమ వారమునఁ బన్నుగఁ దోగగ దేవ తీర్థమం
దు రమణఁ గల్గు నెల్లరకుఁ దోరపు టాయువులుం గులాభివృ
ద్ధి రుచిర సంతతీశ భవదీయ దయేక్షణ వేంకటేశ్వరా!              26.
[శ్రవణాభ = శ్రవణానక్షత్రము]

బాలుని రంగదాసుని విభాసిత కాయుని భక్తశేఖరుం
బాలిత పుష్పధామ సుమభవ్యసుదామ సమర్పణార్థి స
త్శీలుని స్వామిపాద నత శీర్షుని భావిజ తొండమానునిన్
మేలుగ గాచి తీవు పరమేష్ఠి సుపూజిత వేంకటేశ్వరా!                           27.

కేకిలలామ నిత్య పరికీర్తిత తోషణ! నీరజాక్ష! వ
ల్మీక నిగూఢపాద! సకిరీటవరాభరణోజ్వలాంగకా!
ప్రాకట శంఖ చక్ర సుకరండ గదాయుధ హస్త భూషితా!
శ్రీకర! భూరమావిరళ సేవిత! కావవె వేంకటేశ్వరా!                               28.
[కేకిలలామ = శిఖిధ్వజుడు ; కుమారస్వామి]

శ్రీసతి పూర్వ మొక్క తరి చిత్రముగన్ ముని శేఖరుండు దు
ర్వాసుని ఘోరశాపమునఁ బద్మదలాక్షుడు తోడురాగ భూ
వాసిగఁ జేసె సంయతినిఁ బద్మ సరోవర వాటికా తటిన్
వాసికి నెక్కె నక్కొలను పాపహరంబుగ వేంకటేశ్వరా!                          29.      

భూరి వరాహ రూపమున బోయని క్షేత్రపు శాలి ధాన్యముం
గోరి భుజింపఁ బాదముల గుర్తులు సూచి నిషాదు డేగి యా
దారినఁ బుట్ట లోనఁ గిటిఁ దాఁ గని త్రవ్వగ మూర్ఛ సెందెనే      
నేరడు నిన్నిలన్ వసువు నేరము సైచితి వేంకటేశ్వరా!                           30.

చెప్పితి వీవు పుత్రుడు భజింప నిషాదుని నావహించి మీ
రిప్పుడ యేగి తెల్పుడిటు లిప్పుర నాథుడు తొండమాన్ ఘనుం
డొప్పుగఁ బుట్టనుం గడుగ నుత్తమ నీలపు గో పయస్సునం
జప్పునఁ గాంతు రొక్క శిలఁ జక్కగ నంచును వేంకటేశ్వరా!                   31.       

ఖోలక మందునున్న శిలఁ గూర్మినిఁ దీసి వరాహ వక్త్రమున్
లీలగ నంక పీఠ తట లేఖిత భూసతి రూపు భాసిలన్  
మేలుగఁ జెక్క స్థాపితము మేదినిఁ జేసెను తొండమానుడుం
బూలును భవ్య పత్రములఁ బూజలు సల్పుచు వేంకటేశ్వరా!                   32.

పాద యుగంబు బుట్ట నిరపాయము దాగిన శ్రీనివాసునిన్
మోదము మీర గాంచి పదముల్ పరిశుభ్రము సేసి పాల నా
మోదిత వేదమంత్రములఁ బూజలు సల్పి చరింప భక్తినిన్
మేదినిఁ దొండమానుడట మీదయఁ బొందెను వేంకటేశ్వరా!                 33.

గౌరవ చించ చంపక నగమ్ములు వేంకట నాధ మాధవ
శ్రీరమ వాసయోగ్యముల రెంటిని దక్క నగాన్య ఛేదనం
గూరిమిఁ దొండమానుడిలఁ గోర రమేశుడు స్వప్నమందుఁ బ్రా
కారము నంత రమ్యముగఁ గట్టెను ధన్యత వేంకటేశ్వరా!                       34.

నేరుగ రాజ మందిర వినిర్గత భవ్య సుఛిద్ర మార్గముం
బారగఁ జేసి యద్రికి సభార్య సుతేతర బంధు సంఘముల్
వీరుడు తొండమానుడల వేంకట నాధ పదాబ్జ పూజలం
గౌరవమొప్పఁ జేయుచు సుఖమ్ములఁ దేలెను వేంకటేశ్వరా!                   35.

3 కామెంట్‌లు: