30, అక్టోబర్ 2016, ఆదివారం

వేంకటేశ్వర శతకము - 9



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౯)
ఆయత మాననీయ వృషభాచల మంచిత వేంకటాద్రి నా
రాయణ శైల రాజము విరాజిత శేష మహీ ధరమ్మును
న్నాయత మంజనాద్రి గరుడాద్రి వృషాగము లందు నిత్యముం
బాయక యుందు విమ్ముగను భక్త జనాశ్రయ వేంకటేశ్వరా!                   76.

సుమసమ కోమలాంగమున సుందర బాలుని లీల దాను దో
చ మసలు వేంకటాధిపతి సమ్మతి బాపడు వృద్ధుడంత స్నా
నము దగ సేయ యౌవనము నన్విల సిల్లగ నా తటాకమే
విమల కుమార ధార యన విశ్రుత మయ్యెను వేంకటేశ్వరా!                  77.

ఉరుతర మోద చిత్తమున నుత్తర పూర్వ దిశాధినేత శం
కరుడట వేంకటాచల వికాసిత దక్షిణ పూర్వ దిక్కునన్
గిరిధర సమ్మతమ్మునను గేశవ మిత్రుడు వాసముండగన్
వరముల కేమి తక్కువట భక్త జనాళికి వేంకటేశ్వరా!                            78.

వేంకట నాధ తుల్యుడు నభీప్సిత దాయక దైవ ముండునే
సంకట షండ భంజనుడు సచ్ఛరణాగత రక్షకుండు స
త్కింకర వత్సలుండు ఘన తీర్థ విలాసిత నాధు డుండునే
పంకజ ఫుల్ల నేత్ర! భవ వారిధి తారక! వేంకటేశ్వరా!                              79.

గుంభన భర్మ సానువులఁ గూడియు వైభవ వేంకటాద్రి సం
రంభ మొకింత లేక కడుఁ బ్రాకృత శైలపు రీతిఁ దోచు నీ
కుంభిని సర్వ మానవులకుం బరమాంచిత శైలమైననున్
స్తంభిత ఘోరదైత్యగణ! సన్నుత నిర్జర! వేంకటేశ్వరా!                             80.

ధనముల నిత్తు రెక్కువ మతాంతర భక్తులు వత్తు రిద్ధరన్
వనితలు బాలవృద్ధులును వారక వత్తురు దర్శనార్థమై
ఘనతర పుణ్యశైలము సుఖప్రద పాపవినాశకాద్రికిన్
మనమున నిన్ను నిల్పియు సమంచిత భక్తిని వేంకటేశ్వరా!                    81.

కీర్తినిఁ గోరి చేయ నది కించి దవాంఛిత కార్యమే సుమీ
కర్తకు దాన వస్తువుల గ్రాహకు లింపుగఁ గల్గ నేర్తురే
యార్తుల కాదరమ్ముగ సహాయత నిచ్చిన దైవకార్యమే 
ధూర్తుల కబ్బదట్టి కడుఁ దోరపు భాగ్యము వేంకటేశ్వరా!                        82.

ఇంచుక దాన మిచ్చిన నహీన దయార్ద్ర హృదంబుజమ్మునం
గొంచెము పూజ చేసిన నకుంఠిత భక్తి నిరంతరమ్ము నే
తెంచిన నంత మాత్రమున దివ్యపు వేంకట శైల రాజముం
బంచెద వెల్ల సంపదలు భక్తుల కిమ్ముగ వేంకటేశ్వరా!                           83.

కలిఁ బ్రతిమావతారమునఁ గాయజ సన్నిభ సుందరాంగుడై
యలరుచు మౌన మూని సక లావని వాసుల కిష్ట దైవమై
చెలగి విమాన రత్నమతి చిత్రము దివ్య మగోచరమ్మునై
వెలుగగఁ బ్రోతు వెల్లరను వేడిన యంతనె వేంకటేశ్వరా!                       84.

సురవర యక్ష కిన్నరులు చోద్యము మీరగ వేంకటాద్రినిన్
సురుచిర పుణ్య తీర్థముల శుద్ధ జలమ్ములఁ దోగి భక్తినిన్
సిరి విభు పాద పద్మ యుగ సేవ వసింప నదృశ్య రూపులై
నిరతము వేడు కొందు రట నిశ్చల చిత్తులు వేంకటేశ్వరా!                     85.

4 కామెంట్‌లు:

  1. శక్తి కొలదిని జేయంగ రక్తి తోడ
    పూజ నావేంక టేశుని మూల ప్రతిమ
    కు మరి స్వామియ యిచ్చును కువల యమున
    శాంతి ,సౌభాగ్యపు సిరులు ,సంతు వుయును

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ:

    స్తంభిత ఘోరదైత్యగణ! సన్నత నిర్జర! వేంకటేశ్వరా! 80.

    రిప్లయితొలగించండి