30, జూన్ 2011, గురువారం

సమస్యా పూరణం -378 (సిరులవలన నేఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సిరులవలన నేఁడు చేటు గలిగె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

29, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 90 (దోగ్ధ్రీధేనువు గర్భమందు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 34
సమస్య - "దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికం
దు ల్వుట్టె నుగ్రాకృతిన్"
శా.
దోగ్ధ్రీవాంతతపోదయా! గుణనిధీ! తేజస్వి! పాపాటవీ
దగ్ధ్రాక్ష్మానలుఁ డైన కశ్యపున కుద్యద్గర్వులై యాగభు
గ్జగ్ధ్రీశుల్ సుతు లుద్భవించిరి బిడౌజా! వింత వీక్షించితే
దోగ్ధ్రీధేనువు గర్భమందు పులికందు ల్వుట్టె నుగ్రాకృతిన్"
[పులి కందులు = పులి బిడ్డలు]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -377 (కుత్తుకలు గోయువానికి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కుత్తుకలు గోయువానికి కోటి నుతులు.

28, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 89 (దుగ్ధపయోధి మధ్యమున)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 33
సమస్య - "దుగ్ధపయోధి మధ్యమున
దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!"
ఉ.
స్నిగ్ధపువర్ణుఁ డీశ్వరుఁడు చిచ్చఱకంటను బంచబాణునిం
దగ్ధముచేసె నంచు విని తామరసేక్షణు మ్రోల నున్న యా
ముగ్ధపు లచ్చి మోదుకొనె; మోహనగంధము పిండిపిండియై
దుగ్ధపయోధి మధ్యమున దుమ్ములు రేఁగె నదేమి చిత్రమో!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -376 (మీసమ్ములు మొలిచె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మీసమ్ములు మొలిచెఁ గనుఁడు మీననయనకున్.

27, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 88 (గాడిద యేడిచెఁ గదన్న)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 32
సమస్య _
"గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!"
కం.
"ఆడిన మాటకుఁ దప్పెను
గాడిదకొడు" కంచుఁ దిట్టఁగా విని "యయ్యో
వీఁడా నా కొక కొడు" కని
గాడిద యేడిచెఁ గదన్న ఘనసంపన్నా!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -375 (శంకరునకు గలవు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శంకరునకు గలవు వంక లెన్నొ!
నిన్న నన్ను "వంకరయ్యా!" అని సంబోధించిన బాల్యమిత్రుడు `గుజరాతి లక్ష్మన్ సా' కు ధన్యవాదాలతో ....

26, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 87 (సుగ్రీవుని యెడమకాలు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 31
సమస్య -
"సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్"
కం.
అగ్రారపు నడివీథిని
నిగ్రహముగ బొమ్మలాట నేర్పుగ నాడన్
విగ్రహము లెత్త మఱచిన
సుగ్రీవుని యెడమకాలు శునకము గఱచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -374 (ఓనమాలు రాని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఓనమాలు రాని యొజ్జ మేలు!
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

25, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 86 (నిప్పున నొక చేరెఁడంత)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 30
సమస్య -
"నిప్పున నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్"
కం.
కుప్పించి వెలుగు దూఁకిన
గొప్ప ములిదె నాటె నిపుడు; కోమలి త్వరగా
నుప్పుఁ గొనిరమ్ము కాఁతము
నిప్పున; నొక చేరెఁడంత నెత్తురు గాఱెన్.
[వెలుగు = కంచె; ములిదె = ములు (ముల్లు) + ఇదె]
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

దత్తపది - 14 (అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు)

కవిమిత్రులారా,
"అప్పు, కొప్పు, చెప్పు, మెప్పు"
పై పదాలను ఆయా అర్థాలలో కాకుండా ఉపయోగించి
పెరిగిన వంటగ్యాసు ధరలపై
మీకు నచ్చిన ఛందస్సులో పద్యం వ్రాయండి.

24, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 85 (కమ్మలు మోఁకాళ్ళు దాఁకి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 29
సమస్య -
"కమ్మలు మోకాఁళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్"
కం.
కొమ్మను మదనుం డపుడు జ
వమ్మున నీలోత్పలముల వడి నేయంగా
సొమ్మసిలి మోము వంచినఁ
గమ్మలు మోఁకాళ్ళు దాఁకి ఘలుఘలు మనియెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -373 (ఐకమత్యమ్ము గలిగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఐకమత్యమ్ము గలిగించు నధికహాని.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

23, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 84 (రండాగమనంబు సేయ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 28
సమస్య -
"రండాగమనంబు సేయ రమ్యంబ యగున్"
కం.
కుండినపురమున రుక్మిణి
చండికకుం బూజసలుపు సమయంబున కా
యండజవాహనుఁ దోడ్కొని
రం; డాగమనంబు సేయ రమ్యంబ యగున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -372 (సన్యాసికి పిల్ల నొసఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సన్యాసికి పిల్ల నొసఁగ సంబరపడియెన్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

22, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 83 (మీనాక్షికిఁ గుచము లాఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 27
సమస్య -
"మీనాక్షికిఁ గుచము లాఱు మీనశరీరా!"
కం.
సూనశరుఁడు నారసమునఁ
బూనిక సుమకందుకములఁ బొసఁగించె ననం
గాను వెలసిల్లె నెంతయు
మీనాక్షికిఁ గుచము లాఱు మీనశరీరా!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -371 (అందవికారమె బ్రతుకున)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అందవికారమె బ్రతుకున నానంద మిడున్.
జాలపత్రిక "ఈమాట" సౌజన్యంతో ..

21, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 82 (ఎలుకలు తమ కలుగులోని)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 26
సమస్య -
"ఎలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్"
కం.
ఇలలో నిద్దఱు రాజులు
మలయుచుఁ జదరంగ మాడి మాపటివేళన్
బల మెత్తి కట్ట మఱచిన
నెలుకలు తమ కలుగులోని కేనుఁగు నీడ్చెన్
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -370 (వ్యాఘ్ర మాఁకొని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి.

20, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 81 (నిను నిను నిన్నునిన్ను)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 25
సమస్య - "నిను నిను నిన్నునిన్ను మఱి
నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్"
(అ) రామాయణార్థంలో ....
చం.
అనిలజ! జాంబవంత! కమలాప్త తనూభవ! వాయుపుత్ర! యో
పనస! సుషేణ! నీల! నల! భానుకులుం డగు రాఘవేంద్రుఁ డ
ద్దనుజపురంబు వే గెలువ దైత్యులఁ జంపఁగ వేగ రమ్మనెన్
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
(ఆ) భారతార్థంలో ...
చం.
అనఘ సురాపగాతనయ! యర్కతనూజ! విచిత్రవీర్యనం
దన! గురుపుత్ర! ద్రోణ! కృప! నాగపురీశ్వర! దుస్ససేన! ర
మ్మనుమనె రాజసూయము యమాత్మజు డిప్పుడు చేయఁబూని తా
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
() భాగవతార్థంలో ...
చం.
అనఘ సురేశ! వాయుసఖ! ఆర్యమనందన! రాక్షసేంద్ర! యో
వననిధినాథ! గంధవహ! వైశ్రవణా! నిటలాక్ష! తాను ర
మ్మనుమని చెప్పె మాధవుఁడు మారుని పెండ్లికి మిమ్ము నందఱిన్
నిను నిను నిన్నునిన్ను మఱి నిన్నును నిన్నును నిన్ను నిన్నునున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -369 (కప్పి చెప్పునదియె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కప్పి చెప్పునదియె కవిత యగును.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

19, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 80 (కప్పను జూడంగఁ బాము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 24
సమస్య -
"కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్"
కం.
కుప్పలకావలి కేఁగఁగఁ
జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్
జప్పుడుఁ జేయుచు జను వెం
కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -368 (బొంకినాఁడు హరిశ్చంద్ర)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
బొంకినాఁడు హరిశ్చంద్ర భూవరుండు.

18, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 79 (ఉత్తరమున భానుబింబము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 23
సమస్య -
"ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్"
కం.
అత్తుగఁ దూరుపుఁ బడమరఁ
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా!
చిత్తరువు వ్రాయఁ బోవలె
నుత్తరమున; భానుబింబ ముదయం బాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -367 (చింతామణి కంటె మంచి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చింతామణి కంటె మంచి చెలువలు గలరే!
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

17, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 78 (మరుఁడు మురిపించె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 22
సమస్య -
"మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె"
తే.గీ.
భరతకులవీరుఁ డైనట్టి పాండురాజు
మాద్రిపై దృష్టిఁ బఱపిన మగువ యంత
వలదు వలదని వారింప వాంఛఁ గదియ
మరుఁడు మురిపించె యముఁడు కింకరులఁ జూపె.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -366 (యోగము ప్రాణాంతకమని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
యోగము ప్రాణాంతకమని యోగి వచించెన్.

16, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 77 (వక్త్రంబు ల్పది కన్ను లైదు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 21
సమస్య - "వక్త్రంబు ల్పది కన్ను లైదు కరముల్
వర్ణింపగా వేయగున్"
శా.
ఈ క్త్రాప్రాసము కష్ట మౌ ననుచు మీ రింతేసివా రాడఁగా
వాక్త్రాసం బది సత్కవీశ్వరుల త్రోవ ల్గామి నేఁ జెప్పెదన్
దిక్త్రారాతికిఁ బార్వతీశ్వరులకున్ దిగ్మప్రభారాశికిన్
వక్త్రంబు ల్పది కన్ను లైదు కరముల్ వర్ణింపగా వేయగున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -365 (కంచి గరుడ సేవ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కంచి గరుడ సేవ మంచి దగును.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

15, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 76 (వర్షాకాలము వచ్చె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 20
సమస్య - "వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్
వైశాఖమాసంబునన్"
శా.
హర్షం బెట్లగు? కృష్ణదేవుఁ డిటకై యబ్జాక్షి! రాఁడాయె సా
మర్షాహంకృతిఁ జంద్రుఁ డేచుతఱి భీమద్వేషసామోగ్రదు
ర్ధర్షక్రూరనిశాతఘాతనవచూతవ్రాతబాణావళీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -364 (తన ప్రాణముఁ గొను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
తన ప్రాణముఁ గొను సుతునకు స్తన్యం బిచ్చెన్.
జాలపత్రిక "ఈమాట" వారికి ధన్యవాదాలు.

14, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 75 (ఇంకం గస్తురిబొట్టుఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 19
సమస్య - "ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము త
న్వీ! ఫాలభాగంబునన్"
శా.
పంకేజానన! నేఁటిరేయి వినుమీ పంతంబుతో రాహువే
శంకాతంకము లేక షోడశకళాసంపూర్ణు నేణాంకునిం
బొంకం బార్చెద నంచుఁ బల్కెను దగం బొంచుండి నే వింటి నీ
వింకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ!ఫాలభాగంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -363 (కన్నవారలు క్రూరులు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కన్నవారలు క్రూరులు కఠినులు గద!
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

13, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 74 (నూఱు న్ముప్పదియాఱు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 18
సమస్య - "నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె
న్రుద్రాణివక్షంబునన్"
శా.
రా రమ్మంచుఁ గుమారు నంకముపయిన్ రంజిల్లఁగా నుంచి వి
స్తారోద్యద్ఘనవక్త్రపంచకముతో శంభుండుఁ దత్కాంతయున్
ఆరూఢిన్ నవపంచరత్నపతకం బాలోకనన్ జేయఁగా
నూఱు న్ముప్పదియాఱు కన్ను లమరె న్రుద్రాణివక్షంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -362 (చోరుని గని సంతసించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

12, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 73 (బడబానలపంక్తి మీఁదఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 17
సమస్య -
"బడబానలపంక్తి మీఁదఁ బచ్చిక మొలిచెన్"
కం.
పడతిరొ! నవమేఘంబులు
వడివడి జడిముసురు పట్టి వలయపువానల్
కడుఁ గొట్టి కురియ గోడలు
బడ, బానల పంక్తిమీఁదఁ బచ్చిక మొలిచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -361 (చెమటలు గారినవి మేన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

11, జూన్ 2011, శనివారం

సమస్యా పూరణం -360 (శాంతి విడిచి కనుఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
శాంతి విడిచి కనుఁడు సౌఖ్యములను.

చమత్కార పద్యాలు - 72 (కామిని కుచమధ్యమందు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 16
సమస్య -
"కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్"
కం.
చేమంతి చెట్టు పొంతను
భామామణి నిదురవోవఁ బయ్యెట జాఱన్
రోమావళి పామో యని
కామిని కుచమధ్యమందు గరుడుం డాడెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

10, జూన్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -359 (భారతీయత మన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
భారతీయత మనకిదే భారమయ్యె.
ఈ సమస్యను పంపిన వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 71 (పాతరలో సూర్యుఁడు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 15
సమస్య -
"పాతరలో సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్"
కం.
ఈతఱిఁ గాపులఁ బిలువుఁడి
రాతిరి ప్రొద్దెల్ల జాత రాయెను ధాన్యం
బాతురముగఁ బోయింతము
పాతరలో; సూర్యుఁ డుదయపర్వత మెక్కెన్.

(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

9, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 70 (కుటిలాలక యెడమకన్ను)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 14
సమస్య -
"కుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్"
కం.
నిటలమున నీవు దాల్చిన
పటుతర కస్తూరిరేఖ బహుగతి రతిచే
నటునిటు జాఱిన చెమటకుఁ
గుటిలాలక యెడమకన్ను కుడిక న్నాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -358 (వల్లకాడులో)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వల్లకాడులో వివాహ మయ్యె.

8, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 69 (భామాకుచమండలంబు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 13
సమస్య -
"భామాకుచమండలంబు భస్మం బాయెన్"
కం.
కామాతురుఁడై జంగము
ప్రేమంబున బూతిఁ బూసి ప్రియ మలరంగాఁ
గామినిఁ గౌఁగిఁటఁ జేర్చిన
భామాకుచమండలంబు భస్మం బాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -357 (చీమ కుట్టగఁ జచ్చెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చీమ కుట్టగఁ జచ్చెను సింహ బలుడు.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

7, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 68 (తోఁచు నడంగు వెండియును)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 12
సమస్య - "తోఁచు నడంగు వెండియును
దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్"
i) రామాయణార్థం వచ్చే విధంగా ...
ఉ.
తోఁచక పట్టి తెమ్మనుచుఁ దొయ్యలి వేఁడిన వెంటనంటి చే
సాచుచు మెల్ల మెల్లఁగను జాడల జాడల నాశ లాశలన్
నాచుకవచ్చు రామరఘునాయకు ముందర మాయలేడి తాఁ
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
ii) రామాయణార్థంతోనే మరోవిధంగా ....
ఉ.
పీఁచమడంచి రాఘవకపిప్రవరాదులు వాల్మగంటిమి
న్నేఁచఁగ మిన్ను మన్ను దిశ లెచ్చటి వచ్చటఁ గాలఁగా రవిం
గ్రాచు శరాగ్ని కీలల జగంబులు ఘూర్ణిల నింద్రజిత్తు తాఁ
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
iii) భాగవతార్థం వచ్చే విధంగా ....
ఉ.
పూచినమాటపట్లఁ దలపోయఁగ లేక మనోభవుండు ప్రే
రేచ గణాలు నాలుఁ దమ రెప్పల నార్పక చూడఁగా మనం
బాచఁగలేని యట్టి త్రిపురారిపురస్స్థలి శౌరి నారియై
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -356 (గొడ్డు టావు పాలు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
గొడ్డు టావు పాలు కుండ నిండె.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

6, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 67 (రారా తమ్ముఁడ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 11
సమస్య - "రారా తమ్ముఁడ రార యన్న యనె నా
రాజాస్య ప్రాణేశ్వరున్"
శా.
గారాబల్లుఁడు నర్జునుండు శ్వశురాగారంబునం దుండఁగా
నీరేజాస్య సుభద్ర వచ్చి యతనిన్ వీక్షించి పెన్ సిగ్గునన్
బాఱం జొచ్చిన సత్య పట్టుకొని యింపారంగ నయ్యర్జునున్
"రారా తమ్ముఁడ! రార యన్న" యనె నా రాజాస్య ప్రాణేశ్వరున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -355 (కల్ల లాడువారె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కల్ల లాడువారె కవులు గాదె.

5, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 66 (కప్పకు సంపంగినూనె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 10
సమస్య -
"కప్పకు సంపంగినూనె కావలె వింటే"
కం.
ఇప్పుర మేలెడు పార్థివుఁ
డిప్పుడు నీతావు కనిచె నిదిగో యార్యా!
తెప్పున నంగడి తలుపుల
కప్పకు; సంపంగినూనె కావలె వింటే.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -354 (జగను కాప్తమిత్రుఁడు గదా)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
జగను కాప్తమిత్రుఁడు గదా చంద్రబాబు.

4, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 65 (అక్కా రమ్మనుచు మగఁడు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 9
సమస్య -
"అక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్"
కం.
రక్కసివలె నే ప్రొద్దును
మెక్కుచుఁ దిరిగెదవి కాలిమెట్టున నిన్నున్
గుక్కక మానను 'దసి నీ
యక్కా!' రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -353 (కపిని కళ్యాణ మాడెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు.
ఈ సమస్యను పంపిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

3, జూన్ 2011, శుక్రవారం

చమత్కార పద్యాలు - 64 (మార్తాండుం డపరాద్రి)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 8
సమస్య - "మార్తాండుం డపరాద్రిఁ గ్రుంకె నదిగో
మధ్యాహ్నకాలంబునన్"
శా.
కీర్తింపం దగు రామసాయక మహాగ్నిజ్వాల శుంభన్నిశా
వర్తిన్ రావణుఁ గాంచి నారదుఁడు దేవాధ్యక్షుతోఁ బల్కె న
ట్లార్తిన్ జెంద మిమున్ జయించుఁ గద ము న్నత్యుగ్రుఁడై దైత్యరా
ణ్మార్తాండుం; డపరాద్రిఁ గ్రుంకె నదిగో మధ్యాహ్నకాలంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -352 (కర్ణు ననిలోనఁ జంపె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కర్ణు ననిలోనఁ జంపె రాఘవుఁడు చెలఁగి.

2, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 63 (ఇనశశిబింబయుగ్మము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 7
సమస్య - "ఇనశశిబింబయుగ్మ ముద
యించె దినాంతమునందుఁ దద్దిశన్"
చం.
ఇనసమతేజ! మీరు సెలవిచ్చిన పీఠము హేమరత్నసం
జననము మేరు ప్రస్తరము చక్కఁగఁ దీర్చితిఁ బక్షమయ్యె నే
ర్పున సురకోటులన్ దిశలఁ బొల్పగ వ్రాయుచు రాఁగ నేఁటి కా
యిన శశి బింబయుగ్మ ముదయించె దినాంతమునందుఁ దద్దిశన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -351 (మగువను బెండ్లాడె మగువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
మగువను బెండ్లాడె మగువ మరు లుదయించన్
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

1, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 62 (గుత్తఁపు తాపుతారవిక)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 6
సమస్య - "గుత్తఁపు తాపుతారవిక
కుట్టు పటుక్కున వీడె నింతికిన్"
ఉ.
అత్తఱిఁ జిత్తజుండు విరహాంగనలన్ గనలింప నిక్షువి
ల్లెత్తి ధనుర్గుణంబు మొఱయించి నిశాతవినూతనప్రసూ
నోత్తమబాణపంక్తిఁ గుడియుగ్మ మదాటునఁ దాక నేసినన్
గుఁత్తపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్.

వెంకటగిరిరాజు ఆ సమస్యనే మరో రకంగా పూరించమంటే కవి పూరణ ...
ఉ.
ఇత్తఱి రమ్ము రమ్మనుచు నింపుగ గొల్లలు తన్నుఁ బిల్వఁగా
దత్తరపాటునన్ గదిసి తాండవకృష్ణుఁడు సుందరాంగిఁ దా
మెత్తని పూలపాన్పునను మెచ్చి కవుంగిటఁ జేర్చినంతనే
గుత్తఁపు తాపుతారవిక కుట్టు పటుక్కున వీడె నింతికిన్
.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

సమస్యా పూరణం -350 (పాండురాజుకు పుత్త్రులు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
పాండురాజుకు పుత్త్రులు వందమంది.