5, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 66 (కప్పకు సంపంగినూనె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 10
సమస్య -
"కప్పకు సంపంగినూనె కావలె వింటే"
కం.
ఇప్పుర మేలెడు పార్థివుఁ
డిప్పుడు నీతావు కనిచె నిదిగో యార్యా!
తెప్పున నంగడి తలుపుల
కప్పకు; సంపంగినూనె కావలె వింటే.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

23 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    _____________________________________

    చప్పున తాళము తీయగ
    కప్పకు కావలెను చమురు - కదులుట కొఱకై !
    ఒప్పుగ తీయగ తాళపు
    కప్పకు సంపంగినూనె - కావలె వింటే !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  2. తప్పదు వానల కొఱకై
    కప్పకు సేయంగ పెండ్లి ఘనముగ! తలపై
    నిప్పుడు బెట్టగ వధువగు
    "కప్పకు సంపంగినూనె కావలె వింటే"

    రిప్లయితొలగించండి
  3. అప్పిచ్చిన వారలతో
    తిప్పలు పడలేడు కాని, స్థితిమంతునిగన్
    గొప్పగ మీసాలకు వెం-
    కప్పకు సంపంగినూనె కావలె వింటే!

    రిప్లయితొలగించండి
  4. అప్పుల తిప్పలు పడు వెం
    కప్పకు; మీసాల కున్ను, ఘనమగు యింటన్
    తుప్పులు పట్టిన తాళపు
    కప్పకు, సంపంగినూనె కావలె వింటే!

    రిప్లయితొలగించండి
  5. కిశోర్ జీ !మిస్సన్న గారూ ! మంచి పూరణలు.
    అభినందనలు.నేను కుడా వెంకప్పను, తాళం కప్పనే పట్టుకున్నానండి.

    రిప్లయితొలగించండి
  6. ( తల్లి కొడుకుతో అంటుంది : )

    "అప్పారావా ! చూడర !
    కొప్పులు యెండినవి మావి గూడులు కట్టెన్ !
    ఇప్పుడె తెమ్ముర కొని ! నా
    కప్పకు సంపంగి నూనె కావలె వింటే !"

    నాకు + అప్పకు = నాకప్పకు = నాకు, మీ యక్కకు

    రిప్లయితొలగించండి
  7. అప్పకు సాండల్ పౌడరు
    చెప్పుకు పాలిష్ నలుపుది, చెర్రీ బ్లాసం !
    కప్పుకు సాసరు; మరి లిం
    గప్పకు సంపంగి నూనె కావలె వింటే !

    రిప్లయితొలగించండి
  8. అప్పుల తిప్పలు తప్పవు
    నెప్పుడు, మింగను మెతుకులు నింకను లేవే!
    గొప్పగ మీసము కిక,రా
    గప్పకు, సంపంగి నూనె కావలె వింటే !

    ఈ భావం మిత్రులు చేసేశారే!ఇంకేమీ తోచట్లేదే!

    రిప్లయితొలగించండి
  9. తే :జగను కాప్త మిత్రుడు గదా చంద్రబాబు
    యన్న కాదు కాదు యనెను యాప్తులేల్ల
    ఔను వారిద్దరోతాను ముక్క లేను
    యనుచు సామాన్య జనులు నె నేమిజెప్ప

    రిప్లయితొలగించండి
  10. వసంత కిశోర్ గారూ,
    తాళంకప్పలోని లివర్ల చిలుము వదిలించడానికి మీకు సంపెంగనూనె కావలసి వచ్చిందా? బాగు ... బాగు ...! బాగుంది మీ పూరణ. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి.
    దుర్దురాంగనకు సంపెంగ నూనెను పెట్టించిన మొదటి పూరణ చాలా బాగుంది.
    "మ్రింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ" అన్న రెండవ పూరణ ఉత్తమం. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీరు వెంకప్పకు, తాళంకప్పకూ నూనె పట్టించిన పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నాగరాజు రవీందర్ గారూ,
    మీరు "అప్ప"ను, "లింగప్ప"ను పట్టుకున్న విధం వైవిధ్యంగా ఉండి మీ రెండు పూరణలూ అలరించించాయి. అభినందనలు.

    మందాకిని గారూ,
    రోజూ నేను ఎదుర్కోనే ఇబ్బంది ఈరోజు మీ కెదురయింది. ఫరవాలేదు. భావం ఒకటైనా కథనంలో వైవిధ్యం ఎలాగూ ఉంటుంది. మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    దారి తప్పారేమిటీ? వ్యాఖ్యను పోస్ట్ చేయడంలో పొరబడ్డరా? సరేలెండి. మీ పూరణను సరైన చోట వ్యాఖానిస్తాను.

    రిప్లయితొలగించండి
  12. కప్పురము, లడ్డువములు,
    అప్పటముగనాదిదేవు నాత్మజు కొఱకై
    గుప్పెడు దీపమునకు, బెణ
    కప్పకు సంపంగినూనె కావలె వింటే

    రిప్లయితొలగించండి
  13. శంకరార్యా ! ధన్యవాదములు !
    శాస్త్రిగారూ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  14. రవి గారూ,
    "బెణకప్ప" ... మంచి ప్రయోగం. పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శంకరార్యా !
    బెణకప్ప అంటే అర్థం ఏమిటో ?

    రిప్లయితొలగించండి
  16. వసంత కిశోర్ గారూ,
    రాయలసీమలోని ఒక జిల్లాలో (ఏ జిల్లానో గుర్తు లేదు) వినాయకుడిని "బెణకప్ప" అని పిలుస్తారు. నాకు ఇంతే తెలుసు. ఇంకా వివరాలు రవి గారు ఇస్తారేమో చూడాలి.

    రిప్లయితొలగించండి
  17. బెణకప్ప అనేది కన్నడ వ్యావహారిక పదం అండి. అర్థం సరిగ్గా తెలీదండి. (అదృష్టం కలిగించేవాడు అని ఏదో ఉండాలి) అనంతపురం జిల్లాలో కొన్ని చోట్ల వినాయకుడిని బెణకప్ప అంటారు. అలాగే నరసింహస్వామికి "బేటరాయస్వామి" (వేటరాయడు - సింహం) అని పేరు.

    రిప్లయితొలగించండి
  18. వెంకప్ప లాగే బెణకప్ప -ఒక పేరనుకున్నా !
    వినాయకుడని తెలిసిందిప్పుడు !

    శంకరార్యా ! ధన్యవాదములు !
    రవీజీ ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  19. తప్పవు మనకిక త్రిప్పలు!
    గొప్పగ మీసమును త్రిప్పు గోపాలుండౌ
    మెప్పగు బావకు పూయుట
    కప్పకు సంపంగినూనె కావలె వింటే!

    అప్ప = అక్క

    రిప్లయితొలగించండి