14, జూన్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -363 (కన్నవారలు క్రూరులు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కన్నవారలు క్రూరులు కఠినులు గద!
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

21 కామెంట్‌లు:

 1. ఉగ్ర వాదము నేర్పించి ఉగ్గు పాల,
  వసుధ యువకుల మానవ బాంబులుగను
  మార్చు వారలు రాక్షస మరి పిశాచి
  కన్న;వారలు క్రూరులు కఠినులు గద!

  రిప్లయితొలగించండి
 2. ఒక బాలుని స్వగతం-

  పాఠశాలకు శలవులు పరిసమాప్తి
  బయలుదేరమనియెదరు బడికి నింక
  పెద్దవారలు దయలేని పేదవారు!
  కన్నవారలు క్రూరులు కఠినులు గద!

  రిప్లయితొలగించండి
 3. కన్న సుతు నీటి పాల్జేసె కరుణ మాలి
  యొక్క జనయిత్రి! పుత్రుని పలు విధాల
  హింసలను బెట్టె నొక తండ్రి హేయ ముగను!
  కన్నవారలు క్రూరులు కఠినులు గద!

  రిప్లయితొలగించండి
 4. అసుర కులమున హరిభక్తు డాయె నొకడు!
  రామ తత్త్వమ్ము గ్రహియించి రావణునకు
  తెలుప నెంచె మరొక్కడు! పలుక వీరి
  కన్నవారలు క్రూరులు కఠినులు గద!

  రిప్లయితొలగించండి
 5. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మీ రెండవ పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 6. శ్రీగురుభ్యోనమ:

  మంచి మాటలు పలుకుచు వంచనలను
  చేయుచుందురు కొందరు ఛీఛి యనగ (చేవ చచ్చి)
  కపటమెరుగని భీకర కఠిన వ్యక్తి
  కన్న, వారలు కౄరులు కఠినులుగద - శ్రీపతి శాస్త్రి

  రిప్లయితొలగించండి
 7. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, జూన్ 14, 2011 3:59:00 PM

  కుంతి దేవి శ్రీకృష్ణుడితో...........

  మాయ జూదమ్ము తోటి ఏమార్చినారు,
  దీక్ష భగ్నమ్ము చేయయత్నించినారు,
  వేడుకొందుము మమ్ము కాపాడుమయ్య,
  కన్న! వారలు కౄరులు కఠినులుగద.

  దీక్ష = వనవాస దీక్ష
  వారలు = దుర్యొధనాదులు

  రిప్లయితొలగించండి
 8. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘వారలు రాక్షసుల్’ అందాం. బాగుంటుంది. మిస్సన్న గారేమో మీ రెండవ పూరణ బాగుందన్నారు. నాకైతే ఒకటే కనిపిస్తున్నది.

  మందాకిని గారూ,
  బడికి వెళ్ళమనే పెద్దలు కఠినులనే భావిస్తారు పిల్లలు. బాగుంది. అభినందనలు.
  "దయలేని పేదవారు"ను "దయలోన పేదవారు" అంటే ఎలా ఉంటుంది?

  రిప్లయితొలగించండి
 9. మిస్సన్న గారూ,
  మొదటి పూరణలో గంగ, హిరణ్యకశ్యపుల గురించి మంచి పూరణ ఇచ్చారు. అభినందనలు.
  అయితే లోకంలో బిడ్డల్ని కన్నవారందరికీ ఆ విశేషణాలు అన్వయించలేము కదా! "హేయ మట్టి/కన్నవారలు" అంటే ఎలా ఉంటుంది?
  మీ రెండవ పూరణ అన్ని విధాల ఉత్తమంగా ఉంది. అన్నట్టు ... విభీషణుడి తండ్రి కఠినుడు కాదు కదా!

  రిప్లయితొలగించండి
 10. శ్రీపతి శాస్త్రి గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  "భీకర కఠిన వ్యక్తి" అన్నప్పుడు ‘న’ గురు వవుతుంది. ’కపట మెఱుగని కఠిన వాక్యముల వ్యక్తి" అంటే సరి.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  కన్నయ్యను సంబోధిస్తూ చేసిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. సంపత్ కుమార్ శాస్త్రిమంగళవారం, జూన్ 14, 2011 5:10:00 PM

  శంకరార్యా,
  ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 12. మీ వ్యాఖ్యానం ఉత్తమం. పరమోత్తమం. మేము ధన్యులం.
  నిజంగా దయలోన ప్రయోగం సరిగ్గా ఒప్పుతుంది ఈ సందర్భంలో.

  రిప్లయితొలగించండి
 13. శంకరార్యా ! ధన్యవాదములు.
  మిస్సన్న గారూ! రెండవ పూరణ మందాకిని గారిది, కనుక మీ అభినందనలు వారికి చెందుగాక. ధన్యవాదములు. మీ రెండు పూరణలు అలరించాయి.
  మందాకిని,శ్రీపతి,సంపత్ గార్ల పూరణలు బాగున్నవి. అందరకూ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. Sankara guruvarya chaala dhanyavadamulu.mee savarananu savinayamuga sweekaristunnanu. Goli Hanumatchastrigariki dhanyavadamulu.
  Sreepathisastry.

  రిప్లయితొలగించండి
 15. గురువుగారూ ధన్యవాదాలు.
  ప్రొద్దుటే ఏమైందో గానీ ఈరోజు రెండవ పూరణ హనుమచ్చాస్త్రి గారిదిలా కనుపించింది నాకు.
  ఆ పూరణ మందాకిని గారిది అని మీ వ్యాఖ్య చూసి నవ్వుకుంటూ తెలుసుకున్నాను.
  హనుమచ్చాస్త్రి గారు అన్నట్లు నా అభినందనలు మందాకిని గార్కి చెందుతాయి.
  మీ సవరణ తర్వాత వారి పూరణ మరింత బాగుంది.
  ఇక నా పూరణలు:
  మొదటి పూరణ కుంతీ దేవి, హిరణ్య కశిపులను దృష్టిలో ఉంచుకొని చేశాను. మీరన్నట్లు గంగకు కూడా వర్తింపజేయ వచ్చును.
  మీ సవరణను సంతోషంగా స్వీకరిస్తున్నాను.
  రెండవ పూరణ ప్రహ్లాద మారీచులను దృష్టిలో నుంచుకొని చేశాను.
  మరొక్కసారి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. శాస్త్రిగారూ, మీతోపాటు మిస్సన్నగారి అభినందనలూ నాకు అందజేసినందుకు రెట్టింపు ధన్యవాదాలు.
  మీ అందరి పూరణల ముందు నా పూరణలు వెలవెలబోతూనే ఉంటాయి కదా!

  హమ్మయ్య, ఇందరు చర్చించాక చివరికైనా నాకు అభినందనలు చెందాయి. ధన్యురాలను.:)
  నా ఉద్దేశ్యంలో గంగాదేవి వసువుల కోరిక ప్రకారమే శిశువులను నీళ్ళల్లో వదిలింది కాబట్టి ఈ నిందలు ఆవిడను చేరవు. లోకనిందకు భయపడటం వల్ల వదిలిన కుంతీమాతయే (ఈ సందర్భంలో) నిందార్హురాలు.

  రిప్లయితొలగించండి
 17. మందాకిని గారూ! ఆ అభినందనలు నిక్కచ్చిగా నూటికి నూరు పాళ్ళూ మీకే చెందుతాయి.
  సందర్భానుసారంగా బహుచక్కని అంశాన్ని ఉపయోగించారు. నిజంగా బళ్ళో దింపి వెళ్ళే అమ్మా నాన్నలను
  చూసే పిల్లలకు ఆ చిన్ని మనస్సులో అలాగే అనిపిoచ వచ్చును.
  ఇక ఒకప్పుడు వెలవెల పోయిన పూరణలే అందరివీనూ.
  నేటి వెలవెలలే రేపటి వెలుగుల పుంతలు.
  అయినా మీవి ' వెలవెల ' రకానికి చెందిన పద్యాలు కాదు. వెలుగుల రకాలే.

  రిప్లయితొలగించండి
 18. మందాకినీ గారూ గంగ విషయంలో మీ అభిప్రాయమే నా అభిప్రాయమూనూ.

  రిప్లయితొలగించండి
 19. మిస్సన్న గారూ,
  ఈ రోజు నా కేమయింది? కుంతి, మారీచులు నా దృష్టికి రాలేదు. మన్నించండి.

  రిప్లయితొలగించండి
 20. పెద్ద వారలు తెలియరు పిన్న మనసు
  ప్రేమ వైవాహిక ములయందు ప్రీతి మీర
  విన్న వించిన పెడచెవిని పెట్టు వారు
  కన్న వారలు క్రూరులు కఠినులు గద !

  రిప్లయితొలగించండి
 21. రాజేశ్వరి నేదునూరి గారూ,
  పిల్లల ప్రేమను అంగీకరించని కఠినులైన పెద్దల గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
  2,4 పాదాలలో గణదోషం. ‘వైవాహికముల యందు’కు బదులు ‘వైవాహికములందు’అనీ, ‘పెడచెవిని పెట్టు’కు బదులు ‘పెడచెవిఁ బెట్టు’ అనీ అంటే సరి!

  రిప్లయితొలగించండి