24, జూన్ 2011, శుక్రవారం

సమస్యా పూరణం -373 (ఐకమత్యమ్ము గలిగించు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
ఐకమత్యమ్ము గలిగించు నధికహాని.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. ఉగ్ర వాదుల కనిపెట్టి ఊడ్చ వలయు;
    ఉగ్రవాదపు సంస్థలే యొకరి కొకరు
    సాయమందించు కొన్నచో చాలు,వారి
    ఐకమత్యమ్ము గలిగించు నధికహాని.

    రిప్లయితొలగించండి
  2. ఐకమత్యమ్ము గలిగించు నధికహాని,
    స్వంత లాభము మేలని స్వార్థ బుద్ధి
    కలిగి యుండెడి రాజ్యము కాదు కాదు!
    ఉగ్గు పాలనుఁ నేర్తుము ఒక్కగుణము,
    ఐకమత్యమె కావలె ననుచుఁ మనకు.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    __________________________________

    ఐకమత్యమ్ము చూడగా - నడవి లోన
    శూర,శార్దూలముల లోన - చూడవచ్చు !
    కూడి చంపును మెకముల - క్రూరముగను !
    ఐకమత్యమ్ము గలిగించు - నధికహాని !
    __________________________________
    శూరము = సింహము
    మెకము = జంతువు

    రిప్లయితొలగించండి
  4. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 24, 2011 9:33:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    ప్రాంత భావాలు మదిలోన పాతుకొనగ
    కలసియుండుట కగుపించె కష్టముగను
    ఐకమత్యమ్ము కలిగించు నధికహాని
    అనుచు చెప్పగ వింటిని ఆంధ్ర యందు

    రిప్లయితొలగించండి
  5. ఐక్య మౌదురు నవినీతి నట్టె బెట్ట
    ఐక మత్యమ్ము గనిపించు నణగ ద్రోక్క ,
    దోచు కొనుటలో కలిసుండు దొరల కున్న
    ఐక మత్యమ్ము, గలిగించు నధిక హాని!!!

    రిప్లయితొలగించండి
  6. guruvu gaarki namaskaramulatO

    తే : చోర వ్యాపార నేతలు చేరి సకల
    జనుల మాన ప్రాణములను జలధి యందు
    గలుప పల్కు నెల్లరు , వారి కలిమి గొరకు
    ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !

    రిప్లయితొలగించండి
  7. నేత లందరు కలిసిరి నేర్పు తోడ
    అన్న హజరేను తొక్కెడి అవసరాన
    బిల్లు యాపక పోయిన చెల్లు పదవి
    ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !

    రిప్లయితొలగించండి
  8. సంపత్ కుమార్ శాస్త్రి.శుక్రవారం, జూన్ 24, 2011 5:12:00 PM

    శ్రీకృష్ణుడు, కర్నుడితో అంటున్నాడు...........

    ప్రాజ్ఞుడవు నీవు పాండవ వంశజుడవు,
    చేరి కోరెద మా పంచ చేరుమయ్య,
    దుష్టులైనట్టి పాండవ ద్రోహులందు,
    ఐకమత్యమ్ము కలిగించు నధికహాని

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఉగ్రవాదుల ఐకమత్యం సమాజానికి హానికరమన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ ఆదర్శాన్ని చక్కగా చెప్పారు. అభినందనలు.
    మూడవపాదం ‘ఉగ్గుపాలతో నేర్చితి మొక్క గుణము’ అంటే ఎలా ఉంటుందంటారు?

    వసంత కిశోర్ గారూ,
    క్రూరమృగాల ఐకమత్యం ఇతర జంతువులకు కీడు కలిగించే విషయంతో మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మందాకిని గారూ,
    మన్నించండి ... అది నాల్గవపాదం.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతి శాస్త్రి గారూ,
    ప్రస్తుత పరిస్థితిని కళ్ళకు కట్టించారు. చక్కని పూరణ. అభినందనలు.
    ‘ప్రాంతభావాలు - ప్రాంతభేదముల్’ అని, ‘ఉండుట కగుపించె - ఉండుట తోచెను’ అనీ ఉంటే బాగుంటుందని నా సూచన.

    రిప్లయితొలగించండి
  12. మంద పీతాంబర్ గారూ,
    దోచుకొనే దొరల ఐకమత్యం హాని కలిగించే విధానాన్ని చక్కగా వివరించారు. మంచి పూరణ. అభినందనలు.
    ‘కలిసుండు’ అనేది ‘కలిసెడి’ అయితే ..?

    వరప్రసాద్ గారూ,
    మంచి భావంతో చేసిన మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని .. కొన్ని లోపాలు. ‘చోర వ్యాపా ..’అన్నప్పుడు ‘ర’, అలాగే ‘మాన ప్రాణ’ అన్నప్పుడు ‘న’ గురువులు అవుతాయి. నా సవరణలతో మీ పద్యం ...
    చోర (వృత్తుల) నేతలు చేరి సకల
    జనుల ప్రాణములను (కష్ట)జలధి యందు
    గలుప ప(ల్క)నెల్లరు , వారి కలిమి పెంచు
    ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !

    రిప్లయితొలగించండి
  13. టేకుమళ్ల వెంకటప్పయ్య గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘బిల్లు యాపక’ అనేది ‘బిల్లు నాపక’ అంటే బాగుంటుంది.

    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘చేరి కోరెద’ చేరఁ గోరెద అంటే సరి!

    రిప్లయితొలగించండి
  14. గురువుగారూ, ధన్యవాదాలు.
    నేను అలా అందామనే అనుకున్నాను. కానీ ఎందుకో ఇదివరకు అలా చేసినపుడు సవరణలు చేయాల్సి వచ్చింది. కారణం తెలీలేదు. అందుకే అలా...

    రిప్లయితొలగించండి
  15. ఐకమత్యమ్ము రాజకీయాన కలదు
    ఐకమత్యమ్ము దుర్మార్గు లందు కలదు
    ఐకమత్యమ్ము పౌరుల లేక, పైన-
    నైకమత్యమ్ము గలిగించు నధికహాని

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జూన్ 24, 2011 10:59:00 PM

    గురువుగారికి వందనములు.మీరు ఎంతో ఓర్పుగా అందరి పూరణలు చదివి మీ వ్యక్తిగత సమస్యలను సైతము ప్రక్కనపెట్టి ప్రతిఒక్కరి పూరణనూ వి(స)వరించి ప్రోత్సహిస్తున్నారు.చాలా చాలా ధన్యవాదములు. మీ దయవలన మహామహులైన కవిమిత్రులను తెలసికొనుచూ నా అభిప్రయాలను తెలుపగల అవకాశం కల్పించినారు. కవిమిత్రులందరికి వందనములు తెలియజేస్తు మీ అమూల్యమైన సలహాలతో ముందుకు సాగాలని కోరుచున్నను. లోకాస్సమస్తా సుఖినోభవంతు.

    రిప్లయితొలగించండి
  17. మూర్ఖులిర్వురియెడక్షణమొక్కటైన
    ముదితలొకచోటగూడగ మువ్వురైన
    మాట వరుస కైనన్ చీని మరియు పాక్ ల
    ఐకమత్యమ్ము గలిగించు నధిక హాని !

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  19. మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    ఊకదంపుడు గారూ,
    బహుకాల దర్శనం!
    ఎవరెవరి ఐకమత్యం హానికరమో చక్కగా చెప్పారు. మంచి పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి