16, జూన్ 2011, గురువారం

చమత్కార పద్యాలు - 77 (వక్త్రంబు ల్పది కన్ను లైదు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 21
సమస్య - "వక్త్రంబు ల్పది కన్ను లైదు కరముల్
వర్ణింపగా వేయగున్"
శా.
ఈ క్త్రాప్రాసము కష్ట మౌ ననుచు మీ రింతేసివా రాడఁగా
వాక్త్రాసం బది సత్కవీశ్వరుల త్రోవ ల్గామి నేఁ జెప్పెదన్
దిక్త్రారాతికిఁ బార్వతీశ్వరులకున్ దిగ్మప్రభారాశికిన్
వక్త్రంబు ల్పది కన్ను లైదు కరముల్ వర్ణింపగా వేయగున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

14 కామెంట్‌లు:

 1. దుష్కర ప్రాస అయినా నేనూ మోచర్ల వారి బాటలో చిన్న అడుగు వేయడానికి ప్రయత్నించాను.మోచర్ల వారికి క్షమార్పణలు మరియు కృతజ్ఞతలతో...

  వాక్త్రోచెన్ మది భారతీ కృప సుమా ! వాక్రుచ్చు లంకాధిపున్
  వక్త్రంబుల్ ; మరి యెన్ననీశ్వరునకున్ ఫాలంబునన్ నేత్రముల్
  వక్తన్బుల్ గన నైదు యున్న; చెపుమా ! పై సూర్యుశ్రీ హస్తముల్ ;
  వక్త్రంబు ల్పది ; కన్ను లైదు ; కరముల్ వర్ణింపగా వేయగున్ !

  రిప్లయితొలగించండి
 2. వివరించకనే చదువరులకు భావం స్ఫురించగలగాలి. అయినా విద్యార్థి దశలో అయినాదుష్కరప్రాసతో అభ్యాసం చేయాలని దురాశతో ప్రయత్నించాను.
  తన చెలితో చెలుడు చెప్తున్నాడు. వక్త్రము (ముఖము) నందురెండు కళ్ళు (నల్లనివో, తేనె కళ్ళో) వర్ణంబులేమైనా
  రెండుకళ్ళుఉంటాయి , ఏ వక్త్రములో అయినా ఒక్క కన్ను ఉంటే శోభిస్తుందా " అంటూ పది వక్త్రములు, అయిదు కన్నులున్న రాక్షసుని కథలు చెప్పబోతుండగా, ఆ వయ్యారి ఆపుతోంది అతన్ని " వక్త్రము , వక్త్రము అంటూ ఆ శబ్దాన్ని పదే పదే పలుకుతున్నావు. అదేమైనా శ్రావ్యంగా ఉందా" అంటూ ఉంది.


  "వక్త్రంబందునురెండుకళ్ళు నిలలో వర్ణంబు లేమైన ; నే
  వక్త్రంబుల్ మరినొక్కకన్ను వలనన్ వయ్యారి శోభించునే?
  వక్త్రంబుల్ పదికన్నులైదు కరముల్ వర్ణింప గావేయగున్"
  "వక్త్రంబంచునుశబ్దమున్ పలుకశ్రవ్యంబే? నిదానింపుమా!"

  రిప్లయితొలగించండి
 3. దృక్త్రాసాయత జీవితమ్మున కళాదివ్యత్వ సంసిద్ధితో
  వాక్త్రిస్రోతృ సమాన మంత్రముల నా వాణిన్ మదిన్ గొల్చి , స
  మ్యక్త్రైలోక్య భయంకరాకృతిని హాస్యప్రౌఢి జిత్రించితిన్
  వక్త్రంబు ల్పది కన్ను లైదు కరముల్ వర్ణింపగా వేయగున్ !!!

  (చూడడానికి భయంగొలిపే సుదీర్ఘమైన ఈ జీవితంలో , కళా వైభవము (చిత్ర కళ ) సిద్ధింపజేసినందులకు గానూ , వాక్కులనబడే గంగానదీ సమానమైన పవిత్ర మంత్రాలతో ఆ వాణిని నా మనస్సులో గొల్చి , ముల్లోకాలకూ భయంకరమైన ఒకానొక భీకరాకృతిని ,కొంచెం హాస్యప్రౌఢిమతో , పదితలలూ , అయిదు కన్నులూ , వేయి చేతులతో చిత్రించినాను !!!)

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  క్రమాలంకార పద్ధతిలో సమస్యను పూరించిన మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  మూడవ పాదంలో ప్రాస తప్పింది. అన్వయం కూడా కొంచెం ఇబ్బంది పెడుతున్నది.

  మందాకిని గారూ,
  సంభాషణారూపమైన మీ పూరణ చాలా బాగుంది. దుష్కరప్రాసను ఛేదించగలిగిన మీకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. డా. విష్ణునందన్ గారూ,
  అద్భుత పదవిన్యాసంతో, చక్కని ధారతో, మనోజ్ఞ భావసంపదతో విరాజిల్లుతూ మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. శంకరార్యా ! ధన్యవాదములు.
  మూడవ పాదంలో వక్త్రంబుల్ అన్నది టైపాటున వక్తన్బుల్ అని పడినది.
  ఇక కన్నులైదు సమన్వయం కొరకు పంచ వక్త్రములున్న ఈశ్వరునకు ఫాలనేత్రములు ఎన్ని అని వ్రాశాను. సవరణతో ...

  వాక్త్రోచన్ మది భారతీ కృప సుమా ! వాక్రుచ్చు, లంకాధిపున్
  వక్త్రంబుల్ ; కలవెన్ని, ఈశ్వరునకున్ ఫాలంబుపై నేత్రముల్
  వక్త్రంబుల్ గన నైదు యున్న; చెపుమా ! పై సూర్యుశ్రీ హస్తముల్ ;
  వక్త్రంబు ల్పది ; కన్ను లైదు ; కరముల్ వర్ణింపగా వేయగున్ !

  సమయస్ఫూర్తి తో పూరించిన మందాకిని గారికి అభినందనలు.
  చిత్రమైన వాణీ చిత్రమును చిత్రించి చూపిన విష్ణు నందన్ గారికి నమస్సులు.

  రిప్లయితొలగించండి
 7. శంకరయ్య గారూ , మహాప్రసాదం ! ధన్యోస్మి !
  మిస్సన్న గారూ , కృతజ్ఞతా పూర్వకాభివందనాలు !!!
  హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాద పరశ్శతం !

  రిప్లయితొలగించండి
 8. హనుమచ్ఛాస్త్రి గారూ , అది వాణీ చిత్రము కాదు . చిత్ర కళనొసంగిన వాణికి నమస్కరించి , కుంచె తో ఒకానొక భయంకరాకారాన్ని , పది తలలూ, అయిదు కన్నులూ , వేయి చేతులతో చిత్రించినానన్నమాట ! అదొక భీతిగొలిపే ఆకారం ! అంతే !!!

  రిప్లయితొలగించండి
 9. విష్ణు నందన్ గారూ ! అవగాహన లో లోపాన్ని మీరు, వాణి క్షమింతురుగాక.
  వివరణకు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  సందేహ నివృత్తి జరిగింది. ఇప్పుడు మీ పద్యం బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి