13, జూన్ 2011, సోమవారం

సమస్యా పూరణం -362 (చోరుని గని సంతసించి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

37 కామెంట్‌లు:

 1. తీరుగ వెన్నను దొంగిలు
  పేరెన్నికగన్న దొంగ, పెట్టుము వెన్నన్ !
  మారితి నేనని బొంకగ;
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్!

  రిప్లయితొలగించండి
 2. కేరుచు నల్లరి జేయుచు
  వారును వీరనక నిండ్ల పాల్వెన్నలకై
  దూరెడి గోపీ మానస
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 3. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ మంచి పూరణ.

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  నవనీతచోరుని గురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  మీరు గోపీ మానసచోరుణ్ణి పట్టుకున్నారు. పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  మిస్సన్న గారూ ! ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 6. లేరిక నెవ్వరిట యనుకొని
  హారిణి గోపిక విసుగున యటుగా బోవన్
  గేరుచుఁ గనవచ్చిన మృదు
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 7. దొంగరాముడు సినిమా చూసి ఇంకా వారం అవ్వలేదు. కాబట్టి మన సాటిలేని మేటి సావిత్రికి అంకింతమిస్తూ,
  ఆ రామునే తలంచుచు
  కూరల బుట్ట తలనెట్టి కులుకుచు నడచెన్
  సౌరుల సావిత్రి దొరల
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

  రిప్లయితొలగించండి
 8. ధారుణి వింతలు గనుడీ!
  హారము దొంగిల తరమగ; యాతుర తన్ దాఁ
  కరవాలముఁ దూయఁ; జడియు
  జోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  హారము దొంగిల తరిమే దొంగను చూసి యాత్రముగా కరవాలము దూయగా జడిసే దొంగను చూసి గెలిచాననే సంతోషముగా సుందరి పిలిచిందని భావము.

  రిప్లయితొలగించండి
 9. గారము లొలుకుచు మరి వ
  య్యారపు నటనలఁ, నధరముఁ హాసము తోడన్
  నీరజ నయనుని, మానస
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

  రిప్లయితొలగించండి
 10. గురువు గారికి ధన్యవాదములు, అందరికి నమస్కారములతో
  క: జోరుగ హుషారుగ వరుడు
  తీరుగ రాత్రి కలలోన ధీరత్వమునన్,
  పోరున గెలచిన మానస
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 11. దోరగ మాగిన పండ్లఁచ
  తురముగ దొంగిలగ వేచు దొంగను వడిగా
  తరుముచు చేతికి చిక్కిన

  రిప్లయితొలగించండి
 12. అందరి పూరణలూ ఆహ్లాదపరచుటలో వేటికవే సాటి. విశేషించి మిస్సన్నగారి పూరణ మనోహరమై ' బుధజన మానసాపహారియై ' , మనోజ్ఞముగా నున్నది !
  మందాకిని గారూ , మీ రెండవ పద్యానికి కొన్ని సవరణలవసరము ...కాస్త పునః పరిశీలించగలరు !

  గారమ్ముగ వేణువునటు
  జేరిచి తన మోవిపైన ; చెవికింపుగ శ్రా
  వ్యారావమూను ' మానస
  చోరుని ' గని సంతసించి సుందరి పిలిచెన్ !!!

  రిప్లయితొలగించండి
 13. చంద్రశేఖర్ గారు, మీ పద్యంలో మొదటిపాదం లో ఒక అక్షరమూ

  మందాకిని గారు, మొదటి , చివరి పద్యములలో ,ప్రాస పూర్వాక్షరములూ సరి చూడగలరు....!!!!

  రిప్లయితొలగించండి
 14. జోరుగ పోరెద గనుమని,
  దోరగ బదులు సరిగా ఉంటె సరిపోతుందనుకుంటాను. సవరణలకు ధన్యవాదాలు, విష్ణు నందన్ గారు!

  రిప్లయితొలగించండి
 15. కవి పండితులకు నమస్కారములు. అందరి పూరణలు బాగున్నాయి.

  వారసుడై వచ్చెను తను
  ధీరునిగా నిలచినాడు దీనులపాలన్
  వీరుని పేదల సుమనో
  చోరుని గని సంతసించి సుందరి పిలచెన్

  ( పేదల సుమనో = పేదల మంచి మనసులు ) తప్పులను మన్నింప ప్రార్థన
  శ్రీపతి శాస్త్రి

  రిప్లయితొలగించండి
 16. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జూన్ 13, 2011 3:08:00 PM

  కోరిన గోర్కెలు దీర్చగ,
  ధీరత తన గృహము జొచ్చి, తెంపున పగలే,
  రారమ్మను తన మానస
  చొరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న గారూ ! మీ పూరణ బాగుంది. అభినందనలు.

  చేరి యశోదకు శిశువును
  ధారుణి బ్రహ్మకు జనకుని, దానవ వైరిన్
  మారుని, లీలా మానస
  చోరుని గని సంతసించి సుందరి బిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 18. చంద్ర శేఖర్ గారూ,
  మీ మొదటి పూరణలో మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  డా. విష్ణు నందన్ గారి వ్యాఖ్యను గమనించారు కదా. ‘విసుగునన్ + అటుగా = విసుగున నటుగా’, అలాగే ‘మృదుచోరుడు’ ?
  నా సవరణలతో మీ పద్యం...
  లే(రెవ రిచ్చట న)నుకొని
  హారిణి గోపిక విసుగున నటుగా బోవన్
  గేరుచుఁ గనవచ్చిన (హృ
  చ్చో)రుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  ఇక రెండవ పూరణలో నాకెంతో ఇష్టమైన ‘దొంగరాముడు’ చిత్రాన్ని ప్రస్తావించారు. పూరణ బాగుంది. అభినందనలు.
  ‘బుట్ట తలనెట్టి’ కాకుండా ‘బుట్ట తలనెత్తి’ అని ఉండాలి.

  రిప్లయితొలగించండి
 19. మందాకిని గారూ,
  మంచి ఊహతో మొదటి పూరణ చెప్పారు. బాగుంది.
  మూడవపాదంలో ‘కరవాలము’నకు బదులు ‘ధారాంగము’ను ప్రయోగిస్తే సరి!
  ఇక రెండవ పూరణలో 2,4 పాదాల ప్రథమాక్షరాలు గురువులై ఉండాలి. నా సవరణ ...
  దోరగ మాగిన పండ్ల(ను
  తోరముగా దొంగిలించి) దొంగ(యె) వడిగా
  (పారుచు) చేతికి చిక్కిన
  చోరుని గని సంతసించి సుందరి బిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 20. డా. విష్ణు నందన్ గారూ,
  కవిమిత్రుల పూరణలను పరిశీలించి సలహాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
  మీ పూరణలు ఔత్సాహికులకు మార్గదర్శకాలు. మనోరంజకాలు.

  రిప్లయితొలగించండి
 21. శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ నిర్దోషంగా, ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  మంచి పూరణ. అభినందనలు.
  ‘మారుని’ శబ్దమే అతకటం లేదు. నా సవరణ ...
  ......దానవ జన సం
  హారిన్ ....

  రిప్లయితొలగించండి
 22. శంకరయ్య గారూ,
  మీకు, విష్ణునందన్ గారికీ శతధా కృతజ్ఞతలు మెరుగులు దిద్దినందుకు. అలాగే సలహాలివ్వమని ప్రార్ధన, యతి గణ దోషాలు లేకపోయినా సరే. "హృచ్చోరుడు" చాలా బాగుంది. మానసచోరుడు అని అందరూ పూరించారు. మన కృష్ణయ్య గోపికల మనసులని మృదువుగా దొంగతనం చేశేవాడు కాబట్టి, "మృదు" పదం విశేషణంగా వాడచ్చని వేసేశాను. మాష్టారు పట్టేశారు. ఆతరువాత కొంచెం మోడరేషన్ మార్కులు ఇచ్చి "హృచ్చోరుడు" అని వేసి పాసు చేయించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 23. చంద్ర శేఖర్ గారూ , సూచనలివ్వమన్నారనే చనవు కొద్దీ ఒక చిరు స్పందన . ' మృదువుగా ' అని పద్యంలో రావాలి . మృదు చోరుడు అనడంలో మృదువైన చోరుడనే అర్థమే కానీ , మృదువు "గా" అని రాదు , మరలాంటప్పుడేం చేయాలంటే , 'లీలా' శబ్దాన్ని ఆశ్రయిస్తే సరి . ' మృదులీలా ' అంటే భేషుగ్గా సరిపోతుంది . ఈ " గా = లీలా " శబ్దం మనల్ని అనేక సందర్భాల్లో రక్షిస్తుంది . ఉకారాంత తత్సమాలైన , మృదు , పృథు ఇత్యాదులన్న మాట . (మృదు లీలా [మృదు లీలా హృచ్చోరుడు ఇలా ] , పృథు లీలా ) . ఈసారెక్కడైనా వాడుకోవచ్చని చెప్పాను . అనుమతించిన శంకరయ్యగారికి ధన్యవాదాలు .

  రిప్లయితొలగించండి
 24. గురువుగారూ ధన్యవాదాలు.
  విష్ణునందన్ గారూ బహుకాలానికి విచ్చేశారు.
  నా పూరణ మీ ప్రశంసార్హమై నందుకు చాలా సంతోషంగా ఉంది.
  రవీందర్ గారూ ధన్యవాదాలు.
  మీ పూరణ యశోదా నందనుని లీలాచౌర్యాన్ని చక్కగా ఆవిష్కరిస్తోంది.
  మిత్రులందరి పూరణలు తమతమ వైభవాలను చాటు కొంటున్నాయి.

  రిప్లయితొలగించండి
 25. విష్ణు నందన్ గారి పూరణ సర్వ జన మానస చోరుని వేణు గాన విలాసాన్ని శ్రావ్యంగా వినిపిస్తోంది.

  రిప్లయితొలగించండి
 26. డా.విష్ణునందన్ గారూ, మీ స్పందన చదివి చాలా ఆనందించాను. అద్భుతమైన సలహా. ధన్యవాదాలు. మీరు ఇలాగే సాన బెట్టండి. సంకోచించ వద్దని మనవి.

  రిప్లయితొలగించండి
 27. గురువుగారు కృతజ్ఞతలు. శ్రీపతిశాస్త్రి

  రిప్లయితొలగించండి
 28. గురువుగారూ, నేను చేసిన సవరణలు మీరు గమనించలేదనుకుంటాను. మీ సవరణలు బాగున్నవి.

  ఇంకో పూరణ చేస్తున్నాను. ఇది అయినా నిర్దోషంగా ఉంటే సంతోషము.

  కోరపు మీసపు తోడను
  చోరుని వేషమునువేయు చిఱుతని "కన్నా,
  రారా" యనుచును మురిపెముఁ
  జోరుని గని సంతసించి సుందరి పిలిచెన్.

  రిప్లయితొలగించండి
 29. తారా పధమున నిలచిన
  వీరా గ్రేసరుని గాంచి పెండిలి యాడన్ !
  గారమున కులుకు మానస
  చోరుని గని సంత సించి సుందరి పిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 30. డా. విష్ణు నందన్, చంద్రశేఖర్, మిస్సన్న గారలకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 31. మందాకిని గారూ,
  మీ సవరణ చూసాను. అందులో చెప్పిన ‘సరిగా’ పదం సరిపోదు కదా. అందుకే నా సవరణ పెట్టాను.
  ఇక మీ చివరి పూరణ విషయం బాగున్నా రెండవ పాదంలో యతి తప్పింది. ‘చిఱుతని’ బదులు ‘చొఱఁ గని’ అంటే సరి! చొఱ అంటే కుఱ్ఱవాడు.

  రిప్లయితొలగించండి
 32. రాజేశ్వరి నేదునూరి గారూ,
  మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 33. నిజమే గురువు గారు, ధన్యవాదాలు. నేను ఏదైనా సరి చేద్దామని వచ్చాను. అంతలో మీరే సరి చేశారు. మరీ మరీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 34. ధన్యవాదములు గురువు గారూ ! నిజమే ! మీరు సూచించిన మార్పు సబబుగా వుంది.

  రిప్లయితొలగించండి
 35. In praise of Telangana She Team:

  నారుల రక్షణ కొఱకై
  దారుల లోపొంచి యుండి ధైర్యము తోడన్
  జారుని వనితల మాన్యత
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

  రిప్లయితొలగించండి
 36. తీరుగ డజనులు డజనులు
  ఘోరముగా కాసి కాసి కోరిక తీరన్
  బోరవ; గుమ్మడి కాయల
  చోరుని గని సంతసించి సుందరి పిలిచెన్

  రిప్లయితొలగించండి