15, జూన్ 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 76 (వర్షాకాలము వచ్చె)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 20
సమస్య - "వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్
వైశాఖమాసంబునన్"
శా.
హర్షం బెట్లగు? కృష్ణదేవుఁ డిటకై యబ్జాక్షి! రాఁడాయె సా
మర్షాహంకృతిఁ జంద్రుఁ డేచుతఱి భీమద్వేషసామోగ్రదు
ర్ధర్షక్రూరనిశాతఘాతనవచూతవ్రాతబాణావళీ
వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

33 కామెంట్‌లు:

  1. వర్షాకాలము వచ్చె;గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్
    వర్షర్తు ప్రబలంబుగాను జనజీవంబందుఁ దెచ్చున్సదా
    హర్షంబుల్ మదినిండ;నెండఁబడి,నయ్యాజీవుఁ గష్టంబులోన్.
    శీర్షంబొగ్గియు నేను వందనములే జేయందగున్, దేవికిన్.


    ఎండబడి జీవులు కష్టములో నుండగా వర్షాలు జనజీవంబులో హర్షాలు తెస్తాయి, నేను ఆ దేవికి కృతజ్ఞతలు వందనాల రూపంలో తలవొగ్గి తెలియజేయాలని నా భావం.

    రిప్లయితొలగించండి
  2. వర్షాకాలము వచ్చె వర్షర్తుఁ , గ్రీష్మమువలెన్ వైశాఖమాసంబునన్ అని అన్వయం.

    రిప్లయితొలగించండి
  3. ఈ సమస్య ఓ మారు పొద్దు సమ్మేళనాలలో వచ్చినట్టుంది.

    రిప్లయితొలగించండి
  4. వర్షా కాల మదిచ్చు సంతసము సంభావింపగా రైతుకున్,
    వర్షా కాలము తెచ్చు మోదమును పాపాబాబుకున్ ఆడగా,
    వర్షా కాలము పెంచు తోయమును గర్భంబందు ధాత్రిన్, అహో
    వర్షాకాలము వచ్చె! " గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్"

    రిప్లయితొలగించండి
  5. వర్షంబుల్ గదిచేను చూడ నిక మా వైభోగ మేమందుమో
    హర్షంబే నని యూపియే కుదురుగా హాహాహ యన్నంతలో;
    శీర్షంబే తలక్రిందులాయె కన టూజీ,స్విస్సు స్కాం మబ్బుగా
    వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖమాసంబునన్.

    (వైశాఖ మాసంలో వసంతకాలముంటుంది.
    అలాటి వసంతకాలమనుకున్న తరుణంలో స్కాం మబ్బులు క్రమ్మి కురుసిన అరోపణల వర్షము యూపియే సర్కారుకు గ్రీష్మం లా వేడిని పుట్టించాయని నా భావం.)

    రిప్లయితొలగించండి
  6. వికృతి ఉగాది కవిసమ్మేళనం కోసం నేను రాసుకొన్న ఈ పూరణం.

    హర్షంబన్నది లేదు ఆశ మనిషిన్ ఆడింపగా కీర్తికై
    తర్షుండై వనరాశులన్ దునిపి తా దర్పంపు హర్మ్యంబులన్
    కర్షాకర్మము మాని నిల్ప భువిలో కల్లోలముల్ రేగగా
    వర్షాకాలము వచ్చె గ్రీష్మము వలెన్ వైశాఖ మాసంబునన్.

    రిప్లయితొలగించండి
  7. నా పూరణ ...
    కార్షుం డిచ్ఛను భూమి దున్నఁగను సంకల్పించఁ దా నేమనున్?
    హర్షంబున్ దొలగించి యెండ లవి కాయన్ దోఁచు నేరీతి? ను
    త్కర్షన్ కూర్మజయంతి వచ్చు నెల యేదయ్యా? యన్న నేఁ జెప్పెదన్
    "వర్షాకాలము వచ్చె"; గ్రీష్మము వలెన్; వైశాఖమాసంబునన్.

    రిప్లయితొలగించండి
  8. మందాకిని గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    అన్వయమే కొద్దిగా ఇబ్బంది పెట్టింది.

    రవి గారూ,
    మీరు చెప్పింది నిజమే. ఈ శీర్షికలోని మొదటి సమస్య"దృఢసత్త్వంబున చీమ తుమ్మె...’ ఈ సంవత్సరం పొద్దు కవిసమ్మేళనంలో ఇచ్చారు కూడా.

    రిప్లయితొలగించండి
  9. మిస్సన్న గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    "పాపాబాబుకున్ ఆడగా" అన్నచోట "పాపల్ బాబు లాటాడగా" అంటే ఎలా ఉంటుంది?

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని విషయాన్ని ఎన్నుకున్నారు. బాగుంది. అభినందనలు.
    "గడిచేను" గడువంగా .. అయితే ..?

    రిప్లయితొలగించండి
  10. ఫణి ప్రసన్నకుమార్ గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. శంకరార్యా ! ధన్యవాదములు.మీరు చేసిన సవరణ చక్కగా కుదిరింది.మీ ప్రశ్నోత్తర పూరణ చాలా బాగుంది.
    మందాకినిగారు మంచి ప్రయత్నం చేశారు.
    మిస్సన్న గారు నాలుగు పాదాలా వర్షం కురిపించారు.
    ప్రసన్న కుమార్ గారి పూరణ అలరించింది.
    అందరకూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ ధన్యవాదాలు.
    పాపనీ, బాబునీ అక్కడ నిలబెట్టడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను.
    మీరు వారిద్దర్నీ చక్కగా కూర్చోబెట్టారు.
    ఇక మీ క్రమాలంకార పూరణ మనోజ్ఞం.

    రిప్లయితొలగించండి
  13. హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.
    మీ పూరణ సందర్భోచితంగా బాగుంది.

    రిప్లయితొలగించండి
  14. హర్షానందములన్, జనంబుకును మోహావేశమున్ దెచ్చుచున్
    వర్షాకాలము వచ్చె; గ్రీష్మము వలెన్, వైశాఖమాసంబునన్,
    శీర్షంబుల్ దహియించువేడిమినినేఁసైఁపంగలేనంచునున్,
    వర్షమ్మున్ మదిఁవేడితిన్ కరుణగావంగన్ ననున్ దీననున్.

    శాస్త్రిగారూ, గురువుగారూ
    మీ ప్రోత్సాహానికి ధన్యురాలను.

    రిప్లయితొలగించండి
  15. మందాకిని గారూ,
    మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ ! మీ రెండవ పూరణ చాలా బాగుంది.వరుణుని కరుణతో వర్షం కురిపించారు.

    రిప్లయితొలగించండి
  17. ఆర్ష ప్రోక్త విధమ్మునన్ గ్రతువులం దాజ్యమ్ము నైవేద్యమై
    హర్షంబున్ సమకూర్ప నా వరుణు డాహా సంతసమ్మంది , భూ
    తర్షమ్మెల్ల నశింపజేయుటకు యత్నంబూన , జ్యేష్ఠంబులో
    వర్షాకాలము వచ్చె ; గ్రీష్మము వలెన్ వైశాఖ మాసంబునన్ !!!

    ( ఆర్షధర్మాన్ని అనుసరించి చేసే యజ్ఞ యాగాదులకు సంతసించిన వరుణదేవుడు , భూతాపాన్ని చల్లార్చడానికి చేసిన యత్నంవలన , వైశాఖ మాసంలో గ్రీష్మం వస్తే ఎంత అరుదో అలా జ్యేష్ఠంలోనే వర్షాకాలం వచ్చిందని భావం !!! )

    రిప్లయితొలగించండి
  18. విష్ణునందన్ గారూ అద్భుతమైన, అందమైన పద్యాన్నిచ్చారు.

    రిప్లయితొలగించండి
  19. డా. విష్ణు నందన్ గారూ,
    సుమధుర భావంతో అత్యుత్తమమైన పూరణ ఇచ్చిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. హనుమచ్ఛాస్త్రి గారి అంతటి సాంప్రదాయిక కవిత్వంలోనూ 'యూపియే' 'స్కాం' అన్న పదాలే కాస్త ఇబ్బంది పెట్టాయి. అయితే పూరణ మాత్రం బహుధా ప్రశంసనీయం , ముఖ్యంగా ప్రస్తుత సామాజిక పరిస్థితుల నేపథ్యంలో.

    మిస్సన్నగారూ, నమస్సుమాలు . మీ పూరణ భేషు ! ' వర్షాకాలమదిచ్చు ' కంటే ' వర్షా కాలమె యిచ్చు ' అంటే మరింత వూనిక కదా ! మార్చకపోయినా నిర్దోషంగా , దివ్యంగా ఉంది కానీ అలా మారిస్తే మరింత అందగిస్తుందేమో .. అలాగే మిగిలిన రెండు పాదాల్లోనూ ' వర్షాకాలమె ' తెచ్చు , ' వర్షాకాలమె ' పెంచు అని చూడండి . ఆ నొక్కి చెప్పడం లోని మాధుర్యం ..సాహసించి చెబుతున్నాను . మన్నింపగలరు .

    శంకరయ్యగారూ , మీ సౌహార్దానికి త్రికరణశుద్ధిగా సాష్టాంగ వందనాలు . సొగసైన పూరణకు నమోవాకాలు . త్కర్షన్ కూర్మజయంతి వచ్చు నెల యేదయ్యా? యనన్ జెప్పెదన్ అని ఉండాలనుకుంటున్నాను . 'ప్రమాదో ధీమతామపి ' కదా ! ఇక్కడా సాహసమే . మన్నింపగోరెదను .

    మందాకిని గారి రెండవ పద్యం ముచ్చటగా ఉంది. 'జనంబునకు ' అనో , ' జనంబులకు ' అనో ఉండాలేమో బహుశా ! మూడవ పాదంలో 'యతి ' మాత్రం సరి చూడగలరు !

    కాస్త విశ్రాంతి దొరికింది . యథేచ్ఛగా వ్రాసినాను ! అన్యథా భావింపవలదు !

    రిప్లయితొలగించండి
  21. విష్ణు నందన్ గారూ ! ధన్యవాదములు.వర్తమాన కాలాన్ని వస్తువుగా గ్రహించినందున కొన్ని పదములు వాడక తప్పని పరిస్థితి. మీ పూరణ తొలకరి జల్లుల హాయినిచ్చింది. మాకోసం మీకు ప్రతి రోజు కొంత విశ్రాంతి దొరికేలా చేయాలని వాగ్దేవికి మా విన్నపము.

    రిప్లయితొలగించండి
  22. విష్ణునందన్ గారూ, ధన్యవాదాలు.
    జనమ్ము, జనంబు ఏకవచనం అవుతుంది కాబట్టి జనంబునకు బాగుంది. మీరిచ్చే చక్కటి సూచనలు మాకెంతో అవసరం. అన్యథా భావించవలదని మీరు వ్రాయవలసిన అవసరమేమీ లేదని మా మిత్రులందరి తరఫునా చెప్పేందుకు సాహసిస్తున్నాను.
    జనమ్మునకు అని కూడా అనవచ్చని అనుకుంటున్నాను.
    మూడో పాదంలో యతి శీ - సై లకు సరిపోతుంది కదా! ప్రాసాక్షరానికి పూర్వాక్షరం ఈ పాదంలో మాత్రం దీర్ఘాక్షరం వచ్చింది.

    రిప్లయితొలగించండి
  23. మందాకిని గారూ , శీ - సై లకు యతిమైత్రి లేదు. ఇ-ఈ-ఎ-ఏ-ఋ - ౠ లు మాత్రమే పరస్పర మిత్రములు . [ సంస్కృత సంధిలో ఆదేశముగా వచ్చే ఐ కారమునకు మాత్రం ఏకారాదులునూ , ఆదేశముగా వచ్చే ఔ కారమునకు ఓ కారాదులునూ మిత్రములవుతాయి . ] అందుకే అలా అన్నాను.
    ' శీర్షంబుల్ దహియించు వేడిమిని యిస్సీ ! సైపలేనంచు నే ' అనో....మరోలానో మార్చి చూడండి.
    ఇక ' జనము ' ఒక ప్రత్యేకపదం . జనమూ (ఏక) , ' జనాలు ' (బహు) రెండు వచనాల్లోనూ నిరభ్యంతరంగా వాడదగినదే !

    అలాగే శార్దూలంలో హ్రస్వ-దీర్ఘాక్షరాల చర్చోపచర్చలేమీ ఉండవు . అన్ని పాదాలు గురువుతోనే ప్రారంభమవుతాయి అంతే !

    రిప్లయితొలగించండి
  24. విష్ణునందన్ గారూ,
    అర్థమైందండీ నా పొరపాటు.మీరు ఎంతో శ్రద్ధతో తప్పుల్ని సరిదిద్దినందుకు ధన్యవాదాలు. i will write it again.

    రిప్లయితొలగించండి
  25. విష్ణునందన్ గారి సవరణతో నా పద్యం మరొక్కసారి.


    హర్షానందములన్, జనమ్మునకు మోహావేశమున్ దెచ్చుచున్
    వర్షాకాలము వచ్చె; గ్రీష్మము వలెన్, వైశాఖమాసంబునన్,
    శీర్షంబుల్ దహియించు వేడిమిని యిస్సీ ! సైపలేనంచు నే
    వర్షమ్మున్ మదిఁవేడితిన్ కరుణగావంగన్ ననున్ దీననున్.

    రిప్లయితొలగించండి
  26. డా. విష్ణునందన్ గారూ,
    నిజమే. "నెల యేదయ్యా? యన్న నేఁ జెప్పెదన్" అన్నప్పుడు గణదోషాన్ని నేను గమనించలేదు. మీ సవరణకు ధన్యవాదాలు.
    మందాకిని గారి సందేహాన్ని తీర్చినందుకు కూడా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. నా పూరణ ...
    (డా. విష్ణు నందన్ గారి సవరణతో, వారికి ధన్యవాదాలతో ....)
    కార్షుం డిచ్ఛను భూమి దున్నఁగను సంకల్పించఁ దా నేమనున్?
    హర్షంబున్ దొలగించి యెండ లవి కాయన్ దోఁచు నేరీతి? ను
    త్కర్షన్ కూర్మజయంతి వచ్చు నెల యేదయ్యా? యనన్ జెప్పెదన్
    "వర్షాకాలము వచ్చె"; గ్రీష్మము వలెన్; వైశాఖమాసంబునన్.

    రిప్లయితొలగించండి
  28. మందాకిని గారూ,
    ఇప్పుడు మీ పద్యం సర్వాంగసుందరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. గురువుగారూ,

    శీర్షాసనంబు వేసియు,
    హర్షానందములుగల్గు యట్టుల నేనా
    కర్షించుపగిదిదోషవి
    కర్షణముగజేతునే,సఘనపూరణముల్?

    మొదటి పాదంలో దీర్ఘాక్షరం వాడాను చూశారా, ప్రాసాక్షరానికి ముందు?:)

    రిప్లయితొలగించండి