20, జూన్ 2011, సోమవారం

సమస్యా పూరణం -369 (కప్పి చెప్పునదియె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కప్పి చెప్పునదియె కవిత యగును.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

20 కామెంట్‌లు:

  1. విషయ మరసి నాత్మ విశ్వాసమును జూపి
    ఛంద రీతులు గని సరళ ముగను
    ఆశు వైనను కవి తావేశము తనపై
    కప్పి చెప్పు నదియె కవిత యగును.

    రిప్లయితొలగించండి
  2. హేళనమ్ము జేయు నీదుసఖుకన్నులు
    కప్పి చెప్పునదియె కవిత యగును.
    పరులుమెచ్చునపుడు బహువిధముల
    తెలియవత్తురమ్మ దెలియుమమ్మ

    రిప్లయితొలగించండి
  3. " చంద్ర బింబ మగును చక్కని వదనమ్ము
    మెరుపు తీగ యగును మేని సొంపు "
    మీకు తోచు నిట్టి మేలి ముసుంగును
    కప్పి చెప్పునదియె కవిత యగును.

    రిప్లయితొలగించండి
  4. అరటిపండు వొలిచి యరచేతిలో పెట్టి
    తినుము తినుము యనిన ఘనత యేమి !?
    పఠిత మెదడు కొంత పనిచేయు నట్టుల
    కప్పి చెప్పునదియె కవిత యగును

    రిప్లయితొలగించండి
  5. తప్పు పనుల జేయ తగదని వారించి
    యొప్పు పనుల గొప్ప విప్పి జెప్పి
    ముప్పు దెచ్చు నట్టి మూఢ నమ్మకముల
    కప్పి,చెప్ప నదియె కవిత యగును !

    రిప్లయితొలగించండి
  6. మిత్రు లందఱి పూరణలు బ్రహ్మాండముగా ఉన్నాయి

    కనుల కింపు గూర్చు కలకంఠి సొగసులు
    చెవుల కింపు గాను చెలువ సౌరు
    కలికితనము నందు కధకుండు హృదయమ్ము
    గప్పి చెప్పు నదియె కవిత యగును



    సత్య ధర్మ పథము సంఘము విడువంగ
    కరుణ హీన మైన కర్మ భూమి
    మేలు కొలుపు పాడి యోలలఁ దన విధిఁ
    గప్పి చెప్పు నదియె కవిత యగును

    -గన్నవరపు

    రిప్లయితొలగించండి
  7. తనపై కవితావేశము కప్పిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అరసి నాత్మ’ అనకుండ ‘అయసి యాత్మ’ అంటే బాగుంటుంది. ‘ఛందః + రీతులు = ఛందోరీతులు’. ‘ఛందరీతులు’ అనరాదు.

    మందాకిని గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవపాదం చివర గణదోషం. ‘బహువిధములుగాను’ అందాం.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. నాగరాజు రవీందర్ గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘తినుము + అనిన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘తిను మని యన’ అంటే సరి!

    మంద పీతాంబర్ గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ నిర్దోషంగా మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. సరస గుణము గూర్చి , చతురార్థముల దీర్చి
    శయ్య మరియు ధ్వనుల సంతరించి
    లలిత లలితమగు నలంకారములను పై
    కప్పి చెప్పునదియె కవిత యగును !!!

    రిప్లయితొలగించండి
  10. శంకరార్యా ! ధన్యవాదములు. మీ సూచనననుసరించి సవరణతో..

    విషయ మరసి యాత్మ విశ్వాసమును జూపి
    పద్య పాద ములను హృద్య ముగను
    ఆశువైనను, కవి తావేశము తనపై
    కప్పి ; చెప్పు నదియె కవిత యగును.

    రిప్లయితొలగించండి
  11. శ్రీపతి శాస్త్రిసోమవారం, జూన్ 20, 2011 10:30:00 PM

    శ్రీ గురుభ్యోనమః

    భావగర్భితముగ భారతీస్మరణతో
    పదములెన్నొ కూర్చి పద్యమల్లి
    పాట యనెడి శాల్వ పార్వతీ మాతకు
    కప్పి చెప్పునదియ కవిత యగును.

    శాల్వ = శాలువ

    రిప్లయితొలగించండి
  12. సంపత్ కుమార్ శాస్త్రి.సోమవారం, జూన్ 20, 2011 10:38:00 PM

    హనుమచ్చాస్త్రి గారూ, మీ రెండవ పద్యములోని మూడవపాదములో చివరి గణము తప్పినదనుకొంటాను, గమనించ ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  13. డా. విష్ణు నందన్ గారూ,
    సర్వకావ్యగుణశోభితమైన మీ పూరణ ఉత్తమోత్తమం. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    సవరించిన మీ పూరణ ఇప్పుడు మనోరంజకంగా ఉంది. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    పార్వతికి శాలువా కప్పి చెప్పిన మీ కవిత బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    గోలి వారి పద్యపాదంలో నాకైతే గణదోషం కనపడలేదు. సరిగానే ఉంది. మరోసారి పరిశీలించండి.

    రిప్లయితొలగించండి
  15. రాలు రాప్పలున్న రమ్యముగ వర్ణించి
    చంద్ర బింబ మనుచు సఖిని పొగడ
    మభ్య పడుచు మగువ ముఖమునే స్తుతియింప
    కప్పి చెప్పు నదియె కవిత యగును .!

    రిప్లయితొలగించండి
  16. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    సంపత్ గారూ ! 'ము తనపై' కలిపి చూడండి.'నగము ' గణమౌతుంది.ధన్యవాదములు.
    శ్రీపతి శాస్త్రి గారూ! బారతీ దేవికి శాలువా కప్పటం బాగుంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. రాజేశ్వరక్కా,
    పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవపాదంలో యతి ‘మ-ము’ తప్పింది. అత్యవసరంగా బయటికి వెళ్తున్నందున ఇప్పుడు సవరించలేదు. మీరు ప్రయత్నించండి. కాకుంటే ఈ సాయంత్రానికల్లా నేను సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 21, 2011 2:48:00 PM

    గురువుగారు ధన్యవాదములు. హనుమచ్చాస్త్రి గారు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  19. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    కమల నయన యనుచు - కలకంఠి యనుచును
    కల్ల లాడి మనసు - కొల్ల గొట్టి !
    కానుకలను దెచ్చి - కాంతల పైనను
    కప్పి ! చెప్పునదియె - కవిత యగును !
    _____________________________________

    రిప్లయితొలగించండి