7, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 68 (తోఁచు నడంగు వెండియును)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 12
సమస్య - "తోఁచు నడంగు వెండియును
దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్"
i) రామాయణార్థం వచ్చే విధంగా ...
ఉ.
తోఁచక పట్టి తెమ్మనుచుఁ దొయ్యలి వేఁడిన వెంటనంటి చే
సాచుచు మెల్ల మెల్లఁగను జాడల జాడల నాశ లాశలన్
నాచుకవచ్చు రామరఘునాయకు ముందర మాయలేడి తాఁ
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
ii) రామాయణార్థంతోనే మరోవిధంగా ....
ఉ.
పీఁచమడంచి రాఘవకపిప్రవరాదులు వాల్మగంటిమి
న్నేఁచఁగ మిన్ను మన్ను దిశ లెచ్చటి వచ్చటఁ గాలఁగా రవిం
గ్రాచు శరాగ్ని కీలల జగంబులు ఘూర్ణిల నింద్రజిత్తు తాఁ
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
iii) భాగవతార్థం వచ్చే విధంగా ....
ఉ.
పూచినమాటపట్లఁ దలపోయఁగ లేక మనోభవుండు ప్రే
రేచ గణాలు నాలుఁ దమ రెప్పల నార్పక చూడఁగా మనం
బాచఁగలేని యట్టి త్రిపురారిపురస్స్థలి శౌరి నారియై
దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

12 కామెంట్‌లు:

  1. చూచుచు పల్లెటూరి ఘన సోయగమున్, పొలమందు నేగుచున్
    చూచితి, సవ్వడిన్ వినుచు చోద్యముగా తల పైకి బెట్టి; దో
    బూచుల నాడుచున్నల నభోతలమందు విమానమొక్కటిన్,
    దోఁచు నడంగు వెండియును దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    "దోబూచుల నాడు మబ్బుల" అంటే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ ! ధన్యవాదములు. మబ్బులనంటే సవరణ సూచించారు. చాలా బాగుంది.కృతఙ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  4. హనుమచ్చాస్త్రి గారూ భళా మీ పూరణ.


    చూచిన దివ్య మంత్రములు సుందర కాండము నందు పెక్కులై
    దోఁచు, నడంగు, వెండియును దోఁచు, నడంగు మెఱుంగు చాడ్పునన్
    పీచ మడంచు కష్టములఁ ప్రీతిగ సాధన జేయ, పాపముల్
    మోచకమై తరించి తుద భూమిజ నాథుని లోన నైక్యమౌ.

    *********************************************

    చూచుచు నోర కన్నులను, సొంపుల నొంపుల విందు సేయుచున్
    వేచిన రాక్షసాధముల వెర్రుల జేయుచు పంక్తి పంక్తి లో
    దోఁచు, నడంగు, వెండియును దోఁచు, నడంగు మెఱుంగు చాడ్పునన్
    ఆ చపలాక్షి మోహిని! భళా! సుధలన్ తనియింప దేవతల్!

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ ! ధన్యవాదములు.
    సుందరకాండ మాహాత్మ్యాన్ని,మోహిని తత్వాన్ని... తోచు,నడంగు...కాకుండా...చక్కగా వర్ణించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    రెంటికి రెండూ అద్భుతమైన పూరణలు. ధన్యవాదాలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మిస్సన్న గారి తరఫున మీకు నా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. వేచితినే సఖీ మదిని వేదనతోడను నాథురాకకై
    తోచెను నామనంబుననుదోయజనేత్రుముఖారవిందమే
    చూచెదచంద్రుయందమున చూచెద నావిభునంచు వేచినన్
    దోఁచు, నడంగు, వెండియును దోఁచు, నడంగు మెఱుంగు చాడ్పునన్

    రిప్లయితొలగించండి
  8. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మాయాబజార్ సినిమాలో సుభద్రాభిమన్యులకు ఘటోత్కచుడు
    కనుపించిన సందర్భం :

    01)
    ___________________________________________

    తోఁచు నడంగు వెండియును - దోఁచు నడంగు మెఱుంగు చాడ్పునన్ !
    నీచపు వృత్తుల న్నభము - నిల్చును ! పిమ్మట మాయమౌను !తా
    వాచకు డై ,గనం బడడు ! - పర్వత మందున గానుపించ గా
    జూచిరి భీమసేన సుతు ! - సూతియు ,సుభద్ర సంభ్రమంబు గా !
    ___________________________________________

    రిప్లయితొలగించండి
  9. మందాకిని గారూ,
    అందమైన పూరణ. అభినందనలు.
    "చంద్రు నందమున" అంటే బాగుంటుంది.

    వసంత కిశోర్ గారూ,
    మంచి దృశ్యాన్ని ఎన్నుకొని ఉత్తమమైన పూరణ చేసారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ ధన్య వాదాలు. కానీ మొదటి పద్యంలో
    ఆఖరి పాదాన్ని ఇలా మారిస్తే నా భావాన్ని సరిగా ప్రకటించినట్లు అవుతుందేమో అనిపిస్తోంది.

    చూచిన దివ్య మంత్రములు సుందర కాండము నందు పెక్కులై
    దోఁచు, నడంగు, వెండియును దోఁచు, నడంగు మెఱుంగు చాడ్పునన్
    పీచ మడంచు కష్టములఁ ప్రీతిగ సాధన జేయ, పాపముల్
    మోచకమై తరించి తుద మోదము తోడుత రాము జేరెడిన్.

    భూమిజానాథుడు సరైన సమాసం అనుకుంటున్నాను.

    హనుమచ్చాస్త్రి గారూ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. మిస్సన్న గారూ,
    నిజమే. ఇప్పుడు మీ పూరణ సర్వాంగసుందరమై శోభిస్తున్నది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి