21, జూన్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -370 (వ్యాఘ్ర మాఁకొని)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి.

12 కామెంట్‌లు:

 1. మాటు వేసెను పొదలను చాటు జేసి
  వ్యాఘ్ర మాఁకొని ;మేసెను పచ్చగడ్డి
  లేడి ప్రక్కన మిత్తిని జూడ లేక;
  యెవరి యాకలి వారిది యేమి చెపుదు?

  రిప్లయితొలగించండి
 2. జింకఁగనినను వచ్చును చిక్కెనంచు
  వ్యాఘ్ర మాఁకొని; మేసెను పచ్చగడ్డి,
  చెంగు చెంగున గెంతెడి చిన్న జింక
  నింక గొనిపొమ్ము రమ్మిక నీల నయన!

  రిప్లయితొలగించండి
 3. శ్రీపతిశాస్త్రిమంగళవారం, జూన్ 21, 2011 2:58:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  వ్యాఘ్రమాకొని మేసెను పచ్చ గడ్డి
  అన్న చందాన కొందరు ఆశపరులు
  కోట్ల నాస్తులు కలిగియు కుత్సితముగ
  పేద ప్రజలను దోచిరి భేషజముగ (ఖేదపడక

  రిప్లయితొలగించండి
 4. వన్య జీవుల రక్షింప వలెనటంచు
  వ్యాఘ్ర సింహాల జింకల వర్ణ పటము
  లడవి ముంగిట బెట్టిగ నావు యొకటి
  వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి!

  రిప్లయితొలగించండి
 5. ఱంకె వెట్టుచు, గిట్టను ఱాచి నేల,
  గెంతి, లంఘించి, తలయూచి, గీటి కొమ్ము
  యెంత అలజడి రేపెనీ యెద్దు! కాదు
  వ్యాఘ్ర మాఁకొని మేసెను పచ్చగడ్డి!

  రిప్లయితొలగించండి
 6. శ్రీపతిశాస్త్రిబుధవారం, జూన్ 22, 2011 6:42:00 AM

  శ్రీగురుభ్యోనమ:

  పళ్ళు పటపట కొరుకుచు పెళ్ళగించె
  భూరుహంబును, కీచకు జేరి దునుప.
  విధికి తలయొగ్గి నిలచెను వీర భీమ
  వ్యాఘ్రమాకొని మేసెను పచ్చగడ్డి

  రిప్లయితొలగించండి
 7. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  "యెవరి యాకలి వారిది యేమి చెపుదు?" ప్రకృతిధర్మాన్ని చక్కగా వివరిస్తున్నది మీ పూరణ. చాలా బాగుంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  అందమైన పూరణ. బాగుంది. అభినందనలు.
  ఇంతకీ ‘నీలనయన’ అని పిలిచింది పులినే కదా!

  శ్రీపతి శాస్త్రి గారూ,
  ఉత్తమమైన పూరణ మీది. ‘గడ్డిమేసే మానవవ్యాఘ్రాల గురించి చక్కగా చెప్పారు. అభినందనలు.
  మీ రెండవ పూరణకూడ బాగుంది. ‘దునుప’ అన్నచోట ‘దునుమ’ అంటే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 8. మంద పీతాంబర్ గారూ,
  నిజమే! పోస్టర్లను తినే ఆవులు అప్పుడప్పుడు దృష్టికి వస్తుంటాయి. చక్కని పూరణ. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  పులిలాంటి ఎద్దును కళ్ళకు కట్టించారు. చక్కని పూరణ. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. హహ్హహ్హ....పులిని నీలనయన అని పిలవటం కూడా బాగుంది, గురువుగారూ!
  జింకల్ని పెంచుకునేవాళ్ళు ఒకరికొకరు "జింక గడ్డి మేయటం అయిందికదా! చెంగుచెంగున గంతులేసే జింకని చూసిందంటే పులి వచ్చేస్తుంది . వెంటనే తీసికెళ్ళమ"ని హెచ్చరించుకున్నట్టు ఊహించాను.

  మిత్రులందరి పూరణలూ వైవిధ్యభరితంగా బాగున్నాయి.

  రిప్లయితొలగించండి
 10. మందాకిని గారూ,
  చెప్పాను కదా! మిత్రుని మరణంతో మనస్సు నిలకడగా లేదు. పద్యభావాన్ని అవగాహన చేసికొనడంలో విఫలమయ్యాను. మన్నించండి. మీరు ఆశ్రమమృగాన్ని గురించి చెప్పారనుకోలేది. ఇప్పుడు మీ పూరణ ఇంకా సుందరంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 11. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  చదువుకునేటప్పుడు మిత్రులతో కలసి లంచాలు తీసుకో కూడదనీ ,
  అదనీ యిదనీ యింకా యెన్నెన్నో ప్రతిఙ్ఞలు చేసిన ఒక భానుడి కథ :

  01)
  _________________________________

  భార్య కోర్కెలు దీర్చగ - భాను మూర్తి
  బల్ల క్రిందకు చేతులు - పరుప సాగె !
  భవ్య భారత పౌరుడు - భగ్న మయ్యె !
  వ్యాఘ్ర మాఁకొని మేసెను - పచ్చగడ్డి !
  _________________________________

  రిప్లయితొలగించండి
 12. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి