19, జూన్ 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 80 (కప్పను జూడంగఁ బాము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 24
సమస్య -
"కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్"
కం.
కుప్పలకావలి కేఁగఁగఁ
జెప్పులు కఱ్ఱయునుఁ బూని శీఘ్రముగాఁగన్
జప్పుడుఁ జేయుచు జను వెం
కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

16 కామెంట్‌లు:

  1. చప్పున మ్రింగగ బోయెను
    కప్పను జూడంగఁ బాము; గడగడ వడఁకెన్
    కప్పయె బెక బెక మనుచును
    అప్పుడు తా కాల్వ ప్రక్క నడుసున దాగెన్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వేగంగా స్పందించి, మంచి పూరణ నిచ్చారు. అభినందనలు.
    ‘అనుచును + అప్పుడు’ అన్నప్పుడు తప్పక సంధి వస్తుంది. ‘బెకబెక మని తా/నప్పుడు’ అందాం.

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ ! సవరణకు ధన్యవాదములు.చిన్న మార్పుతో...

    చప్పున మ్రింగగ బోయెను
    కప్పను జూడంగఁ బాము; గడగడ వడఁకెన్
    కప్పయె, బెక బెక మనితా
    నప్పుడు చిరు కాల్వ ప్రక్క నడుసున దూరెన్.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇప్పుడు మీ పద్యం సర్వాంగశోభితమై అలరారుతున్నది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  5. ఎప్పు డెవరు పిలిపించిన
    నప్పుడె నాగప్ప వచ్చి నాగుల బట్టున్ -
    చప్పున వచ్చెడు నా( నా
    గప్పను జూడంగ బాము గడగడ వణికెన్ !

    రిప్లయితొలగించండి
  6. తప్పవు నేడిక పెద్దల
    తిప్పలు, పిల్లల యలుకలుఁ దీర్చకఁ; గనగా
    నిప్పుడుఁ బోల్చగ వచ్చును -
    కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

    పెద్దలు పిల్లలను మందలించి మంచీ చెడూ చెప్పే కాలం ఏమయ్యిందో , అందరి ఇళ్ళల్లో పిల్లలు ఏం చెపితే అదే జరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  7. గొప్పలు చెప్పెడి కాంగ్రెసు
    ముప్పై చనుదెంచి జగను మొట్టుచు తలపై
    త్రిప్పగ చక్రము నవ్వగు
    కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

    రిప్లయితొలగించండి
  8. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పాములను పట్టే వాడి పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    పిల్లల్ని కప్పల్ని చేసిన మీ పూరణ బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అవును ! నిజమే తమ్ముడూ ! ఒకోసారి అర్ధ రాత్రి నిద్ర పట్టక పొతే " లేచి బుక్ చదివినా .టి.వి. చూసినా , ఇలా కంప్యూటర్ ముందు కూర్చున్నా ,నిద్ర వస్తుంది. కాక పొతే కాస్త ఆరోగ్యం కుడా చూసు కోవాలి కదా ? మీరు ఆరోగ్యం గా ఉంటేనే కదా ! మేమంతా ఇలా పాల్గొన గలం ? అంతే అందుకని .చెప్పానన్న మాట . సరే జాగ్రత్త మరి ఆశీర్వదించి అక్క

    రిప్లయితొలగించండి
  10. రాజేశ్వరక్కా,
    మీ సలహాను పాటిస్తాను. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. కప్పలు కుప్పలు కుప్పలు
    మెప్పుగ వల్మీకము చుట్టు బెక బెక లాడన్ !
    చప్పున పడగెత్తి వినగ
    కప్పను జూడంగ బాము గజ గజ వడ కెన్ !

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరక్కా,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ఇక్కడా రెండవపాదంలో యతి తప్పింది. ‘ము, బు’లకు యతిమైత్రి ఉంది. కాని ‘మె, బె’లకు లేదు. ‘మెప్పుగ వల్మీకము చుట్టు మెలగుచు మ్రోయన్’ అందాం.

    రిప్లయితొలగించండి
  13. ఎంత బాగుంది తమ్ముడూ ! సవరణ మాటేమో గాని పిలుపులో ఎంతటి మాధుర్యం ? ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _______________________________

    తిప్పలు తప్పవు మీకిక
    చప్పున పడిపోవు మీదు - చపలపు ప్రభుతే
    గొప్పలు చెప్పగ జగనే !
    కప్పను జూడంగఁ బాము - గడగడ వడఁకెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. ఎప్పటి కెయ్యది ప్రస్తుత
    మప్పటికా మాటలాడి మనుజుల కడ పల్
    మెప్పులు పొందుచు కులికెడి
    కప్పను జూడంగఁ బాము గడగడ వడఁకెన్

    రిప్లయితొలగించండి