18, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 79 (ఉత్తరమున భానుబింబము)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 23
సమస్య -
"ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్"
కం.
అత్తుగఁ దూరుపుఁ బడమరఁ
జిత్తరువు లిఖించి నిదురఁ జెందితి నౌరా!
చిత్తరువు వ్రాయఁ బోవలె
నుత్తరమున; భానుబింబ ముదయం బాయెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

23 కామెంట్‌లు:

  1. హత్తుకు పోయిన వలపుల
    చిత్తరువు లిఖించె చెలియ అక్షరములతో
    మత్తుగ! మునిగెను చెలువుడు
    యుత్తరమున; భానుబింబ ముదయం బాయెన్.

    (వెంకన్న గారి బాటలోనే)

    రిప్లయితొలగించండి
  2. ఎత్తగు ఎవరె స్టెక్కడ ?
    హత్తెరి పండేమి దొరకె హనుమకు? ఏలా
    ఇత్తరి కోడియె కూసెను?
    ఉత్తరమున; భానుబింబ, ముదయం బాయెన్

    రిప్లయితొలగించండి
  3. మిత్రుల పూరణలు బహు సుందరముగా నున్నాయి.


    ఉత్తరములనే వ్రాయం
    దత్తర పడుచును పరీక్షఁ, దండనఁ బొందన్ -
    కొత్తగఁ రాసెను బాలుడు-
    "ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్"

    చిత్తుగఁ దిక్కులు దెలియక
    మత్తుగ దాగిన తదుపరి మాదయ వాగెన్
    హత్తెరి! నేడే వింతగ
    ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్.

    చిత్తరువులఁరమ్యముగఁ,మ
    హత్తరముగఁ ననుఁ, రవినని యనకన్ హౌరా!
    ఇత్తరి రచియించితివే!!
    ఉత్తరమున -భానుబింబ ముదయం బాయెన్.

    (రవి అనే అతని చెలి బొమ్మలు బాగా గీయగలదు. రవికి ఉత్తరము వ్రాస్తూ, రవి అని సంబోధించక రవి బొమ్మ గీసిందన్నమాట.)

    రిప్లయితొలగించండి
  4. గురువు గారికి నమస్కారములతో,
    సవరణలకు ధన్యవాదములు
    ఉత్తర గోగ్రహణమందు ఉత్తరకుమారుని పలుకులు పార్థుని దయతో నిజమైనవి
    క: ఉత్తర కుమారుడు బలికె
    నుత్తరియములను బహుమతి నిచ్చెడ నీకున్
    నుత్తర ! పార్థుని దయతో
    నుత్తరమున భాను బింబ ముదయంబాయెన్

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    కాని రెండవపాదంలో యతి తప్పింది.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశ్నోత్తరరూపమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీ మూడు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందలు.
    మొదటి పూరణలో ‘కొత్తగ’ కాదు ‘క్రొత్తగ’.

    వరప్రసాద్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింపదగిందే. కాని ‘ఉత్తరీయం‘లో రీ ని హ్రస్వం చేసారు. అన్వయం కూడా కొద్దిగా ఇబ్బంది పెడుతున్నది.

    రిప్లయితొలగించండి
  6. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    మందాకిని గారూ !మీ పద్య కవితా ధార మంద గమనంతో మొదలై మందాకినీ ఝరిలా సాగుతోంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మాస్టరుగారూ ! ధన్యవాదములు.
    మందాకిని గారూ !మీ పద్య కవితా ధార మంద గమనంతో మొదలై మందాకినీ ఝరిలా సాగుతోంది.అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. ఉత్తర దిక్కున గల తెర
    నెత్తిరి ; " సూరజ్ ఫిలిం " సనెడు టైటిలుతో
    నత్తరి మొదలయె సినిమా ;
    ఉత్తరమున భానుబింబ ముదయం బాయెన్ !

    ఒక సినిమా హాలులో ఉత్తరము వైపున సినిమా తెర వుంది. సినిమా ప్రారంభంలో " సూరజ్
    ఫిలింస్ " అనే టైటిల్ పడగానే సూర్యోదయాన్ని చూపించారు ...........

    రిప్లయితొలగించండి
  9. హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పలుకులే శుభాశీస్సులు.
    ఇందరి మిత్రుల ఆశీస్సులు లభించిన నాది అదృష్టము.

    రిప్లయితొలగించండి
  10. గురువుగారూ పొరబాటుకు చింతిస్తున్నాను.

    సవరించిన నా పూరణ:

    హత్తుకు పోయిన వలపుల
    అత్తరు చిలికించె చెలియ అక్షరములతో
    మత్తుగ! మునిగెను చెలువుడు
    యుత్తరమున; భానుబింబ ముదయం బాయెన్.

    రిప్లయితొలగించండి
  11. ఎత్తగు గోడను కట్టకు
    ముత్తరమున; భాను బింబ ముదయం బాయెన్
    యిత్తరి నెండలు మండును,
    మొత్తము ప్రహరీని కట్ట బోదువె నేడే?

    రిప్లయితొలగించండి
  12. చిత్తరువు గీసి, కోమలి
    చిత్తమ్మును దోచెనేమొ,చిన్నది ప్రేమో
    న్మత్తునబడె, నేమున్నదొ
    నుత్తరమున, భాను బింబ ముదయంబాయెన్ !

    రిప్లయితొలగించండి
  13. ఇత్తరి కందము సీసము
    మత్తుగ నే చదివి చదివి మానస మందున్ !
    చిత్తుగ నే వ్రాయ బోవగ
    నుత్తరమున భానుబింబ ముదయంబాయన్ !

    రిప్లయితొలగించండి
  14. నాగరాజు రవీందర్ గారూ,
    వహ్వా! పసందైన పూరణ మీది. చాలా బాగుంది. అభినందనలు.

    మిస్సన్న గారూ,
    సవరించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘చెలువుడు + ఉత్తరమున’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెలువుం డుత్తరమున’ అంటే సరి.
    మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదం ప్రారంభంలో యడాగమం రాదు. అక్కడ ‘ఇత్తరి’ అని అచ్చుతో మొదలెడితే దోషం కాదు.

    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ అన్ని విధాలా బాగుంది. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో గణదోషం. ‘చిత్తుగ వ్రాయఁ గడంగిన" అంటే సరి.

    రిప్లయితొలగించండి
  15. అవునూ ! ఇంత పొద్దున్నే అంటే రాత్రి ౨.౩౦ కి మేలుకొని సవరణలు చేస్తున్నారా ? ఆరోగ్యం జాగ్రత్త . ఇప్పుడు మా పద్యాలకు తొందర ఎం వచ్చింది. ? నిద్ర లేకుండా ? ఎందుకు ? దయచేసి అలా చేయకండి. ముందు మీ ఆరోగ్యం . తర్వాతే కదా ఇవన్నీ ? ఈ అక్కమాట కాస్త వినమని ప్రార్ధన

    రిప్లయితొలగించండి
  16. రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    ఎందుకో ఆ సమయంలో మెలకువ వచ్చి, ఎంతకూ నిద్ర పట్టలేదు. కాసేపు కంప్యూటర్ చూస్తే కళ్ళు అలసటకు గురై నిద్ర పడుతుందనుకున్నాను. అనుకున్నట్టే నిద్ర ముంచుకొచ్చింది.

    రిప్లయితొలగించండి
  17. గురువు గారూ ! నా పూరణ మీకు అంతగా నచ్చినందులకు నేను ధన్యున్ని .

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ పునస్సవరణలకు ధన్యవాదాలు.
    'ఉదయం బాయెన్' అన్న తర్వాత ' , ' (విరామ చిహ్నం - కామా) ఉంటుందనుకొని
    యిత్తరి అని (యడాగమ సంధి) చేశాను. నా అభిప్రాయం సరైనదేనా?
    భవదీయుడు.

    రిప్లయితొలగించండి
  19. క్రొత్తయె లేదిచ్చట నువు
    తత్తర పడనేల జూన్లొ తారక రామా!
    ఉత్తర దేశములందున
    నుత్తరమున భానుబింబ ముదయం బాయెన్

    రిప్లయితొలగించండి