12, జూన్ 2011, ఆదివారం

సమస్యా పూరణం -361 (చెమటలు గారినవి మేన)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

 1. కొమరయ్య నిన్న నొంటి, పొ
  లమునకు కావలికి వెళ్ళె, రాతిరి కలలో
  యమ భటులే కను పించగ
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్!

  రిప్లయితొలగించండి
 2. హ..హ..హ.. శాస్త్రిగారూ బాగుందండీ మీ పూరణ. కానీ మా కొమరయ్య అంత పిరికివాడు కాదండి :-)

  రిప్లయితొలగించండి
 3. మురళి మోహన్ గారూ ! ధన్యవాదములు.
  చెమటలు పట్టింది నిద్రలోనే లెండి.మేలుకొన్న తరువాత ధైర్యం గానే ఉన్నాడు మన కొమరయ్య !

  రిప్లయితొలగించండి
 4. యమహాపై సఖు లిద్దరు
  యమ వేగము వెళ్ళుచుండ నడవుల త్రోవన్
  యమపులి గనబడ, వారికి
  చెమటలు గారినవి మేన శీతల రాత్రిన్

  ( యమపులి = యముని వంటి పులి ;
  కరెక్టేనా ! ? గురువు గారూ ! )

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  __________________________________

  అమలాపురమున నేనొక
  కమలాక్షి వరించి, వెంట - కదలగ ! జిహ్వా
  పము నుసిగొల్పెను; భయమున
  చెమటలు గారినవి, మేన - శీతల రాత్రిన్ !
  __________________________________
  జిహ్వాపము = కుక్క

  రిప్లయితొలగించండి
 6. సుమ శయ్య వేదికై, మరు-
  సమరములో క్రొత్త జంట సమ యుజ్జీలై,
  మమతలు గెలిచిన వేళను
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్!

  రిప్లయితొలగించండి
 7. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జూన్ 12, 2011 11:35:00 AM

  అమవశనిశి, కాల్నడకన,
  యమరిన యా తాటి చెట్లు యమభటులని, నే
  భ్రమపడి నక్కితినిక, ము
  చ్చెమటలు గారినవి మేన శీతల రాత్రిన్.

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జూన్ 12, 2011 11:38:00 AM

  మిస్సన్న గారు, శృంగారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. అభినందనలు. అద్భుతమైన పూరణ.

  రిప్లయితొలగించండి
 9. రమణుండనునొకవర్తకు
  డుమనంబునభీతిఁజెందడుయడవులందున్
  కొమరునకుభయముగల్గెన్
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్!

  రిప్లయితొలగించండి
 10. సంపత్ కుమార్ శాస్త్రి గారూ ధన్య వాదాలండీ.
  మీ పూరణ సహజంగా చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 11. కిషోర్ జీ! ధన్యవాదములు.
  రహస్యాలు చెపితే ఎలాగండీ!....పూరణను పరుగు పెట్టించారు..బీభత్స రసమొలికించారు ..
  మిస్సన్నగారూ ! శృంగార రసం పొంగులువారింది.
  మందాకిని గారూ! కరుణ రసం కురిపించారు.
  రవీందర్ గారూ, సంపత్ గారూ భయానక దృశ్యాని చూపించారు...
  అందరకూ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. శ్రీపతి శాస్త్రిఆదివారం, జూన్ 12, 2011 3:20:00 PM

  శ్రమపడు కార్మికుడొక్కడు
  తమ బిడ్డల బాగు కోరి తాపములోర్చెన్
  క్రమముగ బరువులు మోయగ
  చెమటలు గారినవి మేని శీతలరాత్రిన్.

  రిప్లయితొలగించండి
 13. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  అద్భుతంగా ఉంది మీ పూరణ. మీరు కవిమిత్రుల పూరణలలో శృంగార, కరుణ, బీభత్స, భయానక రసాలను చూస్తే, నేను మీ పూరణలోని హాస్యరసాన్ని ఆస్వాదించాను. అభినందనలు. కవిమిత్రుల పూరణలను ప్రశంసించినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
  "యమపు" ప్రయోగమే బాగా లేదు. నా సవరణ ...
  "...... నడవిని శార్దూ
  లము గనబడగా, వారికి ...."

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
  ఉన్మాద ‘జిహ్వాపాల’ బెడద రాష్ట్రంలో ఎక్కువగా ఉందట! కాస్త జాగ్రత్త సుమండీ ...

  రిప్లయితొలగించండి
 16. మిస్సన్న గారూ,
  సరసమైన పూరణ మీది. బాగుంది. అభినందనలు.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  "అమవశనిశి" కి బదులు పెద్దన గారి "అమవసనిసి"ని ప్రయోగిద్దాం.

  రిప్లయితొలగించండి
 17. మందాకిని గారూ,
  బాగుంది మీ పూరణ. యతిస్థానంలో ‘డు’ ప్రత్యయాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. అభినందనలు.
  ‘చెందడు + అడవులందున్’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘చెందడు వనమునందున్’ అందాం.

  రిప్లయితొలగించండి
 18. కోడీహళ్ళి మురళీ మోహన్ గారూ,
  మీకు ప్రత్యేక ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతి శాస్త్రి గారూ,
  ‘శంకరాభరణం’ బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
  ఉత్తమమైన పూరణతో అడుగుపెట్టారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 20. శంకరార్యా !ధన్యవాదములు.వసంత కిషోర్ గారి పూరణ ద్వారా ఈ రోజు 'జిహ్వాపము' అనే క్రొత్త పదాన్ని నేర్చుకున్నాను.
  శ్రీపతి శాస్త్రి గారూ!మంచి పూరణ చేశారు.సుస్వాగతం.

  రిప్లయితొలగించండి
 21. గురువుగారికి నమస్కారములు. కవి పండితులకు వందనములు. ఈ బ్లాగును ఇటీవలె చూచినాను. చాలా బాగున్నది ఒక చిన్న ప్రయత్నంగా పై పద్యము వ్రాసినాను. గురువుగారికి కృతజ్ఞతలు

  శ్రీపతి శాస్త్రి

  రిప్లయితొలగించండి
 22. శాస్త్రి గారూ , భలే దర్శనం చేసి మాకూ చేయించారండీ, ధన్యవాదాలు.


  గురువు గారూ, ధన్యవాదాలు.
  కానీ అడవి యందు కలిగే భయము వనమునందు కలగదే అన్న అసంతృప్తి మిగిలింది.
  అందుకే ఇంకో పూరణ రాస్తున్నాను.

  ఘుమఘుమవంటలనెన్నో
  కమలామణిఁదానువండె. ఘనమగు విందే
  యమరే మాపుకు. నయ్యో,
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్!

  రిప్లయితొలగించండి
 23. రమణీ మణులంత జేరి
  కమనీయపు వనము నందు కమనుని చుట్టన్ !
  తమిగొని రమణుడు బెదరగ
  చెమటలు గారినవి మేన శీతల రాత్రిన్ !

  రిప్లయితొలగించండి
 24. యమరే స్థానములో యమరెన్ ఉండాలి. టైపాటు.

  రాజేశ్వరి అక్కయ్య గారూ, పద్యం బాగా వచ్చిందండి. మొదటి పాదంలో గణదోషం ఉందనుకుంటా. రమణీమణులెల్లరు నా (ఎల్లరున్ + ఆ ) అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 25. మందాకిని గారూ ! సవరణ చేసి నందులకు ధన్య వాదములు

  రిప్లయితొలగించండి
 26. శంకరార్యా ! ధన్యవాదములు !
  శాస్త్రిగారూ ! ధన్యవాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

  రిప్లయితొలగించండి
 27. మందాకిని గారూ,
  అడవి, వనం పర్యాయపదాలే కదా. వన మంటే మీరు ఉద్యానవనం అనే అర్థాన్ని తీసుకున్నారా?
  మీ రెండవ పూరణకూడా బాగుంది. అభినందనలు.
  రాజేశ్వరి గారి పద్యానికి సవరణ తెలిపినందుకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 28. రాజేశ్వరి నేదునూరి గారూ,
  పూరణ బాగుంది. అభినందనలు.
  మందాకిని గారి సవరణను గమనించారు కదా. సంతోషం!

  రిప్లయితొలగించండి
 29. గురువు గారూ ! మీ దిద్దుబాటు సరిగ్గా సరిపోయింది.
  ధన్యవాదములు .

  యమహాపై సఖు లిద్దరు
  యమ వేగము వెళ్ళుచుండ నడవిని శార్దూ
  లము గనబడగా వారికి
  చెమటలు గారినవి మేన శీతల రాత్రిన్

  రిప్లయితొలగించండి
 30. కమలమును నీట గాంచిన
  కమలాక్షులకు కవులకును కన్నుల పండౌ
  మమతకు రాహులు గాంధికి
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్

  రిప్లయితొలగించండి
 31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి


 32. మెండుగ జిలేబి వేడగ మెచ్చె కపుడు
  మండు టెండలో కురిసెను మంచు జల్లు
  యండగొట్టక చల్లని యాశుగమ్మె
  చండ రుక్కటు దాగెను జలధరమున !

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు


  1. ఎక్కడో వేయాల్సింది

   వేరెక్కడనో వేసెనా జిలేబి‌? :)


   జిలేబి

   తొలగించండి
 33. ధమికిలు నివ్వగ భాజప
  చిమచిమ లాడుచు తుడుచుచు చీమిడి ముక్కున్
  మమతకు గణనము నందున
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్

  రిప్లయితొలగించండి


 34. అమనస్కుడనై నడిచితి
  సమాధులన్ దాట పెనుమసనమని తెలిసెన్
  ఘుమఘుమ మల్లెల వాసన!
  చెమటలు గారినవి మేన శీతలరాత్రిన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి