4, జూన్ 2011, శనివారం

చమత్కార పద్యాలు - 65 (అక్కా రమ్మనుచు మగఁడు)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 9
సమస్య -
"అక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్"
కం.
రక్కసివలె నే ప్రొద్దును
మెక్కుచుఁ దిరిగెదవి కాలిమెట్టున నిన్నున్
గుక్కక మానను 'దసి నీ
యక్కా!' రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

14 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !

    01)
    __________________________________

    ముక్కోపగు నారాయణ
    కక్కాజమ్మకు జరిగెను - కల్యాణంబే !
    అక్కాజమ్మను ముద్దుగ
    అక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  2. padyam.netలో ఈ సమస్యకు నేను చేసిన పూరణలు:

    1. చక్కంగనుండు పచ్చడి
    గ్రక్కున వాడు పలనాటి కారము వలనన్
    మక్కువ మీరగ తెచ్చితి
    నక్కారమ్మనుచు, మగఁడు నాలిం బిలిచెన్

    ఆ + కారమ్ము + అనుచు = అక్కారమ్ము + అనుచు = అక్కారమ్మనుచు ( త్రిక,ఉకార సంధులు)
    .............................
    పెక్కగు మందుల కంటే
    కిక్కెక్కువనిచ్చునాలి క్రీఁగను చూపుల్
    నిక్కము సతియే మందుల
    కక్కారమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!!

    మందులకు+అక్క+ఆ+రమ్ము+అనుచు = మందులకక్కారమ్మనుచు
    {మందులన్నిటికి అక్క అయిన ఆ రమ్ము (ఒక మందు Brand) యే తన భార్య అని తలచి...}

    రిప్లయితొలగించండి
  3. క: కుక్కలు రక్కిన పిక్కలు
    చుక్కలు జూప, దన రోజు జక్కగ లేకన్
    జిక్కితినె, గోపమున నీ
    యక్కా, రమ్మనుచు మగడు నాలింబిలిచెన్,

    రిప్లయితొలగించండి
  4. చక్కటి బొమ్మా!గంధపు
    చెక్కన మలచిన వరాల చెలువా! బండీ
    నెక్కవె, నామరదలిచి
    న్నక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్"

    రిప్లయితొలగించండి
  5. ఈ పద్యం ఎక్కడో చూశానండి. అప్పట్లో నేను రాసుకున్న పూరణ.

    చక్కగ వండిన పప్పున
    గ్రక్కున మిరియంపుకాయఁ గరచి వగచుచున్!
    ఠక్కున నీరుం దే! హ! హ!
    హ! క్కారమ్మనుచు మగడు నాలిం బిలిచెన్

    రిప్లయితొలగించండి
  6. చక్కని పేరని రమణిని
    మక్కువగా వలచి యతడు పరిణయ మాడన్ !
    చెక్కిలి మీటుచు ప్రేమగ రమ
    ణక్కా రమ్మనుచు మగడు నాలిం బిలిచెన్ !

    రిప్లయితొలగించండి
  7. నూతన వధూవరులు నమస్కారములు చేసే సందర్భంలో...

    గ్రక్కున వరుడే బిలిచెను
    అక్కా! రమ్మనుచు ;మగఁడు నాలిం బిలిచెన్
    అక్కకు బావకు మ్రొక్కగ
    తక్కిన పనులన్ని మనకు తరువాతనియెన్!

    రిప్లయితొలగించండి
  8. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "ముక్కోపి + అగు" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "ముక్కోపి యైన నారయ/ కక్కాజమ్మకు" అంటే ఎలా ఉంటుంది?

    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ పద్యం చక్కగా ఉంది. అభినందనలు.

    మందాకిని గారూ,
    మీ పూరణ నిజంగానే గంధపు చెక్కన చెక్కిన బొమ్మలా శోభిస్తున్నది. మంచి పూరణ. అభినందనలు.

    రవి గారూ,
    హ .. హ ... హా ... హాయిని గుర్చిన మీ పూరణ అలరించింది. అభినందనలు.

    రాజేశ్వరి నేదునూరి గారూ,
    రమణీయమైన మీ రమణక్క పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అక్కాబావలకు మ్రొక్కించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. గురువుగారూ!ధన్యవాదములు. నిజానికి పూరణ అను గంధపుచెక్కకు మీ ప్రశంస గుబాళింపు.

    రిప్లయితొలగించండి
  10. పిక్కల పైదాకా నువ్
    చుక్కల చీరెను బిగించి చూపుల్ గ్రుచ్చన్
    చక్కని దౌ రంభయె నీ
    కక్కా? రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!

    రిప్లయితొలగించండి

  11. ముక్కోపిది నా పెండ్లా
    మక్కా!;...రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్
    రక్కసి! హిడింబ సాటివి!
    గ్రక్కున చూపుము కొడుకును గండరగండున్!

    రిప్లయితొలగించండి


  12. సక్కంగున్నవు నీవెం
    సక్కంగున్నవు జిలేబి ! సల్లాపముగా
    పక్కన రా, నా మరదలి
    అక్కా, రమ్మనుచు మగఁడు నాలిం బిలిచెన్!


    జిలేబి

    రిప్లయితొలగించండి