23, జూన్ 2011, గురువారం

సమస్యా పూరణం -372 (సన్యాసికి పిల్ల నొసఁగ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సన్యాసికి పిల్ల నొసఁగ సంబరపడియెన్.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

36 కామెంట్‌లు:

  1. కన్యామణి ప్రేమను గని,
    ధన్యత వారిని కలుపగ తలిదండ్రులె, తా
    మన్యుల నొల్లక, సొగసరి
    సన్యాసికి, పిల్ల నివ్వ సంబరపడియెన్!

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇంత స్పీడా? ఇంతకూ వరుని పేరు ‘సన్యాసి’ అంటారు. నే ననుకున్న భావం మొదటి పూరణలోనే మీరు వెలిబుచ్చారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అన్యముఁదలపక సుందర
    కన్యామణియగు సుభద్ర కై,యతి యయ్యెన్
    ధన్య సుభద్రయెనని హరి
    సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్.

    రిప్లయితొలగించండి
  4. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    సుభద్రా పరిణయం సంబర పడేలా జేసిన మందాకినీ గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శ్రీపతిశాస్త్రిగురువారం, జూన్ 23, 2011 8:19:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    మాన్యుడు కృష్ణుడు ఫల్గును
    సన్యాసిగమార్చి దాను సహృదయముతో
    కన్యాదానము జేయుచు
    సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియన్

    రిప్లయితొలగించండి
  6. కన్యకు మహరాజు తలచె
    పుణ్యాత్ముడు ఋష్యశృంగు పొత్తును గూర్చన్
    అన్యుల మేలును గోరుచు
    సన్యాసికి పిల్లనివ్వ సంబర పడియెన్ !

    రిప్లయితొలగించండి
  7. సన్యాసిరా వను నతడు
    పాణ్యమనెడు పురము నందు , వ్యాపారము చే (
    సన్యుల మించెన్ ; మామయు
    సన్యాసికి పిల్లనివ్వ సంబర పడియెన్ !

    రిప్లయితొలగించండి
  8. కన్యా దానము చేసెను
    మాన్యుడు హిమవంతు డపుడు మాలిమి గిరిజన్
    దైన్యం బడగిన మేనా
    సన్యాసికి పిల్లనివ్వ సంబర పడియెన్ !

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతిశాస్త్రిగురువారం, జూన్ 23, 2011 6:52:00 PM

    కవి మిత్రులు మన్నించాలి. నా పూరణలో గణము తప్పినందుకు సవరణ గ్రహింప ప్రార్థన.--శ్రీపతిశాస్త్రి
    మాన్యుడు కృష్ణుడు ఫల్గును
    సన్యాసిగ మార్చి తెచ్చె స్వయముగ తానే
    కన్యాదానము చేసెను
    సన్యాసికి పిల్లనివ్వ సంబరపడుచున్

    రిప్లయితొలగించండి
  10. కన్య శశిరేఖ తా నభి
    మన్యుని ప్రేమించి వాని మగనిగ నెంచెన్ !
    "అన్యాయము ! ! " సీరి పిఱికి
    సన్యాసికి పిల్లనివ్వ సంబర పడియెన్ !

    సీరి = బలరాముడు ;
    పిఱికి సన్యా(న్నా)సి = లక్ష్మణ కుమారుడు ( ఒక్కసారి "మాయా బజార్" సినిమాను గుర్తుకు తెచ్చుకోండి ! )

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రుల పూరణలు వైవిధ్యంగా, అందంగా వున్నాయి. నాపూరణ:
    మహాభారతం, ఆదిపర్వంనుంచి, వాసుకి జరత్కారు మహామునితో అంటున్న మాటలు:
    కన్య సనామయై తా
    ధన్యత నందెన్, మదర్పిత జరత్కారున్
    కన్యా భిక్షగ గొనుమని
    సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్.

    రిప్లయితొలగించండి
  12. మొదటిపాదం సవరణతో:
    కన్య సనామ యగుటచే
    ధన్యత నందెన్, మదర్పిత జరత్కారున్
    కన్యా భిక్షగ గొనుమని
    సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులందరికీ వందనములు !
    ఇంట్లో ఫోను చెడిపోవడం వలన పది రోజులనుండీ
    మిత్ర దర్శనానికి దూరమయ్యాను !

    ఆరోగ్యం కూడా సరిగా లేక net సెంటరుకు వెళ్ళలేక పోయాను !

    పది రోజుల తరువాత మిత్రులనూ వారి పూరణలనూ చూస్తుంటే
    మహదానందముగా నున్నది !

    వసంత్ కిశోర్

    రిప్లయితొలగించండి
  14. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    బహుశా " సీతా రామ కల్యాణం " సినిమాలో ననుకుంటాను !
    ఒకసారి వాణి బ్రహ్మ సృష్టిని పరిహసిస్తుంది !
    ప్రతిక్రియగా అహల్యను సృష్టిస్తాడు బ్రహ్మ !
    అదే సమయానికి అక్కడకు వచ్చిన నారదుడు పెట్టిన పరీక్షలో నెగ్గిన
    గౌతమునికి అహల్యనిచ్చి వివాహం చేస్తారు ! అదీ కథ !

    01)
    _______________________________

    కన్యాగ్రహణము కొరకై
    సన్యాసగు నారదుండు - సలుప పరీక్షన్
    ధన్యత జెందిన, గౌతమ
    సన్యాసికి పిల్ల నివ్వ - సంబరపడియెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  15. 02)
    _______________________________

    సన్యాసి వేష మందున
    విన్యాసము జేయ , మురిసి - వేదాధిపుడే!
    పుణ్యంబ నెంచి మదిలో
    సన్యాసికి పిల్ల నివ్వ - సంబరపడియెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  16. అన్యాయము కాదనుకొని
    కన్యా దానము సలుపగ సన్యాసి వేష మైనన్ !
    మాన్యుడు జామాత యైనచొ
    సన్యాసికి పిల్ల నివ్వ సంబర పడియెన్ !

    రిప్లయితొలగించండి
  17. పుణ్యప్రదముగ కవితా
    కన్యను శంకర గురువుల కంకితమిచ్చెన్
    మాన్య సుకవి ధన్యుడగుచు
    సన్యాసికి పిల్ల నివ్వ సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులకు వందనాలు.
    సమస్యగా ఇచ్చిన పద్యపాదంలో ‘ఇవ్వ’ శబ్దప్రయోగం వ్యాకరణరీత్యా దోషమన్న విషయాన్ని డా. విష్ణునందన్ గారు సవివరంగా నాకు మెయిల్ ద్వారా తెలియజేసారు. వారికి ధన్యవాదాలు. వారి సూచన మేరకు ‘ఇవ్వ’ శబ్దాన్ని తొలగించి ‘ఒసఁగ’ అని సవరించాను. గమనించమని మనవి. తీరిక దొరకగానే అందరి పూరణలలో ఆ శబ్దాన్ని సవరిస్తాను.

    రిప్లయితొలగించండి
  19. మాస్టారూ, డా.విష్ణునందన్ గారి వివరణ ఇక్కడ పోస్ట్ చేస్తే మాఅందరకూ కూడా నేర్చుకొనే అవకాశం వుంటుంది కదా!

    రిప్లయితొలగించండి
  20. మందాకిని గారూ,
    సుందరమైన పూరణ. అభినందనలు.

    శ్రీపతి శాస్త్రి గారూ,
    (సవరించిన) మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    నాగరాజు రవీందర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా మూడవది ‘అదిరింది’.అభినందనలు.
    మొదటి పూరణ పూరణలో మహ(హా)రాజు అన్నచోట ‘దశరథుఁడు" అంటే బాగుంటుంది.

    మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ‘మేనా’ అనేది ‘మేనయె" అందాం.

    రిప్లయితొలగించండి
  21. చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    సంతోషం! ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుటపడింది కదా! ఈ పది రోజులు మీ లోటు కొట్టొచ్చినట్లు కనిపించింది. కొందరు మిత్రులు గుర్తు చేసారు కూడా. మీరు చూసే ఉంటారు. నేనూ మిమ్మల్ని సంబోధిస్తూ ఈరోజు వ్యాఖ్య పెట్టాలనుకున్నాను. ఈలోగా మీరే ప్రత్యక్షమయ్యారు. ధన్యవాదాలు.
    రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    రెండిటిలోను ‘సన్యాసి + అగు, అని + ఎంచి’ అన్నప్పుడు యడాగమం వస్తుంది.
    ‘సన్యాసియె నారదుండు’, ‘పుణ్యంబని యెంచి మదిని’ అందాం.

    రిప్లయితొలగించండి
  22. రాజేశ్వరక్కా,
    మంచి పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది. మూడవ పాదంలో గణదోషం. తమ్ముడికి హోంవర్క్ ఇస్తున్నారు. సరే!
    నా సవరణ ...
    అన్యాయము కాదనుకొని
    కన్యా దాన(మ్ము) సలుప(గా) సన్యాసిన్ !
    మాన్యుడు జామాత (యనుచు)
    సన్యాసికి పిల్ల నివ్వ సంబర పడియెన్ !

    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మరి కావ్యకన్యను స్వీకరించింది ఏ శంకరుడు? ఈ శంకరుడు ‘ఇంకా" సంసారియే!

    రిప్లయితొలగించండి
  23. చంద్రశేఖర్ గారూ,
    డా. విష్ణునందన్ గారు అనుమతిస్తే తప్పక ఇక్కడ ప్రకటిస్తాను.

    రిప్లయితొలగించండి
  24. శంకరయ్యగారూ , చంద్రశేఖర్ గారి సూచన మేరకు నేను పంపిన వ్యాఖ్య ప్రచురింపడంలో నాకేమీ అభ్యంతరం లేదు. వీలైతే కాస్త సమయం చూసుకుని మరి కొంచెం వివరణాత్మకంగా వ్యాఖ్యానించగలవాడను . ధన్యవాదములు .

    రిప్లయితొలగించండి
  25. ఇందాక చెప్పిన విషయానికి ఉపోద్ఘాతంగా ఒక రెండు మాటలు .
    తెలుగు క్రియాపదాల్లో , అసమాపక క్రియలలో మరలా విభాగాలుంటాయి . సంస్కృత పద విషయకంగా వాటిని చేదర్థకములు ( చేత్ అంటే అయినట్ట్లైతే అనే అర్థాన్నిచ్చే చేసినచో ,వచ్చినచో , రానిచో , లేనిచో ఇత్యాదులు ,. ) , తుమున్నర్థకములు ( కర్తుం అంటే చేయుటకు , వ్రాయుటకు , వినుటకు యిత్యాదులు ,. ) మొదలైనవి.
    చేయుటకు , వ్రాయుటకు మొదలైనవి సామాన్య వ్యావహారిక భాషలో చేయడానికి , వ్రాయడానికి మొదలైన రూపాంతరం సంతరించుకుంటాయి . ఇవి దేశ్యములు .
    ఇక సమస్య విషయానికి వస్తే , సన్స్యాసికి పిల్లనిచ్చుటకు ( ఇవ్వడానికి , ఇచ్చుటకోసం ) సంబరపడినాడన్నది.
    ఇది తుమున్నర్థకము . ఈ అనే ప్రత్యయానికి ఇచ్చుటకు అనేది ప్రామాణికమైన తుమున్నర్థకం. ' ఇవ్వడం ' అనడం , అందులోనుండి మరలా ' ఇవ్వ ' అనే రూపాంతరాన్ని సాధించడం రెండూ దేశ్యాలే !
    ఒకప్పుడు ఒక మోడు వారిన చెట్టు వ్యథను పద్య రూపంలో పెడుతూ ,
    "పూర్వమిచ్చితి జనులకు పుష్ప ఫలము
    లిపుడు జనులకు నేనేమి ఈయగలను ? " అని వ్రాసుకుని (అప్పటికే ' ఇవ్వగలను ? ' అనడం తప్పని తెలిసింది కనుక ' ఈయగలను ? ' అని అన్నాను ) ఒక సహస్రావధానికి చూపిస్తే , ' ఈయగలగడం ' కూడ గ్రామ్యమే అని తెలిసింది . వారే ' ఇపుడు జనులకు నేనేమి ఈగలాడ ?! ' అని సరిదిద్దినారు .
    చెప్పొచ్చేదేమిటంటే , ఇవ్వ ; ఈయ అనేవి ' వస్తాడు , చేస్తాడు , తెస్తాడు ' అని అన్నట్టుగానే గ్రామ్యాలు . పెద్ద పట్టింపులేమీ లేకపోతే వాడుకోనూ వచ్చు . అయితే గియితే , ఎవరైనా ప్రామాణిక రచన చేస్తే , చేయబూనితే తెలిసి ఉండడం మంచిదనీ .....అంతే !

    రిప్లయితొలగించండి
  26. డా. విష్ణునందన్ గారూ, సవివరణ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు. చేదర్థకములు, తుమున్నర్థకముల ప్రస్తావనతో వివరించటం వల్ల భవిష్యత్తులో వీటి ప్రయోగము యేరకంగా చేయవలెనో (చేయకూడదో) తెలిసింది. శతాధిక వందనములు.
    అయితే ఒక చిన్న అనుమానం: సన్యాసికి పిల్ల "నిచ్చి" సంబరపడెన్ అనవచ్చా? (భూతకాలములో).
    కృతజ్ఞలతో,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  27. మాస్టారూ, మనమందరమూ "సంసారి", "సన్యాసి" రెండూనూ. భాగవతంలోని కథ అనుకొంటా, కృష్ణుడు నిత్య సన్యాసి, అగస్త్యుడు నిత్య ఉపవాసి అని చెబుతుంది. నాకు చాలా ఇష్టమైన కథ. ఈ పాటికి నాభావం గ్రహించేవుంటారు.
    ధన్యవాదాలతో,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  28. చంద్ర శేఖర్ గారూ , "ఇచ్చి " అని భేషుగ్గా ప్రయోగించవచ్చు . ప్రామాణికమైన శబ్దం ' ఇచ్చు ' కు భూతకాలం అంతే కదా మరి .అభ్యంతరమేమీ లేదు . "ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులున్ " ఉండనే ఉంది కదా !!!

    రిప్లయితొలగించండి
  29. డా.విష్ణునందన్ గారూ, ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  30. గురువుగారూ ధన్యవాదాలు.
    మేనా దేవి అంటారని మేనా అన్నాను. కాని, మేనయె అన్నపదం సరియైనదని మీ ద్వారా తెలుసుకొన్నాను.
    విష్ణు నందన్ గారు అమూల్యమైన వ్యాకరణ పాఠాన్ని చెప్పారు. ధన్య వాదాలు.
    వసంతగ మహోదయుని పునరాగమనం కడు సంతోష దాయకం.

    రిప్లయితొలగించండి
  31. శంకరార్యా ! ధన్యవాదములు !

    విష్ణునందనా ! సుందరా ! ధన్యవాదములు !
    మీరు మాకు తెలుగు మాష్టారైతే (శాశ్వతముగా-అప్పుడప్పుడు కాకుండా)
    ఎంత బాగుండేదో !!!
    మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  32. సన్యాసి యాశ్రమమ్మున
    నన్యోన్యమ్ముగ పెరిగిన నావులు పులులున్
    కన్యా దానమ్ముగ నా
    సన్యాసికి పిల్ల నొసఁగ సంబరపడియెన్

    రిప్లయితొలగించండి
  33. కన్యా! టైపాటాయెను:
    "సన్యాసికి పిల్ల నొసఁగ సంబరపడియెన్"
    శూన్యము జేయుట నెలుకల:
    "సన్యాసికి పిల్లి నొసఁగ సంబరపడియెన్"

    రిప్లయితొలగించండి