14, జూన్ 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 75 (ఇంకం గస్తురిబొట్టుఁ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 19
సమస్య - "ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము త
న్వీ! ఫాలభాగంబునన్"
శా.
పంకేజానన! నేఁటిరేయి వినుమీ పంతంబుతో రాహువే
శంకాతంకము లేక షోడశకళాసంపూర్ణు నేణాంకునిం
బొంకం బార్చెద నంచుఁ బల్కెను దగం బొంచుండి నే వింటి నీ
వింకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ!ఫాలభాగంబునన్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

10 కామెంట్‌లు:

  1. అంకం జేరిచి ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
    శంకర్ బాబుకు వేషమున్ మలచుచున్ చక్కంగ మార్చేవుగా !
    ఇంకా కొంచెము నీలిరంగు నిడగా నింపొందు గా, యిప్పుడే
    ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము, తన్వీ!ఫాలభాగంబునన్.

    రిప్లయితొలగించండి
  2. ముదుసలి దంపతుల సంభాషణ. తాతగారికి చేతకాదని ఆయనకు స్వయంగా స్నాన, అలంకారాదులు చేస్తున్న భార్యతో భర్త తనకు అలంకారములు చాలని, దైవకైంకర్యపు పనులకు వేళవుతున్నదని వెళ్ళమంటూ పరిహాసంగా అంటున్నట్టుగా ఊహించాను.


    ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్
    వంకే లేదుగ నీది భక్తి,ముదిమిన్ వాడంగ నుంటిన్ గదా!
    కంకాళమ్ముకు నేల బాలిక! యలంకారంబు భామామణీ!
    కైంకర్యంబుల వేళ, బేల!మధుపాకంబుల్ నివేదించవే!

    రిప్లయితొలగించండి
  3. శంకేలా? మన యింట వెన్నెలలు ఓ చంద్రాననా నీవె యౌ
    వంకే లేని ముఖేందు బింబ రుచులన్ ! వద్దందు నేమందువా,
    పొంకంబై మిరుమిట్లు గొల్పు కనులన్! మూయంగనౌ తాళకన్!
    ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్"

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    కృష్ణవేషధారికి నల్లని రంగు పూయక ముందే బొట్టు పెట్టవద్దన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    ‘అంకము/అంకమ్ము/అంకంబు + చేర్చి’ అన్నప్పుడు ‘అంకంజేర్చి’ కాదు. అక్కడ ‘అంకంబందున’ అంటే సరిపోతుంది. ‘ఇంకా’ అనేదాన్ని ‘ఇంకన్’ అంటే సరి! ‘నీలిరంగు నిడగా’ బదులు ‘నీలవర్ణ మిడగా’ అందాం. కృష్ణుని రంగు ‘నీలము = నలుపు’, సినిమాల్లో చూపినట్లు ‘నీలి = బ్లూ’ కాదు.
    ‘బావామరదళ్ళు’ చిత్రంలో ‘నీలిమేఘాలలో గాలి కెరటాలలో’ పాట ఉంది. అక్కడ నీలిమేఘాలంటే ‘వర్షం కురిపించక తేలిపోయే మేఘాలని అర్థం. అలాగే ‘నీలివార్తలు = అబద్ధపు వార్తలు’ గుర్తుకు తెచ్చుకోండి.

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారూ,
    మనోహరమైన పూరణ. బాగుంది. అభినందనలు.
    ముదుసలి తాత భార్యను "బాలికా" అని సంబోధించాడా? భలే! చమత్కారంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  6. మిస్సన్న గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉందనడానికి శంకరయ్యకు ‘శంకేలా’? చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా! ఓపికగా సవరణలు సూచించినందులకు కృతఙ్ఞతలు.
    సవరణలతో మరల పంపుచున్నాను.
    మనోహర పూరణలు చేసిన మందాకిని గారికి,
    మిస్సన్న గారికి అభినందనలు.


    అంకం బందున ముద్దుజేసి యటుపై నాబాల కృష్ణుండు గా
    శంకర్ బాబుకు వేషమున్ మలచుచున్ చక్కంగ మార్చేవుగా !
    ఇంకన్ బూయుము నీల వర్ణ మిచటన్నీ ప్రక్కగా ,యప్పుడే
    ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము, తన్వీ!ఫాలభాగంబునన్.

    రిప్లయితొలగించండి
  8. కుంకల్ హిందుల స్త్రీలు వండరయయో గోమాంసమే రీతినిన్
    వంకల్ పెట్టకు షర్మిలా! ప్రియతమా బంగాలు టాగూరహో!
    జంకేలా రమణీ! నవాబు ఘనునిన్ చక్కంగ పెండ్లాడితే!
    ఇంకం గస్తురిబొట్టుఁ బెట్టకుము తన్వీ! ఫాలభాగంబునన్!

    రిప్లయితొలగించండి