7, ఏప్రిల్ 2012, శనివారం

కళ్యాణ రాఘవము - 6

కళ్యాణ రాఘవము - 6

శ్రీమాన్ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు

తే.గీ.
"కంటివా దేవ! కల దిందుఁ గార్ముకమ్ము
పణము సీతావధూసమర్పణమున కిది
సానరాపిడి రాజతేజమున కిద్ది
శ్రాంతి త్రైలోక్యవీరవిక్రాంతి కిద్ది. (67)


ఉ.
ము న్నల దక్షయాగమున మూగిన వేలుపుమూఁకఁ జూచి ము
క్కన్నులఁ జిచ్చు లొల్క, వడఁగన్ శశిరేఖ కపర్దసీమలో,
మిన్నుఁ బగుల్చు హుంకృతుల మి మ్మిదె కూల్తు నఁటంచు నల్కఁ బై
చన్నపు డెత్తినట్టి పురసంహరు విల్లిదియే మునీశ్వరా! (68)


చం.
అనఘ! ప్రసన్నుఁడైన శివుఁ డవ్వల మాకులవృద్ధదేవరా
తున కిడె; నాఁటనుండియు నెదుర్కొను మా యిడు నగ్రపూజలన్
ధను విది యాయుధాలయమునం, దిపుడో నృపు లెల్ల రగ్రపూ
జన మొనరించి రించుకయుఁ జాలనముం బొనరింపఁ జాలమున్. (69)


ఆ.వె.
ముదితగతిని జేరె మొదట రాజక మది
పాణిపీడనైకపరవశమున
ముదితగతిని జాఱెఁ దుదకు రాజక మది
పాణిపీడనైకపరవశమున. (70)


చం.
ఎవరును జేయలేనిపని యిట్లు పణ మ్మని రాకొలమ్మునే
యవమతిపాలు సేసితి నఁటం చఖిలావనిపాలు రేకమై
వివిధబలప్రచారముల వేసరి వత్సర మెల్లఁ బోరియున్
వివశతఁ బాఱి రప్పిఱికివీరు లపాస్తసమస్తసారులై. (71)


మ.
ఘనదర్పమ్మున మున్ సుధన్వుఁడను సాంకాశ్యప్రభుం డిమ్మహా
ధనువున్ సీతను గోరి పోరి మిథిలాధన్యోపకంఠంబునన్
దనప్రాణమ్ములు ధారవోసెను మునీంద్రా! యల్పవీర్యుల్ నృపు
ల్గన - నవ్వార్తల కేమి? రాఘవుల కింకం జూపు మీ చాపమున్. (72)


తే.గీ.
కోలలం జిమ్మి హింసించు గోల లేదు
పట్టినం జాలు సీత కే ల్పట్టఁ జేయు
దుర్లలితు లుగ్రధనువని దూర నేమి?
తలఁప నిది యన్నిటన్ శివధనువ కాదె?" (73)


కం.
అని మిన్నకుండె జనకుఁడు
ముని మనుకులతిలకు ముద్దుమోమును గని "నా
యన! రామ! లెమ్ము ధనువును
గనుఁగొను" మని యమృతధారఁ గనుఁగొన విసరెన్. (74)


చం.
అలసపునవ్వుతోడ విలునమ్ములు తమ్మున కిచ్చి, పైడిదు
వ్వలువను గాసె పుచ్చి, వలెవాటున లేనడుముం బిగించి, వే
వలఁగొని మౌనిమ్రోలఁ దలవంచి, మెయిం దళితేంద్రనీలకం
దళరుచి జాలువాఱఁ గయిదండలకండలు పొంగుదేఱఁగన్. (75)


తే.గీ.
అల్లలాడెడి కాకపక్షాళితోడ
నగవులో బీర మొల్కు నెమ్మొగముతోడ
వినయశౌర్యముల్ దొలఁకెడి కనులతోడ
జానులం దాఁటు లోలద్భుజాలతోడ
వెడఁదయై పొంగి వచ్చు లేయెడఁదతోడ
వడి నెగయు గున్నయేనుఁగు నడలతోడ
రాఘవుఁడు వింటిపెట్టెఁ జేరఁ జను నప్పు
డప్పుడమి యెల్ల జవ్వాడునట్లు దోఁచె. (76)

మ.
"ఇది మీఁ దెంచని సాహసంబె యగు" నం "చీ వి ల్లితం డెత్త నే
మిది పిన్నాటయె" యంచు, "వింటిమి కదా! యేపుట్ట నేశేషుఁ డు
న్నది దుర్బోధ" మఁటంచు, "బ్రహ్మఋషి యాజ్ఞాశక్తికిన్ సాధ్య మె
య్యది కా"దంచును రాచబందుగులు మందాలాపముల్ సేయఁగన్. (77)


సీ.
"ఈ చేవముదురని యినకులాంకుర మఁటే

యొకకోల మీటి తాటక నడంచె
నీ వెన్నముద్దయఁటే మండుటెండల
మౌనివెంబడి నరణ్యానిఁ దాఁటె
నీ నల్లగిసెపూవఁటే కూళరాకాసి
కొండల వజ్రముల్ గురిసి మెఱసె
నీ సుధాగుళికయఁటే స్పర్శమాత్రనఁ
బ్రాణముల్ పోసెఁ బాషాణమునకు
తే.గీ.
నహహ! యీ బాలు కేల్ చిగురాకు లేడ,
కఠినకఠినము హరకార్ముక మ్మ దేడ?
యెట్టి సాహసికుఁడు కంటిరే" యఁటంచు
ముచ్చటించిరి తమలోన ముదితలెల్ల. (78)

తే.గీ.
"భువనమోహనుఁ డీ నవయువకుఁ డంచు
మదిఁ దలంపఁడొ మునిజనమౌళి తాను?
కనుఁగొనఁగ లేఁడొ యిసుమంత జనకుఁ, డింత
పట్టుదల యేల విల్లు మోపెట్టుకొఱకు?" (79)


తే.గీ.
అని తలంచుచుఁ జెలుల మధ్యముననుండి
యంతకంతకుఁ గొంగ్రొత్తయైన రాము
చెలువు బరికించు పరవతి సీత కన్ను
లోరముసుఁగున విప్పారెఁ జేరెఁ డంత. (80)


తే.గీ.
పురజనుల గుంపు లెల్లఁ జిత్తరువు లయ్యె
వేలకన్నులు రాముపై వ్రాలి నిలిచెఁ
గొట్టుకొనుచుండె జనకుని గుండె; యపుడె
వృద్ధరా జున్నఁ గడు పెంత పిసికికొనునొ! (81)

1 కామెంట్‌: