3, ఏప్రిల్ 2012, మంగళవారం

సమస్యాపూరణం - 666 (నాగపంచమి వచ్చును)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలససిన సమస్య ఇది...

నాగపంచమి వచ్చును నవమినాడు.

ఈ సమస్యను పంపిన సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. శ్రావణంబున శుక్లపక్షమ్మునందు
    నాగపంచమి వచ్చును, నవమినాడు
    భక్తి తత్పరులై రామ భద్రు కొలచి
    శాంతినొందుదురెల్లరు చైత్రమందు.

    రిప్లయితొలగించండి
  2. అరుణ యాత్రకు నేగిన యట్టి దినము
    నాగపంచమి, వచ్చును నవమి నాడు
    భక్తితో చూచి చాల దేవాలయములు
    తెచ్చును ప్రసాదములు మనకిచ్చు నాడు

    రిప్లయితొలగించండి
  3. నాధునికుశలమ్మెరిగితో?నాకు దెలుపు
    మయ్య మేఘనాధ!యబలనంజలింతు.
    పక్షమయ్యపట్నమ్మేగి, పరగ నేడు
    నాగపంచమి వచ్చును, నవమి నాడు.

    రిప్లయితొలగించండి
  4. శుద్ధ పంచమి దినమున శుభము లీ య
    నాగ పంచమి వచ్చును ,నవమి నాడు
    రామ చంద్రుడు పెండ్లాడె భూమి సుతను
    తెలుసు కొనవచ్చు నిట్ల నె తిధుల బట్టి

    రిప్లయితొలగించండి
  5. శుద్ధ పంచమి దినమున శుభము లీ య
    నాగ పంచమి వచ్చును ,నవమి నాడు
    రామ చంద్రుడు పెండ్లాడె భూమి సుతను
    తెలుసు కొనవచ్చు నిట్ల నె తిధుల బట్టి

    రిప్లయితొలగించండి
  6. గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణ....

    పాడ్యమందున వచ్చు సంవత్సరాది,
    పరగ దసరాయె దశమిని, పంచమికిని
    నాగ పంచమి వచును, నవమి నాడు
    రామ నవమియె వచ్చును భామ వినుమ.

    రిప్లయితొలగించండి
  7. శంకరాత్మజు గొలువంగ చవితి గలదు,
    సర్పరాజుకు చూడంగ చవితి మరియు
    నాగపంచమి వచ్చును, నవమినాడు
    రామకల్యాణ మిలలోన రమ్యముగను.

    రిప్లయితొలగించండి
  8. పతిని పూజించి సేవించు పడతి మహిమ
    బ్రహ్మ విష్ణు మహేశులు బాలలగును
    ఇనుడు నుదయాద్రికినిపోక వెనుదిరుగును
    యముడె విగతజీవికి చూడ నసువులొసగు
    ధాత్రి లోసాధ్వియే తాను తలచుకొనిన
    నాగపంచమి వచ్చును నవమినాడు

    రిప్లయితొలగించండి
  9. ఈనాటి సమస్య చూడగానే ఒక ప్రముఖ సమస్యా పూరణము గుర్తుకు వస్తుంది . దానిని స్మరించు కోవడం అప్రస్తుతం కాదనుకుంటాను . ఆ సమస్య ఇది . గణ చతుర్ధి నాడు ఫణ చతుర్ధి . ఈ సమస్యకు తిరుపతి వెంకట కవులు చేసిన పూరణ చూద్దామా ?

    ఎన్ని దినము లాయె నిట నన్ను డించి నీ
    వరిగి ? యనిన పత్ని కనియె భర్త
    నేటి కెన్నగ పది నెల లాయెగా? నేడు
    గణ చతుర్ధి, నాడు ఫణ చతుర్ధి.

    ఇది అవధానంలో ఆశువుగా చెప్పినది . మనం అలోచించి అలోచించి అయినా ఈ స్థాయి పద్యం చెప్పగలమా ?

    నేమాని వారి, ఉకదంపుడు వారి పద్యాలలో ఈ ఛాయ కొంచెం ఉండడము గమనించగలరు .

    రిప్లయితొలగించండి
  10. ఇంకో విషయం కుడా చెబుతాను . ఈ మధ్య నే " అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ ' అన్న సమస్య ఇదే బ్లాగు లో చూసేము . ఈ సమస్యను శ్రీ మిన్నికంటి గురునాధ శర్మ గారికి ఒక అవధానం లో ఇస్తే వారు అక్రమ సంబంధాలు లేకుండా అద్భుతమైన పూరణ చేసేరు.
    చూడండి --------
    ఉ . ఎల్ల సురల్ వినంగ హరి యిట్లనె భూ సుత సీత బొందితిన్
    నీళ్ళను మున్గి నట్టి ధరణీ సతి గౌగిట గ్రుచ్చి ఎత్తితిన్
    తల్లికి తల్లియౌ సతి నెదన్ ధరియించితి గాన భూమికిన్
    అల్లుడ నయ్యెదన్ మగడ నయ్యెద నే మనుమండ నయ్యెదన్ !

    దేవతలు వినగా విష్ణువు ఇలా అన్నాడు . భూపుత్రిక సీతను పెండ్లా డినాను ( రామావతారం ).భూమిని పెండ్లా డేను (వరాహావతారం ). లక్ష్మిని పెండ్లా డేను (సముద్ర మాధనానంతరం ) ఇక్కడ విష్ణు పాదం లో గంగ పుట్టింది .విష్ణువు భార్య భూదేవి .కనుక గంగ భూమికి కూతురి వరస . గంగ సముద్రునికి భార్య నదులన్నీ సముద్రుని భార్యలు గదా ! సముద్రం లో పుట్టింది లక్ష్మి .కనుక లక్ష్మి గంగ కూతురి వరస .కూతురిని తల్లీ అని పిలవడం ఉంది . ఈ గమనికతో భూమికీ, భూసుత సీతకూ, గంగాసుత లక్ష్మికీ - మూడు తరాలవారికి విష్ణువు భర్త గనుక అల్లుడు , మగడు, మనుమడు వరుసలు సరిపోయాయి .

    ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  11. సర్పరాజును పూజింప సమయమెద్ది?
    ఎల్ల తిథులయందును పర్వమెట్లు వచ్చు?
    జానకికి రామునికెపుడు జరుగు పెండ్లి?
    నాగపంచమి వచ్చును, నవమి నాడు.

    రిప్లయితొలగించండి
  12. పెద్దలకు ప్రణామములు.

    “ప్రాణసఖి వీవు; పల్లకీ పంపి నిన్ను
    ఏప్రియల్ తొలిరోజు నేనే పరిణయ
    మాడుదు” నని యంటివి కదా! చూడు, ఱేపు
    నాగపంచమి వచ్చును; నవమి - నాఁడు.

    చైత్రశుద్ధ దశమికి మా చిన్నవాని
    పెండ్లి వేళకుఁ దప్పక పెద్ద కొడుకు
    ఫ్రాన్సు నుండి సెలవుపెట్టి, బయలుదేఱి
    నాగపంచమి - వచ్చును నవమి నాఁడు.

    విధేయుఁడు,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమ:

    ఆంగ్ల మాసపు తేదీని అయ్యవారు
    సంస్క్రృతంబున పలికిరి సరసముగను
    పర్వదినముల పట్టిక బట్టి జెప్పె
    నాగపంచమి వచ్చును నవమినాడు

    రిప్లయితొలగించండి
  14. 1.నిమ్మచెట్టున కాయు దానిమ్మ లట్లె
    కందిపూతకు జూడ కాకరలు నిండు,
    జగతి కలికాల మేదేని జరుగ గలదు
    నాగపంచమి వచ్చును నవమి నాడు.

    2.జాతి ధర్మంబు విడనాడి భీతిలేక
    పాపపుణ్యాలు తలపక పరుగు లిడుచు,
    తిథులు, వారాలు, తారలు తెలియనపుడు
    నాగపంచమి వచ్చును నవమి నాడు.

    రిప్లయితొలగించండి
  15. మాస మందున పంచమి మరలు మరల
    నరక చతుర్దశి పిదప నాగ చవితి
    చవితి పంచమి నవమన దైవ మొకటె
    నాగ పంచమి వచ్చును నవమి నాడు !

    రిప్లయితొలగించండి
  16. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _____________________________________________

    నాగ పూజలు చేయగా - నయము గాను
    మంచి దైనట్టి యాషాఢ - మాసమందు
    బహుళ ద్వాదశి తిథినాటి -ప్రాయణంబు
    నాగపంచమి వచ్చును - నవమి నాడు
    _____________________________________________
    ప్రాయణము = ప్రారంభము (మొదలుకొని)
    నాగపంచమి = శ్రావణ శుద్ధ పంచమి
    నవమి నాడు = తొమ్మిదవనాడు

    రిప్లయితొలగించండి
  17. ప్రముఖ కవిదిగ్దంతుల పూరణలను పరిచయం చేసిన అజ్ఞాత గార్కి ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    ఊకదంపుడు (రామకృష్ణ) గారూ,
    ఈ సమస్య పూరణలో మీరు సరియైన దారి పట్టారు. నేను ఆశించిన పూరణ ఇది. బాగుంది. అభినందనలు.
    "నేడు/నాగపంచమి వచ్చును" అన్నది "రేపు నాగపంచమి వచ్చును" అని ఉంటే ఇంకా బాగుండేదేమో!
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    "ఇట్లనె" కు బదులు "ఇట్లని/ఇట్లను? అంటే బాగుంటుందనుకుంటా.
    మిత్రుల పూరణలను నిశితపరిశీలన చేసి వ్యాఖ్యానిస్తున్నందుకు ధన్యవాదాలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పండుగల "లిస్టు" పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.
    "పాడ్యమందున" అన్నచోట "పాడ్యమి యందున" అని యడాగమం వస్తుంది. దానిని "పాడ్యమీతిథి న్వచ్చు..." అంటే సరి!
    మూడవ పాదంలో సుబ్బారావు గారు గుర్తించిన టైపాటు "వచును - వచ్చును".
    *
    సత్య నారాయణ మూర్తి గారూ,
    "రమ్య"మైన పూరణ మీది.
    తరువాతి రెండు పద్యాలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
    *
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    పతివ్రతా మాహాత్మ్యాన్ని వివరించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    "బాల లగును" ను "బాల లైరి" అంటే బాగుంటుందేమో!
    *
    అజ్ఞాత గారూ,
    చక్కని విషయాలు చెప్పి మిత్రులకు మార్గదర్శనం చేయించారు. ధన్యవాదాలు. మీ సూచనలను సంతోషంగా ఆహ్వానిస్తున్నాను.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ క్రమాలంకార పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    రెండవ ప్రశ్న అన్వయం కుదరలేదని సందేహం!
    *
    ఏల్చూరి మురళీధరరావు గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ప్రశంసనీయమైన ప్రయత్నం చేసారు.
    ఎందుకో మీ పూరణ భావం అవగాహనకు చిక్కడం లేదు. "చతుర్దశి" అన్నచో గణదోషం, "నవమన" అన్నచో సంధిగత దోషం ఉన్నాయి.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ సమర్థనతో పూరణ శోభిల్లుతున్నది. బాగుంది. అభినందనలు.
    "బహుళ ద్వాదశి" అన్నప్పుడు "ళ" గురువై గణదోషం.

    రిప్లయితొలగించండి
  19. ధన్యవాదాలు గురువుగారు,
    నిజమేనండి. రెండవ పాదం విషయంలో అసంతృప్తి గానే ఉంది.

    సవరణ
    సర్పరాజును పూజింప సమయమెద్ది?
    పాలు ద్రావ పుట్టవెడలి పాము రాదొ?
    జానకికి రామునికెపుడు జరుగు పెండ్లి?
    నాగపంచమి, వచ్చును, నవమి నాడు

    రిప్లయితొలగించండి
  20. ధన్యవాదాలు గురువుగారు,
    నిజమేనండి. రెండవ పాదం విషయంలో అసంతృప్తి గానే ఉంది.

    సవరణ
    సర్పరాజును పూజింప సమయమెద్ది?
    పాలు ద్రావ పుట్టవెడలి పాము రాదొ?
    జానకికి రామునికెపుడు జరుగు పెండ్లి?
    నాగపంచమి, వచ్చును, నవమి నాడు

    రిప్లయితొలగించండి
  21. గురువు గారూ..,
    ధన్యవాదములు..
    నేడు అనవలెనా -రేపు అనవలెనా అని సంశయిస్తూనే- నేడు అన్నాను...
    ఈమె తెల్లవారక ముందే లేచి మొరపెట్టుకొనే సమయానికి ఇంకా పంచమి ప్రవేశించలేదని - గూఢభావన..

    కాగా.., తిధిలు బడిలోనే మరిచిపోవటం వల్ల.., అక్కడ నేడు అన్నా , రేపు అన్నా - పక్షం తో సరిపోవటమ్ లేదని - ఇప్పుడే గమనించాను.. ఇలామారుస్తున్నాను..

    నాధునికుశలమ్మెరిగితో?నాకు దెలుపు
    మయ్య మేఘనాధ!యబలనంజలింతు.
    పదిదినములుపట్టణమేగి, పరగ రేపు
    నాగపంచమి వచ్చును, నవమి నాడు.


    అజ్ఞాతవిబుధా..,
    మీరు చెప్పిన సమస్య వినలేదు కానీయండీ,
    "ఏకాదశి నాడు సప్తమేడే ఘఢియల్" అన్న సమస్య మునుపు ఒక పుస్తకం లో చూశాను.. ఏ అవధానం లోనిదో గుర్తు లేదు. విరుపు ఆ పూరణ ద్వారా నేర్చుకున్నదే.

    భవదీయుడు

    రిప్లయితొలగించండి